"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

ప్రసంగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రసంగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25 నవంబర్, 2026

మహాకవి కాళిదాసు జయంతి సభలో ఆచార్య దార్ల స్పందన

 మహాకవి కాళిదాసు జయంతి సభలో ఆచార్య దార్ల స్పందన 

పెద్దలందరికీ నమస్కారం!

మేము ( డా.కాలువ మల్లయ్య, డా.బెందాళం కృష్ణారావు, నేను) ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా ఇక్కడకి ( తెలుగు మరియు సంస్కృత అకాడమీ)కి వచ్చాం. అనుకోకుండా ఈ కార్యక్రమంలో (మహాకవి కాళిదాసు జయంతి కార్యక్రమం) లో పాల్గొన్నాం. దీనిలో మట్లాడిన వారంతా సంస్కృత సాహిత్యంలో ఎంతో నిష్ణాతులు. ప్రతి ప్రసంగాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఒక్కొక్క ప్రసంగం వింటుంటే కాళిదాసు తన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో ఓ సందర్భంలో అన్నట్లు …

‘రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్

పర్యుత్సుకో భవతి యత్ సుఖితోఽపి జంతుః |

తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం

భావస్థిరాణి జననాంతరసౌహృదాని ||( పంచమాంకం లోని ఆ శ్లోకం (5-2).) గుర్తొచ్చింది. 

మళ్ళీ నా విద్యార్థి రోజులు గుర్తొచ్చాయి. మళ్ళీ నేను మా విద్యార్థులకు పాఠం చెప్పేటప్పుడు.. ముఖ్యంగా మేడమ్ గారు చెప్పిన ‘కావ్యేషు నాటకం రమ్యం, తత్ర రమ్యా శకుంతలా, తత్రాపి చతుర్థోంకః, తత్ర శ్లోకచతుష్టయమ్ లో

యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా

కంఠః స్తంభితబాష్పవృత్తికలుషశ్చింతాజడం దర్శనమ్ |

వైక్లవ్యం మమ తావదీదృశమిదం స్నేహాదరణ్యౌకసః

పీడ్యంతే గృహిణః కథం ను తనయావిశ్లేషదుఃఖైర్నవైః ||... శ్లోకం.. దాన్ని రాయప్రోలు వారు ‘ శకుంతల’ పేరుతో చేసిన అనువాదంలో …

‘’వెళ్ళున్ నేడు శకుంతలంచు హృది క్షోభించు౯ సముత్కంఠ, క 

న్నీళ్ళాకట్టె గళంబు, చూపు కలుషించె చింతచే, సుంత యీ 

పిల్లం బెంచి యరణ్యవాసు లిటు నిర్వేదింపగా ! కన్న కూ

తుళ్ల క్రొత్తగ సాగనంపుచు గృహస్థుల్ ఎంత శోకింతురో! (రాయప్రోలు సుబ్బారావు, శకుంతల:1965) అనే పద్యం గుర్తొచ్చింది. 

ఆచార్య దీవి నరసింహ దీక్షితులు గారన్నట్లు కాళిదాసు గారి కవిత్వంలో మానవ హృదయాన్ని స్పందింపజేసే ప్రాసంగికత ఉంది. పూల త్రివిక్రమ్ రావుగారన్నట్లు కాళిదాసు కవిత్వంలో మానవ ఉద్వేగాలతో మనం మమేకమవుతాం. మేడమ్ గారు డా.పి.కోటిరత్నంగారు అన్నట్లు ఈ సన్నివేశాన్ని చదివేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు మన కళ్ళల్లో మనకే తెలియకుండా కన్నీళ్ళు కారిపోతాయి.  అది ఆ కవిత్వానికి ఉన్న గొప్పతనం. అదే నేటికి కాళిదాసుని మనం నిత్యం స్మరించుకొనేలా చేస్తున్న కవిత్వ శక్తి. మేడమ్ గారు మాట్లాడుతూ కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు దుఃఖిస్తారని అన్నారు. నిజానికి మన ఇంట్లో ఓ అక్కనో, చెల్లినో పెళ్ళిచేసి అప్పగింతలు చేసి పంపేటప్పుడు కూడా కుటుంబ సభ్యులు అంతా అలాగే కన్నీటి పర్యంతమవుతారు. ఆ ఎమోషన్ ని కాళిదాసు అద్భుతంగా పట్టుకోగలిగారు. అంతే కాదు, శకుంతలను చూసినప్పుడు దుష్యంతుడు ఆమె గురించి అనుకున్న శ్లోకం కూడా నేటికీ పెళ్ళికాని ఓ అబ్బాయి ఓ అందమైన అమ్మాయిని చూస్తే అనుకునే భావమేనేమో అనిపిస్తుంది. 

‘అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహైః

రనావిద్ధం రత్నం మధు నవమనాస్వాదితరసం।

అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం

న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః॥

(కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం, ద్వితీయాంకం, శ్లోకం 10.)

ఈ రోజు మేము మరో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినా యాదృచ్ఛికంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మమ్మల్ని కూడా గౌరవంతో ఇలా సత్కరించడం మాకెంతో సంతోషంగా ఉంది. సభా ప్రారంభానికి తొలిపలుకులు పలికి, సభ లక్ష్యాన్ని వివరించిన డా. ఎస్.ఎ.టి.రాజ్యలక్ష్మిగారి దగ్గర నుండి సభలో పాల్గొన్న ప్రతి వక్తా ఒక జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేసినట్లు పత్రాలను రాసుకొచ్చి మరీ, సమయం సందర్భోచితంగా చక్కగా మాట్లాడారు. నిజంగా నేను ఈ ప్రసంగాలను ఎంజాయ్ (ఆస్వాదించాను) చేశాను. తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు ఈ కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. మమ్మల్ని కూడా సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 24.11.2026.



(ది 24.11.2026 వ తేదీ ఉదయం గం.11.00 నిమిషాలకు తెలుగు మరియు సంస్కృత అకాడమీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తమ కార్యాలయం, 104 ప్రైమై హిల్ క్రిస్ట్ వడ్డేశ్వరంలో నిర్వహించిన ‘కవికుల గురువు మహాకవి శ్రీకాళిదాసు జయంతి’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన నా స్పందన.)



(





15 నవంబర్, 2026

సత్యం, శివం, సుందరం’ దళిత, మార్క్సిస్టు దృక్పథం: ఆచార్య దార్ల ప్రసంగం. (14.11.2026)

 ‘సత్యం, శివం, సుందరం’ దళిత, మార్క్సిస్టు దృక్పథం: 

ఆచార్య దార్ల ప్రసంగం.

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై వరుసగా ప్రొఫెసర్ మనోజ్ఞ, ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే, డా.భట్టు లక్ష్మీనారాయణ, లక్ష్మి తదితరులు. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ప్రసంగం (సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్ - 14.11.2026లో జనసాహితి వారు ఏర్పాటు చేసిన ‘సాహితీ చర్చ’ కార్యక్రమంలో మరాఠీ దళిత రచయిత, ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే, పాలమూరు విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ప్రొఫెసర్ మనోజ్ఞ, కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మి పాల్గొన్నారు. సభకు జన సాహితి జంట నగరాల అధ్యక్షులు డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ కవయిత్రులు కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, మహే జబీన్, ఎండ్లూరి మానస తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నేను మాట్లాడిన ప్రసంగ సారాంశాన్ని అందిస్తున్నాను.)

సభాధ్యక్షులు డా.భట్టు లక్ష్మీనారాయణగార్కి, వేదికపై ఆసీనులైన ప్రముఖ మరాఠీ దళిత సాహిత్య వేత్త ఆచార్య శరణ్‌కుమార్ లింబాలే గార్కీ,, ప్రొఫెసర్ మనోజ్ఞ గార్కీ, సభను ఏర్పాటు చేసిన లక్ష్మి గార్కీ  సాహితీ ప్రియులైన మీ అందరికీ నమస్కారం. ఈ వేదికపై మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు ఎం.ఏ.లో 2005లో ఒక కోర్స్ గా ‘దళిత సాహిత్యం’ పెట్టాను. అప్పటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరులో తప్ప, మరెక్కడా ఆ కోర్సు లేదు. నేను మా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కోర్సు పెట్టిన తర్వాతనే డా.బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కోర్సు సిలబస్ లో రిఫరెన్స్ గ్రంథంగా శరణ్ కుమార్ లింబాలే గారి ఈ పుస్తకాన్ని కూడా పెట్టాను. ప్రొఫెసర్ సునీత రాణి గారు నాకు ఆ పుస్తకం ఇచ్చి, చదవమన్నారు. చదివిన తర్వాత దాన్ని కూడా రిఫరెన్స్ పెడితే బాగుంటుందని సలహా తీసుకొని పెట్టాను. నేను మొట్టమొదటిసారిగా సత్యం శివం సుందరం గురించి దళిత దృష్టితో ఆ భావనలను ఎలా అర్థం చేసుకోవాలో ఆ పుస్తకం ద్వారానే తెలుసుకున్నాను. 

1. భారతీయ తాత్వికత - సత్యం, శివం, సుందరం: ఒక పునరాలోచన

భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక దృక్పథంలో ‘సత్యం, శివం, సుందరం’ అనే భావనలు అత్యంత ప్రాచీనమైనవి, లోతైనవి. మన వేదాలు, రామాయణ, మహాభారతాది ఇతిహాసాలు, పురాణాలు అన్నీ కూడా ఈ మూడింటి చుట్టూనే తిరుగుతుంటాయి. సత్యం, శివం, సుందరం మూడింటిలో కేంద్ర భావన ఒకటే..దైవం.

సత్యం అంటే ఏమిటి? భగవంతుడే సత్యం, ఈ భౌతిక ప్రపంచమంతా మాయ, శాశ్వతంగా నిలిచేది దేవుడే అనేది భారతీయ తత్వశాస్త్రం చెప్పే మూల సూత్రం. భారతీయ తత్వశాస్త్రంలో ‘సత్యం’ అనే భావనకు అత్యంత ప్రాచీనమైన, ఆధ్యాత్మికమైన లోతు ఉంది. ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతం వంటి భారతీయ తాత్విక మార్గాలు ఈ భౌతిక జగత్తును 'మిథ్య' లేదా 'మాయ'గా అభివర్ణిస్తాయి. కాలం మారుతున్న కొద్దీ నశించిపోయే ఈ దృశ్యమాన ప్రపంచం తాత్కాలికమని, ఎప్పటికీ మార్పు చెందకుండా, సర్వవ్యాప్తంగా, శాశ్వతంగా నిలిచే పరమాత్మ లేక బ్రహ్మ పదార్థమే ఏకైక 'సత్యం' అని ఈ తత్వశాస్త్రం బోధిస్తుంది. ఇంద్రియాలకు గోచరించే ఈ భౌతిక ప్రపంచం కేవలం మాయాజాలమని, దీని వెనుక ఉన్న దివ్య చైతన్యమే పరమ సత్యమని భావించడం భారతీయ ఆధ్యాత్మిక దృక్పథం యొక్క మూల సూత్రం.

అయితే, ఈ ఆధ్యాత్మిక సత్య భావనకు భిన్నంగా ఆధునిక శాస్త్రీయ దృక్పథం, ముఖ్యంగా దళిత-భౌతికవాద కోణం భిన్నమైన వాస్తవికతను ముందుకు తెచ్చింది. శాస్త్రీయ దృక్పథం ప్రకారం, కంటికి కనిపించే, భౌతికంగా స్పృశించగలిగే, ప్రయోగశాలలో నిరూపించగలిగే పదార్థమే (Matter) సత్యం. అలాగే, సామాజిక వాస్తవికతలో నిరుపేదలు, అట్టడుగు వర్గాలు అనుభవించే ఆకలి, దౌర్జన్యాలు, కుల వివక్ష, కష్టజీవుల చెమట, వారి కన్నీళ్లే కంటికి కనిపించే ప్రత్యక్ష సత్యాలు. అమూర్తమైన దేవుడిని లేదా మాయా సిద్ధాంతాన్ని పక్కనపెడితే, మనుషుల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఈ భౌతిక,సామాజిక రుగ్మతలే అత్యంత బలమైన, ఎల్లప్పుడూ సజీవంగా ఉండే వాస్తవ సత్యాలని ఈ లౌకిక, శాస్త్రీయ తాత్వికత వివరిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రొఫెసర్ శరణ్కుమార్ లింబాలే తన పుస్తకంలో వివరించారు.


ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే తో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ తదితరులు 

శివం: సమస్త లోకానికి శుభకరమైన ఆలోచన చేసేది, పవిత్రమైనది భగవత్ తత్వమే. భారతీయ తాత్వికతలో 'శివం' అంటే సమస్త లోకానికి మంగళకరమైనది, శుభకరమైనది, పవిత్రమైనది అని అర్థం. ఈ విశ్వాన్ని సృష్టించి, కాపాడే భగవత్ తత్వమే పరమ పవిత్రమైనదిగా, సమస్త జీవకోటికి శుభాన్ని చేకూర్చే శక్తిగా ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తాయి. భగవంతుని గురించిన ఆలోచన చేయడమే మనిషికి శుభకరమని, అది అంతిమంగా మానసిక ప్రశాంతతను, మోక్షాన్ని ఇస్తుందని ఈ తత్వశాస్త్రం నమ్ముతుంది. శుభకరమైన ఆలోచనలు ఉంటే శుభం  జరుగుతుంది అనేది ఒక సత్సంకల్పంగా బోధిస్తుంది. మన ఆలోచనే మన శుభా శుభాలను నిర్ణయిస్తుందని వివరిస్తుంది.

అయితే, దళిత సాహిత్య దృక్పథంలో మరియు శరణ్‌కుమార్ లింబాలే లాంటి ఆలోచనాపరుల ‘దళిత సౌందర్యశాస్త్రం’ (Dalit Aesthetics) ప్రకారం ఈ ‘శివమ్’ భావనకు సరికొత్త అర్థం చెప్పారు. కేవలం పురోహిత వర్గ కర్మకాండలను ఆచరించడం, ఆధిపత్య వర్గాల సంప్రదాయాలను పాటించడమే శివం కాదని... సమాజంలో తరతరాలుగా వేళ్లూనుకున్న అసమానతలను, కుల వివక్షను, పీడనను ఎదిరించి, సమసమాజాన్ని స్థాపించడానికి జరిగే పోరాటమే నిజమైన 'శివం' (శుభకరం) అని వారు భావిస్తారు.

ఇక మూడవది ‘సుందరం’ అనే భావన. భారతీయ తాత్వికతలో, సౌందర్య శాస్త్రంలో 'సుందరం' అంటే భౌతికంగా కనిపించే రూపురేఖలు, ప్రకృతి అందాలు లేదా ఈశ్వర సృష్టి అంతా సర్వ సుందరమైనది అనే ఒక సాధారణ భావన ఉంది. ఈ సృష్టి వెనుక ఉన్న దివ్యత్వాన్ని, అందాన్ని ఆస్వాదించడమే సౌందర్యమని మన సాంప్రదాయ కావ్యశాస్త్రం చెబుతుంది. సుందరం భౌతిక రూపం కూడా నశించి దాని అంతస్సారం మనలో కలిగించే ఆనందమే సౌందర్యం. అది కలగాలంటే మనలో దైవత్వం రావాలి. అంటే సత్వగుణం అలవడాలి. మానవుడే దేవుడవ్వాలి. భౌతికంగా మనిషి చనిపోయినా ఆ జీవాత్మ, పరమాత్మలో ఐక్యం కావడమే నిజమైన సౌందర్యం. దీన్ని భారతీయులు ఎంతో లోతైన భావనలతో వివరించారు. 

కానీ, ఆచార్య శరణ్‌కుమార్ లింబాలే గారు  ఈ సంప్రదాయ సౌందర్య భావనలను తీవ్రంగా ప్రశ్నించారు. సమాజంలో అట్టడుగున ఉండి, కుల వివక్షను, ఆకలిని, ఆర్థిక వ్యత్యాసాలను అనుభవిస్తున్న దళిత బహుజనుల కోణం నుంచి ఆయన ఈ పదానికి సరికొత్త అర్థాలను వెలికితీశారు. రాచరికపు భవనాలు, రక్తంతో నిర్మించిన పెద్ద రాజభవనాలు, వాటిని చూసి పులకించిపోయే కవుల వర్ణనలు ఎప్పుడూ అసలైన సౌందర్యం కాలేకపోతాయని ఆయన వాదించారు. కళ కళ కోసమే అనే వాదనలోని ఆనందంలో సుందరత్వాన్ని వెతికితే దళితుల్లో అటువంటి సుందరత్వం ఉండదన్నారు. ఆ భవనాలు కట్టడానికి తమ ప్రాణాలను, చెమటోడ్చిన కూలీల ఆకలిని, వారి కన్నీళ్లను, వారి శ్రమను పట్టించుకోని ఏ సౌందర్యశాస్త్రం కూడా నిజమైనది కాదని లింబాలే గారు స్పష్టం చేశారు. కష్టజీవుల చెమటలో, వారి కష్టాల్లో, అణచివేతకు వ్యతిరేకంగా ఎగిరే ధిక్కార స్వతంత్ర పతాకంలోనే అసలైన సౌందర్యం దాగి ఉందని ఆయన నిరూపించారు. కాబట్టి, కేవలం భౌతిక ఆకారాన్ని లేదా ఈశ్వర సృష్టిని చూసి మురిసిపోవడం కాదు... మనుషుల ఆకలిని, వారి పోరాటాలను, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేదే అసలైన 'దళిత సౌందర్యశాస్త్రం' అని మనం గ్రహించాలన్నారు. రస సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం - దళిత సౌందర్యశాస్త్రం గురించి తన గ్రంథంలో ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబలే ప్రస్తావించారు. దీని వెనుక ఉన్న రెండు ప్రధాన వాదనలను పరిశీలించాలి.


1. సంప్రదాయ రస సిద్ధాంతం చెప్పేది ఏమిటి?

సంప్రదాయ సంస్కృత కావ్యశాస్త్రం, భరతుని నాట్యశాస్త్రం ప్రకారం, రసం అనేది ఒక విశ్వవ్యాప్తమైన, ఆనందమయమైన అనుభూతి. ‘విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తిః’ అంటే విభావాలు, అనుభవాలు, వ్యభిచారి భావాల సంయోగం వల్లే రసం పుడుతుందని చెబుతారు. ఇక్కడ సాహిత్య పఠనం వల్ల కలిగే ఆనందం లేదా రసానుభూతి అందరికీ ఒకేలా ఉంటుందని, అది ఉన్నతమైన మానసిక స్థాయులకు, రసాస్వాదన నైపుణ్యాలకు సంబంధించినదని సంప్రదాయవాదుల నమ్మకం.

2. దళిత సౌందర్యశాస్త్రం (Dalit Aesthetics) లేవనెత్తే ప్రశ్నలు ఏమిటి?

కానీ, శరణ్‌కుమార్ లింబాలే వంటి దళిత సాహిత్యవేత్తలు ఈ సిద్ధాంతాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. వారి ప్రకారం…సమాజంలో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అట్టడుగు వర్గాలు, కుల వివక్షను అనుభవించేవారు, కూలీలు పడే కష్టాలు, ఆకలి, అవమానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి, సంప్రదాయ రస సిద్ధాంతం కేవలం ఉన్నత వర్గాల అనుభవాలకే పెద్దపీట వేస్తుందని వారు వాదిస్తారు. దళిత సౌందర్యశాస్త్రం కేవలం ఆనందాన్ని పంచేది కాదు; అది బాధను, అణచివేతను, ఆక్రోశాన్ని, వాటికి వ్యతిరేకంగా సాగే పోరాటాన్ని అక్షరరూపం ఇస్తుంది.

సాహిత్యం చదివి ప్రశాంతంగా ఆనందించడం కాకుండా, సమాజంలోని అసమానతలను ప్రశ్నించేలా, అన్యాయాలను ఎదిరించేలా పాఠకుడిలో చైతన్యాన్ని నింపడమే దళిత సౌందర్యశాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యంగా భావించారు.కాబట్టి, సంప్రదాయ రస సిద్ధాంతం అందరికీ సార్వత్రికమైనది కాదని, అది కేవలం ఒక వర్గం లేదా ఒక ప్రత్యేక జీవన విధానం నుంచి పుట్టినదేనని దళిత సౌందర్యశాస్త్రం వాదిస్తుంది. దీన్ని "పూర్తిగా సత్యం" అనలేము కానీ, ఇది సాహిత్య విమర్శలో ఒక బలమైన ప్రత్యామ్నాయ దృక్పథం అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. మా జీవితాల్లోని బాధలు, అవమానాలు, కన్నీళ్లు, మా కష్టాల నుంచి పుట్టే అనుభవాలే మాకు రసాలను పండిస్తాయని దళితులు భావిస్తారు. మా కష్తటాలనుండి ఇతరుల భోగభాగ్యాలను చూసి పొందే ఆనందం మాది కాదనీ; మా అస్తిత్వ వేదన, మా ఆత్మగౌరవ పోరాటమే మా సాహిత్యానికి ప్రాణమంటారు. కుల వివక్షను అనుభవిస్తున్న మనుషుల సంఘర్షణ,పోరాటాలే ప్రధానమైనవిగా శరణ్ కుమార్ లింబాలే భావించారు. ఈ భావనలు నిజానికి సాహిత్య విమర్శ సిద్ధాంతాల్లో ఒక సంచలనాన్ని కలిగించాయి.

(ఒక విద్యార్థిగా నాకూ అటువంటి కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. కాలేజీ రోజుల్లో ప్రధాన స్రవంతి సాహిత్యంగా పిలువబడే సాహిత్యం చదువుతున్నప్పుడు అందులో ప్రేమ, శృంగారం, వర్ణనలు మాత్రమే ఉండేవి. కానీ, బయట సమాజంలో దళితులు, అట్టడుగు ప్రజలు పడుతున్న నానా తంటాలు, వివక్ష నాకు కళ్లకి కట్టినట్టు కనిపించినా, పాఠ్యాంశాల్లో ఉండేవి కాదేమిటని అనిపించేది.. అప్పుడు నాకు ఒకటే సందేహం వచ్చేది దళితులు ప్రేమ కవితలు రాస్తున్నారు, కానీ వారి చుట్టూ జరుగుతున్న ప్రేమ ఎలాంటిదో రాయాలి. సామాజిక అన్యాయాలపై మాట్లాడుతూ రాయాలి, తన రాతలు తన అస్తిత్వాన్ని తాను జీవిస్తున్న సమాజంలో ఎలా ప్రతిపలిస్తుందో, ఎలా అనుభవంలోకి వస్తుందో దాన్ని రాయచ్చు కదా ‘ అనిపించేది. అలా రాసిన రచనలు ప్రధాన జీవన స్రవంతి సాహిత్యంగా చదువుతున్నట్లే పాఠ్యాంశాల్లో చదువుకుంటే బాగుండేది కదా అని కలలు కనేవాణ్ణి. ఆ కలలు ఎం.ఏ.లో దళిత సాహిత్యం ఒక కోర్సుగా పెట్టిన తర్వాత నెరవేరాయని అనిపించింది. ఇది ప్రసంగంలో చెప్పాలనుకున్నాను కానీ సమయం సరిపోక చెప్పలేకపోయాను.)

3. మార్క్సిస్టు దృక్పథంతో  ఈస్తటిక్స్:

ఈ సభను ప్రజాసాహితి వారు ఏర్పాటు చేశారు. కానీ మనం దళిత మేధావి రచయిత శరణ్ కుమార్ లింబాలే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. ఆయన దళిత్  ఈస్తటిక్స్ థియరీ ని లోతుగా గమనిస్తే, వర్గ స్వభావాన్ని ఆయన స్పష్టంగా  వివరించారు. మార్క్సిజం ప్రకారం, సమాజంలో ఆర్థిక వనరులను నియంత్రించే వర్గమే (Ruling Class), సమాజం ఏది నమ్మాలో కూడా నిర్ణయిస్తుంది. ఏది నిజం, ఏది ధర్మం అనేది పాలకవర్గాలే నిర్ణయిస్తాయి. శ్రామికులు కష్టపడటం, యజమానులకు సేవ చేయడం 'ధర్మం' (సత్యం) అని నమ్మిస్తారు. పాలకవర్గ వ్యవస్థకు భంగం కలగకుండా, సమాజంలో శాంతి (Status quo) ఉండటమే 'శివం' (మంగళకరం) అని ప్రచారం చేస్తారు. తిరుగుబాటును 'అశుభం'గా లేదా 'పాపం'గా చిత్రీకరిస్తారు. కష్టజీవుల చెమట, రక్తంపై నిర్మించబడిన రాజభవనాలను, ప్రకృతిని చూసి కవులు 'సుందరం' అని పొగుడుతారు. కానీ ఆ భవనాలు కట్టిన కూలీల ఆకలి, కన్నీళ్లు ఆ సౌందర్యశాస్త్రంలో కనిపించవు. మార్క్సిస్టు సౌందర్యశాస్త్రం (సిద్ధాంతం) శరణ్‌కుమార్ లింబాలే వాదనతో చాలావరకు ఏకీభవిస్తుంది.సామాజిక వాస్తవికత (Social Realism) అనేది సాహిత్యం అనేది కల్పిత స్వర్గాలను, అలౌకిక ఆనందాన్ని (రసానందం) ఇవ్వడానికి కాదని చెప్తుంది. అది సమాజంలోని వర్గ పోరాటాన్ని, దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపించాలి. మార్పు కోసం కళ ఉపయోగపడాలనీ చెప్తుంది. "తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, కానీ ముఖ్యమైనది దానిని మార్చడం" అని మార్క్స్ అన్నారు. అదే విధంగా, సాహిత్యం సమాజాన్ని మార్చే ఒక ఆయుధంగా ఉండాలి. 

మార్క్సిజానికి, దళిత దృక్కోణానికి మధ్య తేడా (లింబాలే విమర్శ) :

ఈ సందర్భంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. శరణ్‌కుమార్ లింబాలే మార్క్సిజాన్ని పూర్తిగా అంగీకరించారనుకోవడానికి వీల్లేదు. ఆయన దాన్ని కూడా విమర్శించారు. మార్క్సిజం సమాజాన్ని కేవలం ఆర్థిక వర్గాలుగా (ధనిక - పేద) మాత్రమే చూస్తుంది. కానీ భారతదేశంలో ఆర్థిక దోపిడీతో పాటు కుల వివక్ష అనేది మనిషి పుట్టుకతోనే ముడిపడి ఉందని లింబాలే వాదించారు. పేదవాడైన అగ్రవర్ణ కూలీకి సమాజంలో గౌరవం ఉంటుంది, గుడిలోకి ప్రవేశం ఉంటుంది; కానీ దళితుడికి డబ్బు ఉన్నా కులం పేరుతో అవమానం తప్పదు. కాబట్టి, కేవలం ఆర్థిక సమానత్వం (మార్క్సిజం) మాత్రమే సరిపోదు, సామాజిక సమానత్వం (అంబేద్కరిజం) కూడా కావాలని లింబాలే స్పష్టం చేశారు.మార్క్సిస్టు దృక్కోణంలో "భగవంతుడే సత్యం, శివం, సుందరం" అనే ఆలోచన శ్రామిక వర్గాన్ని పోరాటం నుండి దూరం చేసే ఒక భావజాల ముసుగు (Ideological Veil). నిజమైన 'సత్యం' శ్రమజీవుల కష్టం, నిజమైన 'శివం' దోపిడీ లేని సమాజ నిర్మాణం, మరియు నిజమైన 'సుందరం' సమసమాజ స్థాపన అని మార్క్సిజం చెబుతుంది. శరణ్‌కుమార్ లింబాలే తన పుస్తకంలోని 'అంబేద్కరిజం మరియు మార్క్సిజం' (Ambedkarism and Marxism) అధ్యాయంలో, ఈ రెండు సిద్ధాంతాలకు అణగారిన వర్గాల విముక్తి ప్రధాన లక్ష్యమైనప్పటికీ, భారతదేశ వాస్తవ పరిస్థితుల్లో వాటి మధ్య ఉన్న కీలకమైన భేదాలను లోతుగా విశ్లేషించారు.

మార్క్సిజం మతాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది ("మతం ఒక మత్తుమందు"). అంబేద్కరిజం మనిషికి నైతిక విలువలు, సామాజిక గౌరవం ఇచ్చే ధర్మం అవసరమని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భావించారు. అందుకే ఆయన హిందూ మతంలోని కుల వ్యవస్థను తిరస్కరించి, స్వేచ్ఛ, సమానత్వం, కరుణను బోధించే బౌద్ధమతాన్ని (నవయాన బౌద్ధం) స్వీకరించారు. లింబాలే దృష్టిలో ఇది కేవలం మత మార్పిడి కాదు, దళితులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఒక గొప్ప సాంస్కృతిక తిరుగుబాటుగా భావిస్తున్నారు. మార్క్సిజం వ్యవస్థను మార్చడానికి సాయుధ పోరాటం లేదా విప్లవాత్మక హింసను సమర్థిస్తుంది. కానీ అంబేద్కరిజం రాజ్యాంగబద్ధమైన హక్కులు, విద్య, సంఘటిత పోరాటం, ప్రజాస్వామ్య విలువల ద్వారా శాంతియుత మార్పును కోరుకుంటుంది. శరణ్‌కుమార్ లింబాలే మార్క్సిజాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. దళితుల విముక్తి కోసం మార్క్స్ యొక్క ఆర్థిక సమానత్వ సిద్ధాంతం మరియు అంబేద్కర్ యొక్క సామాజిక సమానత్వ సిద్ధాంతం రెండూ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, భారతదేశంలో కుల నిర్మూలన జరగకుండా కేవలం మార్క్సిజం ద్వారా సమసమాజం సాధ్యం కాదని, దళిత సాహిత్యానికి అంబేద్కరిజమే అసలైన ప్రాణవాయువు అని ఆయన స్పష్టం చేశారు.

4.‘ధ్వని’ (Dhvani),వ్యంగ్యార్థాల తిరస్కరణ:

ఆనందవర్ధనుడు ప్రతిపాదించిన 'ధ్వని' సిద్ధాంతం ప్రకారం, సాహిత్యంలో అభిధార్ధాన్ని మించి అంతర్గత అర్థం (Implicit meaning) లేదా ధ్వని ప్రధానంగా ఉండాలి. కవి తన భావాన్ని ఎక్కడా నేరుగా చెప్పకుండా, అలంకారాలతో, గూఢార్థాలతో, సున్నితమైన సంకేతాలతో పాఠకుడికి అందజేయాలని ఆ సిద్ధాంతం చెబుతుంది.

కానీ, శరణ్‌కుమార్ లింబాలే గారు, దళిత సౌందర్యశాస్త్రం ఈ ధ్వని సిద్ధాంతాన్ని, వ్యంగ్యార్థాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. వారి వాదన ఏమిటంటే అణచివేతకు, కుల వివక్షకు గురైన దళితుడికి తన బాధను అలంకారాలతో, కవితాత్మక పదజాలంతో అలంకరించి దాచిపెట్టి చెప్పే తీరిక, అవసరం లేవు. సమాజంలో తన మీద జరుగుతున్న దాడిని, అవమానాలను, వివక్షను ఏమాత్రం దాచుకోకుండా సూటిగా, పదునుగా, కఠినమైన వాస్తవ భాషలో చెప్పడమే దళిత సాహిత్య లక్షణం. ఒకవేళ అక్కడ సున్నితమైన భాషను వాడితే, ఆ వ్యంగ్యార్థాల వెనుక నిజమైన బాధ యొక్క తీవ్రత తగ్గిపోయి, అణచివేత స్వభావం మరుగైపోతుంది. అందువల్ల, గూఢార్థాల కంటే నేరాలనూ, అన్యాయాలనూ ఎత్తిచూపే నిరసన గళమే దళిత సాహిత్యానికి ప్రాణాధారమని లింబాలే గారు స్పష్టం చేశారు.

సిద్ధాంతపరంగా "అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు" (సత్యం, శివం, సుందరం) అని చెబుతూనే, ఆచరణలో మాత్రం ఒక మనిషిని అంటరానివాడిగా చూసి, దేవాలయాల్లోకి రానివ్వకపోవడాన్ని లింబాలే ప్రశ్నిస్తారు."భగవంతుడే అన్నీ చూసుకుంటాడు" అనే ఆలోచన, తరతరాలుగా అణచివేతకు గురవుతున్న వారిని తమ హక్కుల కోసం పోరాడకుండా నిస్సహాయులుగా మారుస్తుందని దళిత చింతన భావిస్తుంది. ఆకలితో ఉన్నవాడికి వేదాంతం కంటే, ముందు కడుపు నిండే మార్గం మరియు ఆత్మగౌరవం ముఖ్యమని ఆయన వాదిస్తారు.లింబాలే వంటి దళిత సాహిత్య విమర్శకులు ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని కాకుండా, సమాజంలో ఆచరణలో ఉన్న వివక్షను ప్రశ్నిస్తున్నారని గమనించాలి.

భారతీయ ఆధ్యాత్మిక దృక్కోణంలో మనిషి అంతర్గత శాంతిని, మోక్షాన్ని, విశ్వజనీన ప్రేమను లక్ష్యంగా చేసుకుంటుంది.దళిత సాహిత్య దృక్కోణంలో ఈ భూమిపై మనిషికి దక్కాల్సిన సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్న లక్ష్యంగా చేసుకుంటుంది.

 కాబట్టి, భగవంతుడిని సత్యం, శివం, సుందరంగా చూడటం అనేది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక భావన కాగా, ఆ పేరుతో జరిగే సామాజిక అన్యాయాలను ఎదిరించి, సమానత్వాన్ని కోరుకోవడం అనేది దళిత సౌందర్యశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం. అణగారిన వర్గాల గొంతును సాహిత్యంగా మలచవచ్చని నిరూపించిన లింబాలే గారికి, ఈ సభను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, ఇక్కడ కూర్చున్న సాహిత్య ప్రియులందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 14.11.2026.



07 సెప్టెంబర్, 2026

అరసం ఆధ్వర్యంలో ఎండ్లూరి సుధాకర్ గారి కావ్య త్రయం పై ఆచార్య దార్ల ప్రసంగం

 ఆచార్య ఎండ్లూరి  ‘కావ్యత్రయం’దళిత చైతన్య పరిణామానికి ప్రతీక

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య.

ఆంధ్రజ్యోతి దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
ప్రభంజనం దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

 సమాజంలో మూడు తరాల దళితుల సామాజిక అస్తిత్వానికి దర్పణంగా ఎండ్లూరి సుధాకర్ గారి కావ్య త్రయం (కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి దీర్ఘకావ్యాలు) నిదర్శనంగా నిలుస్తుందనిహెచ్ సీయు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారి వారం వారం అంతర్జాల ప్రసంగ పరంపరలో భాగంగా ఆదివారం ఉదయం (6.9.2026) ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సమావేశానికి అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ మూడు దీర్ఘకావ్యాలను సమగ్రంగా పరిశీలిస్తే దళిత అస్తిత్వం, హక్కులు, చారిత్రక గుర్తింపు అనే మూడు కీలక దశలుగా అవి కనిపిస్తాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దళిత జీవితానుభవాన్ని కేవలం వ్యక్తిగత వేదనగా కాకుండా సామాజిక చరిత్రగా, సామాజిక చరిత్రను అస్తిత్వ ప్రశ్నగా, అస్తిత్వ ప్రశ్నను హక్కుల పోరాటంగా సుధాకర్‌ తన కావ్యాల్లో మలిచారని దార్ల వివరించారు. ‘కొత్త గబ్బిలం’లో దళిత స్వరం కోసం అన్వేషణ, ‘వర్గీకరణీయం’లో హక్కు కోసం వాదన, ‘గోసంగి’లో చరిత్రలో అస్తిత్వాన్ని పునఃస్థాపించుకునే ప్రయత్నం కనిపిస్తుందని చెప్పారు.

దిశ దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
విశాలాంధ్ర దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
నినాదం దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 



సాక్షి దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 

విశ్వవిద్యాలయంలో పనిచేసే ఆచార్యులు చేయాల్సిన పనులన్నీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్నారని, ఎండ్లూరు సుధాకర్ గారి కావ్యత్రయాన్ని చక్కటి విశ్లేషణాత్మక ప్రసంగం ద్వారా మూడు దీర్ఘ కావ్యాల్లోని సాహిత్య, సామాజిక, చారిత్రక పరిణామాలను శాస్త్రీయంగా విశ్లేషించారని సభాధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో అరసం కార్యదర్శి ఆనంద్,  ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి, రచయిత డా.వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి,  టి.రమణయ్య, లెనిన్ బాబు, గోవింద్, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


01 డిసెంబర్, 2025

గురజాడ వారి ప్రకాశిక త్రైమాస పత్రిక ... ఆచార్య దార్ల ప్రసంగం (1.12.2025)

 గురజాడ వారి ప్రకాశిక త్రైమాస పత్రిక – నా అనుభవాలు

అందరికీ నమస్కారం.



ముందుగా అంతర్జాతీయ గురజాడ ఫౌండేషన్ వారికి, అలాగే భారతదేశంలోని భారతీయ గురజాడ ఫౌండేషన్ నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.

ఈ రోజు (1.12.2025 )  మనం ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికుడు గురజాడ అప్పారావు గారి 110వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడానికి, స్మృత్యాంజలి ఘటించడానికి ఈ అంతర్జాల వేదికపై సమావేశమయ్యాం. అయితే, నా దృష్టిలో ఈ సమావేశం గురజాడను కేవలం గుర్తు చేసుకోవడానికే పరిమితం కాకూడదు; ఆయన ఆలోచనలను, ఆయన సమాజానికి చూపిన మార్గాన్ని వర్తమాన సందర్భంలో నిలబెట్టి పునర్మూల్యాంకనం చేసుకోవలసిన సందర్భమనుకుంటున్నాను. ముఖ్యంగా గురజాడ సాహిత్యాన్ని, ఆలోచనలను ప్రపంచవ్యాప్తం చేయడంలో విశేషమైన కృషి చేసిన గురజాడ అప్పారావు గారి మనుమరాలు  గురజాడ అరుణమ్మ గారిని మనం మొదటగా గుర్తుచేసుకోవాలి. ఆమె కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిల్లో చేసిన కృషి అసాధారణమైనది. గురజాడ వారి మనవరాలుగా సాహిత్య రంగంలోకి వచ్చి కార్యక్రమాలు చేపట్టేసరికి సాహిత్య లోకంలో ఎక్కడలేని ఏకాగ్రత, సరికొత్త ఉత్సాహం ఏర్పడ్డాయి. ఆమెతో మాట్లాడాలన్నా, సదస్సులు నిర్వహించాలన్నా పండితులు, పరిశోధకులు ఎంతో ఆసక్తితో ముందుకొచ్చారు. ఆ కృషి చేసినందుకు అరుణమ్మగారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను.

ఈనాటి సభాధ్యక్షులు డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ గారు అమెరికాలో క్యాన్సర్ ఔషధ రూపకల్పనలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తూనే, అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ నడిపిన విస్తృతమైన అనుభవం ఉన్నవారు. ఆ శాస్త్రీయ దృక్పథంతోనే గురజాడ అప్పారావు గారు స్థాపించిన  ‘ప్రకాశిక’ పత్రికను తెలుగువారికి అందిస్తున్నారు. నాకు ఇప్పటికీ గుర్తుంది — నన్ను ఈ పత్రిక సంపాదక మండలిలో భాగస్వామ్యం చేస్తున్నామని ఆయన ఒక లేఖ రాసినప్పుడు, నేను ఎంతో సంతోషంగా ఆయనకు బదులిస్తూ ఒక మాట అన్నాను.“నాకు ఒక జ్ఞానపీఠ పురస్కారం రావడం కంటే, సాహిత్య అకాడమీ పురస్కారం రావడం కంటే... ఆధునిక తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన గురజాడ వారి పేరిట వెలువడే ‘ప్రకాశిక’ సంపాదక మండలిలో ఉండడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.” అని! నేను ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నాను. ఆయన నమ్మకంతో నన్ను కార్యనిర్వాహక సంపాదకులుగా పెట్టినందుకు కృతజ్ఞతలతో కూడిన నమస్కారాలు తెలియజేస్తున్నాను.

అలాగే ఈ అంతర్జాల  వేదికపై ఉన్న ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన గురజాడ ఫౌండేషన్ (అమెరికా) అధ్యక్షులు శ్రీమతి గురజాడ అరుణమ్మగారికీ,, ఈ సమావేశంలో ప్రత్యేక అతిథి గా పాల్గొన్న సహృదయ సాహితి, అధ్యక్షులు, శ్రీ శేఖరమంత్రి ప్రభాకరరావు గారికీ   గురజాడ ఫౌండేషన్ (ఇండియా) అధ్యక్షులు గురజాడ రవీంద్రుడు గారికీ, గురుతుల్యులు ఆచార్య వెలమల సిమ్మన్న, గురువులు ఆచార్య అయినవోలు ఉషాదేవి గారికి, మిత్రులు డాక్టర్ షమీవుల్లా గారికి, గురజాడ పై పరిశోధన చేసిన డా చెంగల్వ రామలక్ష్మి గారికి, గురజాడ వారి బంధువులు గురజాడ రవీంద్రుడు గారికి, ప్రజాసాహితి మాసపత్రిక సంపాదకులు డా.కొత్తపల్లి రవిబాబు గారికి, ‘ప్రకాశిక’ పత్రికసంపాదక వర్గ మిత్రులందరికీ, ఈ సభలో పాల్గొన్న సహృదయ సాహితీవేత్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.

ఈ సందర్భంగా ఆచార్య గోపాలకృష్ణ కొవ్వలి, ఆచార్య అయినవోలు ఉషాదేవి సంపాదకత్వంలో వచ్చిన ‘గురజాడ సాహిత్యంలో భాషా విశేషాలు’ గ్రంథాన్ని ప్రముఖ కవి, విమర్శకులు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎస్.షమీఉల్లా, ‘మనస్వినీయం’ (ఆచార్య గోపాలకృష్ణ కొవ్వలి వారి వచన కవితాసంపుటి)ని ప్రముఖ కవయిత్రి, విమర్శకులు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.చెంగల్వ రామలక్ష్మి సమీక్షించారు. ఇలాంటి గొప్ప సభలో ఈ రోజు నా చేతుల మీదుగా ‘ప్రకాశిక’ ఐదవ సంచిక ఆవిష్కరణ జరుగడం నాకెంతో సంతోషంగాను, గర్వంగానూ ఉంది. సాంకేతికంగా మొబైల్ తెరపైనా, బ్యాక్‌గ్రౌండ్‌లోనూ పత్రికను చూపిస్తూ ఆవిష్కరించాను. కానీ పత్రికను స్క్రీన్‌పై చూపించడం కేవలం బాహ్యమైన లాంఛనం మాత్రమేనని నా అభిప్రాయం. పత్రిక అంతరంగాన్ని, దాని వెనుక ఉన్న తాత్వికతను ఆవిష్కరించడమే నిజమైన హృదయావిష్కరణగా భావిస్తున్నాను.

ఈ ఐదవ సంచిక ఎందుకు ప్రత్యేకమైనదో, గురజాడ ఫౌండేషన్ సహృదయత ఎంత గొప్పదో ఒక్క ఉదాహరణ చెబితే స్పష్టమవుతుంది. ఈ  సంచికలో అందెశ్రీకి నీరాజనాలు అర్పిస్తూ గురజాడ అప్పారావు, అందెశ్రీలు ఇద్దరూ మానవత్వం, మనిషి తత్త్వం గురించి చర్చించుకుంటున్నట్లు కృత్రిమ మేధ సహాయంతో చిత్రీకరించిన ఓ చిత్రాన్ని ముఖచిత్రంగా ప్రచురించారు. ఇందులో తెలంగాణాలో పుట్టి పెరిగిన ప్రజాకవి అందెశ్రీ గారి జీవితం, సాహిత్యంపై ఏకంగా 23 పేజీల సుదీర్ఘమైన, సమగ్రమైన విశ్లేషణాత్మక ఒక వ్యాసాన్ని ప్రచురించాం. ఆ వ్యాసం జాగ్రత్తగా చదివితే ప్రతి అక్షరంలో తెలంగాణ సాంస్కృతిక చైతన్యం తొణికిసలాడుతుంది. అక్షరజ్ఞానం లేని, తల్లిదండ్రులెవరో కూడా నిర్దిష్టంగా తెలియని అట్టడుగు సామాజిక నేపథ్యం నుంచి వచ్చి, తన వాగ్ధాటితో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన ఒక ప్రజాకవికి ఇంతటి ప్రాధాన్యతనిచ్చి వ్యాసం ప్రచురించడమంటే... అది గురజాడ వారు మట్టి మనుషులకు ఇచ్చిన గౌరవంగా, పేద ప్రజల పక్షాన నిలబడిన మానవత్వపు విజయపతాకగా నేను భావిస్తున్నాను. అందెశ్రీ గారు మరణించిన వెంటనే ఇయనపై ఒక వ్యాసం వేయాలని, ఎవరైనా బాగా, ఆత్మీయంగా, సవివరమైన విషయ పరిజ్ఞానంతో రాస్తే బాగుంటుందని ప్రకాశిక పత్రిక ప్రధాన సంపాదకులు ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు నేనూ మాట్లాడుకున్నాం. చాలా మంది పేర్లు చర్చించుకున్నాం. కానీ, త్వరగా రాసివ్వాలి. ఎవరైనా రాస్తారేమోనని, నేను వాళ్ళతో మాట్లాడతానని అన్నాను. కానీ వాళ్ళంతా అందెశ్రీ కి సంబంధించిన తగిన సమాచారం తమ దగ్గర లేదన్నారు. అంత వేగంగా కూడా ఇవ్వలేమన్నారు. ఎలాగైనా మా పత్రిక ‘ప్రకాశిక’లో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఒక వ్యాసం వేయాలనుకున్నాం. ఇక, నన్నే రాయమనన్నారు. అలా ఆయనపై ఒక సుదీర్ఘమైన వ్యాసం రాశాను. 

నేను నిరంతరం పరిశోధనా వ్యాసాలు రాస్తుంటాను, సంపాదకత్వంలో భాగస్వామినే అయినా... డాక్టర్ గోపాలకృష్ణ గారితో కలిసి పనిచేస్తూ నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన పేరుకు సైంటిస్ట్ అయినప్పటికీ, సంపాదకత్వానికి వచ్చేసరికి అత్యంత నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఎవరి వ్యాసమైనా సరే ఎడిటింగ్ ఎడిటింగ్‌లాగే చూస్తారు. “దార్ల గారూ, ఇక్కడ వాక్యం ఇలా ఉంది, ఈ భావం ఇలా ఉంటే బాగుంటుంది కదా” అని నాతో నిర్మొహమాటంగా చర్చిస్తారు. ఒక సంపాదకుడు ఎలా పనిచేయాలో ఆయన ఆచరణలో చేసి చూపించారు.

అన్నిటికంటే ముఖ్యంగా సాహిత్య పరిశోధనలో ఆయన ప్లేజియరిజాన్ని (నకలు రాతలను) పట్టుకునే తీరు నన్ను విస్మయానికి గురిచేస్తుంది. గురజాడ వారి 150వ జయంతి సందర్భంగానో, విజయనగరం సదస్సుల్లోనో, వెయ్యేళ్ల కన్యాశుల్కం సంపుటాల్లోనో వచ్చిన పాత వ్యాసాల నుంచి భాగాలను కాపీ చేసి, తమ పేర్లు తగిలించి పంపే పరిశోధకుల వ్యాసాలను ఆయన ఒక్క చూపుతో పసిగట్టేవారు. “దార్ల గారూ, ఈ వాక్యానికి ఆ వాక్యానికి తేడా చూడండి, ఇది ఇతని సొంత వాక్యంలా లేదు, ఎక్కడి నుంచో తెచ్చి అతికించినట్టుంది” అని ఇట్టే పట్టేసేవారు. అందుకే ‘ప్రకాశిక’లో ఒక వ్యాసం ప్రచురితమైందంటే అది సంపూర్ణ ప్రామాణికమైనది, నికార్సయిన పరిశోధన అయితేనే సాధ్యమవుతుంది.

అంతేకాదు, ‘ప్రకాశిక’ సాహిత్య రంగానికి చేసిన నిర్మాణాత్మక సేవలు అపారమైనవి. గతంలో కొన్ని ప్రత్యేక సంచికలు తీసుకొచ్చారు. తెలుగు కవిత్వోద్యమాలు, లఘు కవితాప్రక్రియలు, వాగ్గేయకార సాహిత్యం, ప్రాచీన సాహిత్యం- సామాజిక స్పృహ, గురజాడ భాషా విశేషాలు మొదలైన పేర్లతో ప్రత్యేక సంచికలు తీసుకొని రావడం, ఆ తర్వాత వాటిని పుస్తకాలుగా తీసుకురావడం ప్రకాశిక పత్రిక చేస్తున్న గొప్ప కృషిగా భావిస్తున్నాను.ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు, ఆచార్య అయినవోలు ఉషాదేవి గారు, ఆచార్య జి.యస్.మోహన్ గారు,  ఆచార్య దామోదరనాయుడు గారి వంటి పండితుల సహకారంతో ప్రాచీన సాహిత్యంలో సామాజిక స్పృహ, జానపద వాగ్గేయకార సాహిత్యంపై ప్రామాణికమైన ప్రత్యేక సంపుటాలు తెచ్చారు. నానీలు, గజళ్ల వంటి లఘు కవితా ప్రక్రియల మీదా ప్రత్యేక సంచికలు తీసుకొచ్చారు. డాక్టర్ గడ్డం శ్యామల, డాక్టర్ ఎస్.రఘు, డాక్టర్ వింధ్యవాసిని  గార్లు ఆ ప్రత్యేక సంచికకు రచనల సేకరణలో సహకరించినందుకు, వారికి సంపాదకులుగా సముచిత రీతిలో గౌరవించారు. 

ఇక్కడ గోపాలకృష్ణ గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంస్కారం మరొకటుంది. ఎవరి దగ్గరైనా కొద్దిపాటి సహకారం తీసుకున్నా, వారి శ్రమను గుర్తించి విభాగ సంపాదకులుగా వారి పేర్లను గౌరవంగా ప్రకటిస్తారు. అదే పద్ధతి ఆ యా ప్రత్యేక సంచికలకు కూడా వర్తించేలా చేశారు.ఇక, పత్రిక సాంకేతిక రూపకల్పన విషయానికి వస్తే, ఇది అంతర్జాల పత్రిక అయినప్పటికీ మనం ముద్రితమైన గ్రంథాన్ని చేతిలో పట్టుకుని చదువుతున్న అనుభూతిని కలిగిస్తుంది. చిత్రకారుడు శివాజీ గారి అద్భుతమైన బొమ్మలు, వెంకట్ గారి పేజీ లేఅవుట్, కిరణ్ గారి వెబ్‌సైట్ నిర్వహణ పత్రికకు విశేషమైన హుందాతనాన్ని తెచ్చిపెడుతున్నాయి. అంతర్జాలంలో ఉచితంగా పని చేయించుకోవాలనే భావన ఆచార్య గోపాలకృష్ణ గారికి ఎక్కడా ఉండదు; ప్రతి పేజీ రూపకల్పనకూ నిర్దిష్టమైన గౌరవ వేతనం ఇస్తూ వృత్తిపరమైన విలువలను కాపాడుతుంటారు. అలాగే వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు తాజా వ్యాసాలు యూనికోడ్‌లో చదువుకునే సౌలభ్యంతో పాటు, గూగుల్ సెర్చ్‌లో వెతికితే నేరుగా ప్రకాశిక వ్యాసాలకు చేరుకునేలా సాంకేతిక నిర్మాణాన్ని కూడా తీర్చిదిద్దారు.

ఒక పెద్ద విశ్వవిద్యాలయం లేదా పరిశోధనా సంస్థ చేయాల్సినంత బృహత్తర కార్యాన్ని ఒక పత్రికగా ‘ప్రకాశిక’ నిర్వహిస్తుండడం తెలుగు సాహిత్యానికే గర్వకారణంగా భావిస్తున్నాను. గోపాలకృష్ణ గారు రెండు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దగ్గర పెట్టుకుని అటు అంతర్జాతీయ క్యాన్సర్ శాస్త్రవేత్తలకు సలహాలు ఇస్తూనే, మరోవైపు తెలుగు సాహిత్యానికి ఇంతటి సమయాన్ని వెచ్చిస్తూ నిర్విరామంగా పనిచేస్తుండడం నిజంగా పత్రిక చేసుకున్న అదృష్టం. ఈ మహత్తరమైన సాహితీ యజ్ఞంలో ఒక కార్యనిర్వాహక సంపాదకుడిగా నన్ను భాగస్వామిని చేసి, గౌరవించినందుకు గురజాడ ఫౌండేషన్‌కు, గురజాడ కుటుంబానికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

సెలవు. ధన్యవాదాలు.

(1.12.2025 వ తేదీన నిర్వహించిన అంతర్జాల వేదికపై మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 2.12.2025.


23 జూన్, 2025

శీలం భద్రయ్య గారి మినీ కవితాసంపుటి‘‘ముస్తాదు’’పై ఆచార్య దార్ల ప్రసంగం (22.6.2025)

శీలం భద్రయ్య ‘ముస్తాదు’ మినీ కవితల సంపుటిపై

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగం

అంతర్జాల సమావేశంలో మాట్లాడుతున్న  ఆచార్య  దార్ల వెంకటేశ్వరరావు


 

●      గౌడు చెమటకు

            తల్లి తాటిచెట్టు ఎద ఉప్పొంగింది

            గెలకంటి నుండి

            బొట్లు బొట్లుగా ఆనంద భాష్పాలు

ఇది, డాక్టర్ శీలం భద్రయ్య గారి ‘ముస్తాదు’ కవితా సంపుటి లోనిది. దీన్ని వివరించడానికి ముందు

మీ అందరికీ నమస్కారం,

ఈరోజు కవి, కథకుడు, తెలుగు భాషోపాధ్యాయుడు డాక్టర్ శీలం భద్రయ్యగారి ‘ముస్తాదు’ కవితా సంపుటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు భాషా చైతన్య సమితి, ద్వానా సాహితీ కుటీరం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించాలి.

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా విధులు చేపట్టినటి నుండి నేటి వరకుఅవిశ్రాంతంగా శని ఆదివారాలు కూడా పనిచేస్తూ చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ నామోజీ బాలాచారి గారు.నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.

 ●     


ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు మా గురువుగారు డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారిపుత్రులు  ద్వాదశి శశికాంత్ గారికి నమస్కారం.  (నిజానికి ఆయన ఈ రోజు సభాధ్యక్షతలో లేరు. కార్యక్రమ ఆహ్వానపత్రంలో మాత్రం ఆయన పేరుంది.) మరొకరు నిర్వహించారు.

●      ఇలాంటి కార్యక్రమంలో వక్తలుగా పాల్గొంటున్న ప్రముఖ కవి, సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త, సెంట్రల్ యూనివర్సిటీలో నాకు సీనియర్ డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఉత్తమ సాహితీవేత్త రాపోలు సీతారామరాజు గార్లకు నా నమస్కారాలు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తెలుగు సాహిత్యం పట్ల ఆయనకి ఎనలేని అభిమానం ఉంది. దక్షిణాఫ్రికా నానీలు, నెల్సన్ మండేలా జీవిత చరిత్ర వంటివి ఆయనకు సాహిత్యంలో మంచి గుర్తింపుని తెచ్చాయి.

●      అస్తిత్వ ఉద్యమానికి ఉద్యమరూపాన్నిచ్చే గొప్ప కవితా సంపుటి ‘ముస్తాదు’ని వెలువరించిన డాక్టర్ శీలం భద్రయ్య గారికి నా శుభాకాంక్షలు. సాహిత్యాన్ని రాయడమే కాదు, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలో తెలిసిన రచయిత భద్రయ్య గారు.

ఇప్పుడు నేను మొట్టమొదట ప్రస్తావించిన కవితలోని సౌందర్యాన్ని విశ్లేషించుకుందాం.

కల్లు గీసే వృత్తి తెలంగాణలో ‘గౌడ’ కులస్తులు మాత్రమే చేస్తారు. కానీ, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈ వృత్తిని ఏ కులస్తులైనా చేయవచ్చు. అలా మా తాత, నాన్న, తర్వాత మా అన్నయ్య… వంశపారంపర్యంగా ఈ వృత్తి చేస్తాం. అందువల్ల ఈ కవిత చదవగానే కవికి కవిత్వం ఉప్పొంగినట్లే, నాకు కూడా హృదయం ఆనందంతో పొంగినట్లయ్యింది

 ●      గౌడు చెమటకు

            తల్లి తాటిచెట్టు ఎద ఉప్పొంగింది

            గెలకంటి నుండి

            బొట్లు బొట్లుగా ఆనంద భాష్పాలు

జీవితాన్ని కవిత్వం చేయడంలో ఇంత అద్భుతమైన అభివ్యక్తిని చూసి నాకు గంతులేసినంత పని అయింది.

తాటి చెట్టుని తల్లిగా భావించటం ఒక పవిత్రమైన భావన. కల్లు గీయడానికి తాడిచెట్టు ఎక్కేముందు, ఆ చెట్టుకి మొక్కుతారు. అంతే దాన్నొక దేవతగా, దైవంగా భావిస్తారు.

దళిత, బహుజన వర్గాలు అన్నీ ప్రకృతితో తన్మయులవుతుంటారు.

కల్లు గీయడం అనేది

తాటి  చెట్టుకి ఉన్న లేత గెలలను మూడు పూటలా కత్తితో సన్నిని పొరలు కోయటం వల్ల దాని నుండి బొట్లు బొట్లుగా కల్లు కారుతుంది.

అది ఒక కుండలో పడేటట్లుగా ఎంతో నైపుణ్యంతో కడతారు.

ఒక చెట్టుకి  ఉన్న గెలలను బట్టి రెండు మూడు  కుండలు కూడా కట్టే అవకాశం ఉంటుంది. 

ఒక్కో కుండకీ తాడుకట్టి, ఆ తాడుని జాగ్రత్తగా ఆ గెలకు పైనున్న కమ్మలకు లేదా ఆ గెల మూలకి కడతారు.

దాన్ని జాగ్రత్తగా తీసి దానిలో ఉన్న కల్లుని తన ముస్తాదుకు కట్టుకున్న కుండడలోకి వేసుకుంటారు.

మళ్లీ ఆ గెలకు ఆ కుండను కట్టే ముందు కుండను జాగ్రత్తగా తాటాకుతో శుభ్రం చేస్తారు. చేయి తగలకుండా ఆ ఆకుతోనే కుండను శుభ్రం చేస్తారు. చేయి తగిలితే కల్లు పుల్లగా అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా శుభ్రం చేయాలి. 

 ఎప్పుడూ కూడా ఆ గెలను పట్టుకొని జాగ్రత్తగా చిన్నచిన్న పొరలు కోయాలి.

అలా కోసిన వెంటనే ఆ గెల నుండి టప్ టప్ మని బొట్టు బొట్లుగా కల్లు కారడం మొదలవుతుంది.

అలా ఆ చెట్టుకి కట్టిన కుండలన్నీ శుభ్రం చేసి, ఆ గెలలన్నీ సన్నగా కోయాలి.

మరలా బయట నుండి పురుగులు వంటి వేమీ ఆ కుండలో పడకుండగా, పక్షలు మూతిపెట్టకుండా మూత జాగ్రత్తగా కట్టాలి.

ఒక్కోసారి తాను తీసుకెళ్ళిన ఒక్క కుండ సరిపోదు.

మళ్లీ  కిందికి దిగి వెళ్లి  మరో కుండలో పెకెళ్ళి కల్లుని తీసుకురావాల్సి ఉంటుంది.

అలా ఒక తాటి చెట్టు అంత కల్లు ఇవ్వడమంటే ఆ తాటి చెట్టు నిజంగా తల్లి లాంటిది కాక, మరేమవుతుంది.

అందుకే ఆ పోలిక. ఎంత ఔచిత్య భరితంగా ఉంది.

●      ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలు కవి శీలంభద్రయ్య గారి కవిత్వాన్ని మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రాంతంలో గౌడ కులవృత్తికి సంబంధించిన ఔన్నత్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఆ కుల వృత్తిలోని సాధకబాధకాలను కూడా ప్రస్తావించారు.

●      డాక్టర్ తండు కృష్ణ చైతన్యగారు ఈ కవితా సంపుటికి ఒక సైద్థాంతిక నేపథ్యాన్ని చెప్పి, ఆ భావజాలానికి ’ముస్తాదు’ కవితా సంపుటి ఎలా తోడ్పడుతుందో చక్కగా అన్వయించారు.

భాష: శీలం భద్రయ్య గారు తన కవిత్వంలోగానీ, అంతముందు తాను వేసిన ‘లొట్టపీసు పూలు’ కథల్లో గానీ, తెలంగాణ జీవద్వంతమైనభాషను ఉపయోగించారు, ఇది వారి రచనలకు సహజత్వాన్ని అందిస్తుంది.

యాదించుకో ...!

మందుకల్లు కాదు

ఎతశితకు “మందు" ..... “కల్లు”

ఇందులో  ‘ఎతశిత’ .. మనసులోని బాధ అనే అర్ధాన్నిస్తుంది. ‘యాదించుకో’ గుర్తుపెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో అనే అర్థంలో నిత్యం ఆ పదాన్ని వాడతారు.

 ముస్తాదును

నడుముకు కట్టిన వస్తాదు

చెమటోడ్చి

ఊరిదూపను తీరుస్తాడు

ఉదా: ముస్తాదు :  ముస్తాదు అంటే గీతకార్మికులు నడుముకు కట్టుకొనేది. అది గౌడుకు పట్టుత్వం, గౌడు వృత్తి పరికరాలైన కత్తులు, చిడతబద్దలను పెట్టుకునేది. చెట్టుపై కల్లు లొట్టి కూడా వెనక తగిలించుకునేది.

ఇది వృత్తి పదానికి ఉన్న వివరణ.

●      దీనితోపాటు…'ముస్తాదు' అనే పదం భిన్న సందర్భాలలో కూడా ఉపయోగిస్తారని నాకు కవే వివరించి చెప్పారు. అంటే గౌడు పరికరాలైన మోకు, గుజి అన్నీ కలిపి చెప్పే పద బంధం. కులంలో ఎన్ని ముస్తాదులున్నాయి అంటే? ఎంతమంది ఉన్నారనే అర్థం.

దీన్ని కోస్తా ప్రాంతంలో బల్లకట్టడం అంటారు.

‘గుజిది ఉడుంపట్టు

యమపాశానికి

వొళ్లు వణికింది’

కల్లు గీసేవారు మూడు పూటలూ తాటి చెట్టు ఎక్కడం,  దిగడానికి కాళ్ళకి వేసుకునే  ఒక ముఖ్యమైన పరికరం గుజి.

దీన్ని కోస్తా ప్రాంతంలో అయితే ‘గుది’ అంటారు. నిఘంటువుల్లో -తాటిచెట్టు మొదలైన వాటినికి ఎక్కుటకు కాళ్ళకు తగిలించుకొను బంధము.’ అని ఉంది. ఆ గుదిని  తాటి నారతోటే తయారుచేస్తారు. దీన్ని తెలంగాణలో ‘గుజి’ అని వ్యవహరిస్తారు.

రెండు కాళ్ళను బలంగా తాటి చెట్టుకు అదిమి పెట్టుకొనిపైకి ఎక్కడానికి కిందికి దిగడానికి కల్లు తీసేటప్పుడు ఆ తాటి చెట్టు గెలలనను సన్నగా కత్తితో కోయడానికి కాళ్ళకున్న ఏకైక ఆధారం కూడా ఆ గుదే.

అది గనక  తెగినా, కాళ్ళల్లో ఒక కాలు బయటకు జారినా, మనిషి కింద పడిపోతాడు. దాంతో తన ముస్తాదు ఒరలో ఉన్న మరొక కత్తి లేదా తన చేతిలో కత్తి తనకే గుచ్చుకోవచ్చు. మనిషి పడ్డాడంటే ఆ చెట్టునే మనిషి దక్కుతాడో లేదో చెప్పలేం. ఒకవేళ బ్రతికినా మళ్ళీ ఆరోగ్యంగా ఉండలేడు. కాళ్లో, చేయిలో, నడుమో విరిగిపోతుంది.  ఒక్కోసారి అక్కడికక్కడే చనిపోయినవాళ్ళెంతమందో. ఎందుకంటే, వాళ్లు పడినప్పుడు వెంటనే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాణం కాపాడొచ్చు. కానీ,తాను ఒక్కడే ఆ తాటి వనందగ్గరకు వెళ్ళి కల్లు గీస్తాడు. ప్రతీరోజు చేసే పని అది. అందువల్ల అతని కూడా రోజూ ఎవరూ ఉండరు. అందుకని అలాంటప్పుడు అది దిక్కులేని చావు అవుతుంది.

మామూలుగా చెట్టు ఎక్కడమే కష్టం.

ఆ చెట్టు ఎక్కిన తర్వాత అక్కడ భూమి మీద నిలబడినట్లుగా చాలా సేపు నిలబడాలి.

ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ గెలలకు గెలలను  జాగ్రత్తగా చిన్న చిన్న పొరలుగా కోయాలి.

దీంతోపాటు ఆ గుది ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే,  రోజుకు మూడుసార్లు ఎక్కీ దిగేసరికీ పైనుండి కొద్దిగా కారినటువంటి కల్లు చెట్టు మీద పడడం వల్లా చెట్టు నున్నగా మారిపోతుంది. అటువంటి అప్పుడు కాలు ఆ చెట్టు మీద జారిపోతుంది. కాలుని జారనివ్వకుండగా పట్టుకునేది గుదే. కాలుకీ, మనిషికీ మంచి పట్టునిస్తుంది.

అందుకని యమధర్మరాజు చేతిలో ప్రాణాలు తీసే యమపాశం కూడా భయపడుతుంది అని కవి చెప్పడం పౌరాణిక ప్రతీకను ఆధునిక కవిత్వంలో శక్తివంతంగా ఉపయోగించుకున్నాడు కవి. బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక పౌరాణిక ప్రతీక ద్వారా గీతకార్మికుని జీవితంలో ఉపయోగించే సాధనాన్ని సామాన్య పాఠకులకు కూడా కళ్ళకు కట్టినట్లు ఊహించుకోవడానికి ఈ వర్ణన ఉపయోగపడుతుంది. అందుకే గుది కల్లుగీసేవారికీ,  కొబ్బరి దింపులు తీసేవారికీ తాటాకు కొట్టేవాళ్ళకీ ముఖ్యమైనటువంటి పరికరం ఇది. ఇంత నైపుణ్యంతో చేయాల్సిన ఈ వృత్తి Unskilled లో పెట్టడం ఆశ్చర్యం.

ఇదే కాదు…

చేతివృత్తులు చేసే వాళ్లంతా తమ పనులు చేసేటప్పుడు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ప్రతీ వృత్తీ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని చేయాల్సిన పనులు. చేనేత ... ఎంత నైపుణ్యం ఉంటే దారాల్ని ఒడకాలి, వాటిని బట్టలుగా చేయాలి. ఎంత నైపుణ్యం ఉంటే తప్ప, ఎన్నో డిజైన్లు వేయడం సాధ్యమవుతుందా?

వడ్రంగి పని...చూడండి. ఒక చెట్టు నుండి తీసుకున్న చెక్కను రకరకాలుగా నిత్యం మనకి ఉపయోగపడే వస్తువులుగా చేస్తారు. గుమ్మం, కిటికీ, అలమారు... ఒకటా, కుర్చీ, మంచం, రకరకాల కుర్చీలు, రకరకాల మంచాలు... ఇంతేకాదు, ఒకప్పుడు బండికి పెద్దపెద్ద చక్రాలు కావాలి. ఇంచుమించు బండి అంతా చెక్కతోనే తయారవుతుంది. శీలలు, ఇరుసులు తప్ప... ... ఇంతే కాదు, ఒకప్పుడు మన బియ్యం, ధాన్యం వంటివాటిని కొలవడానికి ఉపయోగించే కుంచం, శేరు, సోల వంటివన్నీ చెక్కతోనే కదా చేస్తారు....  అవన్నీ ఎలాంటి చెక్కవాడాలో, వాటిని ఎలా తీర్చిదిద్దాలో అనేది నైపుణ్యం కాదా?

కమ్మరి... మనింట్లో నిత్యం ఉపయోగించుకునే కత్తి దగ్గర నుండి, సుత్తి, కొడవలి, చాకు, (శీలలు), తలుపులకు, కిటికీలకు వాడే గొళ్ళాలు, మిగతా పరికారాలు, కిటికీలలో వాడే ఊసలు, తాళాలు, వాటి చెవులు... ఇలా ఒకటా, రెండా

నిత్యం మనం చెప్పులు లేకుండా నడవలేం. గీతకార్మికుడు వాడే ‘ముస్తాదు’లో మంచి చెర్మంతో చేసిన ఒరలు ఉండాలి. అప్పుడే ఆ కత్తులు పెట్టుకున్నా, అది ఏమీకాదు. వీటితో పాటు సమస్త చేతివృత్తుల వాళ్ళూ ఎంతో నైపుణ్యంతో తమ తమ వృత్తుల్ని చేయాలి. కానీ, ఇవన్నీ Unskilled జాబితాలో పెట్టేసారు.

ఒక చిన్న కవిత ద్వారా  ఇన్ని విషయాలను మన ముందుకు చర్చకు పెడుతున్నాడు కవి.

 కోపం వచ్చినప్పుడు గీతకార్మికులు దానితోనే కొడుతూ ఉంటారు. చిన్నప్పుడు  నేను గాని, మా అన్న తమ్ముళ్లలో ఎవరైనా సరే ఆలస్యంగా లేస్తే ఆ గుదితోటే కొట్టేవాడు మా నాన్న.

 

సామాజిక స్పృహ: శీలం భద్రయ్యగారి కవితలు అణచివేత, తిరుగుబాటు, సామాజిక అసమానతలను ప్రతిబింబిస్తాయి.

ఇది మినీ కవిత్వమే కావచ్చు. ఒక్కొక్క కవిత ఖండిక మూడు లేదా నాలుగు పాదాల్లో కొనసాగింది.

కానీ, ప్రతి ఖండికలోను ఒక జీవితం ఉంది.

కొన్నిసార్లు మూడు వాక్యాలే రాసినా, భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో కనిపించే జీవితం మూడు వాక్యాలుగా వర్ణించాడేమో అనిపిస్తుంది. ఇదొక చమత్కారం మాత్రమే.

సంప్రదాయ లేదా శిష్ట సాహిత్యంలో ఉపయోగించే పదాలు నిఘంటువుల్లో కనిపిస్తాయి. కొన్ని కింది వర్గాలు, వర్ణాల వారు ప్రయోగించేవైనా కోస్తాప్రాంతాల్లోని పదాలు కొంతవరకు నిఘంటువుల్లోకి ఎక్కాయి. అయినా నేటికీ, దళిత బహుజన కులాల వృత్తి పదాలు ఇంకా నిఘంటువులకు ఎక్కలేదు. కానీ, తెలంగాణలోని తెలుగు పద సంపద  ఇంకా నిఘంటువుల్లోకి ఎక్కాల్సింది, పాఠ్యాంశాల్లో చేరాల్సింది ఎంతోఉంది. రవ్యాశ్రీహరి, నలిమెల భాస్కర్ మొదలైన వాళ్ళు ఆ దిశగా కొంతపనిచేశారు. మిగతా వాళ్ళు కూడా దాన్ని అందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.

సృజనాత్మక రచయితలు తమ కవితలు, కథలు, నవలలు, నాటకాలు, సినిమాలలో నిత్యం ఇలాంటి పదజాలాన్ని ప్రయోగించి తమ రచనలు చేయాలి. పాఠ్యాంశాల్ని నిర్ణయించేవారు ప్రతి పాంతం యొక్క ప్రాంతీయ అస్తిత్వంలో ఒకటైన భాషను మరొక తరానికి పరిచయం చేయడానికి,  తెలుగు వారి సాంస్కృతిక సంపదను పరిరక్షించడానికి, విస్మరణకు గురికాకుండాను పాఠ్యాంశాల్లో చేర్చాలి.  దురదృష్టం ఏమిటంటే, ఇటువంటి వాటికి పాఠ్యాంశాల్లో తగినంత భాగం దక్కట్లేదు అందువల్ల నిత్యజీవితంలో దళిత బహుజనులు వ్యవహరించుకునే పదాలకు ప్రధాన జీవన స్రవంతికి ఎంతో దూరం కనిపిస్తుంది.

శీలం భద్రయ్య ఈ కవిత్వం నిండా భాషను, భావాన్ని అక్షరీకరిస్తూ కవి గీతకార్మికునిలో ఆత్మగౌరవ చైతన్యాన్ని నింపాడు. గీత కార్మికుని జీవితంలోని అనేక పార్శ్వాలను వర్ణించాడు. తాటి చెట్టుని భూలోక కల్పవృక్షం అంటారు. దాన్ని ఎందుకంటారో తెలియాలంటే ఈ కవిత్వం చదవాలి. తాటి ఆకు, తాటి చెట్టు,  దాని కమ్మలు, దాని ఆకులు, దాని పళ్ళు, ఆ పళ్ళు తిన్న తర్వాత ఆ టెంకలను నేలలో పాతితే తేగలు (గేగులు) రావడం… ఆ తాడిచెట్లు ఇళ్ళలో దూలాలుగా, నిట్రాళ్ళుగా, కొన్నిచోట్ల వంతెనలుగా ఉపయోగించుకుంటారు. ఇంకొంతమంది బలమైన తాటి దూలాలతో మంచాలు కూడా చేయించుకుంటారు... ఇలా తాటిచెట్టు నుండి వచ్చే ప్రతీ వస్తువు ఉపయోగపడేదే. దీన్నంతా కవిత్వం చేసి మనం ముందు ఉంచాడు కవి. 

కవితాత్మక శైలి:  శీలం భద్రయ్యగారి కవితల్లో కవితాత్మకత, గ్రామీణ చిత్రణ, ఎంతో భావోద్వేగంతో కూడినలోతు ఉంటుంది. పురాణ ప్రతీకలను ఆధునిక జీవితంతో అద్భుతంగా ప్రయాణించాడు.

●      యాదవులకున్నట్టు

            తాటి గెలలకో

           గీతకారుడున్నాడు

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంత గౌరవం విలువ ఉన్నాయో, అంత వ్యూహం… ఆ తెలివితేటలు… అందరినీ నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు గీతకార్మికులకు కూడా ఉంటాయనేది కవి ధ్వని. ఇలా ఒక్కొక్కటీ చెప్పుకుంటూ పోతో ఎంత తాత్విక లోతులు ఉన్నాయో తెలుస్తుంది.

పరవశింపజేసే ప్రకృతిగంగను

నేలమీదకు దింపే

అపర భగీరథుడు

సాధారణంగా  ఆకాశం నుండి కురిసే వర్షాన్ని గంగ అంటారు. అది నిష్కల్మషంగా ఉంటుంది. కనుక అది ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు.

దీనికి పురాణాల్లో ఒక కథ ఉంది.

భగీరథుని ముత్తాత సగరుడు.  అతడు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తాడు. అయితే ఆ యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి, పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశంలో  ఆ జంతువును నిర్బంధిస్తాడు. సగరుని 60,000 మంది కుమారులు పాతాళ లోకంలో ఆ గుర్రం ఉందని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్లి తమ బొంగురు గొంతులతో గట్టిగా అరుస్తుంటారు. ఆ అరుపులు కపిలమహర్షిని కలవరపరుస్తాయి. కపిలమహర్షి కోపోద్రిక్తుడవుతాడు. సగరుని 60,000 మంది కుమారుల్నీ,  తన అగ్ని నేత్రాలతో బూడిద చేసేస్తాడు. వారికి ఉత్తమగతులు లభించాలంటే స్వర్గంలోని గంగను పాతాళానికి తేవాలి. అది పొందేవరకు సగరుని కుమారుల అంత్యక్రియలను పూర్తికాదు. అంత వరకు వాళ్ళు స్వర్గానికి చేరుకోలేరు. అందువల్ల భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించిన తరువాత, తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని, గంగా దేవిని ప్రార్థించడానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు. స్వర్గంలోని గంగను భూలోకానికి తీసుకొస్తాడు. అది భూలోకానికి తీసుకొచ్చేటప్పుడు మళ్లీ శివుడ్ని ప్రార్థన చేయడం, గంగను తలపై ధరించిన శివుడు ఒక పాయలో నుండి కిందికి వదలడం, తర్వాత ఆ ప్రవాహం జాహ్న మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తడం, ఆ మహర్షి కోపంతో ఆ నదిని మింగేయడం. మళ్ళీ భగీరథుడు ఆ మహర్షిని శాంతింపజేసి ఆతని చెవి నుండి చిన్న ధార రావడం, అది సాగరంలోకి చేరి, ఆ తర్వాత పాతాళానికి వెళ్ళి  బూడిదగా మారిన తన తాతముత్తాతలపై ప్రవహింపజేసి, వాళ్ళంతా ఉత్తమ గతులు పొందేలా చేస్తాడు. 

ఇది పురాణాల్లో ఉన్న కథ.

ఇంద్రుడు దొంగిలించడంలో లోకకల్యాణం ఉంది. శివుడి రౌద్రాన్ని తగ్గించి, భక్తులకు ప్రసన్నవదం కనిపించేలాచేయడం వంటి పరమార్థాలు ఉన్నాయి. నిజంగా శివుడు ఉన్నా లేకున్నా తీవ్రమైన కోపంతో ఉండేవాళ్లు కాస్త నీళ్ళు తాగితే శాంతిస్తారు. నరాలు సరిగ్గా పనిచేస్తాయి. రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఆవేశం తగ్గుతుంది. ఇదంతా వాచ్యంగా చెప్పకుండా మన పౌరాణికులు పాత్రల రూపంలో చెప్పారు. ఇంద్రుడు దొంగతనం చేశాడని చెప్పడంలో ఇంకా అనేక పరమార్థాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ చెప్పకోవడానికి సమయం సరిపోదు. ప్రస్తుతం,ఈ కల్లుని తాటి చెట్టు నుండి కిందికి తీసుకొని రావడానికి కూడా అంతే కష్టపడాలి అని కవి చెప్తున్నాడనేది ఈ కథ ద్వారా తెలుసుకోవాలి.

ఆకాశమంత ఎత్తులో ఉన్న తాటి చెట్టు మీద నుండి కల్లు తీసుకొచ్చే గీతకార్మికుడ్ని కవి అపరభగీరథుడుగా అభివర్ణించడంలో దీన్ని ఒక పవిత్రమైన వృత్తిగా కూడా సూచిస్తున్నాడు. ఆ కష్ణ నష్టాల్ని స్ఫురింపజేస్తున్నాడు.

 వృత్తిలోని  గౌరవాన్ని ఎంతో ఉదాత్తంగా వర్ణించాడు కవి. మామూలుగా చెట్టు ఎక్కినవారు దిగడమే కష్టం. అలాంటప్పుడు నడుముకి వేలూడుతున్న నిండు కుండతో చెట్టు ఒక్కొక్క అడుగు కిందికి వేస్తూ, తన నడుముకీ, తాడికీ చుట్టూ కట్టుకున్న మోకుని జాగ్రత్తగా ఒకచేత్తో జరుపుతూ, మరొక చేత్తో చెట్టుని పట్టుకుంటూ దిగాలి. మళ్ళీ దిగేటప్పుడు గానీ, ఎక్కేటప్పుడు గానీ, కాలుకున్న గుది (గుజి)ని సడలనివ్వకుండా చెట్టుకి గట్టిగా అదిమిపెట్టాలి. రెండు చేతుల్నీ చెట్టుకి బలంగా వ్యతిరేక దిశగా నొక్కుతూ ఉండాలి. ఇదంతా చూసినంత సులువుకాదు. ఒక వ్యక్తిగా ఎక్కడ సులువే. కానీ, ఒక్క చుక్కకూడా కిందికి పడకుండా చూసుకోవాలి. మరొకవైపు, లొట్టు (కల్లు ఉన్న కుండ) గట్టిగా ఊడితే చెట్టుకి తగిలి పగిలిపోకుండా జాగ్రత్తపడాలి. ఇంకొకవైపు తనని తాను కాపాడుకుంటూ ఉండాలి. ఎంత బ్యాలెన్స్ చేసుకుంటే ఇది సాధ్యమూ ఒకసారి ఆలోచించండి. అందుకే తాటిచెట్టు పైనుండి కిందికి కల్లుతేవడమనేది భగీరథప్రయత్నం వంటిది అన్నాడు కవి.

●      కల్లు చుట్టూ కందిరీగలు

            కష్టాన్ని తాగి

            ముఖం వాచేలా కుట్టాయి.

మంచి కవిత్వంతో పాటు, ఆ వృత్తి జీవన వేదన కూడా దీనిలో ఉంది. ఎక్కడో జరిగే కల్తీ కల్లులకు వీళ్ళనే బాధ్యులను చేస్తారు. ఎక్సైజ్ డిపార్ట్మెంటువాళ్ళు తనిఖీలని, కొంత కల్లుని తీసుకెళతారు. దాన్ని పరీక్షించి కల్తీకల్లు అంటారు. అది కాదని చెప్పడానికి వీళ్ళ ఎదురుగా తనిఖీచేయరు. అక్కడికి తీసుకొనివెళ్ళాక ఏమి కలుపుతారో ఎవరికి తెలుసు? అందువల్ల వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. అంతే కాదు, స్థానికంగా ఉండే సారాయి దుకాణం యాజమాన్యం కూడా కుట్రలు పన్నే అవకాశం ఉంది. మరోవైపు తమ చుట్టుపక్కలవాళ్ళు కూడా వీళ్ళ ఎదుగుదలను సహించలేక రకరకాలసమస్యల్ని సృష్టించే అవకాశం కూడా ఉంది. స్థానిక పెద్దమనుషులతో కలిసి కుట్రలు చేస్తుంటారు. వీటికి తోడు కల్లు తాగడానికి వచ్చేవాళ్ళలో కొంతమంది పలికే అవాకులు చివాకులు చాలా చిరాకునీ, బాధనీ కలిగిస్తుంటాయి. కవితాంశం ఈ కష్టజీవుల మనసులోని సంఘర్షణను, అణచివేత వల్ల కలిగే మానసిక గాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది. అయినప్పటికీ, ఈ బాధలోనూ తిరుగుబాటు స్ఫూర్తి దాగి ఉంది,  ఇది ఆ కులవృత్తి ఆత్మగౌరవ చైతన్యాన్ని కూడా తెలియజేస్తుంది.

●      మొదటగా పలకరించి

             చివరగా వీడ్కోలు తీసుకునే

             అతని ఆప్తనేస్తాలు

             సూర్య చంద్రులు

 

కల్లు గీసేవారు పొద్దున్నే లేచి చెట్ల దగ్గరకు వెళ్లాలి. కొద్ది ఆలస్యంగా  అంటే ఎండ వచ్చిన తర్వాత గెల  కోత కోస్తే ఆ కల్లు పుల్లగా మారిపోతుంది. అందుకే పొద్దున్నే సూర్యోదయం పలకరిస్తుందట. మధ్యాహ్నం కూడా చెట్లు ఎక్కి గెల సన్నని పొరను కోయాలి. నిజానికి అలా తాటిగెలలను రోజూ చిన్నచిన్నపొరకోసి బొట్టుబొట్టుగా కల్లుకారడానికి పదును పెట్టడాన్నే కల్లు గీయడం అంటారు. మరలా సాయంత్రం గెల పొరను  మళ్ళీ తాజాదనం చేసి కల్లు తీయాలి.అప్పుడు అతనికి  వీడ్కోలు చెప్పేది కూడా సూర్యుడే! అంటే, పొద్దున్నుండి  సాయంత్రం వరకు  కష్టపడే గీత కార్మికుడి కష్టాన్ని ఎంత అద్భుతమైన  భావ చిత్రంలా  చెప్పాడో చూశారా కవి.

‘వెన్నులు

ధనువులా వంగినా

తాటిచెట్టు నిటారుగా నిలబెడుతుంది’

గీత కార్మికుడు అన్నిసార్లు చెట్టు ఎక్కి దిగడం, ఒక నిచ్చెన, ఒకతునగాలు, నడుముకి మోకు, దానికి ఒకవైపు కత్తి, ఒకవైపు గుది, మధ్యలో కుండ… ఎంతో జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ పని చేయాలి. ఇంత కష్టపడేటప్పుడు వీళ్ళు త్వరగా ముసలి వాళ్ళలా కనిపిస్తారు. నడుము వంగిపోతుంది. బలం సడలిపోతుంది.

ఈ స్థితినంతా చెప్తూనే, ఆ చెట్టు ఎక్కేటప్పుడు మాత్రం నడుముకున్న మోకు వల్ల కాళ్లకున్న గుదివల్ల నిటారుగా నిలబడాల్సిన పరిస్థితి. ఇది వాచ్యంగా కనిపించే అర్థం. కానీ, ధ్వన్యార్ధంలో గీత కార్మికుడికి తాటి చెట్టు ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటూ తమని ఆత్మగౌరవంతో నిలబెట్టే గొప్ప ఆధారమనిచెప్తున్నాడు. ఒక్క చిన్న కవితలోనే అనేక పార్శ్వాలను అందించటం కవి ప్రతిభకు నిదర్శనం.

ఇలా ఎన్ని కవితలనైనా విశ్లేషించే అవకాశం ఉంది.

కల్లు మా కులదేవత

మండువా మా భరతమాత

తాటిచెట్టు మా జాతి పతాక

సర్వాయి మా జాతిపిత

వంటి కవితా ఖండికలు నినాదాలుగా బహుజనుల గుండెల్లో నిలిచిపోతాయి. ఈ కవితా సంపుటిలో ‘నేటి గీతం పాడుతాను’ అనే ఒక వచన కవితా ఖండిక ఉంది. దీనిలో అన్ని సబ్బండ కులాల వారి వృత్తి నైపుణ్యాన్ని, ఒకరికొకరు సహాయపడే విధానాన్ని ఎంతో తాత్వికంగా వర్ణించాడు కవి. కవికున్న సామాజిక స్పృహ, సామాజిక అవగాహన, వృత్తుల్లో చూడాల్సిన ఉదాత్తత, ఒక వృత్తితో మరొక వృత్తి పెనవేసుకున్న గ్రామీణ జీవన చిత్రంలో కనిపించే సౌందర్యం అద్భుతంగా అక్షర చిత్రాలుగా వర్ణించాడు.

‘’ఎద్దుతోలును వలిచి

 తంగేడు చెక్కతో శుద్ధిచేసి

ఆరబెట్టి సానబెట్టి

మురిపెంగా ముస్తాదు కుట్టి

గౌడన్న చేతికిచ్చిన నీ చేతిచలువను

 గుర్తుచేసి కడజాతి కట్టుబాటు

 ఎక్కడిదని పాటగా చేసి పాడుతాను

 మట్టి ముద్దను పసిబిడ్డగా చేతుల్లో

తీసుకుని ఒడుపుగా వృద్ధిచేసి

 తొట్టిలో బిడ్డను లొట్టిగా మార్చి

 గౌడజాతికిచ్చిన కన్నతండ్రి ప్రేమను

 పాటగా చేసి పాడుతాను’’

 ఇలా కొనసాగే ఈ వచన కవితకు ‘నేటి గీతం పాడతాను’’ అని పేరు పెట్టడం వెనుక, ఇప్పుడు ఎటువంటి సాహిత్యం రావాలో సూచిస్తున్నాడు కవి. ఇప్పుడు సబ్బండవర్ణాలు ఒకరికొకరు ఎలా కలిసిమెలిసి ఉండాలో ధ్వనిస్తున్నాడు కవి.

 

ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ

చెట్టుమీద ఉన్న మా తాత కనిపించాడు

ఈ కవిత్వం చదువుతున్నంత సేపూ

నవ్వుతూ తాటి చెట్టు ఎక్కి

సాయంత్రానికి అందరితో సరదాగా గడిపే‌

మా నాన్నే కనిపించాడు.

ఈ కవిత్వం చదువుతున్నంత సేపూ

గ్లాసుల్లో కల్లు పోసి ఇచ్చే మా అమ్మే

అటు ఇటు తిరుగుతున్న సందడేదో వినిపించింది.

ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ

తియ్యని సువాసన ఏదో

అక్షరాలతో నా చుట్టూ

అలముకున్నట్లే అనిపించింది.

‘’ప్రముఖ కవి జూలూరు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో మొట్టమొదట బీసీ అస్తిత్వ స్పృహతో "వెంటాడే కలాలు వెనకబడ్డ కులాలు" అను పేరుతో కవితా సంకలనం 2002 సంవత్సరంలో వెలువడింది. ఇందులో బీసీ కులాలకు చెందిన కవులు తమ కులాల ఆస్తిత్వాన్ని ప్రకటిస్తూ రాసిన కవితలు ఉన్నాయి. అదేవిధంగా గౌడుల అస్తిత్వాన్ని చాటుతూ పలువురు కవులు, రచయితలు గౌడుల ఆస్తిత్వాన్ని తమ రచనల ద్వారా తెలియజేశారు. వారిలో మామిండ్ల రామా గౌడ్, ఆచార్య ననుమాస స్వామి, నేరెళ్ల శ్రీనివాస్, కె. వి. ఎల్, కొంపెల్లి వెంకట్ గౌడ్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, మోత్కుల నారాయణ గౌడ్, డాక్టర్ పాండాల మహేశ్వర్, డాక్టర్ తండ హరీశ్ గౌడ్, మెరుగు మల్లేశం, నకిరెకంటి శ్రీనయ్య గౌడ్, పల్లె దీక్షిత మొదలగువారు గౌడుల అస్తిత్వాన్ని తమ రచనల ద్వారా చాటి చెప్పారు. గౌడ కులస్తుడు కాకపోయినా ప్రముఖ కవి అంబటి వెంకన్న రాసిన 'కల్లు పాట' గేయం ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఇదే స్పృహతో కవిత్వం రాస్తూ గౌడ జాతి అభ్యున్నతి కోసం పాటుపడుతూ గౌడ జాతి ఆత్మాభిమానాన్ని, గౌడుల జీవన విధానాన్ని చాటి చెబుతూ శీలం భద్రయ్య రాసిన కవితా సంపుటే ఈ 'ముస్తాదు'.’’ అని డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య ముందుమాటలో చెప్పిన మాటలతో ఏకీభవిస్తూ ముగిస్తున్నాను.

          మళ్ళీ నన్ను నా బాల్యానికీ, నా గ్రామానికీ తీసుకెళ్ళి మావాళ్ళందరితో కలిసి వచ్చినట్లనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన కవిశీలం భద్రయ్యగార్కీకీ, అంతర్జాల ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్న జయప్రకాశ్ గార్కీ, దీనిక తోడ్పాటుని అందిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నామోజు బాలాచారి గార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.

(ఆదివారం 22 జూన్ 2025, సాయంత్రం 6గంటలకు "తెలుగు భాషా చైతన్య సమితి, ద్వానా సాహితీ కుటీరం & తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్" వారు సంయుక్తముగా నిర్వహించిన "కొత్త పుస్తకం -2" శీర్షికన "ముస్తాదు" తొలి గౌడ కవితా సంపుటిని జూమ్ వేదికలో నేను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.)