"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

డైరీలో ఒకరోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
డైరీలో ఒకరోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25 నవంబర్, 2026

మహాకవి కాళిదాసు జయంతి సభలో ఆచార్య దార్ల స్పందన

 మహాకవి కాళిదాసు జయంతి సభలో ఆచార్య దార్ల స్పందన 

పెద్దలందరికీ నమస్కారం!

మేము ( డా.కాలువ మల్లయ్య, డా.బెందాళం కృష్ణారావు, నేను) ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా ఇక్కడకి ( తెలుగు మరియు సంస్కృత అకాడమీ)కి వచ్చాం. అనుకోకుండా ఈ కార్యక్రమంలో (మహాకవి కాళిదాసు జయంతి కార్యక్రమం) లో పాల్గొన్నాం. దీనిలో మట్లాడిన వారంతా సంస్కృత సాహిత్యంలో ఎంతో నిష్ణాతులు. ప్రతి ప్రసంగాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఒక్కొక్క ప్రసంగం వింటుంటే కాళిదాసు తన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో ఓ సందర్భంలో అన్నట్లు …

‘రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్

పర్యుత్సుకో భవతి యత్ సుఖితోఽపి జంతుః |

తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం

భావస్థిరాణి జననాంతరసౌహృదాని ||( పంచమాంకం లోని ఆ శ్లోకం (5-2).) గుర్తొచ్చింది. 

మళ్ళీ నా విద్యార్థి రోజులు గుర్తొచ్చాయి. మళ్ళీ నేను మా విద్యార్థులకు పాఠం చెప్పేటప్పుడు.. ముఖ్యంగా మేడమ్ గారు చెప్పిన ‘కావ్యేషు నాటకం రమ్యం, తత్ర రమ్యా శకుంతలా, తత్రాపి చతుర్థోంకః, తత్ర శ్లోకచతుష్టయమ్ లో

యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా

కంఠః స్తంభితబాష్పవృత్తికలుషశ్చింతాజడం దర్శనమ్ |

వైక్లవ్యం మమ తావదీదృశమిదం స్నేహాదరణ్యౌకసః

పీడ్యంతే గృహిణః కథం ను తనయావిశ్లేషదుఃఖైర్నవైః ||... శ్లోకం.. దాన్ని రాయప్రోలు వారు ‘ శకుంతల’ పేరుతో చేసిన అనువాదంలో …

‘’వెళ్ళున్ నేడు శకుంతలంచు హృది క్షోభించు౯ సముత్కంఠ, క 

న్నీళ్ళాకట్టె గళంబు, చూపు కలుషించె చింతచే, సుంత యీ 

పిల్లం బెంచి యరణ్యవాసు లిటు నిర్వేదింపగా ! కన్న కూ

తుళ్ల క్రొత్తగ సాగనంపుచు గృహస్థుల్ ఎంత శోకింతురో! (రాయప్రోలు సుబ్బారావు, శకుంతల:1965) అనే పద్యం గుర్తొచ్చింది. 

ఆచార్య దీవి నరసింహ దీక్షితులు గారన్నట్లు కాళిదాసు గారి కవిత్వంలో మానవ హృదయాన్ని స్పందింపజేసే ప్రాసంగికత ఉంది. పూల త్రివిక్రమ్ రావుగారన్నట్లు కాళిదాసు కవిత్వంలో మానవ ఉద్వేగాలతో మనం మమేకమవుతాం. మేడమ్ గారు డా.పి.కోటిరత్నంగారు అన్నట్లు ఈ సన్నివేశాన్ని చదివేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు మన కళ్ళల్లో మనకే తెలియకుండా కన్నీళ్ళు కారిపోతాయి.  అది ఆ కవిత్వానికి ఉన్న గొప్పతనం. అదే నేటికి కాళిదాసుని మనం నిత్యం స్మరించుకొనేలా చేస్తున్న కవిత్వ శక్తి. మేడమ్ గారు మాట్లాడుతూ కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు దుఃఖిస్తారని అన్నారు. నిజానికి మన ఇంట్లో ఓ అక్కనో, చెల్లినో పెళ్ళిచేసి అప్పగింతలు చేసి పంపేటప్పుడు కూడా కుటుంబ సభ్యులు అంతా అలాగే కన్నీటి పర్యంతమవుతారు. ఆ ఎమోషన్ ని కాళిదాసు అద్భుతంగా పట్టుకోగలిగారు. అంతే కాదు, శకుంతలను చూసినప్పుడు దుష్యంతుడు ఆమె గురించి అనుకున్న శ్లోకం కూడా నేటికీ పెళ్ళికాని ఓ అబ్బాయి ఓ అందమైన అమ్మాయిని చూస్తే అనుకునే భావమేనేమో అనిపిస్తుంది. 

‘అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహైః

రనావిద్ధం రత్నం మధు నవమనాస్వాదితరసం।

అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం

న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః॥

(కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం, ద్వితీయాంకం, శ్లోకం 10.)

ఈ రోజు మేము మరో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినా యాదృచ్ఛికంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మమ్మల్ని కూడా గౌరవంతో ఇలా సత్కరించడం మాకెంతో సంతోషంగా ఉంది. సభా ప్రారంభానికి తొలిపలుకులు పలికి, సభ లక్ష్యాన్ని వివరించిన డా. ఎస్.ఎ.టి.రాజ్యలక్ష్మిగారి దగ్గర నుండి సభలో పాల్గొన్న ప్రతి వక్తా ఒక జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేసినట్లు పత్రాలను రాసుకొచ్చి మరీ, సమయం సందర్భోచితంగా చక్కగా మాట్లాడారు. నిజంగా నేను ఈ ప్రసంగాలను ఎంజాయ్ (ఆస్వాదించాను) చేశాను. తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు ఈ కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. మమ్మల్ని కూడా సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 24.11.2026.



(ది 24.11.2026 వ తేదీ ఉదయం గం.11.00 నిమిషాలకు తెలుగు మరియు సంస్కృత అకాడమీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తమ కార్యాలయం, 104 ప్రైమై హిల్ క్రిస్ట్ వడ్డేశ్వరంలో నిర్వహించిన ‘కవికుల గురువు మహాకవి శ్రీకాళిదాసు జయంతి’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన నా స్పందన.)



(





15 నవంబర్, 2026

సత్యం, శివం, సుందరం’ దళిత, మార్క్సిస్టు దృక్పథం: ఆచార్య దార్ల ప్రసంగం. (14.11.2026)

 ‘సత్యం, శివం, సుందరం’ దళిత, మార్క్సిస్టు దృక్పథం: 

ఆచార్య దార్ల ప్రసంగం.

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై వరుసగా ప్రొఫెసర్ మనోజ్ఞ, ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే, డా.భట్టు లక్ష్మీనారాయణ, లక్ష్మి తదితరులు. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ప్రసంగం (సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్ - 14.11.2026లో జనసాహితి వారు ఏర్పాటు చేసిన ‘సాహితీ చర్చ’ కార్యక్రమంలో మరాఠీ దళిత రచయిత, ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే, పాలమూరు విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ప్రొఫెసర్ మనోజ్ఞ, కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మి పాల్గొన్నారు. సభకు జన సాహితి జంట నగరాల అధ్యక్షులు డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ కవయిత్రులు కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, మహే జబీన్, ఎండ్లూరి మానస తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నేను మాట్లాడిన ప్రసంగ సారాంశాన్ని అందిస్తున్నాను.)

సభాధ్యక్షులు డా.భట్టు లక్ష్మీనారాయణగార్కి, వేదికపై ఆసీనులైన ప్రముఖ మరాఠీ దళిత సాహిత్య వేత్త ఆచార్య శరణ్‌కుమార్ లింబాలే గార్కీ,, ప్రొఫెసర్ మనోజ్ఞ గార్కీ, సభను ఏర్పాటు చేసిన లక్ష్మి గార్కీ  సాహితీ ప్రియులైన మీ అందరికీ నమస్కారం. ఈ వేదికపై మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు ఎం.ఏ.లో 2005లో ఒక కోర్స్ గా ‘దళిత సాహిత్యం’ పెట్టాను. అప్పటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరులో తప్ప, మరెక్కడా ఆ కోర్సు లేదు. నేను మా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కోర్సు పెట్టిన తర్వాతనే డా.బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కోర్సు సిలబస్ లో రిఫరెన్స్ గ్రంథంగా శరణ్ కుమార్ లింబాలే గారి ఈ పుస్తకాన్ని కూడా పెట్టాను. ప్రొఫెసర్ సునీత రాణి గారు నాకు ఆ పుస్తకం ఇచ్చి, చదవమన్నారు. చదివిన తర్వాత దాన్ని కూడా రిఫరెన్స్ పెడితే బాగుంటుందని సలహా తీసుకొని పెట్టాను. నేను మొట్టమొదటిసారిగా సత్యం శివం సుందరం గురించి దళిత దృష్టితో ఆ భావనలను ఎలా అర్థం చేసుకోవాలో ఆ పుస్తకం ద్వారానే తెలుసుకున్నాను. 

1. భారతీయ తాత్వికత - సత్యం, శివం, సుందరం: ఒక పునరాలోచన

భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక దృక్పథంలో ‘సత్యం, శివం, సుందరం’ అనే భావనలు అత్యంత ప్రాచీనమైనవి, లోతైనవి. మన వేదాలు, రామాయణ, మహాభారతాది ఇతిహాసాలు, పురాణాలు అన్నీ కూడా ఈ మూడింటి చుట్టూనే తిరుగుతుంటాయి. సత్యం, శివం, సుందరం మూడింటిలో కేంద్ర భావన ఒకటే..దైవం.

సత్యం అంటే ఏమిటి? భగవంతుడే సత్యం, ఈ భౌతిక ప్రపంచమంతా మాయ, శాశ్వతంగా నిలిచేది దేవుడే అనేది భారతీయ తత్వశాస్త్రం చెప్పే మూల సూత్రం. భారతీయ తత్వశాస్త్రంలో ‘సత్యం’ అనే భావనకు అత్యంత ప్రాచీనమైన, ఆధ్యాత్మికమైన లోతు ఉంది. ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతం వంటి భారతీయ తాత్విక మార్గాలు ఈ భౌతిక జగత్తును 'మిథ్య' లేదా 'మాయ'గా అభివర్ణిస్తాయి. కాలం మారుతున్న కొద్దీ నశించిపోయే ఈ దృశ్యమాన ప్రపంచం తాత్కాలికమని, ఎప్పటికీ మార్పు చెందకుండా, సర్వవ్యాప్తంగా, శాశ్వతంగా నిలిచే పరమాత్మ లేక బ్రహ్మ పదార్థమే ఏకైక 'సత్యం' అని ఈ తత్వశాస్త్రం బోధిస్తుంది. ఇంద్రియాలకు గోచరించే ఈ భౌతిక ప్రపంచం కేవలం మాయాజాలమని, దీని వెనుక ఉన్న దివ్య చైతన్యమే పరమ సత్యమని భావించడం భారతీయ ఆధ్యాత్మిక దృక్పథం యొక్క మూల సూత్రం.

అయితే, ఈ ఆధ్యాత్మిక సత్య భావనకు భిన్నంగా ఆధునిక శాస్త్రీయ దృక్పథం, ముఖ్యంగా దళిత-భౌతికవాద కోణం భిన్నమైన వాస్తవికతను ముందుకు తెచ్చింది. శాస్త్రీయ దృక్పథం ప్రకారం, కంటికి కనిపించే, భౌతికంగా స్పృశించగలిగే, ప్రయోగశాలలో నిరూపించగలిగే పదార్థమే (Matter) సత్యం. అలాగే, సామాజిక వాస్తవికతలో నిరుపేదలు, అట్టడుగు వర్గాలు అనుభవించే ఆకలి, దౌర్జన్యాలు, కుల వివక్ష, కష్టజీవుల చెమట, వారి కన్నీళ్లే కంటికి కనిపించే ప్రత్యక్ష సత్యాలు. అమూర్తమైన దేవుడిని లేదా మాయా సిద్ధాంతాన్ని పక్కనపెడితే, మనుషుల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఈ భౌతిక,సామాజిక రుగ్మతలే అత్యంత బలమైన, ఎల్లప్పుడూ సజీవంగా ఉండే వాస్తవ సత్యాలని ఈ లౌకిక, శాస్త్రీయ తాత్వికత వివరిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రొఫెసర్ శరణ్కుమార్ లింబాలే తన పుస్తకంలో వివరించారు.


ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే తో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ తదితరులు 

శివం: సమస్త లోకానికి శుభకరమైన ఆలోచన చేసేది, పవిత్రమైనది భగవత్ తత్వమే. భారతీయ తాత్వికతలో 'శివం' అంటే సమస్త లోకానికి మంగళకరమైనది, శుభకరమైనది, పవిత్రమైనది అని అర్థం. ఈ విశ్వాన్ని సృష్టించి, కాపాడే భగవత్ తత్వమే పరమ పవిత్రమైనదిగా, సమస్త జీవకోటికి శుభాన్ని చేకూర్చే శక్తిగా ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తాయి. భగవంతుని గురించిన ఆలోచన చేయడమే మనిషికి శుభకరమని, అది అంతిమంగా మానసిక ప్రశాంతతను, మోక్షాన్ని ఇస్తుందని ఈ తత్వశాస్త్రం నమ్ముతుంది. శుభకరమైన ఆలోచనలు ఉంటే శుభం  జరుగుతుంది అనేది ఒక సత్సంకల్పంగా బోధిస్తుంది. మన ఆలోచనే మన శుభా శుభాలను నిర్ణయిస్తుందని వివరిస్తుంది.

అయితే, దళిత సాహిత్య దృక్పథంలో మరియు శరణ్‌కుమార్ లింబాలే లాంటి ఆలోచనాపరుల ‘దళిత సౌందర్యశాస్త్రం’ (Dalit Aesthetics) ప్రకారం ఈ ‘శివమ్’ భావనకు సరికొత్త అర్థం చెప్పారు. కేవలం పురోహిత వర్గ కర్మకాండలను ఆచరించడం, ఆధిపత్య వర్గాల సంప్రదాయాలను పాటించడమే శివం కాదని... సమాజంలో తరతరాలుగా వేళ్లూనుకున్న అసమానతలను, కుల వివక్షను, పీడనను ఎదిరించి, సమసమాజాన్ని స్థాపించడానికి జరిగే పోరాటమే నిజమైన 'శివం' (శుభకరం) అని వారు భావిస్తారు.

ఇక మూడవది ‘సుందరం’ అనే భావన. భారతీయ తాత్వికతలో, సౌందర్య శాస్త్రంలో 'సుందరం' అంటే భౌతికంగా కనిపించే రూపురేఖలు, ప్రకృతి అందాలు లేదా ఈశ్వర సృష్టి అంతా సర్వ సుందరమైనది అనే ఒక సాధారణ భావన ఉంది. ఈ సృష్టి వెనుక ఉన్న దివ్యత్వాన్ని, అందాన్ని ఆస్వాదించడమే సౌందర్యమని మన సాంప్రదాయ కావ్యశాస్త్రం చెబుతుంది. సుందరం భౌతిక రూపం కూడా నశించి దాని అంతస్సారం మనలో కలిగించే ఆనందమే సౌందర్యం. అది కలగాలంటే మనలో దైవత్వం రావాలి. అంటే సత్వగుణం అలవడాలి. మానవుడే దేవుడవ్వాలి. భౌతికంగా మనిషి చనిపోయినా ఆ జీవాత్మ, పరమాత్మలో ఐక్యం కావడమే నిజమైన సౌందర్యం. దీన్ని భారతీయులు ఎంతో లోతైన భావనలతో వివరించారు. 

కానీ, ఆచార్య శరణ్‌కుమార్ లింబాలే గారు  ఈ సంప్రదాయ సౌందర్య భావనలను తీవ్రంగా ప్రశ్నించారు. సమాజంలో అట్టడుగున ఉండి, కుల వివక్షను, ఆకలిని, ఆర్థిక వ్యత్యాసాలను అనుభవిస్తున్న దళిత బహుజనుల కోణం నుంచి ఆయన ఈ పదానికి సరికొత్త అర్థాలను వెలికితీశారు. రాచరికపు భవనాలు, రక్తంతో నిర్మించిన పెద్ద రాజభవనాలు, వాటిని చూసి పులకించిపోయే కవుల వర్ణనలు ఎప్పుడూ అసలైన సౌందర్యం కాలేకపోతాయని ఆయన వాదించారు. కళ కళ కోసమే అనే వాదనలోని ఆనందంలో సుందరత్వాన్ని వెతికితే దళితుల్లో అటువంటి సుందరత్వం ఉండదన్నారు. ఆ భవనాలు కట్టడానికి తమ ప్రాణాలను, చెమటోడ్చిన కూలీల ఆకలిని, వారి కన్నీళ్లను, వారి శ్రమను పట్టించుకోని ఏ సౌందర్యశాస్త్రం కూడా నిజమైనది కాదని లింబాలే గారు స్పష్టం చేశారు. కష్టజీవుల చెమటలో, వారి కష్టాల్లో, అణచివేతకు వ్యతిరేకంగా ఎగిరే ధిక్కార స్వతంత్ర పతాకంలోనే అసలైన సౌందర్యం దాగి ఉందని ఆయన నిరూపించారు. కాబట్టి, కేవలం భౌతిక ఆకారాన్ని లేదా ఈశ్వర సృష్టిని చూసి మురిసిపోవడం కాదు... మనుషుల ఆకలిని, వారి పోరాటాలను, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేదే అసలైన 'దళిత సౌందర్యశాస్త్రం' అని మనం గ్రహించాలన్నారు. రస సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం - దళిత సౌందర్యశాస్త్రం గురించి తన గ్రంథంలో ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబలే ప్రస్తావించారు. దీని వెనుక ఉన్న రెండు ప్రధాన వాదనలను పరిశీలించాలి.


1. సంప్రదాయ రస సిద్ధాంతం చెప్పేది ఏమిటి?

సంప్రదాయ సంస్కృత కావ్యశాస్త్రం, భరతుని నాట్యశాస్త్రం ప్రకారం, రసం అనేది ఒక విశ్వవ్యాప్తమైన, ఆనందమయమైన అనుభూతి. ‘విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తిః’ అంటే విభావాలు, అనుభవాలు, వ్యభిచారి భావాల సంయోగం వల్లే రసం పుడుతుందని చెబుతారు. ఇక్కడ సాహిత్య పఠనం వల్ల కలిగే ఆనందం లేదా రసానుభూతి అందరికీ ఒకేలా ఉంటుందని, అది ఉన్నతమైన మానసిక స్థాయులకు, రసాస్వాదన నైపుణ్యాలకు సంబంధించినదని సంప్రదాయవాదుల నమ్మకం.

2. దళిత సౌందర్యశాస్త్రం (Dalit Aesthetics) లేవనెత్తే ప్రశ్నలు ఏమిటి?

కానీ, శరణ్‌కుమార్ లింబాలే వంటి దళిత సాహిత్యవేత్తలు ఈ సిద్ధాంతాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. వారి ప్రకారం…సమాజంలో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అట్టడుగు వర్గాలు, కుల వివక్షను అనుభవించేవారు, కూలీలు పడే కష్టాలు, ఆకలి, అవమానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి, సంప్రదాయ రస సిద్ధాంతం కేవలం ఉన్నత వర్గాల అనుభవాలకే పెద్దపీట వేస్తుందని వారు వాదిస్తారు. దళిత సౌందర్యశాస్త్రం కేవలం ఆనందాన్ని పంచేది కాదు; అది బాధను, అణచివేతను, ఆక్రోశాన్ని, వాటికి వ్యతిరేకంగా సాగే పోరాటాన్ని అక్షరరూపం ఇస్తుంది.

సాహిత్యం చదివి ప్రశాంతంగా ఆనందించడం కాకుండా, సమాజంలోని అసమానతలను ప్రశ్నించేలా, అన్యాయాలను ఎదిరించేలా పాఠకుడిలో చైతన్యాన్ని నింపడమే దళిత సౌందర్యశాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యంగా భావించారు.కాబట్టి, సంప్రదాయ రస సిద్ధాంతం అందరికీ సార్వత్రికమైనది కాదని, అది కేవలం ఒక వర్గం లేదా ఒక ప్రత్యేక జీవన విధానం నుంచి పుట్టినదేనని దళిత సౌందర్యశాస్త్రం వాదిస్తుంది. దీన్ని "పూర్తిగా సత్యం" అనలేము కానీ, ఇది సాహిత్య విమర్శలో ఒక బలమైన ప్రత్యామ్నాయ దృక్పథం అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. మా జీవితాల్లోని బాధలు, అవమానాలు, కన్నీళ్లు, మా కష్టాల నుంచి పుట్టే అనుభవాలే మాకు రసాలను పండిస్తాయని దళితులు భావిస్తారు. మా కష్తటాలనుండి ఇతరుల భోగభాగ్యాలను చూసి పొందే ఆనందం మాది కాదనీ; మా అస్తిత్వ వేదన, మా ఆత్మగౌరవ పోరాటమే మా సాహిత్యానికి ప్రాణమంటారు. కుల వివక్షను అనుభవిస్తున్న మనుషుల సంఘర్షణ,పోరాటాలే ప్రధానమైనవిగా శరణ్ కుమార్ లింబాలే భావించారు. ఈ భావనలు నిజానికి సాహిత్య విమర్శ సిద్ధాంతాల్లో ఒక సంచలనాన్ని కలిగించాయి.

(ఒక విద్యార్థిగా నాకూ అటువంటి కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. కాలేజీ రోజుల్లో ప్రధాన స్రవంతి సాహిత్యంగా పిలువబడే సాహిత్యం చదువుతున్నప్పుడు అందులో ప్రేమ, శృంగారం, వర్ణనలు మాత్రమే ఉండేవి. కానీ, బయట సమాజంలో దళితులు, అట్టడుగు ప్రజలు పడుతున్న నానా తంటాలు, వివక్ష నాకు కళ్లకి కట్టినట్టు కనిపించినా, పాఠ్యాంశాల్లో ఉండేవి కాదేమిటని అనిపించేది.. అప్పుడు నాకు ఒకటే సందేహం వచ్చేది దళితులు ప్రేమ కవితలు రాస్తున్నారు, కానీ వారి చుట్టూ జరుగుతున్న ప్రేమ ఎలాంటిదో రాయాలి. సామాజిక అన్యాయాలపై మాట్లాడుతూ రాయాలి, తన రాతలు తన అస్తిత్వాన్ని తాను జీవిస్తున్న సమాజంలో ఎలా ప్రతిపలిస్తుందో, ఎలా అనుభవంలోకి వస్తుందో దాన్ని రాయచ్చు కదా ‘ అనిపించేది. అలా రాసిన రచనలు ప్రధాన జీవన స్రవంతి సాహిత్యంగా చదువుతున్నట్లే పాఠ్యాంశాల్లో చదువుకుంటే బాగుండేది కదా అని కలలు కనేవాణ్ణి. ఆ కలలు ఎం.ఏ.లో దళిత సాహిత్యం ఒక కోర్సుగా పెట్టిన తర్వాత నెరవేరాయని అనిపించింది. ఇది ప్రసంగంలో చెప్పాలనుకున్నాను కానీ సమయం సరిపోక చెప్పలేకపోయాను.)

3. మార్క్సిస్టు దృక్పథంతో  ఈస్తటిక్స్:

ఈ సభను ప్రజాసాహితి వారు ఏర్పాటు చేశారు. కానీ మనం దళిత మేధావి రచయిత శరణ్ కుమార్ లింబాలే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. ఆయన దళిత్  ఈస్తటిక్స్ థియరీ ని లోతుగా గమనిస్తే, వర్గ స్వభావాన్ని ఆయన స్పష్టంగా  వివరించారు. మార్క్సిజం ప్రకారం, సమాజంలో ఆర్థిక వనరులను నియంత్రించే వర్గమే (Ruling Class), సమాజం ఏది నమ్మాలో కూడా నిర్ణయిస్తుంది. ఏది నిజం, ఏది ధర్మం అనేది పాలకవర్గాలే నిర్ణయిస్తాయి. శ్రామికులు కష్టపడటం, యజమానులకు సేవ చేయడం 'ధర్మం' (సత్యం) అని నమ్మిస్తారు. పాలకవర్గ వ్యవస్థకు భంగం కలగకుండా, సమాజంలో శాంతి (Status quo) ఉండటమే 'శివం' (మంగళకరం) అని ప్రచారం చేస్తారు. తిరుగుబాటును 'అశుభం'గా లేదా 'పాపం'గా చిత్రీకరిస్తారు. కష్టజీవుల చెమట, రక్తంపై నిర్మించబడిన రాజభవనాలను, ప్రకృతిని చూసి కవులు 'సుందరం' అని పొగుడుతారు. కానీ ఆ భవనాలు కట్టిన కూలీల ఆకలి, కన్నీళ్లు ఆ సౌందర్యశాస్త్రంలో కనిపించవు. మార్క్సిస్టు సౌందర్యశాస్త్రం (సిద్ధాంతం) శరణ్‌కుమార్ లింబాలే వాదనతో చాలావరకు ఏకీభవిస్తుంది.సామాజిక వాస్తవికత (Social Realism) అనేది సాహిత్యం అనేది కల్పిత స్వర్గాలను, అలౌకిక ఆనందాన్ని (రసానందం) ఇవ్వడానికి కాదని చెప్తుంది. అది సమాజంలోని వర్గ పోరాటాన్ని, దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపించాలి. మార్పు కోసం కళ ఉపయోగపడాలనీ చెప్తుంది. "తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, కానీ ముఖ్యమైనది దానిని మార్చడం" అని మార్క్స్ అన్నారు. అదే విధంగా, సాహిత్యం సమాజాన్ని మార్చే ఒక ఆయుధంగా ఉండాలి. 

మార్క్సిజానికి, దళిత దృక్కోణానికి మధ్య తేడా (లింబాలే విమర్శ) :

ఈ సందర్భంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. శరణ్‌కుమార్ లింబాలే మార్క్సిజాన్ని పూర్తిగా అంగీకరించారనుకోవడానికి వీల్లేదు. ఆయన దాన్ని కూడా విమర్శించారు. మార్క్సిజం సమాజాన్ని కేవలం ఆర్థిక వర్గాలుగా (ధనిక - పేద) మాత్రమే చూస్తుంది. కానీ భారతదేశంలో ఆర్థిక దోపిడీతో పాటు కుల వివక్ష అనేది మనిషి పుట్టుకతోనే ముడిపడి ఉందని లింబాలే వాదించారు. పేదవాడైన అగ్రవర్ణ కూలీకి సమాజంలో గౌరవం ఉంటుంది, గుడిలోకి ప్రవేశం ఉంటుంది; కానీ దళితుడికి డబ్బు ఉన్నా కులం పేరుతో అవమానం తప్పదు. కాబట్టి, కేవలం ఆర్థిక సమానత్వం (మార్క్సిజం) మాత్రమే సరిపోదు, సామాజిక సమానత్వం (అంబేద్కరిజం) కూడా కావాలని లింబాలే స్పష్టం చేశారు.మార్క్సిస్టు దృక్కోణంలో "భగవంతుడే సత్యం, శివం, సుందరం" అనే ఆలోచన శ్రామిక వర్గాన్ని పోరాటం నుండి దూరం చేసే ఒక భావజాల ముసుగు (Ideological Veil). నిజమైన 'సత్యం' శ్రమజీవుల కష్టం, నిజమైన 'శివం' దోపిడీ లేని సమాజ నిర్మాణం, మరియు నిజమైన 'సుందరం' సమసమాజ స్థాపన అని మార్క్సిజం చెబుతుంది. శరణ్‌కుమార్ లింబాలే తన పుస్తకంలోని 'అంబేద్కరిజం మరియు మార్క్సిజం' (Ambedkarism and Marxism) అధ్యాయంలో, ఈ రెండు సిద్ధాంతాలకు అణగారిన వర్గాల విముక్తి ప్రధాన లక్ష్యమైనప్పటికీ, భారతదేశ వాస్తవ పరిస్థితుల్లో వాటి మధ్య ఉన్న కీలకమైన భేదాలను లోతుగా విశ్లేషించారు.

మార్క్సిజం మతాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది ("మతం ఒక మత్తుమందు"). అంబేద్కరిజం మనిషికి నైతిక విలువలు, సామాజిక గౌరవం ఇచ్చే ధర్మం అవసరమని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భావించారు. అందుకే ఆయన హిందూ మతంలోని కుల వ్యవస్థను తిరస్కరించి, స్వేచ్ఛ, సమానత్వం, కరుణను బోధించే బౌద్ధమతాన్ని (నవయాన బౌద్ధం) స్వీకరించారు. లింబాలే దృష్టిలో ఇది కేవలం మత మార్పిడి కాదు, దళితులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఒక గొప్ప సాంస్కృతిక తిరుగుబాటుగా భావిస్తున్నారు. మార్క్సిజం వ్యవస్థను మార్చడానికి సాయుధ పోరాటం లేదా విప్లవాత్మక హింసను సమర్థిస్తుంది. కానీ అంబేద్కరిజం రాజ్యాంగబద్ధమైన హక్కులు, విద్య, సంఘటిత పోరాటం, ప్రజాస్వామ్య విలువల ద్వారా శాంతియుత మార్పును కోరుకుంటుంది. శరణ్‌కుమార్ లింబాలే మార్క్సిజాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. దళితుల విముక్తి కోసం మార్క్స్ యొక్క ఆర్థిక సమానత్వ సిద్ధాంతం మరియు అంబేద్కర్ యొక్క సామాజిక సమానత్వ సిద్ధాంతం రెండూ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, భారతదేశంలో కుల నిర్మూలన జరగకుండా కేవలం మార్క్సిజం ద్వారా సమసమాజం సాధ్యం కాదని, దళిత సాహిత్యానికి అంబేద్కరిజమే అసలైన ప్రాణవాయువు అని ఆయన స్పష్టం చేశారు.

4.‘ధ్వని’ (Dhvani),వ్యంగ్యార్థాల తిరస్కరణ:

ఆనందవర్ధనుడు ప్రతిపాదించిన 'ధ్వని' సిద్ధాంతం ప్రకారం, సాహిత్యంలో అభిధార్ధాన్ని మించి అంతర్గత అర్థం (Implicit meaning) లేదా ధ్వని ప్రధానంగా ఉండాలి. కవి తన భావాన్ని ఎక్కడా నేరుగా చెప్పకుండా, అలంకారాలతో, గూఢార్థాలతో, సున్నితమైన సంకేతాలతో పాఠకుడికి అందజేయాలని ఆ సిద్ధాంతం చెబుతుంది.

కానీ, శరణ్‌కుమార్ లింబాలే గారు, దళిత సౌందర్యశాస్త్రం ఈ ధ్వని సిద్ధాంతాన్ని, వ్యంగ్యార్థాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. వారి వాదన ఏమిటంటే అణచివేతకు, కుల వివక్షకు గురైన దళితుడికి తన బాధను అలంకారాలతో, కవితాత్మక పదజాలంతో అలంకరించి దాచిపెట్టి చెప్పే తీరిక, అవసరం లేవు. సమాజంలో తన మీద జరుగుతున్న దాడిని, అవమానాలను, వివక్షను ఏమాత్రం దాచుకోకుండా సూటిగా, పదునుగా, కఠినమైన వాస్తవ భాషలో చెప్పడమే దళిత సాహిత్య లక్షణం. ఒకవేళ అక్కడ సున్నితమైన భాషను వాడితే, ఆ వ్యంగ్యార్థాల వెనుక నిజమైన బాధ యొక్క తీవ్రత తగ్గిపోయి, అణచివేత స్వభావం మరుగైపోతుంది. అందువల్ల, గూఢార్థాల కంటే నేరాలనూ, అన్యాయాలనూ ఎత్తిచూపే నిరసన గళమే దళిత సాహిత్యానికి ప్రాణాధారమని లింబాలే గారు స్పష్టం చేశారు.

సిద్ధాంతపరంగా "అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు" (సత్యం, శివం, సుందరం) అని చెబుతూనే, ఆచరణలో మాత్రం ఒక మనిషిని అంటరానివాడిగా చూసి, దేవాలయాల్లోకి రానివ్వకపోవడాన్ని లింబాలే ప్రశ్నిస్తారు."భగవంతుడే అన్నీ చూసుకుంటాడు" అనే ఆలోచన, తరతరాలుగా అణచివేతకు గురవుతున్న వారిని తమ హక్కుల కోసం పోరాడకుండా నిస్సహాయులుగా మారుస్తుందని దళిత చింతన భావిస్తుంది. ఆకలితో ఉన్నవాడికి వేదాంతం కంటే, ముందు కడుపు నిండే మార్గం మరియు ఆత్మగౌరవం ముఖ్యమని ఆయన వాదిస్తారు.లింబాలే వంటి దళిత సాహిత్య విమర్శకులు ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని కాకుండా, సమాజంలో ఆచరణలో ఉన్న వివక్షను ప్రశ్నిస్తున్నారని గమనించాలి.

భారతీయ ఆధ్యాత్మిక దృక్కోణంలో మనిషి అంతర్గత శాంతిని, మోక్షాన్ని, విశ్వజనీన ప్రేమను లక్ష్యంగా చేసుకుంటుంది.దళిత సాహిత్య దృక్కోణంలో ఈ భూమిపై మనిషికి దక్కాల్సిన సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్న లక్ష్యంగా చేసుకుంటుంది.

 కాబట్టి, భగవంతుడిని సత్యం, శివం, సుందరంగా చూడటం అనేది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక భావన కాగా, ఆ పేరుతో జరిగే సామాజిక అన్యాయాలను ఎదిరించి, సమానత్వాన్ని కోరుకోవడం అనేది దళిత సౌందర్యశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం. అణగారిన వర్గాల గొంతును సాహిత్యంగా మలచవచ్చని నిరూపించిన లింబాలే గారికి, ఈ సభను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, ఇక్కడ కూర్చున్న సాహిత్య ప్రియులందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 14.11.2026.



08 నవంబర్, 2026

క్యాంపస్ ఉద్యమాల చైతన్యం – సామాజిక ఆచరణ: ASA తో మూడు దశాబ్దాల నా అనుభవం. ( ASA మీటింగ్ లో ఆచార్య దార్ల ప్రసంగం)

 

 Prof. Darla Venkateswara Rao is addressing the gathering at the ASA Alumni Meet held on 07.11.2026.



హైదరాబాద్Prof. Darla Venkateswara Rao is addressing the gathering at the ASA Alumni Meet held on 07.11.2026.

 సెంట్రల్ యూనివర్సిటీ (UoH)లో 7.11.2026 వ తేదీన ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం వరకు  ASA (అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్) పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో (Alumni Meet)  పాల్గొని నేను (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు)  చేసిన ప్రసంగాన్ని అందిస్తున్నాను. 

క్యాంపస్ ఉద్యమాల చైతన్యం – సామాజిక ఆచరణ: ASA తో మూడు దశాబ్దాల నా అనుభవం.


Prof. Darla Venkateswara Rao is addressing the gathering at the ASA Alumni Meet held on 07.11.2026.

డా.బి.ఆర్ అంబేద్కర్ గార్కీ, 

అంబేద్కర్ అనుయాయులకీ జైభీములు.

పరిచయం – మూడు దశాబ్దాల సజీవ సాక్ష్యం:

ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులకు ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు. 

ఇది విద్యార్థులు నిర్వహిస్తున్న కార్యక్రమం. అయితే ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం. దీంట్లో పూర్వ విద్యార్థులు పాల్గొంటున్నారు. నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఏఎస్ఏ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుతం మన యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా.నాగేశ్వరరావుగారు నన్ను ఆహ్వానించారు. నిన్న ప్రత్యేకించి నా ఛాంబర్ కి వచ్చి మరీ ఆహ్వానించారు. అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక విశ్వవిద్యాలయం కేవలం తరగతి గదులకే పరిమితం కాదు; అది సామాజిక చైతన్యానికి, ఆత్మగౌరవ పోరాటాలకు వేదిక. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  నేను 1996లో విద్యార్థిగా అడుగుపెట్టి, అక్కడే క్రమంగా ఎదిగి ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ దాదాపు 30 ఏళ్లకు పైగా క్యాంపస్ పరిణామాలను దగ్గరినుండి పరిశీలించే అవకాశం నాకు లభించింది. విద్యార్థిగా మొదలైన ఈ ప్రస్థానంలో అటు విద్యార్థి దృక్కోణాన్ని, ఇటు అధ్యాపక దృక్కోణాన్ని సమన్వయం చేసుకుంటూ సాగిన ఈ ప్రయాణంలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) నిర్వహించిన చారిత్రక పాత్రను దగ్గరగా గమనించడానికి నేను ఒక సజీవ సాక్షిగా నిలిచానుకుంటున్నాను. 


Prof. Darla Venkateswara Rao is addressing the gathering at the ASA Alumni Meet held on 07.11.2026.

తొలినాళ్ళ పోరాటాలు – ASA ఆవిర్భావ నేపథ్యం: యూనివర్సిటీలో నేను ప్రవేశించే నాటికి క్యాంపస్‌లో ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరమ్ (PSF) పనిచేసేది. ఆ సమయంలో చోటుచేసుకున్న సునీత ఘటన విద్యార్థి లోకంలో పెనుమార్పులకు దారితీసింది. ఒక దళిత అమ్మాయి అయిన సునీతను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, తర్వాత పెళ్లి చేసుకోవాలని తన కులానికి చెందిన మరొక అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. ఈమెను అవమానించాడు. దానికి ఆమె హాస్టల్లో ఉరి వేసుకుంది. ఆ సందర్భంగా దళిత అభ్యుదయ భావాలు గల క్యాంపస్ విద్యార్థులు  న్యాయం కోసం గళమెత్తి గవర్నర్ భవనం వరకు ఊరేగింపులు తీశారు. అనేక ఉద్యమాలు చేశారు. నేను కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్న వాడిని.అలా సాగిన ఉద్యమాల్లో ఐక్యంగా పోరాడిన సంఘటనలు ఇప్పటికీ నా కళ్ళముందే ఉన్నాయి. దళిత, బహుజన విద్యార్థులకు ప్రవేశాలు (Admissions) కల్పించడంలో తోడ్పాటు అందించడం మొదలుకొని, వారి హక్కుల పరిరక్షణ వరకు అప్పటి విద్యార్థులు చేసిన సేవ సామాన్యమైనది కాదు. ఆ నిరంతర ఆందోళనల నేపథ్యంలోంచే మరింత నిర్దిష్టమైన ఆశయాలతో ASA ఆవిర్భవించింది. ఆ ప్రారంభ దశలో డాక్టర్ నాగభూషణం, డాక్టర్ విస్తాలి శంకర్ రావు, డా.కాకాని సుధాకర్, డా.జి.వి.రత్నాకర్ వంటి మిత్రులతో కలిసి రాత్రింబవళ్ళు ఎస్ఏ కార్యక్రమాల గురించి చర్చించే వాళ్ళం. అప్పుడు సభల నిర్వహణ, గోడ పత్రికలు (పోస్టర్లు) అంటించడం వంటి కార్యకలాపాల్లో నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా భాగస్వామినైనందుకు నేను గర్విస్తున్నాను.

సాహిత్య, సైద్ధాంతిక ప్రభావం – గుండెడప్పు స్పృహ: క్యాంపస్‌లో కొనసాగిన విద్యార్థి చైతన్యం, క్యాంపస్ వెలుపలి సామాజిక, వైజ్ఞానిక రంగాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. దళిత సాహిత్యానికి సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభ కేంద్రంగా మారింది. 1995 నాటి ప్రసిద్ధ 'గుండెడప్పు' కవిత్వ సంకలనం వచ్చి నేటికీ మూడు దశాబ్దాలపైగా  పూర్తయిన సందర్భంగా, 'నినాదం' పత్రికలో డీ. సాయినాథ్ రెడ్డి ఆ సంకలన చారిత్రక ప్రాధాన్యతపై రెండు పూర్తి పేజీల వ్యాసాలు రాశారు. ఆ రచనలు కేవలం పుస్తక సమీక్షలు మాత్రమే కావు; ASA ఆవిర్భావం తెచ్చిన చైతన్యాన్ని, ఉద్యమ ఘనతను ప్రతిబింబించేవిగా కూడా భావించాలి. సంస్థతో ప్రత్యక్ష సంబంధం లేని విద్యార్థులు సైతం ఇలాంటి చారిత్రక వ్యాసాలు రాయడానికి క్యాంపస్ అందించిన ప్రేరణే ప్రధాన కారణం.

ముప్పై సంవత్సరాలయిన సందర్భంగా  'గుండె డప్పు' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏఎస్ఏ పూర్వ విద్యార్ధులు

సంఘం ఎందుకు అవసరం? – ఆత్మగౌరవ వేదిక: 

2001లో నేను అధ్యాపకుడిగా చేరాను.  ఆ బాధ్యతలు  చేపట్టిన తొలినాళ్లలో విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులపై జరిగిన రస్టికేషన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టగా, వారికి సంఘీభావం తెలపడానికి నేను సెలవు పెట్టి  క్యాంపస్ కీ వచ్చాను. ఆ రోజునే ఒక విచారణ కమిటీ (Enquiry Committee) ప్రతినిధులు వచ్చారు. అప్పటికి నేను నిరాహార దీక్ష చేస్తున్న శిబిరంలోనే ఉన్నాను. ఆ కమిటీ సభ్యులు ఒక ప్రశ్న లేవనెత్తారు. "మీ సమస్యలేమైనా ఉంటే వైస్ ఛాన్సలర్ లేదా డీన్, రిజిస్ట్రార్ గారికి విన్నవించుకోవచ్చు కదా, ప్రత్యేకంగా ఒక విద్యార్థి సంఘం ఎందుకు? ఈ ఆందోళన ఎందుకు?"


వేదిక పై ఏఎస్ఏ పూర్వ విద్యార్ధులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.

ఆ ప్రశ్నకు నేను ఇచ్చిన సమాధానం వాళ్లని ఆలోచింపజేసిందనిపించింది.

"బలహీనులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఒక గొంతుకగా నిలవడానికి ఒక సంఘం అవసరం. రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులను కాపాడుకోవడానికి ఒక సంఘం అవసరం. దళితులు, అణగారిన వర్గాలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక సంఘం అవసరం, వివక్ష-అవమానాల నుంచి రక్షణ పొందడానికి ఒక సంఘటిత శక్తి అవసరం. దళితులతో ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఒక సంఘం అవసరం ఆ ఆవశ్యకతే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటుకు పునాది." అని చెప్పాను.

తమకు రావాల్సిన వాటికోసం అధికార వ్యవస్థల ముందు నిస్సహాయంగా నిలబడే బదులు, రాజ్యాంగం కల్పించిన సంఘటిత బలాన్ని ఉపయోగించుకోవడమే ASA ఉనికికి పరమార్థం. అది మా అందరికీ తెలిసి చేసిన ఒక సంఘ నిర్మాణం. 


వేదిక పై మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

క్యాంపస్ దాటిన ఉద్యమ స్పృహ – సామాజిక బాధ్యత: 

ASA కేవలం క్యాంపస్ అంతర్గత సమస్యలకే పరిమితం కాలేదు. బయటి సమాజంలో జరిగే ప్రజా ఉద్యమాల పట్ల ఎప్పటికప్పుడు స్పందించింది.

ఎస్సీ వర్గీకరణ ఉద్యమం: ధనరాజ్ ASA అధ్యక్షుడిగా ఉన్న కాలంలో సామాజిక న్యాయం కోసం సాగుతున్న వర్గీకరణ ఉద్యమానికి ASA పూర్తిస్థాయి మద్దతును ప్రకటించింది. దీని ప్రభావంతో 'బహుజన కెరటాలు' వంటి పత్రికల ద్వారా ప్రత్యేక సంచికలను తీసుకొచ్చి చర్చను తీవ్రతరం చేసింది. అందుకు ఏఎస్ఏకి నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య కాకాని సుధాకర్, ఆచార్య విస్తాలి శంకరరావు, డా. నూనావత్ రాంబాబు...

తెలంగాణ ప్రజా ఉద్యమం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ప్రజాపోరాటంలోనూ ASA తన ప్రగతిశీల వైఖరిని ప్రదర్శించి, ప్రజాకాంక్షలకు అండగా నిలిచింది.

విశ్వవిద్యాలయంలో చదువుకుంటూనే సమాజంలో జరుగుతున్న అన్ని అంశాలను విద్యార్థులు గమనించడమే కాదు, ఆ సమాజంలో మార్పు కోసం నిలబడటమే ఒక ఆదర్శ విద్యార్థి సంఘం చేయాల్సిన పని అని ASA నిరూపించింది.

డా.శేఖర్, ఆచార్య దార్ల, డా.దామోదరరావు, ఆచార్య విస్తాలి శంకరరావు, ఆచార్య జి.వి.రత్నాకర్ తదితరులు 

విద్యా రంగంలో మార్పు – సిలబస్‌లోకి దళిత సాహిత్యం: విద్యార్థి ఉద్యమాల నుంచి పొందిన సైద్ధాంతిక ప్రేరణను ఆ తర్వాత కాలంలో దానిలో పనిచేసిన వారు బోధనా రంగంలో కూడా ఆచరణలో పెట్టడం జరిగింది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి.వి.రత్నాకర్ వంటి వారు పుస్తకాలు, సదస్సుల ద్వారా అంబేద్కర్ తాత్వికతను సమాజంలోకి విస్తరిస్తుండగా, నేను 2004లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరాను.  ఒక ఏడాదిలోనే అంటే 2005లోనే  తెలుగు ఎం.ఏ. పాఠ్యప్రణాళికలో (MA Syllabus) 'దళిత సాహిత్యం' అనే ఒక ఆప్షనల్ కోర్సుని  అధికారికంగా ప్రవేశపెట్టాను. దళిత సాహిత్యం అంటే మరేదో కాదు, అది అంబేద్కరైట్ భావజాలం (Ambedkarite Ideology) యొక్క సృజనాత్మక అభివ్యక్తి. అణగారిన వర్గాల చరిత్రను, వేదనను, తాత్వికతను తరగతి గదుల్లో అధికారిక అధ్యయన విషయంగా మార్చడమే ఒక అధ్యాపకుడిగా నా వంతు బాధ్యతగా భావించాను.



ముగింపు: 

అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించడానికి ఒక్కొక్కరు ఒక్కో కార్యాచరణను (Strategy) ఎంచుకుంటారు. కొందరు పుస్తకాలు రాస్తారు, కొందరు సదస్సులు నిర్వహిస్తారు, కొందరు తరగతి గదిలో బోధిస్తారు. వీటన్నింటికీ మూల ప్రేరణ క్యాంపస్‌లలో పనిచేసే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA), దళిత, ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ సంఘాలు  అందించే తాత్విక పునాదే ప్రధాన ప్రేరణగా నిలుస్తాయి. అణగారిన వర్గాల విద్యార్థుల్లో క్రియాశీలక ఆలోచనలను, ప్రశ్నించే తత్వాన్ని రగిలించి ఒక చారిత్రక పాత్రను పోషించిన ASA కృషి ఎప్పటికీ అభినందనీయం.


ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని కలిగించిన మీ అందరికీ మరోసారి జై భీమ్ లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 7.11.2026. 

సావిత్రి బాయి ఫూలే ఆడిటోరియం,( డి.యస్.టి), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్. 



31 అక్టోబర్, 2026

ఒక విద్యార్థి అనుభవం...

 మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు సర్ 😊🙏💐



సర్ నేను M.A లో మొదటి సెమిష్టర్ లో "దళిత సాహిత్యం" ఆప్షనల్ పేపర్ ఎంచుకున్నాను మీ బోధన , ప్రోత్సాహంతో క్లాస్ లో చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉండేది.

నేను పుట్టి పెరిగిన దళిత సామాజిక జీవితం పుస్తకాల్లో రాస్తారా అని నాకు అప్పటికి తెలియదు చదువుతుంటే ఆశ్చర్యమయ్యాను నా జీవితం గురించి నేను చదువుతున్నట్టు అనిపించింది మీరు బోధించిన దళిత సాహిత్యం, మీరిచ్చిన ప్రేరణ, ప్రోత్సాహం ఒక దళితుడిగా, మాదిగగా నాకొక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఇచ్చాయి సమాజంపై అవగాహన కల్పించాయి ఇది నాలో జరిగిన ఒక గొప్ప మార్పు అందులో మీ ప్రభావం అధికం అది నాలో శాశ్వతంగా దళిత సమాజం పట్ల మరింత ఇష్టాన్ని, ప్రత్యేకమైన బాధ్యతను కల్పించింది. 

మీరు చదవమన్న దళిత సాహిత్యం చిలుకూరి దేవపుత్ర గారి "పంచమం" , జి. కల్యాణ రావు గారి " అంటరాని వసంతం " నవలలు చాలా ఇష్టంగా చదివాను పంచమం నవల గురించి క్లాస్ రూమ్ సెమినార్ పెడితే ప్రశ్నలు, జవాబులు , విశ్లేషణలు విద్యార్థుల చేతనే చేయించారు అందులో నేను చాలా ఉత్సాహంగా అందరి ప్రశ్నలకు జవాబులు చెప్పాను అప్పుడు మీరు ఇలాగే చదవాలి , ఇలానే ఆలోచించాలి , పరిశోధన అంటే ఇదే అని చెప్పి నన్ను ప్రత్యేకంగా అభినందించారు అది నా జీవితంలో మరిచిపోలేని ఒక గొప్ప మధురానుభూతి, ఎప్పటికి మరిచిపోని సంఘటన. 

"కులవృత్తి" కథ మీద అసైన్మెంట్ ఇచ్చి వ్యాసం రాయించారు ఇలానే రాయాలి ఇంకా బాగా రాయాలి అని చెప్పి ప్రోత్సహించారు ఈ కథ మీద మీ రూమ్ లో వైవా పెట్టారు నన్ను ఆ కథ పై విశ్లేషణ చేయించి ఈ కథ పై ఒక వాక్యంలో నీ అభిప్రాయం చెప్పు అన్నారు అప్పుడు నేను తడుముకోకుండా 'దళితుల ఔన్నత్యం, బ్రాహ్మణుల అసమర్థత ' అని చెప్పాను మీరు నవ్వి వెరీగుడ్ అన్నారు అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అప్పటి నుంచి మీరంటే ఎంతో గౌరవం, ఇష్టం, ప్రేమాభిమానాలు కలిగాయి నా హృదయంలో మీ స్థానాన్ని పదిలపరుచుకున్నాను. 

అసైన్మెంట్ మేము సబ్మిట్ చేసిన కొద్ది రోజులకి ఇనాక్ తాతయ్య డిపార్మెంట్ కి వచ్చారు అప్పటికే మా ఏసురత్నం తాతయ్య నేను జాయిన్ అయిన కొద్దిరోజులకే కాంపస్ కి వచ్చి తాతయ్య దగ్గరకి మీర్ పేట తీసుకెళ్ళారు.

తాతయ్య డిపార్ట్‌మెంట్‌ కి వచ్చినప్పుడు మేము రాసిన అసైన్మెంట్లు అన్నిటిని ఆయన చూసారు నీ పేపర్ కూడా చూసారు నీ గురించి నాకు చెప్పారు నువ్వు ఇనాక్ గారి వాళ్ళ బంధువువి అంటగదా మా పిల్లోడే అని అన్నారని మీరు నాతో చెప్పారు.

తాతయ్య వెళ్ళేటప్పుడు నన్ను పిలిచి నాయనా నీ అసైన్మంట్ చూసాన్రా అలాగే రాయాలి నీ గురించి దార్ల వెంకటేశ్వర రావు గారికి మా పిల్లోడే మనవడు అవుతావని చెప్పాను బాగా చదువుకో అని చెప్పారు.

 "కులవృత్తి" కథ నాలో ఎన్నో మార్పులకు గురిచేసింది సాహిత్యానికి సమాజానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది. 

ఇవన్నీ మొదటి సెమిష్టర్ లో కలిగిన గొప్ప అనుభూతులు, ఙాపకాలు సర్ ఈ మెసేజ్ చదివాక మీతో పంచుకోవాలని అనిపించింది మిమ్మల్ని నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటాను. 

మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. 

ధన్యవాదాలు సర్ 

డా.పులిపర్తి రమేష్, 30.10.2026

💙💙💙🙇‍♂️🙇‍♂️🙇‍♂️

15 అక్టోబర్, 2026

లెయిజన్ ఆఫీసర్ గా ఆచార్య దార్ల.. అభినందనలు

 లెయిజన్ ఆఫీసర్ గా ఆచార్య దార్ల.. అభినందనలు 

ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్‌గా ఆచార్య దార్ల నియామకం - దళిత, బహుజన విద్యార్థి సంఘాల ఘన సత్కారం


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని 14.10.2026 తేదీన సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్న DSU (Dalit Students Union, HCU. విద్యార్థులు 



ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని 14.10.2026 తేదీన సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్న DSU (Dalit Students Union, HCU. విద్యార్థులు 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్ని 15.10.2026 వ తేదీన అభినందించి, శుభాకాంక్షలు తెలియజేస్తున్న BSF విద్యార్థి నాయకులు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్ని 15.10.2026 వ తేదీన అభినందించి, శుభాకాంక్షలు తెలియజేస్తున్న BSF విద్యార్థి నాయకులు

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)కి చెందిన దళిత విద్యార్థి సంఘం (DSU), బహుజన స్టూడెంట్స్ ఫ్రెంట్ (BSF) నాయకులు, అలాగే పలువురు పిహెచ్.డి, ఎం.ఏ. విద్యార్థులు.. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రొఫెసర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని వర్సిటీ క్యాంపస్‌లో ఘనంగా సత్కరించి, తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని 14.10.2026 తేదీన సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్న ఎం.ఏ., పిహెచ్.డి. విద్యార్థులు 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్టోబర్ 8, 2026న ఒక అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. యూనివర్సిటీలోని ఎస్సీ (SC), ఎస్టీ (ST) వ్యవహారాలకు సంబంధించిన లైజన్ ఆఫీసర్ (Liaison Officer)గా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు నియమితులయ్యారు. ఈ కీలక పదవిలో ఆయన తక్షణమే బాధ్యతలు స్వీకరించి, రాబోయే మూడేళ్ల పాటు (3 సంవత్సరాలు) కొనసాగనున్నారు. గతంలో ఈ బాధ్యతల్లో ఉన్న స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఖామ్ ఖాన్ సువాన్ హౌసింగ్ (Kham Khan Suan Hausing) స్థానంలో ఆచార్య దార్ల ఈ నియమాకం పొందారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడటం, ఆ వర్గాలకు చెందిన ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించడం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు వార్షిక నివేదికలు సమర్పించడం మరియు రిజర్వేషన్ రోస్టర్లను పర్యవేక్షించడం వంటివి లైజన్ ఆఫీసర్ ముఖ్య బాధ్యతలు.

యూనివర్సిటీలో సామాజిక న్యాయం అమలులో అత్యంత కీలకమైన ఈ పదవికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఎంపిక కావడం పట్ల దళిత, బహుజన విద్యార్థి సంఘాలు తీవ్ర హర్షం వ్యక్తం చేశాయి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే ఆయన.. ఈ కొత్త బాధ్యతల్లోనూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి చేస్తారని విద్యార్థులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే వారంతా ఏకమై ఆయనకు ఈ ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేశారు.

అందరి ప్రేమాభిమానాలకు, నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు: ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల లైజన్ ఆఫీసర్‌గా తాను నియమితులైన సందర్భంగా ఘనంగా సత్కరించి, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన దళిత విద్యార్థి సంఘం (DSU), బహుజన స్టూడెంట్స్ ఫ్రెంట్ (BSF) నాయకులకు, పిహెచ్.డి పరిశోధక విద్యార్థులకు, ఎం.ఏ. విద్యార్థులకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నాపై నమ్మకంతో యూనివర్సిటీ ఉన్నతాధికారులు అప్పగించిన ఈ కీలక బాధ్యతను అత్యంత బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. విద్యార్థులు, తోటి అధ్యాపకులు, శ్రేయోభిలాషులు నాపై చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమాభిమానాలు నాలో మరింత స్ఫూర్తిని, బాధ్యతను పెంచాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు వారికి సక్రమంగా అందేలా చూడటానికి నా వంతు కృషి నిరంతరం కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.అలాగే, సామాజిక మాధ్యమాల ద్వారా, ఫోన్ల ద్వారా తనకు శుభాకాంక్షలు అందించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధ్యాపకలోకానికి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారం, మద్దతు భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.



13 అక్టోబర్, 2026

విల్సన్ రావుగారి 'జాషువా పద్య శిల్పం' గ్రంథావిష్కరణ

 సాహిత్య జీవితాన్ని వొడిసి పట్టిన

 'జాషువా పద్య శిల్పం'



 మహాకవి గుర్రం జాషువా సాహిత్య జీవితాన్ని వొడిసి పట్టిన రచనగా కొమ్మవరపు విల్సన్ రావు రాసిన  'జాషువా పద్య శిల్పం' తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోతుందని ప్రముఖ సాహితీవేత్త సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం (11.10.2026) కర్నూల్ లోని టీజీవి కళాక్షేత్రంలో  సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ సభాధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది. పుస్తకావిష్కరణ అనంతరం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన జాషువాపై రచనల్లో వైవిధ్యమైన రచనగా ఇది నిలిచిపోతుందని అన్నారు. ఈ పుస్తకంలో ఇంతకుముందు పరిశోధకులు, విమర్శకులు లోతుగా పట్టించుకోని అనేకాంశాలను విల్సన్ రావు కొమ్మవరపు పట్టించుకోని విషయాలను బయటపెట్టారని అన్నారు.  సాహిత్య విమర్శలో  పునర్ మూల్యాంకన విధానంలో జాషువా సాహిత్యాన్ని పునర్ మూల్యాంకన చేసిన గ్రంథం గా ఆయన పేర్కొన్నారు. దేవాలయాల ప్రవేశం కోసం దేశంలో మొట్టమొదటిసారిగా కేరళలోని తిరువాన్కూర్ మహా దేవాలయంలో జరిగిన వైకం సత్యాగ్రహం ప్రభావంతో జాషువా తన గబ్బిలం కావ్యం రాశారనే విషయం ఈ పుస్తకంలో అత్యంత ముఖ్యమైన అంశమని దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.   ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శాంతి నారాయణ మాట్లాడుతూ జాషువా పద్యంలోని శిల్పాన్ని వస్తువుని, ఈ రచన సమగ్రంగా చర్చించిందని అన్నారు. అసమానతల సమాజంలో నుంచి జాషువా కలం దిక్కారస్వరమైందని  ఈ ధిక్కార స్వరాన్ని  రచయిత మరింత పదునుగా చూపించాడని  అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ కథకుడు అడవాల శేషగిరి రాయుడు మాట్లాడుతూ ఆనాటి సామాజిక అంతరాలు జాషువా కలం ఎలా ఎలుగెత్తి సాగిందో ఆ కలం ప్రయాణాన్ని రచయిత అద్భుతంగా మలిచాడని అన్నారు. పుస్తకాన్ని పరిచయం చేసిన రాయలసీమ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంధం అరుణ  మాట్లాడుతూ రచనలో ఎనిమిది వ్యాసాలలోను రచయిత జాషువాను పరిచయం చేయడమే కాకుండా ఆయన సాహిత్యాన్ని మూల్యాంకనం చేసినట్లు ఉందని అన్నారు. వనపర్తికి చెందిన ప్రముఖ కవి జనజ్వాల మాట్లాడుతూ జాషువా కవిత్వం నిప్పుకణికలా మండిందని, అది అగ్రవర్ణ భావజాలాన్ని సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసిందని అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ సాహితీ స్రవంతి కర్నూలుగా ఇది మూడవ రచనగా తీసుకువచ్చామని, జాషువా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో  నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర కల్కూర  మాట్లాడుతూ జాషువా జీవితం సాహిత్యం సంక్లిష్టమైనదని ఎంతో ప్రాసంగికత కలిగినదని అన్నారు. ఈ సమావేశంలో రచయితలు డాక్టర్ నాగేశ్వరాచారి, మారుతి పౌరోహితం, బిజివేముల రమణారెడ్డి, తెలుగు వెంకటేష్,సయ్యద్ జహీర్ అహ్మద్, జనతా ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా, అవిజ వెంకటేశ్వర రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. సభను సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ ప్రారంభించగా నగర అధ్యక్షులు ఆగిపోగు నాగరాజు వందన సమర్పణతో ముగించారు.

ప్రభంజనం దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
నినాదం దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 

గగన్ సమాచార్ దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
ఆంధ్రజ్యోతి. దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
ఈనాడు దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
ప్రజాశక్తి దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
సృజన క్రాంతి దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
జన ప్రతి ధ్వని దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 


మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

09 సెప్టెంబర్, 2026

జీవితం ఒక సంబరం!

జీవితం

తాతల్ని మించిన చరిత్ర రాస్తేనే

విజయమై వెలుగుతుందా?

ఎవరి జీవితానికి వారిదే ఒక కథ!

ఎవరి కన్నీటికి వారిదే ఒక వ్యథ!

ఎవరి నవ్వులో వారిదే ఒక ప్రపంచం!

ఎన్ని వసంతాలు దాటిందని

కాలం లెక్కలు వేస్తుంది;

ఎన్ని అనుభవాలు మూటగట్టుకుందని

మనసు జీవితాన్ని కొలుస్తుంది!

ఒకరికి జీవితం

పూలబాటపై పున్నమి వెన్నెల;

మరొకరికి

ముళ్లబాటపై మండే ఎండ!

ఒకరికి అందని ఆకాశం

మరొకరి అరచేతిలో ఇంద్రధనుస్సు!

అయినా

ప్రతి ఉదయమూ ఒక కొత్త ఆహ్వానం!

ప్రతి సాయంత్రమూ ఒక మధుర జ్ఞాపకం!

ప్రతి రాత్రీ

మనసుతో మనం మాట్లాడుకునే ఏకాంతం!

బంగారు పళ్ళెంలో

పంచభక్ష్య పరమాన్నాలు తిన్నా

ఆకలి తీరిన తృప్తే ముఖ్యం!

చెట్టు కింద

చద్దన్నం తిన్నా

పక్కన ఆప్యాయత ఉంటే

అదే అమృత భోజనం!

ఊరంతా నీ వెంట నడిస్తే

అదొక సందడి!

ఒంటరిగా నువ్వు నడుస్తూ

నీ అంతరంగాన్ని పలకరిస్తే

అదొక అద్భుత యాత్ర!

సింహాసనం మీద కూర్చున్నా

నేలమీద నడిచే మనిషివే!

ఆకాశమంత పేరు సంపాదించినా

గుప్పెడంత గుండెతోనే జీవించాలి!

జీవితం

ఎప్పుడూ పూలవర్షం కురిపించదు;

అప్పుడప్పుడు పిడుగుల్ని పరిచయం చేస్తుంది!

కన్నీటితో అక్షరాలు నేర్పిస్తుంది!

గాయాలతో గమ్యాన్ని చూపిస్తుంది!

ఓటమితో ఓర్పును పెంచుతుంది!

గెలుపుతో గర్వాన్ని పరీక్షిస్తుంది!

నిన్ను చూసి నవ్వినవాళ్లుంటారు,

నీ నవ్వు కోసం ఎదురుచూసేవాళ్లుంటారు!

నీ అడుగుల్ని అడ్డుకున్నవాళ్లుంటారు,

నీ అడుగులకు బాటలు పరిచినవాళ్లుంటారు!

అందరినీ దాటుకుంటూ

నీ లోపలి మనిషిని చేరుకోవడమే

జీవితపు అసలైన ప్రయాణం!

ఒకరోజు

నీ పేరు సభల్లో మార్మోగుతుంది!

నీ మాటకు వేల చేతులు చప్పట్లు కొడతాయి!

నీ ప్రతిభకు వేదికలు వెలుగులు అద్దుతాయి!

మరోరోజు

అదే వేదికపై

నీ కుర్చీ ఖాళీగా మిగులుతుంది!

నీ మాట కోసం ఎదురుచూసిన గొంతులు

నీ జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటాయి!

అప్పుడు

నువ్వు కూడబెట్టిన సంపదకన్నా

పంచిన ప్రేమే మాట్లాడుతుంది!

నువ్వు నిర్మించిన భవనాలకన్నా

నిలిపిన మనుషులే గుర్తుకొస్తారు!

నువ్వు గడిపిన సంవత్సరాలకన్నా

జీవించిన క్షణాలే వెలుగుతాయి!

జీవితం అంటే

ఎంత ఎత్తుకు ఎదిగావని కాదు,

ఎంతమందికి నీడనిచ్చావో!

ఎంత దూరం ప్రయాణించావని కాదు,

ఎన్ని హృదయాలకు దగ్గరయ్యావో!

ఎంతకాలం నిలిచావని కాదు,

ఎంతటి అనుభూతిని మిగిల్చావో!

చివరకు

కాలం తన పుస్తకాన్ని మూసేస్తుంది!

మనిషి తన ప్రయాణాన్ని ముగిస్తాడు!

మిగిలినవాళ్లు

జ్ఞాపకాల దీపాలు వెలిగిస్తారు!

అప్పటిదాకా

నవ్వొస్తే మనసారా నవ్వు!

కన్నీళ్లు వస్తే కాసేపు కరిగిపో!

ప్రేమ దొరికితే పంచుకో!

అవకాశం వస్తే పదిమందికి చేయూతనివ్వు!

జీవితం ఒకసారి దొరికే అనుభవం!

ప్రతి క్షణం ఒక కొత్త పాఠం!

ప్రతి మనిషి ఒక కొత్త పరిచయం!

ప్రతి అనుభూతి ఒక అపురూప జ్ఞాపకం!

బతకడమే ఒక కళ!

బతుకును ఆస్వాదించడమే ఒక వరం!

మనిషిగా మిగలడమే

జీవితానికి అసలైన అలంకారం!

జీవితం ఎప్పుడూ అందమైనదే!

దాన్ని చూసే చూపులోనే

దాని సౌందర్యమంతా దాగుంది!

- దార్ల వెంకటేశ్వరరావు, 9.10.2026

26 ఆగస్టు, 2026

మదర్ థెరిసా 'సేవారత్న' పురస్కారాల ప్రదానం

 మదర్ థెరిసా 'సేవారత్న' పురస్కారాల ప్రదానం

ఈనాడు దినపత్రిక, 27.8.2026 సౌజన్యంతో 
విశాల భారతి దినపత్రిక, 27.8.2026 సౌజన్యంతో 
తరణం దినపత్రిక, 27.8.2026 సౌజన్యంతో 
వార్త దినపత్రిక, 27.8.2026 సౌజన్యంతో 
భారతీయ వెలుగు దినపత్రిక, 27.8.2026 సౌజన్యంతో 
సాక్దిషి నపత్రిక, 27.8.2026 సౌజన్యంతో 

జన ప్రతిధ్నవని పత్రిక, 27.8.2026 సౌజన్యంతో 

​ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం (26.8.2026) మాదాపూర్ లోని స్వాతి హైస్కూల్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు. ముందుగా మదర్ థెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి, క్రొవ్వొత్తులు వెలిగించి ఘనంగా అంజలి ఘటించారు.

​కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్‌సీయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా రాగం మల్లికార్జున యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మదర్ థెరిసా జీవితంలోని పలు అరుదైన, స్ఫూర్తిదాయకమైన కోణాలను ఆవిష్కరించి, ఆమె సేవకు ప్రతిరూపంగా వ్యాఖ్యానించారు.మదర్ థెరిస్సా తన జీవితాన్ని పేదలు, అనాథలు, రోగుల సేవ కోసం అంకితం చేసిన ఒక గొప్ప మానవతావాది అని ఆయన వివరించారు "మానవ సేవే మాధవ సేవ" అనే సూత్రాన్ని నమ్మి, సమాజంలో అట్టడుగున ఉన్న వారి కోసం ఆమె ఎనలేని కృషి చేశారని చెప్పారు.  1950లో కేవలం 13 మంది సభ్యులతో, సాధారణ నీలం అంచు తెల్లటి చీరతో 'మిషనరీస్ ఆఫ్ చారిటీ'ని స్థాపించి, దాన్ని వందలాది దేశాలకు విస్తరించిన ఆమె ప్రయాణం అనన్యసామాన్యమని ఆయన కొనియాడారు. ముఖ్యంగా మరణశయ్యపై ఉన్న అనాథలు, పేదలు రోడ్ల పక్కన దిక్కులేకుండా చనిపోకూడదనే ఉద్దేశ్యంతో కాళీఘాట్ లో ఆమె స్థాపించిన 'నిర్మల్ హృదయ్', అలాగే అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన 'శిశు భవన్' లాంటి సంస్థలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనాలు" అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మదర్ థెరిస్సా సేవలను గుర్తు చేశారు.

 సభాధ్యక్షత వసహించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ‘సమాజంలో మానవసేవే మాధవసేవగా భావించి వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేస్తున్న వారికి 'సేవారత్న' పురస్కారాలు అందిస్తున్నామని చెప్పారు. 

మదర్ థెరిస్సా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె స్థాపించిన సంస్థల ద్వారా దయ, కరుణ, సేవాభావం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని స్వాతి హైస్కూల్ ప్రిన్సిపాల్ చంద్రిక పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా  వివిధ రంగాలలో విశేషమైన సేవలందించిన కింది సేవామూర్తులకు అతిథుల చేతుల మీదుగా సేవారత్న అవార్డులను (దుశ్శాలువ, జ్ఞాపిక, పగిడి, తాంబూలంతో) సత్కరించి ప్రదానం చేశారు. ​శ్రీమతి ఎం. అరుణ, ​శ్రీ ఎం. వెంకటరావు, ​డాక్టర్ కె. అరుణశ్రీ, ​డాక్టర్ రాజ్ కుమార్ లట్టుపల్లి (జాయ్ ఫౌండేషన్) ​శ్రీ జి.ఎస్.డి. గుప్తా (షిరిడీ సాయిబాబా అసోసియేషన్, రిటైర్డ్ బీహెచ్ఈఎల్ ఏజీఎం) లకు పురస్కారాలను అందించారు.

​తమకు తగిన గుర్తింపు లభించడం పట్ల పురస్కార గ్రహీతలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ ప్రోత్సాహంతో మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా పనిచేస్తామని కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో స్వాతి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి చంద్రిక,కొత్తపల్లి కోటేశ్వరరావు, డా. రామన్న, డి.వి.కె.రావు, సుబ్బారావు, వాణీ సాంబశివరావు, విష్ణు ప్రసాద్,   పాలం శీను, శివరాం రెడ్డి, బాలన్న, డా.సాంబశివరావు, తెలుగు శాంతి కుమార్, డా.లతాగుప్త, సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





23 మార్చి, 2026

కాశీ ప్రసాదం... మా అమ్మాయిలా‌...

 కాశీ ప్రసాదం.. పద్యం


కాశిని జూచి వచ్చియును కమ్మని దీవెన తోడ నాకునున్

క్లేశము బాపి పంపెనుగ కృష్ణుడు మెచ్చెడి రీతి బిడ్డయై

భాసము బెట్టి నెన్నొసట భక్తిగ నిచ్చెను గంగ తీర్థమున్

వాసిగ కూతురై యిపుడు వత్సలతన్ గనిపించె నన్నెదన్!

(కాశీ క్షేత్రాన్ని దర్శించి వచ్చిన నా ప్రియ శిష్యురాలు, ఆ విశ్వనాథుని కమ్మని దీవెనలతో పాటు నాకు ప్రసాదాన్ని అందించింది. నా మనసులోని ఆందోళనలను (క్లేశములను) దూరం చేస్తూ, ఆ కృష్ణ పరమాత్మ కూడా మెచ్చే రీతిలో ఒక బిడ్డగా నా దగ్గరకు వచ్చింది. నా నుదుట భక్తితో బొట్టు పెట్టి, గంగా తీర్థాన్ని ఇస్తున్న ఆ సమయంలో... నాకు కూతురు లేదన్న వెలితిని పూర్తి చేస్తూ, ఒక కన్నకూతురి వలె ఎంతో వాత్సల్యంతో ఆమె నా హృదయానికి కనిపించింది.)

పువ్వు పూచి చెట్టు పులకింప జేసిన

రీతి బిడ్డ యొకతె ప్రీతి తోడ

కాశి విభుని నొసగె కరుణ తో బొట్టును

కూతు రైన దమ్మ గురువు కపుడు!

(ఒక పువ్వు పూచి చెట్టుకు ఎలాగైతే పులకింతను ఇస్తుందో, అలాగే ఆ బిడ్డ ఆత్మీయతతో కాశీ విశ్వనాథుని ప్రసాదాన్ని ఇచ్చి, బొట్టు పెట్టింది. ఆ క్షణంలో ఆ విద్యార్థిని తన గురువుకు నిజంగా కూతురై నిలిచింది.)

కాశి విశ్వేశు దీవెన గలిగె ననగ

బొట్టు పెట్టియు బిడ్డగా మురిపె మొలికె

పుత్రికే లేని వెలితిని పూర్తి జేసె

గురుని యెద నిండ ననురాగ కుసుమ మయ్యె!

(కాశీ విశ్వేశ్వరుని దీవెన లభించిందా అన్నట్లుగా, ఆ బిడ్డ బొట్టు పెడుతుంటే కూతురు లేని వెలితి తీరిపోయింది. ఆమె చూపిన అనురాగం గురువు హృదయంలో ఒక వికసించిన పువ్వులా నిలిచిపోయింది.)


Rcpuram Government Degree College International Seminar on 23.3.2026

 




Rcpuram Government Degree College International Seminar on 23.3.2026