"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

నినాదం దినపత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నినాదం దినపత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

01 నవంబర్, 2026

భారతీయ సాహిత్యంలో కాళిదాసు


నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 1.11.2026 సౌజన్యంతో. 

....

భారతీయ సాహిత్యంలో కాళిదాసు 

‘’పురా కవీనాం గణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠితకాళిదాసః ।

అద్యాపి తత్తుల్యకవేరభావాదనామికా సార్థవతీ బభూవ ॥’’

సంస్కృత సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన మహాకవి కాళిదాసు గొప్పతనాన్ని చెప్తూ పండితులు, విమర్శకులు చెప్పుకున్నట్లు ఒక ప్రశంసా పూర్వక శ్లోకం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప కవులు ఎవరు అని లెక్కించే ఒక సందర్భాన్ని ఊహించుకుంటూ, కాళిదాసు కవిత్వానికి సాటిరాగల మరో కవి ఈ సృష్టిలోనే లేడని చాటిచెప్పడానికి ఈ శ్లోకాన్ని సృష్టించారు.

మనం సాధారణంగా ఏదైనా లెక్కింపు చేసేటప్పుడు చేతి వేళ్లను ముడుస్తూ, మొదట చిటికెన వేలితో ప్రారంభించడం భారతీయుల అలవాటు.అలా లెక్కింపు మొదలుపెట్టగానే, చేతి మొదటి వేలైన చిటికెన వేలు మీద అందరికంటే శ్రేష్ఠుడు, మొదటివాడు కాళిదాసే" అని కాళిదాసు పేరును చెప్పారు.మొదటి స్థానం కాళిదాసుకి ఇచ్చాక, రెండవ స్థానంలో ఏ కవిని నిలబెట్టాలి అని ఆలోచిస్తే, నేటికీ కాళిదాసుతో సమానమైన ఆయన స్థాయికి సరితూగగల మరో కవి ఎవ్వరూ కనిపించలేదట! అంత గొప్ప కవి కాళిదాసు.

భారతీయ క్లాసికల్ సంస్కృత సాహిత్యంలో అగ్రగణ్యుడైన మహాకవి కాళిదాసు జీవిత చరిత్ర చారిత్రక ఆధారాల కంటే జానపద ఐతిహ్యాల రూపంలోనే ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఒక సాధారణ మూర్ఖుడు దైవానుగ్రహం, అంతఃపరివర్తన ద్వారా జగద్గురు సమానుడైన మహాకవిగా ఎలా రూపాంతరం చెందాడనే సంప్రదాయ కథనం శతాబ్దాలుగా భారతీయ సాహిత్య రంగంలో వినబడుతోంది. అందం, విద్యాగర్వంతో ఉన్న ఒక విదుషీమణికి, అక్షరజ్ఞానం లేని ఒక నిరక్షరాస్యుడికి మధ్య జరిగిన విచిత్ర వివాహ బంధం చుట్టూ ఈ కథనం అల్లబడింది. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వెలువడిన అనేక పుస్తకాల్లో ఈ కథలు కనిపిస్తాయి.

సాహిత్య సంప్రదాయం ప్రకారం, ఆనాటి రాజకుమారి, పరమ విదుషీమణి అయిన ‘విద్యోత్తమ’ తనను శాస్త్ర చర్చలో ఓడించిన పండితుడినే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. మరికొంతమంది ప్రకారం కాశీరాజు భీమశుక్లుని కుమార్తె ‘వాసంతి’గా చెప్తారు. (కాళిదాసు’ రచయిత: కె.టి.పాండురంగి, తెలుగు అనువాదం:వారణాసి జానకీ దేవి, 1997:8) ఎంతోమంది పండితులను అవమానిస్తుంది. ఆమె అహంకారాన్ని దెబ్బతీయాలని భావించిన కొంతమంది పండితులు, ఒక పరమ మూర్ఖుడిని అన్వేషించే క్రమంలో తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న ఒక అమాయక యువకుడిని కనుగొంటారు. గొర్రెలను వేపుకుంటున్న ఒక వ్యక్తి, వాటి ఆహారం కోసం చెట్ల ఆకులు కొమ్మలను కొట్టి వాటిని మరల కింద తీసుకు వచ్చి వేయడం కష్టమని భావించి, కొమ్మ పైన కూర్చుంటే ఆ కొమ్మతో పాటు తాను కూడా కింద హాయిగా రావచ్చని భావిస్తాడు.‌ అతనికి పండిత వస్త్రాలు ధరింపజేసి, ఆయన గొప్ప మౌన ముని అని, కేవలం సైగలతోనే సమాధానాలు ఇస్తారని విద్యోత్తమను నమ్మిస్తారు. ఆ క్రమంలో జరిగిన విచిత్ర సంకేత శాస్త్రార్థంలో పండితుల కుయుక్తి వల్ల రాజకుమారి ఓడిపోయి, ఆ మూర్ఖుడిని వివాహం చేసుకుంటుంది. అయితే, వివాహానంతరం మొదటి రాత్రే తన భర్త నిరక్షరాస్యుడనే కఠోర సత్యాన్ని విద్యోత్తమ గ్రహిస్తుంది. భర్త మూర్ఖత్వాన్ని భరించలేక, తీవ్రమైన ఆత్మాభిమానంతో ఆమె అతనిని నిందించి, అవమానించి ఇంటి నుండి వెల్లగొట్టేస్తుంది. 

భార్య చేసిన ఆ పరమ పరాభవం తర్వాత ఆ యువకుడి మానసిక స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. తన అజ్ఞానానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ, ఆత్మన్యూనతా భావంతో ఆ రాత్రే గ్రామ శివార్లలోని ఓ కాళికా దేవి ఆలయానికి చేరుకుంటాడు. ఆలయంలో కాళీ మాతను దర్శించుకుని, తీవ్రమైన ఆర్తితో, కన్నీటితో జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. అతని నిష్కల్మషమైన భక్తికి, తపనకు ప్రసన్నురాలైన కాళికా దేవి ప్రత్యక్షమై, అతని నాలుకపై బీజాక్షరాలను లిఖించి, అపారమైన శబ్ద సంపదను, సకల శాస్త్ర పాండిత్యాన్ని అనుగ్రహిస్తుంది. కాళీ మాత కరుణాకటాక్షాల వల్ల పరమ జ్ఞానిగా మారినందు వల్ల, నాటి నుండి అతను 'కాళిదాసు' అనే నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. కాళీకామాతకు దాసుడు కాబట్టి, కాళిదాసు అయ్యాడనే కథ ప్రచారంలో ఉంది. అతని అసలు పేరు కాలుడనీ, తర్వాత కాళిదాసుగా మారాడనీ చెప్తుంటారు. మనం ఎంత మూర్ఖులమైనా, చదువు రాకపోయినా పర్వాలేదు. కానీ పట్టుదల, కష్టపడే తత్వం, మరియు నమ్మకం ఉంటే ఎలాంటి కష్టమైన చదువునైనా సాధించవచ్చు, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అనేది ఈ కథ ద్వారా తెలుస్తోంది. దివ్యజ్ఞాన సంపన్నుడైన కాళిదాసు తిరిగి గృహానికి విచ్చేసినప్పుడు, అతని ముఖ వర్చస్సును, గంభీరమైన శైలిని గమనించిన విద్యోత్తమ ఆశ్చర్యంతో, సంస్కృతంలో "అస్తి కశ్చిద్ వాగ్విశేషః?" (మీ వాక్కులో ఏదైనా విశేషం కనిపిస్తోందా?) అని ప్రశ్నిస్తుంది. భార్య పలికిన ఆ వాక్యంలోని మూడు పదాలను (అస్తి, కశ్చిత్, వాక్) ప్రేరణగా తీసుకునే తర్వాత కాలంలో కాళిదాసు తన సుప్రసిద్ధ మహాకావ్యాలైన కుమారసంభవం, మేఘదూతం, రఘువంశాలను రచించి భారతీయ వాఙ్మయంలో చిరస్థాయిగా నిలిచిపోయారని సాహితీవేత్తలు వ్యాఖ్యానిస్తుంటారు. 

సాహిత్య విద్యార్థులుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కథకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. కాళిదాసు కావ్యాలలో వ్యక్తమయ్యే అపారమైన వేద, వేదాంగ, జ్యోతిష్య, భౌగోళిక విజ్ఞానాన్ని పరిశీలిస్తే, ఆయన ఒకే రాత్రిలో పండితుడు కాలేదని, సుదీర్ఘమైన విద్యాభ్యాసం చేసి ఉంటారని విమర్శనాత్మకంగా అవగాహన చేసుకోవాలి. అయినప్పటికీ, ఒక కవి ప్రతిభ వెనుక ఉండే పట్టుదలను, కావ్య సృష్టి వెనుక ఉండే దైవిక ప్రేరణను ప్రతీకాత్మకంగా చెప్పడానికి ఈ జానపద గాథ సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలుస్తోంది. అంతేకాదు, కాళిదాసు పేరుతో మరికొన్ని రచనలు కనిపిస్తాయి. అవన్నీ ఆయనే రాశాడో లేదో చెప్పలేమనీ, కాళిదాసు పేరుతో మరో కవి కూడా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

సాహిత్య పరిశోధనలో అత్యంత క్లిష్టమైన అంశం కాళిదాసు పూర్వీకుల గురించిన వివరాలు సేకరించడంగా నేటికీ చరిత్రకారులు భావిస్తున్నారు. కాళిదాసు తన ఏ ఒక్క కావ్యంలోనూ, నాటకంలోనూ తన తల్లిదండ్రుల పేర్లను గానీ, తన వంశ వృత్తాంతాన్ని గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. జానపద ఐతిహ్యాల ప్రకారం ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని, చిన్నప్పుడే అంటే ఆరో నెలలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారాడని, తదనంతరం ఒక గొర్రెలు మేపుకొనే వాని ఇంట పెరిగాడని చెప్తుంటారు.(kalidasa: His period, Personality & Poetry, by K.S.Ramaswami Sastri, 1933:82) కాళిదాసు జీవించిన కాలాన్ని నిర్ధారించడానికి పరిశోధకులు రెండు చారిత్రక విషయాలను ప్రస్తావిస్తుంటారు.కాళిదాసు రచించిన మొదటి నాటకం ‘మాళవికాగ్నిమిత్రం’. దీనిలోని నాయకుడు శృంగ వంశానికి చెందిన రాజు 'అగ్నిమిత్రుడు' (క్రీ.పూ. 170). కాబట్టి కాళిదాసు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం తర్వాతే జీవించి ఉండాలి.చాళుక్య రాజు రెండవ పులకేశి వేయించిన ప్రసిద్ధ ఐహోళె శాసనం (క్రీ.శ. 634) లో కాళిదాసు, భారవిల పేర్లు స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి. అలాగే క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందిన బాణభట్ట తన 'హర్షచరితం' లో కాళిదాసు కవితా మాధుర్యాన్ని కొనియాడాడు. దీనిని బట్టి కాళిదాసు క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 7వ శతాబ్దం మధ్య కాలంలో జీవించాడని స్పష్టమవుతోంది. ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పాలించిన వీరుడు, క్రీ.పూ. 57 లో 'విక్రమ శకం' ప్రారంభించిన రాజ విక్రమార్కుడి లేదా విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో కాళిదాసు అగ్రగణ్యుడు అనే ఒక సిద్ధాంతం ఉంది.దీని ప్రకారం కాళిదాసు క్రీ.పూ. 170–57 మధ్య కాలానికి చెందినవాడు. 

మరో సిద్ధాంతం ప్రకారం కాళిదాసు గుప్తుల స్వర్ణయుగానికి చెందినవాడు. గుప్త వంశ చక్రవర్తి అయిన రెండవ చంద్రగుప్తుడు (క్రీ.శ. 375–415) తనకు తాను 'విక్రమార్క' లేదా 'విక్రమాదిత్య' అనే బిరుదును ధరించాడు. ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోనే కాళిదాసు రాజకవిగా ఉన్నాడని భావిస్తున్నారు. ఈ వాదనకు బలమైన సాహిత్య ఆధారాలు ఉన్నాయి. కాళిదాసు రాసిన ‘రఘువంశం’ లోని రఘుమహారాజు దిగ్విజయ యాత్ర, గుప్త రాజు సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్తి శాసనంలో ఉన్న దిగ్విజయ యాత్రతో అచ్చుగుద్దినట్లు సరిపోలుతుంది. అలాగే, ఆయన కావ్యాల్లో ప్రతిబింబించే సామాజిక, ఆర్థిక వైభవం మరియు శాంతిభద్రతలు గుప్తుల కాలపు అత్యున్నత సంస్కృతికి అద్దం పడతాయి. అందువల్ల, కాళిదాసు కాలాన్ని చారిత్రకంగా క్రీ.శ. 5వ శతాబ్దం (గుప్తుల కాలం) గా నిర్ధారించడం అత్యంత హేతుబద్ధంగా భావిస్తారు.

ప్రాచీన భారతీయ సాహిత్య చరిత్రలో చాలామంది కవుల విషయంలో ఇలాగే కాలనిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజంగా కనిపిస్తుంది. సాహిత్య చరిత్రకారులు కాళిదాసు రచించినట్లుగా ప్రమాణీకరించిన గ్రంథాలు మాత్రం మొత్తం ఏడు (7). అవి రెండు మహాకావ్యాలు, రెండు ఖండకావ్యాలు, మూడు నాటకాలు. రఘువంశం, కుమారసంభవం అనేవి రెండు ప్రసిద్ధ మహాకావ్యాలు కాగా; మేఘదూతం, ఋతుసంహారం అనేవి ప్రకృతి సౌందర్యాన్ని, విరహ వేదనను ప్రతిబింబించే రెండు విశిష్ట ఖండకావ్యాలు. నాటక ప్రక్రియలో జగత్ప్రసిద్ధి గాంచిన అభిజ్ఞాన శాకుంతలంతో పాటు, పురూరవ-ఊర్వశుల ప్రణయ గాథ అయిన విక్రమోర్వశీయం, ఆయన తొలి నాటకం అయినప్పటికీ, మాళవికాగ్నిమిత్రం సాహిత్య లోకంలో మకుటాయమానంగా నిలిచిందని కొంతమంది సాహిత్య విమర్శకుల అభిప్రాయం. అవి కేవలం ఒక నిర్దిష్ట కాలానికి లేదా ఒక కుటుంబానికే పరిమితం కాకుండా, విశ్వజనీనమైన భారతీయ సంస్కృతికి శాశ్వత ప్రతీకలుగా నిలిచాయని సాహిత్య చరిత్ర కారుల అభిప్రాయం.

‘రఘువంశం’ ఒక మహాకావ్యం 19 సర్గలతో కూడిన కాళిదాసు పరిణతి చెందిన మహాకావ్యం. సూర్యవంశానికి చెందిన అత్యంత పరాక్రమవంతులైన 29 మంది రాజుల గొప్పతనాన్ని వారి జీవిత విశేషాలను వివరిస్తుంది. ఈ కథ సంతానం లేని దిలీప మహారాజు వశిష్ఠుని ఆజ్ఞ మేరకు నందిని అనే కామధేనువు పుత్రికకు సేవ చేసి, రఘువు అనే పరాక్రమవంతుడైన కుమారుడిని పొందడంతో ప్రారంభమవుతుంది. రఘువు పేరు మీదుగానే ఈ వంశానికి 'రఘువంశం' అనే పేరు వచ్చింది. ఆ తర్వాత రఘువు కుమారుడైన అజుడు, మనవడైన దశరథుడు, ఆ వంశంలోనే జన్మించిన శ్రీరాముడి ఉదాత్తమైన జీవిత చరిత్ర, రావణ వధ, సీతాన్వేషణ వంటి రామాయణ ఘట్టాలు దీనిలో ప్రధానంగా వర్ణించాడు. చివరకు ఈ వంశంలో చివరి వాడైన అగ్నివర్ణుడు అనే రాజు భోగలాలసత్వంతో మరణించడంతో మొత్తం 19 సర్గల ఈ మహాకావ్యం ముగుస్తుంది.

కుమారసంభవం 17 సర్గలతో కూడిన అద్భుతమైన కావ్యం. శివపార్వతుల కళ్యాణం, కుమారస్వామి (షణ్ముఖుడి) జననం, తారకాసుర సంహారం దీనిలోని ప్రధాన ఇతివృత్తం. హిమాలయాల వర్ణనతో ప్రారంభమయ్యే ఈ కావ్యంలో పార్వతీదేవి తపస్సు, మన్మథ దహనం, దేవీదేవుల శృంగార వర్ణనలు కాళిదాసు కల్పనా చాతుర్యానికి నిదర్శనాలు.

తారకాసురుడనే రాక్షసుని బాధల నుండి దేవతలను రక్షించడానికి, శివపార్వతుల తేజస్సుతో మహావీరుడైన 'కుమారస్వామి' (సుబ్రహ్మణ్య స్వామి) జన్మవృత్తాంతమే ఈ కావ్యానికి ప్రధాన ఇతివృత్తం. హిమవంతుని కుమార్తె పార్వతి శివునిపై మనసుపడి, ఆయనను భర్తగా పొందడం కోసం హిమాలయాల్లో కఠినమైన తపస్సు చేస్తుంది. లోకకల్యాణం కోసం మన్మథుడు తన బాణంతో శివుని తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించగా, శివుని మూడో కంటి మంటకు మన్మథుడు బూడిదవుతాడు. అయినప్పటికీ పార్వతి అచంచల దీక్షకు, భక్తికి సంతోషించిన శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు.శివపార్వతుల వివాహానంతరం వారి తేజస్సుతో ఉద్భవించిన కుమారస్వామి సేనానిగా, దేవసేనను నడిపించి తారకాసురుడిని సంహరిస్తాడు. తద్వారా దేవతలకు స్వర్గరాజ్యాన్ని తిరిగి ఇప్పించి, లోకంలో శాంతిని ప్రతిష్టిస్తాడు. ఈ కావ్యంలో కాళిదాసు ప్రకృతి సౌందర్యాన్ని, హిమాలయ వర్ణనలను, పార్వతీదేవి తపస్సును, శృంగార వీర రసాలను అత్యంత రమణీయమైన శైలిలో వర్ణించాడు. అందుకే ఇది సంస్కృత దృశ్య-కావ్య రంగంలో ఒక సుందరమైన దృశ్యకావ్యంగా నిలిచింది.

మేఘదూతం లఘుకావ్యమైనప్పటికీ ప్రపంచ సాహిత్యంలోనే ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలకాపురి రాజు, ధనాధిపతి అయిన కుబేరుడి కొలువులో ఒక యక్షుడు ఉండేవాడు. అతను తన కొత్త భార్య ప్రేమలో మునిగిపోయి, విధులను నిర్లక్ష్యం చేస్తాడు. దాంతో ఆగ్రహించిన కుబేరుడు, ఒక సంవత్సరం పాటు భార్యకు దూరంగా ఉండాలని అతనికి శాపం విధిస్తాడు.శాపగ్రస్తుడైన యక్షుడు తన నివాసాన్ని వదిలి, దక్షిణ భారతదేశంలోని 'రామగిరి' ఆశ్రమాలకు వస్తాడు.ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని రామ్‌గఢ్ కొండలుగా చెప్తుంటారు భార్య విరహంతో ఎనిమిది నెలలు గడిచిపోతాయి.ఆషాఢ మాసం మొదటి రోజున, కొండలను తాకుతున్న ఒక అందమైన నల్లటి మేఘాన్ని యక్షుడు చూస్తాడు. వర్షాకాలం వస్తుండటంతో భార్యపై విరహం మరింత ఎక్కువవుతుంది. ప్రాణం లేని మేఘాన్ని చూసి, తన భార్యకు తన క్షేమ సమాచారాన్ని చేరవేసే "దూత"గా మార్చుకుంటాడు.

మేఘదూతం రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వమేఘం భాగంలో యక్షుడు మేఘానికి రామగిరి నుండి హిమాలయాల్లోని అలకాపురి వరకు వెళ్ళే దారిని వివరిస్తాడు. ఇందులో భారతదేశంలోని నదులు (నర్మద, వెట్రవతి), పర్వతాలు, ఉజ్జయిని నగరం, మహాకాళేశ్వర ఆలయం వంటి ఎన్నో ప్రాంతాల భౌగోళిక అందాలను కాళిదాసు అద్భుతంగా వర్ణించారు. ఉత్తరమేఘం భాగంలో అలకాపురి నగర వైభవాన్ని, యక్షుడి ఇల్లు ఎలా ఉంటుందో, విరహంతో కృశించిపోతున్న అతని భార్య రూపం ఎలా ఉంటుందో మేఘానికి చెప్తాడు. చివరగా, మేఘం ఆమెకు చెప్పాల్సిన సందేశాన్ని అందిస్తాడు. తాను క్షేమంగా ఉన్నానని, శాపకాలం త్వరలోనే ముగుస్తుందని చెప్తాడు. కాళిదాసు రాసిన మేఘదూతం ఎంతగానో ప్రజాదరణ పొందింది. దీని తర్వాత సంస్కృతంలోను తెలుగులోను అనేక 'సందేశ కావ్యాలు' వచ్చాయి. కాళిదాసు కేవలం జడపదార్థమైన మేఘానికి మానవ రూపాన్ని, భావాలను ఆపాదించి, ప్రకృతిని ఒక జీవమున్న పాత్రగా మార్చారు. చివరగా, యక్షుడి సందేశాన్ని విన్న కుబేరుడు కరిగిపోయి, వారిద్దరినీ శాప విముక్తులను చేయడంతో ఈ కావ్యం సుఖాంతమవుతుంది.

వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో శ్రీరాముని దూతగా హనుమంతుడు సీతాదేవి వద్దకు వెళ్లి విరహ సందేశాన్ని అందించే ఘట్టమే సంస్కృత సాహిత్యంలోని 'సందేశ కావ్య' ప్రక్రియకు మూలబీజం. ఈ హనుమత్సందేశపు భావనను, విరహ వేదనను, ప్రకృతితో కూడిన మార్గవర్ణనల నేపథ్యాన్ని ప్రధాన ప్రేరణగా తీసుకునే మహాకవి కాళిదాసు ఒక నిర్జీవ మేఘాన్ని దూతగా మలచి విశ్వవిఖ్యాతమైన 'మేఘసందేశం' మహాకావ్యాన్ని అద్భుతంగా సృష్టించారు.

మహాకవి గుర్రం జాషువా గారి 'గబ్బిలం' ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అత్యున్నతమైన, విప్లవాత్మకమైన ఖండకావ్యం. సమాజంలో అంటరానితనం, కులవివక్ష వంటి దురాచారాల వల్ల అణచివేతకు గురైన ఒక నిరుపేద దళిత భక్తుని వేదనను భగవంతునికి చేరవేయడానికి జాషువా ఎంచుకున్న అద్భుతమైన దూత 'గబ్బిలం'.

కాళిదాసు 'మేఘసందేశం'లో యక్షుడు మేఘాన్ని దూతగా పంపితే, జాషువా సమాజంచేత అసహ్యించుకోబడిన, అశుభప్రదంగా భావించబడే గబ్బిలాన్ని తన ఆవేదనను కాశీ విశ్వనాథునికి తెలపడానికి దూతగా ఎంచుకోవడం ఆయన సామాజిక దృక్పథానికి నిదర్శనం. అంటరానితనం కారణంగా గుడిలోకి వెళ్ళలేని ఒక దీనుని తరఫున, ఆ రాత్రివేళ తిరిగే గబ్బిలం కైలాసానికి వెళ్లి ఈశ్వరునికి తన గోడును వివరిస్తుందని కవి హృదయ విదారకంగా వర్ణించారు. కేవలం సామాజిక వేదనను తెలపడమే కాకుండా, దేశభక్తిని, జాతి ఐక్యతను ఆకాంక్షిస్తూ, పండిత లోకాన్ని సైతం ఆలోచింపజేసిన ఈ రూపకం తెలుగు సాహిత్యానికి జాషువా అందించిన అమూల్యమైన కానుక.

బహుభాషా కోవిదులైన పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగులోకి అదే స్థాయిలో రమణీయమైన పద్యరూపంలో 'మేఘదూతము'గా రమణీయంగా అనువదించారు. 

ఋతుసంహారం కాళిదాసు తొలి రచనగా పరిశోధకులు భావిస్తారు. భారతదేశంలోని ఆరు ఋతువులను (వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర) ప్రేమికుల హృదయ స్పందనలతో ముడిపెడుతూ అద్భుతంగా వర్ణించిన ప్రకృతి కావ్యం ఇది.

అభిజ్ఞాన శాకుంతలం ఏడు అంకాలతో కూడిన ఈ నాటకం కాళిదాసు సృష్టిలోనే కాక, ప్రపంచ నాటక సాహిత్యంలోనే ఒక మకుటాయమానమైన గ్రంథం. మహాభారతంలోని దుష్యంత-శకుంతలల ఉపాఖ్యానాన్ని తీసుకుని, ఆ విప్రలంభ శృంగారానికి 'అంగుళీయం' అనే అద్భుతమైన కల్పనను జోడించి నాటక శిల్పాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. "కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్యా శకుంతలా" అనే నానుడి దీని విశిష్టతను చాటుతుంది. జర్మన్ మహాకవి గెథే (Goethe) ఈ నాటకాన్ని చదివి పరవశించి తలపై పెట్టుకుని నాట్యం చేశాడని చరిత్ర చెబుతోంది.

విక్రమోర్వశీయం ఐదు అంకాల 'త్రోటకం' అనే నాటక ప్రక్రియకు చెందినది. భూలోక రాజు పురూరవుడికి, దేవలోక అప్సరస ఊర్వశికి మధ్య నడిచిన ప్రణయగాథ దీని ఇతివృత్తం. విరహవేదనతో ఉన్మాదిగా మారిన పురూరవుడి ప్రకృతి వర్ణనలు కాళిదాసు కవితా ప్రతిభకు పరాకాష్ఠ.

మాళవికాగ్నిమిత్రం కాళిదాసు రచించిన మొదటి నాటకంగా సాహిత్య చరిత్ర కారులు భావిస్తారు. శృంగ వంశానికి చెందిన రాజు అగ్నిమిత్రుడు, అంతఃపుర నర్తకి మాళవికల మధ్య నడిచిన శృంగార, రాజకీయ చదరంగం దీని ఇతివృత్తం. తొలి రచన అయినప్పటికీ నాటక రంగస్థల నియమాలను, నృత్య శాస్త్ర విశేషాలను ఇందులో అత్యంత నిశితంగా పొందుపరిచాడు.

సంస్కృత సాహిత్య విమర్శకులు కాళిదాసు కవిత్వ శైలిని "ఉపమా కాళిదాసస్య" అని సూత్రీకరించారు. కాళిదాసు ఒక వస్తువును లేదా సందర్భాన్ని వర్ణించేటప్పుడు చెప్పే పోలిక ఊహాతీతంగా, ఎంతో సహజంగా ఉంటుంది. ఆయన వాడే ఉపమ కేవలం అందం కోసమే కాకుండా, కథా సందర్భాన్ని, పాత్రల అంతరంగాన్ని విప్పి చెప్పేలా ఉంటుంది. అందుకే పోలిక చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే ।

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ ॥ ‘రఘువంశం’ ప్రారంభ శ్లోకంలో శబ్దం, దాని అర్థం ఎలాగైతే ఒకదానిని విడిచి ఒకటి ఉండలేవో, అంతగా కలిసిపోయి ఉంటాయో, అలాగే విడదీయరాని బంధంతో ఎల్లప్పుడూ కలిసి ఉండే జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులను నేను పూజిస్తున్నాను. నాకు వాక్సుద్ధి వాటికి తగిన ఉత్తమమైన అర్థం సిద్ధించాలని వారిని వేడుకుంటున్నానని మంగళాచరణ శ్లోకం చెప్పే సందర్భం. శివపార్వతులు విడదీయరాని శక్తి స్వరూపులని చెప్పడానికి ఈ ఉపమ వాడారు.

సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ 

యం యం వ్యతీయాయ పతింవరా సా ।

నరేంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే 

వివర్ణభావం స స భూమిపాలః ॥ 

(రఘువంశ మహాకావ్యం – ఆరవ సర్గ (6వ సర్గ), 67వ శ్లోకం) 

స్వయంవర మంటపంలో వరుడిని ఎన్నుకునే ఇందుమతి, చేతిలో జ్యోతిని పట్టుకుని రాత్రి వేళ రాజమార్గంలో నడిచి వెళ్తున్న ఒక "కదిలే దీపశిఖ" లా ఉంది. ఆ దీపం ఒక భవనం ముందుకు వచ్చినప్పుడు ఆ భవనం వెలిగిపోయి, దీపం ముందుకు సాగిపోగానే ఆ భవనం మళ్లీ ఎలా చీకట్లో మునిగిపోతుందో... అలాగే ఇందుమతి తన ముందుకు వచ్చినప్పుడు ఆశతో ముఖాలు వెలిగించుకున్న రాజులు, ఆమె తమ్మును దాటి ముందుకు వెళ్ళిపోగానే నిరాశతో ముఖాలు వెలవెలబోయి అంధకారంలో మునిగిపోయారు.

కాళిదాసు తన రఘువంశం, కుమారసంభవం, అభిజ్ఞాన శాకుంతలం వంటి రచనలలో ప్రకృతిని, మానవ భావాలను పోలుస్తూ చెప్పిన ఉపమానాలు పాఠకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే ఉపమ అనగానే అందరికీ మొదట గుర్తుకువచ్చేది కాళిదాసే. 

మహాకవి కాళిదాసు రచనలలోని ఇతివృత్తాలు, భాషా శైలి ఆనాటి ఉన్నత వర్గాలైన రాజులు, పండితులకు చెందినవనే వాదనలో కొంత నిజముంది. ఆయన తన కావ్య నాటకాలకు కథలను రామాయణ, మహాభారత, పురాణాల నుండి సేకరించారు. రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం వంటి రచనలు మహారాజుల వైభవాన్ని, రాజప్రసాదాల ప్రణయ గాథలను వివరిస్తాయి. అలాగే, నాటకాల్లోని ప్రధాన పాత్రలు ఉన్నతమైన సంస్కృత భాషలో మాట్లాడటం వల్ల ఇవి సామాన్యులకు దూరమనే భావన కలుగుతుంది. ఆనాటి సామాజిక, సాహిత్య నిబంధనల ప్రకారం కాళిదాసు ఈ శైలిని అవలంబించాల్సి వచ్చింది.

అయినప్పటికీ, కాళిదాసు రచనలు సామాన్య ప్రజల జీవితాలను, వారి భావోద్వేగాలను ఎక్కడా విస్మరించలేదు. ఆయన తన నాటకాల్లో మహిళలు, సేవకులు, చేపలు పట్టుకునే ధీవరుడి వంటి సామాన్య పాత్రల చేత ఆనాటి ప్రజాభాష అయిన ప్రాకృతం మాట్లాడించి, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించారు. కథలు రాజులవైనా, అందులోని ప్రేమ, విరహం, కూతురిని అత్తగారింటికి సాగనంపే తండ్రి ఆవేదన వంటి మానవ సహజమైన అనుభూతులు సామాన్యునికి సైతం అర్థమయ్యేలా ఉంటాయి. కాబట్టి, కాళిదాసు సాహిత్యం పైకి ఉన్నత వర్గాలదిగా కనిపించినా, అంతర్లీనంగా అది అందరి హృదయాలను తాకే సార్వజనీనమైనదిగా నిలుస్తుందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. 

కాళిదాసు పేరుతో ఉన్న కథలు, చరిత్ర కేవలం కవిగా పేరొచ్చిన కాళిదాసుకి చెందినదే కాదనీ, ఇద్దరు ముగ్గురు ఆ పేరుతో ఉండి ఉండవచ్చుననే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మనిషి ప్రారంభ స్థితి అతడి అంతిమ గమ్యాన్ని నిర్ణయించదు. అవమానం ఆత్మపరిశీలనకు దారితీస్తే, సంకల్పం సాధనగా మారితే, సాధన ప్రతిభకు పునాది అవుతుంది. కాళిదాసు గాథలోని అంతరార్థం ఇదే.

డా. దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్, ఫోన్: 9989628049







25 అక్టోబర్, 2026

భారతీయ సాహిత్యంలో ‘‌వాల్మీకి - రామాయణం’ ,

 భారతీయ సాహిత్యంలో ‘‌వాల్మీకి - రామాయణం’


(నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 25.10.2026 సౌజన్యంతో )

భారతీయ సాహిత్య చరిత్రలో మహర్షి వాల్మీకి స్థానం అత్యంత విశిష్టమైనది. సంస్కృతంలో మొట్టమొదటి కావ్యాన్ని సృష్టించి, భారతీయ కావ్య పరంపరకు అంకురార్పణ చేసిన మహానుభావుడు. వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర, ఆయన ఆధ్యాత్మిక పరివర్తన, ఆయన రచనలు భారతీయ సాహిత్యంపై ఆయన చూపిన ప్రభావం అనన్యసామాన్యమైంది. వాల్మీకి మహర్షి పూర్వ జీవితం గురించి పురాణాలలో  పౌరాణిక గాథలలో విపులంగా ప్రస్తావించబడింది. వాల్మీకి తన పూర్వాశ్రమంలో 'రత్నాకరుడు' అనే పేరుతో పిలువబడేవారు. కొందరు పౌరాణిక కథనాల ప్రకారం ఆయన వేటగాళ్ల కుటుంబంలో పెరిగారని, జీవనం కోసం అడవి దారిలో వెళ్లే ప్రయాణికులను దోచుకునేవారని ప్రతీతి.

ఒకసారి ఆ దారిన వెళుతున్న నారద మహర్షిని రత్నాకరుడు దోచుకోవడానికి ప్రయత్నించగా, నారదుడు ఆయనలో పరివర్తన తెచ్చేందుకు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. "నీవు చేస్తున్న ఈ పాప కార్యంలో నీ భార్యాపిల్లలు భాగస్వాములు అవుతారా?" అని ప్రశ్నించగా, రత్నాకరుడు ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని అడుగుతాడు. ఎవరికీ ఆ పాపంలో భాగం తీసుకోవడం ఇష్టం లేదని తేలిన తర్వాత ఆయన కళ్లు తెరుచుకుంటాయి. పశ్చాత్తాపంతో కుమిలిపోయిన రత్నాకరుడికి నారదుడు 'రామ' నామాన్ని ఉపదేశిస్తారు. పాపపు సంస్కారాల వల్ల 'రామ' అనలేని ఆయనకు, ఆ పదాన్ని తిరగేసి 'మర-మర' అని జపించమంటారు. అలా నిరంతరం 'మర' జపిస్తూ, కాలక్రమేణా అదే 'రామ' నామంగా మారిపోతుంది.  ఆయన ఏళ్ల తరబడి కదలకుండా తపస్సు చేయడంతో శరీరంపై పుట్టలు (వల్మీకం) కమ్ముకుంటాయి. ఆ పుట్టలను బద్దలు చేసుకుని బయటకు రావడంతో ఆయనకు 'వాల్మీకి' అనే పేరు స్థిరపడింది.

  వాల్మీకి మహర్షి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు తమసా నదీ తీరంలో చోటు చేసుకుంది. ఒకరోజు ఆయన తమసా నదీ తీరంలో విహరిస్తుండగా, ఒక జంట క్రౌంచ పక్షులలో (క్రౌంచ మిధునం) మగ పక్షిని ఒక బోయవాడు బాణంతో కొట్టి చంపుతాడు. ఆ ఆడ పక్షి పడే వేదనను, రోదనను చూసి వాల్మీకి హృదయం ద్రవించిపోతుంది. ఆ కరుణ, ఆగ్రహం కలగలిసి ఆయన నోటివెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడుతుంది.

మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాః | యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్ ||

 (ఓ బోయవాడా! కామమోహితమైన క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని చంపిన నీకు ఎప్పటికీ శాశ్వత ప్రతిష్ట లభించదు గాక!) ఛందోబద్ధంగా, కరుణ రస ప్రధానంగా వెలువడిన ఈ శ్లోకమే సంస్కృత సాహిత్యానికి 'ఆది శ్లోకం' అయింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇదే ఛందస్సులో శ్రీరామచంద్రుని చరిత్రను లోకానికి అందించమని వాల్మీకిని ఆదేశిస్తాడు. అలా రామాయణ రచనకు శ్రీకారం చుట్టబడింది. త్రేతా యుగానికి చెందిన శ్రీరాముని కథ, ఒక అవతారపురుషుని కథ.

వాల్మీకి రామాయణం:

      వాల్మీకి మహర్షి రచించిన 'శ్రీమద్ రామాయణం' ప్రపంచ సాహిత్యానికే తలమానికమైన గ్రంథం.ఇది 24 వేల శ్లోకాలతో కూడుకుని, ఆరు కాండలుగా (బాల, అయోధ్యా, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలు) తరువాత ఉత్తర కాండతో కలిపి మొత్తం ఏడు కాండలుగా విభజింపబడింది. మానవ సంబంధాలు, పితృవాక్య పాలన, భ్రాతృప్రేమ, ధర్మనిష్ఠ, ఆదర్శ కుటుంబ వ్యవస్థకు రామాయణం ప్రతీకగా నిలిచింది. రావణునిపై రాముని విజయం ధర్మానికి అధర్మంపై లభించిన శాశ్వత విజయంగా నిరూపించబడింది.యోగవాసిష్టం, లఘువాసిష్టం వంటి తత్వశాస్త్ర గ్రంథాలు కూడా వాల్మీకి మహర్షి ద్వారానే ప్రవచించబడినట్లు సంస్కృత సంప్రదాయం చెబుతుంది.

1. బాలకాండలో రాముని జననం, బాల్యం, విశ్వామిత్రునితో ప్రయాణం, తాటక వధ, అహల్య కథ, సీతాస్వయంవరం, సీతారాముల వివాహం ఇందులో ప్రధాన ఘట్టాలు. రాముని వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ కాండ పునాది వేస్తుంది.

2. అయోధ్యాకాండలో దశరథుని వరప్రదానం, కైకేయి కోరికలు, రాముని వనవాసం, భరతుని సోదరభక్తి ప్రధానాంశాలు. అధికారం, వాగ్దానం, కుటుంబ బాధ్యత, త్యాగం వంటి అంశాలు ఇందులో సంఘర్షణలుగా కనిపిస్తాయి.

3. అరణ్యకాండలో అరణ్యవాసం, శూర్పణఖ ఘట్టం, మారీచుని మాయలేడి, సీతాపహరణం, జటాయువు పోరాటం ఇందులోని ముఖ్య సంఘటనలు. అరణ్యం కథలో ప్రకృతి ప్రదేశంగానే కాకుండా ప్రమాదం, అనిశ్చితి, నైతిక పరీక్షల వేదికగా నిలుస్తుంది.

4. కిష్కింధాకాండలోరామసుగ్రీవుల స్నేహం, వాలి వధ, సీతాన్వేషణ కోసం వానరసేనల పంపకం ఇందులో ప్రధాన ఘట్టాలు. స్నేహం, రాజ్యాధికారం, కూటమి, న్యాయం వంటి అంశాలను ఈ కాండ చర్చకు తెస్తుంది.

5.సుందరకాండలో హనుమంతుని సముద్ర లంఘనం, లంకలో సీతాన్వేషణ, అశోకవనంలో సీతను కలుసుకోవడం, లంకాదహనం ఇందులో ముఖ్య ఘట్టాలు. హనుమంతుని ధైర్యం, బుద్ధి, కార్యదీక్ష ఈ కాండకు ప్రత్యేక ఆకర్షణ.

6. యుద్ధకాండలో సముద్రంపై వారధి నిర్మాణం, లంకాయుద్ధం, రావణవధ, సీతను తిరిగి పొందడం, అయోధ్యకు రాముని పునరాగమనం, పట్టాభిషేకం ఈ కాండలోని ప్రధాన ఘట్టాలు.

7. ఉత్తరకాండలోసీతను అడవికి పంపడం, వాల్మీకి ఆశ్రమంలో లవకుశుల పెంపకం, వారు రామాయణాన్ని గానం చేయడం, సీత భూదేవిలోకి ప్రవేశించడం వంటి సంఘటనలు ఇందులో ఉంటాయి. రాజధర్మం, ప్రజాభిప్రాయం, స్త్రీ గౌరవం, కుటుంబ విషాదం వంటి ప్రశ్నలకు ఈ కాండ ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది.

ఈ ఏడు కాండలు రామాయణ కథను వరుస సంఘటనల సమాహారంగా మాత్రమే కాకుండా, వ్యక్తిగత జీవితం నుంచి రాజ్యపాలన వరకు విస్తరించే సామాజిక కథనంగా తీర్చిదిద్దుతాయి. అయితే, ఏడు కాండలూ ఒకే సమయంలో రూపుదిద్దుకున్నాయని నిర్థారించలేమనే పరిశోధకులు ఉన్నారు. రామాయణం పూర్తయ్యే  కాలక్రమేణా జరిగిన విస్తరణ, పాఠాంతరాల పరిశీలన చేయడం ముఖ్యం.

వాల్మీకిపై వచ్చిన రచనలు:

భారతీయ సాహిత్యంలో వాల్మీకి  కవులందరికీ ఆరాధ్య దైవం. ఆయనపైన, ఆయన రామాయణం ఆధారంగానూ అనేక గ్రంథాలు రూపుదిద్దుకున్నాయి.సంస్కృత సాహిత్యంలో మహాకవి కాళిదాసు, భవభూతి, భారవి వంటి ప్రాచీన కవులు తమ గ్రంథాలలో వాల్మీకిని 'ఆది కవి'గా స్మరించుకున్నారు. భవభూతి తన 'ఉత్తర రామచరితం' నాటకంలో వాల్మీకిని ఒక పాత్రగా తీర్చిదిద్ది, లవకుశులకు ఆశ్రయమిచ్చి విద్యాబుద్ధులు నేర్పిన గురువుగా గొప్పగా కీర్తించారు. అశ్వఘోషుడు, భరతుడు వంటి వారు వాల్మీకి రామాయణ శిల్పాన్ని తమ రచనలకు పునాదిగా చేసుకున్నారు.

వాల్మీకి జీవితం -కోర్టు వివాదాలు:

వాల్మీకి మహర్షి పూర్వాశ్రమంలో దొంగ, దారి దోపిడీదారుడనే ప్రచారానికి ఎలాంటి చారిత్రక, ప్రామాణిక ఆధారాలు లేవు. ఇలపావులూరి పాండురంగారావు గారు తమ రచనలలో స్పష్టం చేసినట్లుగా, శాస్త్రీయ దృక్పథం, రసజ్ఞత గలిన మహానుభావుడిపై ఇటువంటి కట్టుకథలు ప్రచారంలోకి రావడం ఆయనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమేనని వివరించారు. పంజాబ్, హరియానా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో (డాక్టర్ సహదేవ నేతృత్వంలో) జరిగిన పరిశోధనలు, న్యాయస్థానపు తీర్పులు కూడా వాల్మీకి మహర్షిని కించపరిచేలా లేదా దొంగగా చిత్రీకరించే ప్రచారాలు నిరాధారమైనవని స్పష్టం చేస్తున్నాయి. 

 శ్రీమద్భాగవతం (చతుర్థ స్కంధం) ప్రకారం, ప్రచేతసుల వంశంలో, క్షత్రియ కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి గురించి కొంతమంది వివరిస్తున్నారు. కానీ, బోయ జాతికి చెందిన వ్యక్తిగానే వాల్మీకి మహర్షి నేటికీ ప్రాచుర్యంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వృత్తి కావొచ్చు. భారతదేశ వ్యాప్తంగా వాల్మీకి కులం కొన్ని చోట్ల గిరిజన తెగలకు, మరికొన్ని చోట్ల షెడ్యూల్డు కులం, ఇంకొన్ని చోట్ల వెనుకబడిన తరగతులకు చెందిన సామాజిక వర్గంగా గుర్తింపు పొందారు.

నారద మహర్షి ఉపదేశంతో, తరతరాల భక్తి విశ్వాసాలతో వారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరుకున్నారు. వాల్మీకి పేరుతో మరికొందరు వ్యక్తులు (రత్నాకరుడు, అగ్నిశర్మ వంటి పేర్లతో) ఉండి ఉండవచ్చని, వారిని ఈ మహర్షిగా పొరబడటం వల్లే ఇటువంటి వదంతులు పుట్టుకొచ్చాయని పరిశోధకులు భావిస్తున్నారు. కేవలం 'శ్రీమద్ రామాయణం' మాత్రమే కాకుండా, శ్రీరాముని బాల్యంలో మానసిక అశాంతిని తొలగించడానికి వశిష్టుల ద్వారా బోధింపబడిన 'యోగవాశిష్టం', నిత్య పారాయణీయమైన 'ఆదిత్య హృదయం',  సమస్త విజ్ఞాన సర్వస్వమైన 'అక్షరలక్ష' వంటి గ్రంథాలను అందించిన మహాజ్ఞాని వాల్మీకి. రాముడిని ఒక ఆదర్శ పురుషుడిగా లోకానికి పరిచయం చేయడమే తన ధ్యేయంగా భావించిన ఆదికవి, తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు.

నారదుడు చెప్పిన ఆదర్శ మానవుని కథ:

బాలకాండ ప్రారంభంలో వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. సత్యవంతుడు, ధర్మజ్ఞుడు, ధైర్యశాలి, కృతజ్ఞుడు, ప్రజాహితాన్ని కోరేవాడు, ఆత్మనిగ్రహం కలిగినవాడు అయిన ఉత్తమ మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? అని అడిగితే నారదుడు రాముని గురించి వివరిస్తాడు. ఈ కథనంలో రాముడు ఒక వ్యక్తిగానే కాకుండా, మానవ ప్రవర్తనకు సంబంధించిన విలువలను పరిశీలించడానికి ఉపయోగపడే పాత్రగా రూపుదిద్దుకుంటాడు. ఆదర్శ మానవుని లక్షణాలను ప్రశ్నించడం ద్వారా మహాకావ్యం ప్రారంభం కావడం విశేషం.

 అహల్య కథ

విశ్వామిత్రునితో రామలక్ష్మణులు ప్రయాణిస్తున్నప్పుడు అహల్య కథ ఎదురవుతుంది. గౌతమ మహర్షి శాపం, అహల్య స్థితి, రాముని రాకతో ఆమెకు విముక్తి లభించడం ఈ కథలోని ప్రధాన అంశాలు.అహల్య కథను కేవలం శాపవిమోచన కథగా మాత్రమే కాకుండా, స్త్రీపై విధించబడిన సామాజిక నియమాలు, పాపం–శిక్ష భావనలు, విముక్తి వంటి ప్రశ్నలతో కూడా పరిశీలించవచ్చు. వివిధ రామాయణ సంప్రదాయాల్లో అహల్య కథకు భిన్నమైన రూపాలు కనిపిస్తాయి.

భరతుని పాత్ర

రాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత భరతుడు రాజ్యాన్ని స్వీకరించడానికి నిరాకరించి, రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి పాలన నిర్వహిస్తాడు.ఈ ఘట్టం సోదరప్రేమకు సంబంధించిన కథ మాత్రమే కాదు. రాజ్యాధికారం ఎవరికి చెందాలి? వ్యక్తిగత ప్రయోజనం కంటే నైతిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వగలమా? అనే ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. భరతుని పాత్ర ద్వారా వాల్మీకి అధికారం పట్ల నిగ్రహం, కుటుంబ సంబంధాల్లో నిబద్ధత, బాధ్యతాయుతమైన పాలన వంటి విలువలను కథలో భాగం చేస్తాడు.

 శబరి కథ

అరణ్యకాండలో శబరి రాముని కోసం ఎదురుచూస్తూ, తన భక్తితో ఆయనను ఆహ్వానిస్తుంది. ఈ ఘట్టం భక్తి సాహిత్యంలో విశేష ప్రాచుర్యం పొందింది. శబరి కథను సామాజిక దృష్టితో పరిశీలించినప్పుడు, రాజకుమారుడైన రామునికి అరణ్యంలో నివసించే ఒక ఆదివాసి లేదా గిరిజన స్త్రీ ఆతిథ్యం ఇవ్వడం, ఆమె భక్తికి కథలో లభించిన ప్రాధాన్యం వంటి అంశాలు కనిపిస్తాయి. అయితే, శబరి సామాజిక గుర్తింపు, ఆమె గురించి చెప్పబడే అనేక వివరాలు వివిధ రామాయణ పాఠాలు, తరువాతి భక్తి సంప్రదాయాల్లో వేర్వేరుగా రూపుదిద్దుకున్నాయని గుర్తించాలి. అలా ఆ యా పాత్రలను తీర్చిదిద్దడంలో ఎంతో వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు. 

 వాలి వధ

కిష్కింధాకాండలో రాముడు చెట్టు చాటునుంచి వాలిని బాణంతో సంహరిస్తాడు. దీనిపై వాలి రాముడిని ప్రశ్నిస్తాడు. రాముడు తన చర్యకు ధర్మపరమైన వివరణ ఇస్తాడు. ఈ సంఘటన రామాయణంలోని ముఖ్యమైన నైతిక సంఘర్షణల్లో ఒకటి. రాజధర్మం, వ్యక్తిగత న్యాయం, యుద్ధ నియమాలు, శిక్ష విధించే అధికారం వంటి అంశాలపై చర్చకు ఇది అవకాశం కల్పిస్తుంది. వాలిని సంహరించిన రాముడి చర్యను సంప్రదాయ ధర్మవాదంతో సమర్థించే వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆధునిక విమర్శనాత్మక అధ్యయనాలు ఆ చర్యలోని నైతిక సందిగ్ధతను ముందుకు తెస్తాయి. ఈ రెండు దృక్కోణాలనూ పరిశీలించడం సాహిత్య విమర్శ, పరిశోధనలకు ఎంతో అవసరం.

 సీతాపహరణం, హనుమంతుని అన్వేషణ

సీతాపహరణం కథలో కీలక మలుపు. సీతను వెతుకుతూ రాముడు వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తాడు. హనుమంతుడు లంకకు చేరి సీతను గుర్తించడం, ఆమెకు రాముని సందేశం అందించడం, తిరిగి వచ్చి సమాచారాన్ని నివేదించడం కథను యుద్ధం వైపు నడిపిస్తాయి.ఈ కథనంలో వియోగం, ఆశ, నమ్మకం, కార్యదక్షత, సమాచార ప్రసారం వంటి అంశాలు పరస్పరం కలుస్తాయి. సుందరకాండలో హనుమంతుని పాత్ర కథాగమనాన్ని ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా నిలుస్తుంది.

సీత అగ్నిప్రవేశ ఘట్టం

యుద్ధకాండలో రావణవధ తర్వాత సీత పవిత్రతకు సంబంధించిన ప్రశ్న కథలోకి వస్తుంది. సీత అగ్నిలో ప్రవేశించే ఘట్టం భారతీయ సాహిత్యంలో విస్తృతమైన చర్చలకు కారణమైంది. ఈ ఘట్టాన్ని సంప్రదాయ వ్యాఖ్యానాలు సీత పవిత్రతకు దైవికమైన సాక్ష్యంగా అర్థం చేసుకుంటాయి. స్త్రీవాద, ఆధునిక విమర్శనాత్మక దృష్టి మాత్రం స్త్రీపై విధించబడే ఆంక్షలను, పురుషాధిక్య సామాజిక నియమాలను, సమాజంలలో స్త్రీకున్న అస్తిత్వం, గౌరవాలను చర్చకు తీసుకొస్తాయి. ఇక్కడ సీతను కేవలం పరీక్షకు గురైన పాత్రగా మాత్రమే కాకుండా, తన గౌరవం గురించి స్పష్టమైన వైఖరి ప్రకటించే వ్యక్తిగా కూడా చదవవచ్చు.

లవకుశుల కథ, సీత వనవాసం

ఉత్తరకాండలో ప్రజల అపవాదుల నేపథ్యంలో రాముడు సీతను అడవికి పంపుతాడు. వాల్మీకి ఆశ్రమంలో సీత లవకుశులకు జన్మనిస్తుంది. వారు పెరిగి రామాయణాన్ని గానం చేస్తారు. రాముడు తన కుమారుల ద్వారా తన జీవితకథను తిరిగి వింటాడు.ఈ కథనంలో ఒక విశేషమైన సాహిత్య నిర్మాణం కనిపిస్తుంది. కథానాయకుడి జీవితమే అతని ముందు గానరూపంలో కథగా తిరిగి ప్రత్యక్షమవుతుంది. అదే సమయంలో సీత అనుభవించిన అన్యాయం, రాజధర్మం పేరుతో వ్యక్తిగత జీవితంపై పడిన భారం, ప్రజాభిప్రాయానికి పాలకుడు ఇచ్చే ప్రాధాన్యం వంటి అంశాలను ఈ ఘట్టం ద్వారా విమర్శనాత్మకంగా పరిశీలించడానికి వీలుంది. అయితే, ఉత్తరకాండ, ఇతర కాండలతో దాని సంబంధం గురించి పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు. 

 భారతీయ సాహిత్యంలో వాల్మీకి ప్రభావం:

వాల్మీకి రామాయణం భారతీయ సాహిత్యానికి ఒక ప్రధాన కథా మూలంగా నిలిచింది. అనేక భాషలు, మత సంప్రదాయాలు, ప్రాంతీయ సంస్కృతులు ఈ కథను తమ అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మించుకున్నాయి. పరిశోధనల్లో వందలాది రామాయణ రూపాలు గుర్తించబడ్డాయి. వాల్మీకి రామాయణం తరువాతి సంస్కృత కవిత్వం, నాటక సాహిత్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. కాళిదాసు రచించిన రఘువంశం, అభిజ్ఞానశాకుంతలం వంటి రచనల్లో రామకథకు సంబంధించిన సంప్రదాయాలు, పాత్రలతో పోల్చి పరిశీలించదగిన కావ్య నిర్మాణాలు కనిపిస్తాయి. భవభూతి రచించిన మహావీరచరితం, ఉత్తరరామచరితం రామకథను నాటకరూపంలో పునర్నిర్మించిన ముఖ్యమైన రచనలు.

భారతీయ సాహిత్య మూలస్తంభమైన వాల్మీకి రామాయణ ప్రభావం తెలుగు సాహిత్యంపై అత్యంత గాఢంగా కనిపిస్తుంది. తెలుగులో రామకథ వివిధ ప్రక్రియల్లో, అనేక రూపాల్లో విస్తృతంగా వికసించింది. గోన బుద్ధారెడ్డి రచించిన ద్విపద కావ్యమైన 'రంగనాథ రామాయణం' తెలుగు రామకథా సంప్రదాయానికి ఒక ప్రత్యేక ఒరవడిని తెచ్చింది. అలాగే, తెలుగు రామకథా సాహిత్యంలో విశేష ఖ్యాతిగాంచిన 'భాస్కర రామాయణం', సరళమైన శైలితో సామాన్య ప్రజలకు అత్యంత చేరువైన మొల్ల రచించిన 'మొల్ల రామాయణం', ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలో మైలురాయిగా నిలిచిన విశ్వనాథ సత్యనారాయణ మహాకావ్యం 'శ్రీమద్రామాయణ కల్పవృక్షం' వంటి రచనలు తెలుగు సాహిత్య భాండాగారాన్ని సుసంపన్నం చేశాయి. అయితే, ఈ విశిష్టమైన రచనలను సంస్కృత వాల్మీకి రామాయణానికి కేవలం అనువాదాలుగా మాత్రమే చూడటం సరైనదికాదు. ఆయా కవుల సృజనాత్మక దృష్టి, భక్తితత్వం, స్థానిక ప్రాంతీయ సంస్కృతి, జీవన భాషా సౌందర్యం ఈ రచనల రూపాన్ని, వైవిధ్యాన్ని పూర్తిగా ప్రభావితం చేశాయి. సంస్కృత మూలాన్ని తెలుగు నేలపైన తమదైన ప్రతిభతో ఆవిష్కరిస్తూ, తెలుగువారి సాంస్కృతిక జీవన విధానానికి అద్దం పట్టిన ఈ కావ్యాలు మన సాహిత్య చరిత్రలో అత్యున్నత స్థానాన్ని పొందాయి.

   వాల్మీకి రామాయణం కేవలం సంస్కృతానికే పరిమితం కాకుండా, భారతదేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో విభిన్న రూపాలు సంతరించుకుంది. ఆయా ప్రాంతాల సంస్కృతులు, సాహిత్య ధోరణులకు అనుగుణంగా రామకథ విస్తృతి చెందింది.తమిళంలోకంబన్ రచించిన 'ఇరామావతారం' (కంబ రామాయణం) తమిళ సాహిత్య లోకంలో అత్యున్నత కావ్యంగా నిలిచింది. అవధీ భాషలో తులసీదాసు రచించిన 'రామచరితమానస్' ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమానికి ప్రతీకగా నిలిచి, సామాన్య ప్రజల హృదయాలను కూడా గెలుచుకుంది. బెంగాలీ, ఒడియా, మరాఠీ, మలయాళం తదితర భారతీయ భాషల్లో స్థానిక జీవన విధానాన్ని ప్రతిబింబించే అనేక రామాయణ రూపాలు వెలువడ్డాయి. కేవలం హిందూ పురాణ సంప్రదాయమే కాకుండా, బౌద్ధ (దశరథ జాతకం వంటివి) జైన సంప్రదాయాల్లోనూ రామకథకు భిన్నమైన, నైతిక దృక్పథంతో కూడిన కథనాలు రూపుదిద్దుకున్నాయి. ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది’ గ్రంథం ఈ విషయాలను స్పష్టంగా తెలుపుతుంది. ఈ విభిన్న భాషా రచనల్లో పాత్రల స్వభావం, ధర్మ భావన, దైవత్వం మరియు సామాజిక విలువలు కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతూ వచ్చాయి. కొన్ని రచనలు రాముని దైవత్వాన్ని ప్రధానంగా ఆవిష్కరిస్తే, మరికొన్ని ఆయనలోని మానవ నైజం, ఆదర్శప్రాయమైన మానవ స్వభావాన్ని ముందుకు తెస్తూ విభిన్న దృక్కోణాలను  అందిస్తాయి.

రామాయణం పై వివిధ విమర్శ దృక్పథాలు:

     వాల్మీకి రామాయణాన్ని కేవలం సాంప్రదాయక భక్తి గ్రంథంగానే కాకుండా, ఆధునిక సాహిత్య విమర్శలో స్త్రీవాద కోణం నుంచి తీవ్రంగా విమర్శిస్తూ పునఃసమీక్షిస్తున్నారు. రామాయణంలోని అనేక అంశాలను తీసుకుని కవిత్వం కూడా రాస్తున్నారు. సీత, శూర్పణఖ, కైకేయి వంటి ప్రముఖ పాత్రల అనుభవాల ఆధారంగా పురుషాధిక్య సమాజంలో స్త్రీల స్వాతంత్ర్యం, వారి శరీరంపై అధికారం, సామాజిక నియంత్రణ  స్త్రీలపై విధించే కఠినమైన నైతిక ప్రమాణాలను ఈ విమర్శలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి. పురాణ గాథల్లో మహిళల అస్తిత్వాన్ని, వారి గొంతును అణచివేసే పితృస్వామ్య భావజాలాన్ని ఈ కోణం బట్టబయలు చేస్తుంది. అదేవిధంగా, దళిత,బహుజన వాద కోణం నుంచి కూడా ఈ గ్రంథంపై గట్టి విమర్శలు, కవిత్వం  వెలువడ్డాయి. రాజ్యవ్యవస్థలో వర్ణ వ్యవస్థ పాత్రను, అరణ్యవాసులు, వానరులు, రాక్షసులుగా చిత్రీకరించబడిన సమూహాల సామాజిక స్థానాన్ని, అలాగే, జ్ఞానంపై హక్కు వంటి అంశాలను ఈ విమర్శకులు విమర్శనాత్మకంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా శంబూకుని వధ వంటి ఘట్టాలను ఉదాహరిస్తూ, ధర్మం పేరుతో అమలయ్యే సామాజిక అసమానతలను, అణచివేత ధోరణులను వారు నిలదీస్తున్నారు. కాలాలు మారుతున్నకొద్దీ రామాయణం శతాబ్దాలుగా ఎన్నో రూపాల్లో పునర్వ్యాఖ్యానించబడుతూ రావడం దాని అసాధారణ సాహిత్య శక్తికి నిదర్శనం. ఒకే మూలకథ కాలాలకనుగుణంగా విభిన్న దృక్కోణాలను, కొత్త ప్రశ్నలను, సరికొత్త అర్థాలను సృష్టించగలగడమే ఈ కావ్యం యొక్క నిజమైన జీవన సౌందర్యం. కేవలం ఒక పురాణ గాథగానే కాకుండా, భారతీయ సాహిత్య, సాంస్కృతిక చైతన్యానికి మూలస్తంభంగా నిలిచిన మహర్షి వాల్మీకి స్థానం ఎప్పటికీ కాలాతీతమైనది, అత్యంత విశిష్టమైనదిగా తెలియజేస్తుంది.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.

(నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 26.10.2026 సౌజన్యంతో)





11 అక్టోబర్, 2026

విల్సన్ రావుగారి 'జాషువా పద్య శిల్పం- గ్రంథ విశిష్టత' ( నినాదం దినపత్రిక, 11.10.2026 సౌజన్యంతో)

 విల్సన్ రావు గారి 'జాషువా పద్య శిల్పం-  గ్రంథ విశిష్టత'



 
నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 11.10.2026 సౌజన్యంతో 


ఒక ఆత్మీయమైన పలకరింపు… అంతే అనుభూతిని నింపే కవిత్వం ఏకకాలంలో చూడాలంటే ప్రముఖ కవి, విమర్శకులు విల్సన్ రావు కొమ్మవరపు గారిని కలవాలి. ఆయనతో ఒకసారి పరిచయం అయితే, ఆ పరిచయం ఒక కుటుంబ సంబంధం కంటే గాఢంగా ముడిపడి కొనసాగుతుంది. అంతేకాదు, ఆయన ఇంకా ముందే పరిచయమై ఉంటే బాగుండేదని కూడా అనిపిస్తుంది. ఆయన కవిత్వంలో కొత్త వస్తువులతో పాటు, కొత్త అభివ్యక్తులుంటాయి. అక్షరాలను శిల్పంలా చెక్కే పనితనం కనిపిస్తుంది.

ఒక వ్యక్తి తన అంతరాత్మను తానే ప్రశ్నించుకుని, ఏది తప్పు, ఏది రైటో తేల్చుకోవడమే పరమార్థం అనే భావనతో వెలువరించిన "న్యాయ నిర్ణేతవూ నీవే" కావచ్చు; వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూనే, కొత్తగా ఉదయించబోయే రేపటిపై ఆశావాహ దృక్పథంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆహ్వానిస్తూ రాసిన "తెల్లారితే…" కవితా సంపుటి కావచ్చు; రైతుల కష్టాలను, మట్టి మనుషుల జీవన పోరాటాన్ని ప్రతిబింబించే "నాగలి కూడా ఆయుధమే…!" కావచ్చు; సాధారణ మానవుల జీవితాలను, సమాజంలోని రుగ్మతలను తనదైన శైలిలో ఎండగడుతూ రాసిన "దేవుడు తప్పిపోయాడు" కావచ్చు... ఆయన ప్రతి కవితా సంపుటి ఒక ఆణిముత్యం లాంటిదే. ఆయన అక్షరంలో, ప్రతి మాటలో కృతజ్ఞతా భావం పొంగిపొర్లుతూ ఉంటుంది. తన కవిత వేసిన పత్రిక గురించి కావచ్చు, తన సాహిత్యం పై మాట్లాడిన మాట గురించి కావచ్చు… ఆయన ఎంతో పారవశ్యంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు.

దాదాపు మూడు దశాబ్దాలకు పైబడిన వీరి రచనా ప్రస్థానంలో కవిత్వంతో పాటు వ్యాసాలు, పుస్తక సమీక్షలు, విమర్శనాత్మక విశ్లేషణలు వెలువడ్డాయి. 'ప్రేరణ', 34 మంది సాహితీవేత్తల ముఖాముఖులతో 'అంతరంగ వీక్షణం', 31 మంది కవుల కవితా విశ్లేషణలతో 'లోపలి మాట' వంటి వ్యాస సంపుటులు ఆయనలోని లోతైన విమర్శకుడిని మనకు పరిచయం చేస్తాయి. ఒక సృజనకారుడు విమర్శకుడిగా మారినప్పుడు, ఆ విమర్శలో కేవలం పాండిత్య ప్రదర్శనే కాకుండా, తోటి కవి పడే ప్రసవ వేదనను అర్థం చేసుకునే సహృదయత ఉంటుంది. విల్సన్ రావు గారి విమర్శలో అదే సహృదయత నిండి ఉంటుంది.



మహాకవి గుర్రం జాషువాపై ప్రత్యేకమైన ఆసక్తితో రాసిన ఎనిమిది వ్యాసాలను ఒక పుస్తకంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సంపుటి మహాకవి గుర్రం జాషువా సాహిత్య వైవిధ్యాన్ని, తాత్త్విక దృక్పథాన్ని అత్యంత లోతుగా ఆవిష్కరిస్తుంది. 'గబ్బిలం' కావ్యాన్ని ఒక విప్లవాత్మక సామాజిక మేనిఫెస్టోగా విశ్లేషిస్తూనే, సంప్రదాయ 'తేటగీతి' ఛందస్సులో ఆధునిక నవ్య కవిత్వాన్ని వెలువరించిన జాషువా శైలీ విశేషాలను ఈ గ్రంథం చర్చిస్తుంది. కవి వ్యక్తిత్వానికి, ఆయన సృజించిన సామాజిక సాహిత్యానికి మధ్య గల అవినాభావ సంబంధాన్ని స్పష్టం చేస్తూ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన జాషువా సాహిత్య తత్త్వాన్ని ఇది సమగ్రంగా పరిశీలిస్తుంది. కులవివక్షను ధిక్కరిస్తూ సమసమాజ స్థాపన కోసం తపించిన ప్రజాకవికి అక్షర రూపంలో అందిస్తున్న ఈ అరుదైన నివాళి, నేటి తరానికి జాషువా ఆలోచనలను పునఃసమీక్షించుకోవడానికి ఒక చక్కటి దిక్సూచిలా నిలుస్తుంది.

 


విల్సన్ రావు గారి కవిత్వం, ఆయన హృదయం లాగే మృదుమధురంగా ఉంటుంది. ఈ వ్యాసం కూడా పఠనాసక్తితో పరుగెట్టిస్తూనే, కొత్త ఆలోచనల తలుపులు తీస్తుందని భావిస్తున్నాను. చదువుతున్నంతసేపూ పాఠకుడిని ఆలోచింపజేస్తూ, జాషువా విశ్వమానవ దృక్పథాన్ని సరికొత్త కోణంలో పరిచయం చేసే ఒక అద్భుతమైన సాహిత్య వేదికగా ఈ పుస్తకం నిలుస్తుందని నమ్ముతున్నాను. 'గుఱ్ఱం జాషువ 'గబ్బిలం': ఒక సామాజిక మేనిఫెస్టో’ఈ గ్రంథంలోని మొదటి వ్యాసంలో పేర్కొనదగిన కొన్ని ముఖ్యాంశాలు.

 'గబ్బిలం' కావ్యం కేవలం ఒక పక్షిని రాయబారిగా పంపే కావ్యం కాదని, ఒక అట్టడుగుజాతి ఆత్మఘోషను కైలాస శిఖరాల దాకా మోసుకెళ్లిన సామాజిక చైతన్య రథమని విల్సన్ రావు  విశ్లేషించారు. ఈ కావ్యంలోని రెండవ భాగంలో గల 164 పద్యాలలో కేవలం పది కంద పద్యాలు మాత్రమే ఉండటం ఒక విశేషం.  దళిత జాతి సామాజికంగా చిన్నగా కనిపించినా అందులో అణచివేయబడిన శక్తి అపారమని చెప్పడానికి, పరిమాణంలో చిన్నదైన కందపద్యాన్ని జాషువా  ఒక 'సామాజిక అస్తిత్వ ఆయుధం'గా మలిచారు. రెండవ భాగం కంద పద్యంతో ప్రారంభమై, కందంతోనే ముగియడం జాషువా గారి ఒక శిల్ప రహస్యమని, దీని ద్వారా దళిత అస్తిత్వానికి ఒక భద్రతా వలయం లాంటి ఛందో చట్రాన్ని ఆయన నిర్మించారని రచయిత గుర్తించారు.అభాగ్యుడైన ఆ పేదవాడి బాధలు విని కైలాసంలో శివుడు కన్నీరు కార్చాడని మొదటి కంద పద్యంలోనే చెప్పడం ద్వారా, బాధకు కులం, మతం లేదని దేవుడు సైతం దానికి స్పందిస్తాడని జాషువా నిరూపించారు. ఈ పది కంద పద్యాలు విడివిడి పద్యాలు కావని, ఇవి నిరాశ నుండి ఆశ వైపుకు, ఆశ నుండి వాస్తవం వైపుకు సాగే ఒక క్రమ పరిణామం అని రచయిత సోదాహరణంగా వివరించారు.

వైకోమ్ ఉద్యమ ప్రభావంతో గుడి తలుపులు తెరుచుకోవడంపై స్పందిస్తూ, అంటరానితనం దేవుడికి కూడా సంకెళ్లు వేసిందని, దళితుల ప్రవేశంతో దేవుడికే ఏకాకితనం (దౌర్భాగ్య దశ) వదిలిందని జాషువా పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు తాము సగర్వంగా ఎగురవేసే జెండా మీద ఈ గబ్బిలాన్నే ముద్రిస్తామని చెప్పడం ద్వారా, అట్టడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని జాషువా ఆకాశమంత ఎత్తులో నిలిపారు. ఆ పేదవాడు పంపిన సందేశం వల్ల కలిగే మార్పును (ఫలితాన్ని) తాను చూస్తాడా లేదా ఆలోపే ప్రాణాలు వదులుతాడా? అన్న ఆవేదనతో, సందేహంతో జాషువా కావ్యాన్ని ముగించారు. ఈ అసంపూర్ణ ముగింపు వెనుక ఒక బలమైన హెచ్చరిక ఉందని, మార్పు తీసుకురావాల్సింది దేవుడు కాదు సమాజమే అన్న బాధ్యతను పాఠకుల మీద జాషువా వదిలేశారని విల్సన్ రావు  వివరించారు. స్వాతంత్ర్యం వస్తున్నా సామాజిక సమానత్వం రాకపోతే ఆ స్వాతంత్ర్యం నిరర్థకమని కవి ఈ కావ్యంలో హెచ్చరించిన తీరును రచయిత స్పష్టం చేశారు.

జాషువా గబ్బిలంలో వైకోమ్ సత్యాగ్రహం గురించి విల్సన్ రావు ఒక కొత్తవిషయాన్ని వెలుగులోకి తెచ్చారు. నిజానికి ‘గబ్బిలం’ కావ్యానికి ఆత్మగా చెప్పకోదగ్గ ఒక అద్భుతమైన చారిత్రక అంశాన్ని విల్సన్ రావు గుర్తించారు. "తిరువానుకూరు దేవుఁడు తెఱచెం గుడితలుపు..." అనే పద్యం ద్వారా వైకోమ్ సత్యాగ్రహం వల్ల వచ్చిన సామాజిక మార్పును జాషువా ఎలా కవితాత్మకంగా మలిచారో ఆయన విశ్లేషించారు. అంటరానితనం కేవలం మనుషులకే కాదు, దేవుడికి కూడా సంకెళ్లు వేసిందని, అణగారిన వర్గాల ప్రవేశంతో దేవుడికే పట్టిన ఏకాకితనం, 'దౌర్భాగ్య దశ' వదిలిందని జాషువా భావించిన తీరును విల్సన్ రావు  దళిత అస్తిత్వ కోణంలో ఎంతో పదునుగా ఆవిష్కరించారు. ఇది కేవలం కవితా వర్ణన కాదనీ, చారిత్రక వాస్తవానికి అద్దం పట్టే ఒక మేధోపరమైన అస్త్రమని ఆయన విశ్లేషణ ద్వారా స్పష్టమవుతుంది.

ఏమిటీ వైకోమ్ సత్యాగ్రహం?

భారతదేశ సామాజిక చరిత్రలో అంటరానితనానికి వ్యతిరేకంగా 1924–1925 మధ్య అప్పటి త్రావణకూర్ సంస్థానం (ప్రస్తుత కేరళ)లో జరిగిన చారిత్రాత్మక పోరాటమే 'వైకోమ్ సత్యాగ్రహం'. కేరళలోని ఇతర గొప్ప దేవాలయాల మాదిరిగానే వైకోమ్ శివాలయం (వైకోమ్ శ్రీ మహాదేవ ఆలయం) కూడా దశాబ్దాలుగా నిమ్న కులాలు, 'అంటరానివారిని' లోపలికి ప్రవేశించకుండా మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న రోడ్లపై నడవకుండా నిషేధించింది.  వైకోమ్ లోని మహాదేవాలయం చుట్టూ ఉన్న వీధులలో అణగారిన వర్గాలైన ఈళవులు, పులయలు నడవకూడదనే కఠినమైన కుల వివక్షను ఎదిరిస్తూ 1924 మార్చి 30న ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది కేవలం దేవాలయ ప్రవేశం కోసం జరిగిన పోరాటం కాదు, మనుషులుగా జీవించి పబ్లిక్ రోడ్ల మీద నడిచే ప్రాథమిక పౌర హక్కు కోసం జరిగిన తొలి వ్యవస్థీకృత ఉద్యమం. టి.కె. మాధవన్ చొరవతో కాంగ్రెస్ జాతీయ అజెండాలోకి చేరిన ఈ పోరాటాన్ని, స్థానిక నాయకుల అరెస్టు తర్వాత తమిళనాడు నుండి వచ్చిన పెరియార్ ఈ.వి. రామసామి ముందుండి నడిపించి "వైకోమ్ వీరన్"గా నిలిచారు. దీనికి శ్రీ నారాయణ గురు మద్దతుతో పాటు, మన్నత్ పద్మనాభన్ నేతృత్వంలో సవర్ణ హిందువులు సైతం భారీ కవాతు నిర్వహించి అండగా నిలవడం చారిత్రక మలుపు.

మహాత్మా గాంధీ జోక్యంతో ఈ ఉద్యమం ఒక కొలిక్కి వచ్చిందని చరిత్ర చెబుతుంది. 1925 మార్చిలో గాంధీజీ వైకోమ్ చేరుకుని అప్పటి    ట్రావెన్‌కోర్ మహారాణి సేతు లక్ష్మీబాయి తోనూ, ఛాందసవాదులతోనూ జరిపిన చర్చల ఫలితంగా.. 1925 నవంబర్ 23న దేవాలయం చుట్టూ ఉన్న రోడ్లను (తూర్పు వైపున ఉన్న ఒక చిన్న భాగం మినహా) అన్ని కులాల వారికీ తెరుస్తూ ఒప్పందం కుదిరింది. వైకోమ్ సత్యాగ్రహం సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయం. ఈ పోరాటం అప్పట్లో నేరుగా గుడిలోకి ప్రవేశాన్ని కల్పించకపోయినా, అది వేసిన బలమైన సామాజిక పునాది కారణంగానే పదేళ్ల తర్వాత 1936లో    ట్రావెన్‌కోర్ మహారాజు చారిత్రాత్మకమైన 'ఆలయ ప్రవేశ ప్రకటన' (Temple Entry Proclamation) చేయవలసి వచ్చింది. గుఱ్ఱం జాషువా తన ‘గబ్బిలం’ కావ్యంలో ఈ ఉద్యమాన్ని ప్రధానమైన స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని విల్సన్ రావు స్పూర్తిమంతంగా పేర్కొనడం అభినందించదగ్గ విషయం.

ఈ చారిత్రక ఘట్టానికి సంబంధించి మరింత లోతైన పరిశీలన చేసినప్పుడు, జాషువా  ఎంతటి సామాజిక, చారిత్రక స్పృహతో ఈ పద్యాన్ని రాశారో అర్థమవుతుంది. ఈ వైకోమ్ ఉద్యమ మూలాలను, నాటి సామాజిక పరిస్థితులను మరింతశాస్త్రీయంగా రాబిన్ జెఫ్రీ (Robin Jeffrey, 1976) రాసిన "Temple-Entry Movement in Travancore, 1860-1940" అనే పరిశోధనా పత్రం సవివరంగా తెలియజేస్తుంది. అలాగే, ఈ సత్యాగ్రహంలో జార్జ్ జోసెఫ్ వంటి నాయకులు పోషించిన కీలక పాత్రను అల్ఫోన్స్ జార్జ్ (Alphons George, 2014) ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రొసీడింగ్స్ (Vol. 75: 569–574) లో ప్రచురించిన "The Role of George Joseph in the Vaikom Satyagraha" అనే వ్యాసం ఒక ప్రామాణిక ఆధారంగా విశ్లేషిస్తుంది. వీటికి తోడుగా, 2018 డిసెంబర్ 24న 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో ప్రచురితమైన "God's own challenge" అనే కథనం కూడా ఈ ఉద్యమ ప్రాధాన్యతను నేటి సామాజిక కోణంలో పునఃసమీక్షించింది. ఇటువంటి బలమైన చారిత్రక ఆధారాల వెలుగులో చూసినప్పుడు, జాషువా అక్షరబద్ధం చేసిన దేవుడి 'దౌర్భాగ్య దశ' విముక్తి వెనుక ఉన్న దళిత అస్తిత్వ పోరాటం ఎంతటి మహోన్నతమైనదో, దానిని తన గ్రంథంలో విల్సన్ రావు  పట్టిచూపిన విధానం ఎంతటి సమగ్రమైనదో మనకు అవగతమవుతుంది.

రెండవది 'జాషువ 'తేటగీతి' - నవ్య కవితారీతి’ వ్యాసంలో జాషువా  'తేటగీతి' లాంటి సంప్రదాయ ఛందస్సును, ఆధునిక, అభ్యుదయ భావాల వ్యక్తీకరణకు ఎలా వాడుకున్నారో విల్సన్ రావు  విశ్లేషించారు. సమాజంలోని ద్రోహులను తేలు, పాముతో పోలుస్తూ రాసిన పద్యం, తనకు ఉద్యోగం వచ్చినప్పటి సామాజిక స్థితిని తెలిపే పద్యాలతో పాటు, ముంతాజమహల్ కావ్యంలోని "కులము లేదన్న వానినిఁ గూడవలచు" అనే పద్యం ద్వారా కళకు కులమత భేదాలు లేవని జాషువా ఆకాంక్షించిన తీరును వివరించారు. గబ్బిలంలో హిందూ సమాజంలోని చాతుర్వర్ణ వ్యవస్థను "నాల్గు పడగల హైందవ నాగరాజు"గా అభివర్ణిస్తూ జాషువా చేసిన తీవ్రమైన సామాజిక విమర్శను ఈ వ్యాసంలో అద్భుతంగా ఆవిష్కరించారు.

మూడవ వ్యాసం ‘జాషువ గురువులు’దీనిలో జాషువా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దయనీయమైన పేదరికం, కుల వివక్షలే ఆయన కవిత్వానికి ఎలా పునాదులు వేశాయో ఈ వ్యాసం తెలియజేశారు. పండుగ పూట కిందపడిన మిఠాయిని తీసుకున్న చిన్ననాటి సంఘటన నుండి, రైలు ప్రయాణంలో కవిత్వాన్ని మెచ్చుకున్న పండితుడు జాషువా కులం తెలుసుకుని "అయ్యయ్యో! వాణి అంటుపడ్డది" అని అవమానించడం, వినుకొండ సభలో జరిగిన పరాభవం వంటి బాధాకరమైన స్వానుభవాలను రచయిత ప్రస్తావించారు. ఈ అవమానాలే ఆయనకు ఎదిరించే శక్తినిచ్చాయని, తనను తాను "విశ్వనరుడ నేను" అని ప్రకటించుకునే స్థాయికి ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఈ వ్యాసంలో వివరించారు.

నాల్గవది ‘'ప్రజాకవి' జాషువ’ అనే వ్యాసంలో కవిత్వం ఎలా ఉండాలి, కవి లక్షణాలు ఎలా ఉండాలి అనే అంశాలపై జాషువా గారికి ఉన్న స్పష్టమైన దృక్పథాన్ని చర్చించారు. కవిత్వానికి కృత్రిమమైన అలంకారాలు అవసరం లేదని, కవికి 'ప్రవిమల చరిత్ర' (స్వచ్ఛమైన నడవడిక) ఉండాలని జాషువా స్పష్టం చేశారని విల్సన్ రావు  తెలిపారు. అలాగే "వీరకులంబున బుట్టితి... పౌరుష గుణ ముగ్గుబాల బడసినవాడన్" అంటూ తన ఆత్మగౌరవాన్ని ప్రకటించిన తీరును, రాజులు కేవలం రాతి విగ్రహాల్లో జీవిస్తే "సుకవి జీవించు ప్రజల నాల్కల యందు" అంటూ కవికి ఉండే శాశ్వతత్వాన్ని చాటిన పద్యాలను ఇందులో లోతుగా విశ్లేషించారు.

ఐదవ వ్యాసం ‘జాషువ సాహిత్యతత్త్వం- పరిశీలన’ జాషువా రచనల్లో సామాజిక స్పృహ, నాయకత్వ లోపాలపై ఆయన చేసిన విమర్శలను  కొత్త లోచనలను రేకెత్తించే ప్రశ్నలుగా మనముందుంచారు. పల్నాటి యుద్ధం నేపథ్యంగా "పరిపాలకులే ప్రజాళి వేధించెడు బందెపోటయి ప్రతిక్షణ హత్యలు చేయుచున్న" అని రాసిన పద్యం ద్వారా స్వార్థపూరిత రాజకీయ నాయకులు సమాజాన్ని ఎలా నాశనం చేస్తారో జాషువా దార్శనికంగా చెప్పారని రచయిత వివరించారు. హింసతో నిండిన ప్రపంచాన్ని అహింసాత్మకంగా మార్చడం ఎంత కష్టమో ప్రశ్నించిన తీరును, అలాగే తన భావాలకు కట్టుబడి ఉదారవాదిగా జీవించిన జాషువా గారి సామాజిక నాయకత్వాన్ని ఈ వ్యాసంలో విశ్లేషించారు.

ఆరో వ్యాసం‘'పిరదౌసి' పద్యశిల్పం’లో గజనీ మహమ్మదుకు, పారశీక మహాకవి పిరదౌసికి మధ్య జరిగిన సంఘర్షణను తెలిపే 'పిరదౌసి' కావ్యంలోని చతుర్ధాశ్వాసంలో జాషువా వాడిన 'కంద' పద్య శిల్పాన్నిచర్చించారు. రాజు మోసం చేయడంతో కవి అడవుల పాలు కావడం, కవిని వేటాడుతూ అశ్విక దళాలు కదలడం లాంటి నాటకీయమైన, వేగవంతమైన ఘట్టాలను వివరించడానికి జాషువా  చిన్నదైన కంద పద్యాన్ని అత్యంత సమర్థవంతంగా ఎలా వాడుకున్నారో విల్సన్ రావు  నిరూపించారు. అధికారం తాత్కాలికమని, కవి రాసిన కృతి (కావ్యం) శాశ్వతమని సామంత రాజులు పలికిన హితబోధలను ఇందులో పొందుపరిచారు.

ఏడవ వ్యాసం ‘'పిరదౌసి' కాప్యంలో 'తేటగీతి' అక్షర దుందుభి’ అదే 'పిరదౌసి' చతుర్ధాశ్వాసంలో సుదీర్ఘమైన నిట్టూర్పులను, పాలకుల హృదయహీనతను పాఠకులకు హత్తుకునేలా చెప్పడానికి జాషువా వాడిన 'తేటగీతి' పద్యాల గొప్పదనాన్ని విశ్లేషించారు. కవిని "దిక్కఱిన వంటయింటి కుందేటి"తో పోల్చిన రాజు అహంకారాన్ని, "కవులకన్నీరు తగదు" అని హెచ్చరించిన సామంతుల వివేకాన్ని ఇందులో విశ్లేషించారు. చివరికి సత్కవి దేహం స్మశానానికి వెళ్తుండగా, రాజు పంపిన ధనం కవి శూన్య గృహానికి చేరుకున్న తీరును ("నిమిషభేదంబు నడుమ సంధింపఁబడిన ఈ రహస్యంబు") విధి ఆడిన వింత నాటకంగా ఈ వ్యాసంలో కళ్లకు కట్టినట్లు వివరించారు.

ఎనిమిదవ వ్యాసం ‘పిరదౌసి' కావ్యం ఒక విషాద రసప్రవాహం’లో కరుణ, వీర రసాలను అత్యంత గంభీరంగా పలికించడానికి జాషువా  'ఉత్పలమాల' వృత్తాన్ని వాడిన తీరును విశ్లేషించారు. గుర్రాల గిట్టల ధ్వనిని తెలిపే "సైంధవ ఖురాహుతి భూమిరజంబు లెఱ్ఱడాలు" అన్న పద్యం ద్వారా సైన్యం క్రూరత్వాన్ని, మసీదుకు వెళ్లి ప్రార్థించే కవి దైన్య స్థితిని రచయిత వివరించారు. తండ్రి మరణానంతరం ధనాన్ని తెచ్చిన రాజును కవి కుమార్తె "ఓయి కృతఘ్నుడా... మనుపీన్నుఁగువై చరింపుమా!" అని శపించిన ఘట్టాన్ని విశ్లేషిస్తూ.. భౌతిక సంపదపై అక్షరానిదే అంతిమ విజయం అని చెబుతూ, నేటి కవులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని విల్సన్ రావు  ఇచ్చిన సందేశంతో ఈ వ్యాసాన్ని ముగించారు.

 

ముగింపు సమసమాజ స్థాపన కోసం తపించిన ఒక అరుదైన ప్రజాకవికి, విల్సన్ రావు     అక్షర రూపంలో అందిస్తున్న ఘనమైన నివాళి ఈ గ్రంథం. కవిత్వం కేవలం పాలకుల భోగభాగ్యాలను కీర్తించడానికి మాత్రమే కాదని, సమాజంలో చైతన్యాన్ని, పశ్చాత్తాపాన్ని రగిలించే ఆయుధమని ఈ పుస్తకం ద్వారా రచయిత స్పష్టం చేశారు. అక్షర నిష్ఠను, ఆత్మగౌరవాన్ని నేర్పే ఒక నిరంతర దిక్సూచిగా నేటి కవులందరూ చదివి తీరవలసిన ఒక అద్భుతమైన సాహిత్య వేదిక ఈ 'జాషువా పద్యశిల్పం. మొత్తం మీద చూస్తే, మహాకవి గుర్రం జాషువా గారి కవితాత్మను ఆవిష్కరించడంలో విల్సన్ రావు కొమ్మవరపు ఒక సహృదయ విమర్శకుడిగా అద్భుతమైన పాత్రను పోషించారని చెప్పవచ్చు. "మంచి కవిత్వానికి ఆర్ద్రమైన గుండె ఉండాలి, ఆ గుండె సాటి మనిషి వేదనకు కన్నీరు కార్చాలి" అన్న జాషువా గారి ప్రగాఢ విశ్వాసాన్ని విల్సన్ రావు  ఈ వ్యాసాల ద్వారా అత్యంత లోతుగా పట్టిచూపారు. అంటరానితనం, దారిద్ర్యం లాంటి అమానవీయ స్వానుభవాల నుంచి పుట్టిన జాషువా వేదనను, అలాగే అధికార గర్వాన్ని ఎదిరించిన ఒక అక్షర శిల్పి ఆత్మగౌరవాన్ని ఆయన కేవలం ఛందోపరంగానే కాకుండా తాత్త్విక, సామాజిక కోణాల్లో విశ్లేషించారు. జాషువా ప్రయోగించిన కందం, తేటగీతి, ఉత్పలమాల పద్యాల వెనుక దాగి ఉన్న కవి అంతరంగపు ఆక్రోశాన్ని, సామాజిక చైతన్యాన్ని పాఠకుల హృదయాలకు హత్తుకునేలా వివరించిన విల్సన్ రావు గారి కృషి.. జాషువా విశ్వమానవ దృక్పథాన్ని నేటి తరానికి సరికొత్త కోణంలో పరిచయం చేయడంలో నూటికి నూరుపాళ్లూ సఫలీకృతమైందని చెప్పవచ్చు.

 

- డా. దార్ల వెంకటేశ్వరరావు,

ప్రొఫెసర్, తెలుగు శాఖ,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.

15.9.2026

 

 


27 సెప్టెంబర్, 2026

డా. టి.రాధాకృష్ణమాచార్యులు గారి ' భారతీయ సాహితీ కిరణాలు '

 విభిన్న భాషల జాతీయ సమైక్య సాహిత్య సౌరభం

 

వృత్తిరీత్యా వైద్యునిగా సమాజానికి విశేషమైన సేవలందిస్తూనే, మరొక వైపు మాతృభాషపై, సాహిత్యం పట్ల ఉన్న అపారమైన అభిరుచితో సవ్యసాచిలా రెండు భిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు 





డా.టి.రాధాకృష్ణమాచార్యులు (డా.టి.ఆర్.కె. ఆచార్యులు) గారు. తీరిక లేని వైద్య వృత్తిలో ఉంటూనే అక్షర వ్యవసాయం చేయడం, కవిగా, రచయితగా, అనువాదకుడిగా నిరంతరం  ఎన్నో విలువైన సాహిత్య వ్యాసాలను పాఠకుల దరికి చేర్చడం వారి అంకితభావానికి నిదర్శనం. గతంలో మీరు ఒక వ్యాసం రాశారు. వివిధ అంశాలను కవిత్వంగా చేసే పద్ధతుల గురించి రాశారు. ఆ వ్యాసం నన్ను ఎంతగానో ఆకర్షించింది. కవిత్వ అభివ్యక్తిలో పాటించాల్సిన వివిధ సృజనాత్మక అంశాలను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గమనించినంతగా అనిపించాయి. ఆ తర్వాత ఆయన ఒక కవిత నన్ను మరింత ఆకర్షించింది. దానిలో ఆయన వాడిని పారిభాషిక పదాలు తెలుగు పదజాలాన్ని విస్తృతంగా పెంచుతాయనిపించింది. నిజానికి డాక్టర్లు,  ఇంజనీర్లు వివిధ రంగాలలో పనిచేసేవారు సాహిత్య సృజన చేయడం వల్ల కొత్త కొత్త పదజాలం తెలుగు సాహిత్యంలో ప్రవేశిస్తుంది. తెలుగు భాష విస్తృతం అవుతుంది. అలాంటి కృషి చేస్తున్న వారిలో ఈయన ఒకరనిపించింది.ఆ అక్షర తపస్సులో భాగంగానే, విశేషమైన అధ్యయనం చేసి వారు తాజాగా మన ముందుకు తీసుకువచ్చిన అపురూపమైన సాహితీ భాండాగారమే "భారతీయ సాహితీ కిరణాలు" అనబడే ఈ అద్భుత గ్రంథం. భారతీయ సాహిత్య చరిత్రలోని వైవిధ్యాన్ని, విశిష్టతను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న బృహత్తర సంకల్పంతో డా. ఆచార్యులు గారు ఈ గ్రంథాన్ని ఒక విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో సుప్రసిద్ధులైన సుమారు 105 మంది విభిన్న భారతీయ రచయితల పరిచయాలను, వారి సాహిత్య ప్రస్థానాన్ని ఒకే చోట పొందుపరచడం ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. జాతీయ స్థాయిలోని ఎందరో కవులు, నవలాకారులు, కథకుల జీవిత విశేషాలను అందిస్తూ, ఆయా భాషల సాహిత్య పరిమళాలను తెలుగు లోకానికి పంచిపెట్టిన ఈ గ్రంథం సాహిత్యాభిమానులందరికీ నిజంగా ఒక అమూల్యమైన కానుక అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఈ గ్రంథంలో డా.టి.ఆర్.కె. ఆచార్యులు గారు పరిచయం చేసిన రచయితలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలను పొందిన సాహిత్య దిగ్గజాలతో పాటు, ముఖ్యమైన కవులు, రచయితలను కూడా పరిచయం చేశారు. వారి వ్యక్తిత్వాన్ని చెబుతూనే, సాహిత్యాన్ని రుచిచూపించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాకాల యశోధారెడ్డి, వారాల ఆనంద్ మొదలైన వారి గురించి గమనిస్తే ఇటువంటి అంశాలు స్ఫష్టమవుతాయి. భారతీయ సాహిత్య రంగానికి అందించే అత్యుత్తమ పురస్కారమైన 'జ్ఞానపీఠ్' అందుకున్న అఖిలన్ (తమిళం), విష్ణు సఖారాం ఖండేకర్ (మరాఠీ), సీతాకాంత్ మహాపాత్ర (ఒరియా), ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ (మలయాళం), డి. జయకాంతన్ (తమిళం), జగద్గురు రామభద్రాచార్య (సంస్కృతం) వంటి ఉద్దండుల సాహితీ ప్రస్థానం ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. అలాగే, భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సత్కారాలు పొందిన సీతాకాంత్ మహాపాత్ర, ఎమ్.టి. వాసుదేవన్ నాయర్, కన్హయ్యలాల్ సేథియా (రాజస్థానీ), దలీప్ కౌర్ తివానా (పంజాబీ), అనిల్ బోరో (బోడో), గీతా ఉపాధ్యాయ్ (నేపాలీ), ఇస్మత్ ఛుగ్తాయ్ (ఉర్దూ) వంటి వారి జీవిత విశేషాలను రచయిత  సవివరంగా అందించారు. ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందుకున్న ఆచార్య ఎన్. గోపి (తెలుగు), చంపా శర్మ (డోగ్రీ), పుండలీక్ నాయక్ (కొంకణి), ఈస్టరిన్ కిరే (నాగా), ఉషాకిరణ్ ఖాన్ (మైథిలి), అమృతలాల్ వేగాద్ (గుజరాతీ), ఎలాంగ్ బామ్ నీలకంఠ సింగ్ (మణిపురి) వంటి సృజనకారులతో పాటు.. సరస్వతీ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, మూర్తిదేవి పురస్కారం, ఠాగూర్ శాంతి బహుమతి వంటి విశేష సత్కారాలు పొందిన ఎందరో మహనీయుల చరిత్రను ఈ గ్రంథంలో ఒకేచోట చూడవచ్చు. కేవలం ఒకట్రెండు భాషలకు పరిమితం కాకుండా, వివిధ భారతీయ భాషల్లో అగ్రగణ్యులైన పురస్కార గ్రహీతలను ఎంచుకుని వారి జీవితాలను పాఠకులకు పరిచయం చేయడం ద్వారా, ఈ పుస్తకం భారతీయ సాహిత్యం విశిష్టతను వివరించే ఒక గొప్ప గ్రంథంగా అభివర్ణించవచ్చు.

 

ఈ  గ్రంథంలో జాతీయ సమగ్రతను, దేశభక్తిని, మత సామరస్యాన్ని పెంపొందించే రచనలు చేసిన మహనీయుల ప్రస్తావన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. గాంధేయవాదంతో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని సామాజిక వివక్షతలపై కలమెత్తిన తమిళ నవలాకారుడు అఖిలన్, మత సామరస్యానికి, సామాజిక పునరుజ్జీవనానికి బాటలు వేసిన అస్సామీ రచయిత్రి నళిని ప్రవ దేకా రచనలు ఈ కోవలోకి వస్తాయి. తన జాతీయవాద కవిత్వంతో స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించి, దేశభక్తిని ప్రబోధించిన రాజస్థానీ కవి కన్హయ్యలాల్ సేథియా, అలాగే, భారతీయ సమాజంలోని విభిన్న ఆలోచనా ధోరణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించిన తమిళ అభ్యుదయ రచయిత డి. జయకాంతన్ వంటి వారి సేవలను ఈ గ్రంథంలో పేర్కొన్నారు. అనువాద రచనల ద్వారా విభిన్న ప్రాంతాల మధ్య సాంస్కృతిక అవగాహనను పెంపొందించిన నేపాలీ రచయిత్రి గీతా ఉపాధ్యాయ్, జాతీయవాద భావాలను విస్తరించిన, మానవ విలువలను తన కవిత్వంలో మేళవించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వంటి సృజనకారుల జీవిత చిత్రణలు ఈ గ్రంథంలో జాతీయ సమగ్రతకు, భావ సమైక్యతకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి.  "భిన్నత్వంలో ఏకత్వం" అన్నది కేవలం మన భారతీయ సంస్కృతికే కాదు, మన సాహిత్యానికి కూడా ప్రాణవాయువు. కాశ్మీర్ పర్వత లోయల నుండి కన్యాకుమారి తీరం వరకు, గుజరాత్ ఎడారుల నుండి ఈశాన్య రాష్ట్రాల పచ్చని అడవుల వరకు విస్తరించిన భారతీయ భావ సారూప్యత ఈ గ్రంథంలో అడుగడుగునా కనిపిస్తుంది. మన రాజ్యాంగం గుర్తించిన 22కు పైగా భారతీయ భాషలకు చెందిన ప్రసిద్ధ సాహిత్య మూర్తుల జీవిత విశేషాలు, వారి సృజనాత్మక ప్రస్థానం తెలుసుకోవాలంటే ఈ గ్రంథాన్ని చదవాలి.  అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, రాజస్థానీ, సంస్కృతం, సంతాలి, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ తదితర అనేక భాషల వైవిధ్యాన్ని, అందులోని సాహిత్య సౌరభాలను రచయిత ఈ పుస్తకంలో ఎంతో సమగ్రంగా ఆవిష్కరించారు. ఆ విధంగా, డా. ఆచార్యులు గారు ఈ గ్రంథంలో ఎందరో ఉద్దండులైన కవులు, నవలాకారులు, నాటకకర్తలను మనకు పరిచయం చేశారు. ఈ గ్రంథంలో జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన ప్రసిద్ద రచయితల సాహిత్య ప్రస్థానాన్ని డా.టి.ఆర్.కె. ఆచార్యులు ఎంతో విశ్లేషణాత్మకంగా మనకు పరిచయం చేశారు. ఆయా భాషలలో సాహిత్య శిఖరాలవంటి వారిని విస్మరించకుండా మనకు అందించిన కొన్ని విశేషాలు.

 

●       బెంగాలీ సాహిత్య వైతాళికుడిగా పేరొందిన శరత్ చంద్ర ఛటోపాధ్యాయ్ పీడిత ప్రజల బాధలను తన రచనల్లో అద్భుతంగా ప్రతిబింబించారు. 'దేవి అనిలా' అనే కలం పేరుతో సృజన చేసిన ఆయన నవలలు 'దేవదాసు', 'పరిణీత', 'శ్రీకాంత్', 'చరిత్రహీనులు' పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శరత్ రచనలు తెలుగు గుండెలను సైతం ఉర్రూతలూగించి, ఆయన తెలుగువాడే అనేంతగా పాఠకులను ప్రభావితం చేశాయి. ఆ మూలంలోని రచనలు కూడా చదవాలనిపించేలా రాయడం విశేషం.

●      భారత మాజీ ప్రధానిగా, గొప్ప వక్తగా పేరుగాంచిన  అటల్ బిహారీ వాజ్ పేయి లోని కవిత్వం జాతీయవాద భావాలతో, మానవీయ విలువలతో ముడిపడి ఉంది. "కవిత్వం ఒక యుద్ధ ప్రకటన, అది ఓటమి నాందీ ప్రస్తావన కాదు" అని చాటిన ఆయన 'ట్వంటీవన్ పోయెమ్స్', 'మేరీ ఇక్యావన్ కవితాయే' వంటి రచనల ద్వారా సామాన్యుల భావోద్వేగాలను అత్యంత కవితాత్మకంగా వ్యక్తీకరించారు. ఆయన గురించి మరింత తెలుసుకోవాలనిపించేలా రాశారు.

●      నిరంతర కవితా పిపాసి, నిత్య చైతన్యశీలి అయిన ఆచార్య ఎన్. గోపి, అనువాదాలకు అతీతంగా తెలుగు కవిత్వంలో 'నానీలు' అనే కొత్త ప్రక్రియకు సృష్టికర్తగా ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యారు. 'తంగేడు పూలు'తో మొదలైన ఆయన ప్రస్థానం 31 కవితా సంపుటాలను వెలువరించింది. ఊరు, మట్టి వాసనలను తన కవిత్వంలో సజీవంగా చిత్రిస్తూ ఆయన రాసిన 'కాలాన్ని నిద్రపోనివ్వను' గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పల్లె పదాల మీద, సామాన్యుల మమతల మీద గోపి గారికున్న అవ్యాజమైన ప్రేమను, అలాగే ఆయన యాత్రా సాహిత్య విశేషాలను ఎంతో అద్భుతంగా పరిచయం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి రచయితల సరసన మన తెలుగు కవి ఘనతను కూడా సగర్వంగా నిలపడం, మన తెలుగు అస్తిత్వాన్ని భారతీయ సాహితీ పటంలో సముచితంగా చూపించడం తెలుగు పాఠకులకు ఎంతో గర్వకారణమైన అంశం. ఆయన గురించిన పరిచయం అద్భుతంగా ఉంది.

●      రెండు నెలల వయసులోనే కంటిచూపు కోల్పోయినా, 22 భాషల్లో ధారాళంగా మాట్లాడగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి జగద్గురు రామభద్రాచార్య సంస్కృతంలో  అనేక రచనలను మనకు అందించారు. వికలాంగుల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఈ హిందూ ఆధ్యాత్మికవేత్త, 100కు పైగా పుస్తకాలు రచించి 2023లో ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారని పరిచయం చేసిన. టి.ఆర్.కె. ఆచార్యులుగారి రచన ఆ రచయిత పట్ల మనకు మతాతీతంగా గొప్ప గౌరవాన్ని పెంచుతుంది. 

●      జ్ఞానపీఠ్ పురస్కారాన్ని సాధించిన తెలుగు సాహిత్య దిగ్గజాలు మన మాతృభాషా వైభవాన్ని జాతీయ స్థాయిలో సముచితంగా నిలబెట్టారు. 'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ గారు తమ అద్భుత కావ్యమైన ' శ్రీమద్రామాయణ కల్పవృక్షం' ద్వారా భారతీయ జీవన వేదాంతాన్ని, సనాతన సంప్రదాయ వైవిధ్యాన్ని అక్షరరూపం దాల్చి తెలుగు సాహిత్యంలో తొలిసారిగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆధునిక మానవతావాదాన్ని, విశ్వజనీన దృక్పథాన్ని చాటిచెప్పే మహాకావ్యం 'విశ్వంభర' ద్వారా డా. సి. నారాయణ రెడ్డి (సినారె) గారు ఈ పురస్కారాన్ని అందుకొని  తెలుగు కీర్తిని దేశవ్యాప్తంగా మరింత ఇనుమడింపజేశారు.ఈ పరంపరలో సినిమా రంగంలోని అట్టడుగు జీవితాల వాస్తవాలను, తెరవెనుక అనుభవాలను, మానవ సంబంధాల సంక్లిష్టతలను అత్యంత సహజంగా ఆవిష్కరించిన 'పాకుడురాళ్లు' నవలకు గాను డా. రావూరి భరద్వాజ గారు జ్ఞానపీఠ్ గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రాచీన పద్య కావ్యాల నుంచి ఆధునిక వచన కవిత్వం, సామాజిక నవలల వరకు విస్తరించిన ఈ తెలుగు సాహిత్య విశేషాలు మన భాషా శక్తికి, సృజనాత్మకతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని కేవలం పరిచయం మాత్రమే కాకుండా, ఆ యా రచయిత రచనలపై చేసిన వ్యాఖ్యలు పుస్తక రచయిత డా. టి.ఆర్.కె. ఆచార్యులు గారి పరిశీలనకు నిదర్శనంగా నిలుస్తాయి.

 

ఇలా,  డా. టి.ఆర్.కె. ఆచార్యులుగారు ఒక్కొక్క రచయిత గురించి ఆకట్టుకునే శైలిలో వారిని పరిచయం చేశారు. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రముఖ పురస్కారాలలో ముఖ్యంగా జ్ఞానపీఠ్ పురస్కారం లేదా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల వంటివి ఒకరి కంటే ఎక్కువసార్లు లేదా అత్యధికంగా ఏ భాషా సాహిత్యకారులకు దక్కాయనే అంశాన్ని కూడా ఈ పుస్తక రచయితడా. టి.ఆర్.కె. ఆచార్యులుగారు చక్కగా  పేర్కొన్నారు. ఈ గ్రంథంలో మరొక ముఖ్యమైన విశేషమేమిటంటే,  ప్రముఖు రచయితల జాబితా ప్రకారం తమిళ భాషకు చెందిన సాహిత్యకారులకు ఈ జాతీయ స్థాయి పురస్కారాలు (జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ అవార్డులు) రెండుసార్లు ప్రస్తావించారు ఈ పుస్తకంలో తమిళ రచయితలలో అఖిలన్ గారు 'వెంగయిన్ మైంధాన్' నవలకు సాహిత్య అకాడమీ అవార్డును, 'చితిరప్పవై' నవలకు దేశం గర్వించదగిన అత్యున్నత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే మరో ప్రముఖ తమిళ అభ్యుదయ నవలా రచయిత డి. జయకాంతన్  'శిల నేరంగళిల్ శిల మణితరగల్' నవలకు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నారు.

 

భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతుల సమ్మేళనమైనప్పటికీ, చాలాసార్లు ఒక్కో ప్రాంతం సాహిత్యం ఆయా భాషలకే పరిమితమైపోతుంది. ఈ నేపథ్యంలో,  డా. టి.ఆర్.కె. ఆచార్యులు గారు రూపొందించిన "భారతీయ సాహితీ కిరణాలు" గ్రంథం తెలుగులో వెలువడడం అత్యంత ఆవసరంగా కనిపిస్తుంది."భిన్నత్వంలో ఏకత్వం" అనే భారతీయ ఆత్మను  ఆవిష్కరిస్తూ, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల వివిధ భాషల సాహిత్య దిగ్గజాల పరిచయాలను తెలుగు పాఠకులకు  పాఠకులలో జాతీయ భావనను, ఇతర భాషల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి ఈ పుస్తకం చక్కటి వారధిలా ఉపయోగపడుతుంది. ఈ గ్రంథంలో రచయిత అనుసరించిన రచనాశైలి అత్యంత ఆకర్షణీయంగా, సులభంగా అర్థమయ్యే రీతిలో సాగింది. ప్రతి రచయిత యొక్క వ్యక్తిగత జీవిత విశేషాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, వారి సాహిత్య ప్రస్థానం, వారు అందుకున్న పురస్కారాలను క్లిష్టత లేకుండా ఎంతో స్పష్టంగా, సంక్షిప్తంగా వివరించడంలో రచయిత తన ప్రతిభను చాటుకున్నారు. ఇది ఒక అనువాదంగా కాకుండా, తెలుగులోనే రాసిన పుస్తకమేమో అనిపిస్తుంది. దేశం నలుమూలల నుంచి వివిధ భాషా రచయితల జీవితాలను, వారి అంతరంగాన్ని ఆవిష్కరించిన తీరు చూస్తే, ఇది వైద్య వృత్తిలో ఉన్న ఒకరు రాసినట్లు కాకుండా, జీవితాంతం సాహిత్యంతోనే సహవాసం చేసిన ఒక ప్రఖ్యాత రచయిత కలం నుంచి జాలువారిన అపురూప కళాఖండంలా అనిపిస్తుంది. తాను బాగా అవగాహన చేసుకున్న విషయాలను చిన్న చిన్న వాక్యాల్లో చెప్పడం ఈ రచనాశైలిలో చెప్పుకోవాల్సిన ఒక సుగుణం. భావ వ్యక్తీకరణలో ఉన్న స్పష్టత, శైలిలో కనిపించే ప్రవాహం, భాషపై ఉన్న పట్టు అన్నీ ఒక నిపుణుడైన సృజనకారుడి స్థాయిని తలపిస్తాయి.

  ఈ పుస్తకంలో కనిపించే మరో విశేషమైన ఆకర్షణ ఏమిటంటే, ఇందులో పరిచయం చేసిన ప్రతి సాహిత్యమూర్తికి సంబంధించిన స్పష్టమైన అరుదైన ఫోటోలను (చిత్రాలను) ఆయా వ్యాసాల ప్రారంభంలో పొందుపరిచారు. కేవలం అక్షరాల ద్వారానే కాకుండా, ఆయా రచయితల చిత్రాలను కళ్ళముందుంచడం ద్వారా పాఠకులకు ఆయా సాహితీవేత్తలతో ఒక మానసిక అనుబంధం ఏర్పడుతుంది. ఈ చక్కటి లేఅవుట్ శైలి, బొమ్మలతో కూడిన అమరిక పుస్తకం యొక్క విలువను మరింత పెంచి, చదవాలనే కుతూహలాన్ని పాఠకులలో రెట్టింపు చేస్తుంది. గ్రంథాన్ని ఒక పాఠ్యాంశంగా లేదా రిఫరెన్స్ పుస్తకంగా రూపొందిస్తే, ఇది ముఖ్యంగా డిగ్రీ (B.A.), పీజీ (M.A. Telugu/Literature) స్థాయి విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. వివిధ భారతీయ భాషల సాహిత్య స్వరూపాన్ని, జాతీయ స్థాయి దిగ్గజాల జీవిత విశేషాలను, అరుదైన భాషా ఉద్యమాలను ఒకే చోట అధ్యయనం చేయడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది. కేవలం తెలుగు సాహిత్యానికే పరిమితం కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతీయ సాహిత్య ధోరణులపై, జాతీయ సమైక్యతపై విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికి, వారిలో సృజనాత్మక దృక్పథాన్ని వికసింపజేయడానికి భవిష్యత్తులో ఈ పుస్తకం ఒక పాఠ్యాంశంగా చేసుకోవడానికి కూడా సరైన ఎంపికగా నిలుస్తుంది.

ఒక రచయిత జీవిత నేపథ్యం, వారు స్పృశించిన సామాజిక ఇతివృత్తాలు, సాధించిన జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అత్యంత సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా, సరళమైన తెలుగులో పరిచయం చేయడంలో రచయిత వంద శాతం సఫలీకృతులయ్యారు. జాతీయ సమైక్యతను, భాషా సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే ఈ విలువైన గ్రంథాన్ని ప్రతి సాహిత్యాభిమాని చదివి తీరాల్సిన అద్భుత గ్రంథం. ప్రాచీన ధోరణుల నుండి ఆధునిక అస్తిత్వ వాదాల వరకు, ప్రధాన భాషల నుండి అరుదైన ప్రాంతీయ మాండలికాల వరకు దేశంలోని నలుమూలల ఉన్న సాహిత్య రత్నాలను ఒక్కచోట చేర్చిన ఈ రచయితను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే.ఒక విశ్వవిద్యాలయం లేదా ఒక విద్యా సంస్థ ( సిఐఐఎల్, మైసూర్), కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని  ట్రాన్స్లేషన్ మిషన్ వంటి సంస్థలు చేయాల్సిన పనిని ఒక వ్యక్తి ఎంతో బాధ్యతాయుతంగా చేయడం ప్రతి ఒక్కరూ హర్షించి తగిన విషయం. ఈ విషయంలో రచయిత డా. టి.ఆర్.కె. ఆచార్యులుగార్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదవాల్సిందిగా ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాను. భవిష్యత్తులో వీరి కలం నుండి మరెన్నో ఇటువంటి ప్రయోజనాత్మక గ్రంథాలు వెలువడాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

-      డా.దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్. ఫోన్: 9989628049.

తేది : 8.9.2026

 

 


20 సెప్టెంబర్, 2026

ఆరుద్ర సాహిత్యం పై ఆచార్య దార్లతో ఇంటర్వ్యూ

 

నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి'20.9.2026 సౌజన్యంతో ... 

సాహితీ లోకానికి చిరస్మరణీయమైన అంజలి — 'నూరు శరత్తులు' (ఆరుద్ర శత జయంతి సంచిక)

మహాకవి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర శత జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రముఖ రచయిత డా. హెచ్.ఎస్.వి.కె. రంగారావు గారు ('లహరి') అత్యంత ప్రతిష్టాత్మకంగా తన సంపాదకత్వం, సంకలనంలో  'నూరు శరత్తులు' (ఆరుద్ర శత జయంతి జ్ఞాపక) పేరుతో ఒక విశిష్ట ప్రత్యేక సంచికను వెలువరించారు. దీనికి సహాయ సంపాదకులుగా సి.ఎం.వి.చంద్రకుమార్ వ్యవహరించారు. ఆరుద్ర అరుదైన లేఖలు, ఆయన సాహిత్యంపై వచ్చిన విమర్శనాత్మక దృక్పథాలు, లోతైన పరిశోధనా పత్రాలు, అంతఃరంగిక ఇంటర్వ్యూలు, విశ్లేషణాత్మక వ్యాసాల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ సంచిక అక్షర లోకానికి ఒక అపురూప నిధిగా నిలుస్తుంది.

ఈ ప్రత్యేక సంచికలో  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో 'పరిశోధకుడుగా ఆరుద్ర' అనే అంశంపై 2003లో పీహెచ్.డీ. చేసి డాక్టరేట్ పట్టా అందుకున్న ఆచార్య డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారిని, ఆ ప్రత్యేక సంచిక సంపాదకులు హెచ్.ఎస్.వి.కె. రంగారావు గారు  ఇంటర్వ్యూ చేశారు. ఆరుద్ర గారి సాహిత్య దృక్పథం, ఆయన పరిశోధనా విశేషాలు, ఆయన అవలంబించిన పరిశోధనా పద్ధతులు,  సాహిత్య విమర్శలో ఆయన చేసిన అసాధారణ కృషితో పాటు అనేక అంశాలను డాక్టర్ దార్ల ఈ ఇంటర్వ్యూలో ఎంతో లోతుగా, విశ్లేషణాత్మకంగా ప్రస్తావించారు. 

ఆరుద్ర శతజయంతి ఉత్సవాల సందర్భంగా సాహిత్య ప్రియుల కోసం ఈ విశేష ఇంటర్వ్యూను 'నినాదం' సాహిత్య అనుబంధం ప్రత్యేకంగా పాఠకులకు అందిస్తోంది.

— సంపాదకులు, నినాదం


పరిశోధకుడుగా ఆరుద్ర

(ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారితో 'లహరి' ఇంటర్వ్యూ)

లహరి: నమస్తే సార్.

డా. దార్ల వెంకటేశ్వరరావు: నమస్తే.

లహరి: పరిశోధకుడుగా ఆరుద్రపై మీ పరిశోధనకు అభినందనలు. ఎంతో విలువైన సిద్ధాంత వ్యాస రచన అది.

డా. దార్ల: ఓహ్! ధన్యవాదాలండీ.

లహరి: ఆరుద్రది చాలా విస్తృతమైన కృషి, వైపుల్యమూ, వైవిధ్యమూ కూడా ఎక్కువే. తనది అభ్యుదయ దృక్పథమనీ, తాను ప్రధానంగా మార్క్సిస్టునని ఆరుద్ర ప్రకటించుకున్నారు. కవిగా సరే, ఈ దృక్పథం ఆయన పరిశోధనా రంగంలోనూ కనిపిస్తుందంటారా?

డా. దార్ల: చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందేహాలు అవసరం లేదు. అయితే అనేక ఆధునిక శాస్త్రాలతో, కళా ప్రక్రియలతో, తత్త్వచింతనలతో ఆ దృక్పథాన్ని విశాలం చేసుకున్నారు. ఆయనది ప్రజా దృక్పథం. పరిశీలనలు, పరిశోధనలు, విమర్శలూ, ఆలోచనలూ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలనే తత్త్వం ఆయనది. అందుకనే ఎంత క్లిష్టమైన విషయాన్నయినా ఆరుద్ర చాలా తేలిక ధోరణిలో, అత్యంత సరళంగా ప్రకటిస్తారు. ఆయనది మార్క్సిస్టు దృక్పథమే! సరళత్వం ఆరుద్ర సృజనాత్మకతకు, పరిశోధనను జనరంజకంగా తీర్చిదిద్దాలనే ఆయన దృక్పథానికీ నిదర్శనాలు. ఈ దృక్పథం ప్రధానంగా ఆయన 'గురజాడ గురుపీఠం', 'వేమన', 'రాముడికి సీత ఏమవుతుంది?', 'ప్రజాకళలు ప్రగతివాదులు', 'వ్యాసపీఠం', 'గుడిలో సెక్స్' రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర రచనలూ ఉన్నాయి.


లహరి: వేమన మీద ఆరుద్ర పరిశీలన ఏమిటి?

డా. దార్ల: వేమన తాను అభ్యుదయ ప్రవక్తగా మారి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించారు. వేమన జన్మతః శైవుడైనా శైవమతంలో కన్పించే దురాచారాల్ని ఖండిస్తూ ఆటవెలది పద్యాలు చెప్పాడని ఆరుద్ర నిరూపించారు. వీటిలో కొన్ని భావాలు బాల్యం నుంచే వేమన మీద తీవ్ర ప్రభావం చూపించి ఉంటాయనీ, ఆస్తికుల తత్త్వాల కన్నా నాస్తికుల దర్శనాలే ఆదర్శవంతంగా ఉన్నట్లు వేమనకు అనిపించిందన్నది ఆరుద్ర భావన. చార్వాకులతోటి, లోకాయతశాస్త్రంతోటీ ప్రగాఢ పరిచయం ఏర్పరచుకోవడం వల్ల వేమనలో భౌతికదృష్టి ఏర్పడిందంటారు ఆరుద్ర. ఈ దృష్టి కలగడం వల్లనే వేమన పరలోకాన్ని ఖండించాడనీ, ధనం మనిషి జీవన స్థితిగతులకు మూలమవుతుందని వేమన గ్రహించాడంటారు. ఈ దృక్పథం వల్లనే ధనిక, పేదల మధ్య వ్యత్యాసాల్ని గుర్తించడమే కాకుండా పేదవాడికి ధనాన్ని పంచి పెట్టడానికి కీడుతలపెట్టయినా, ముచ్చటించైనా, కపటం చేతనైనా, తెగింపు చేతనైనా ధనవంతుడి సిరిని చేజిక్కించుకుని నిరుపేదకు పంచి పెట్టడం మంచిదనే విప్లవ ధోరణి వరకూ వేమన తత్త్వ చింతన వెళ్ళిందని ఆరుద్ర భావన.

లహరి: అయితే వేమనవి వేల కొద్దీ పద్యాలు చెలామణిలో ఉన్నాయి. ఆయన ప్రస్తావించని విషయం లేదు. తను చెప్పడానికి అనువైన పద్యాలనే ఆరుద్ర వ్యాఖ్యానానికి ఎంచుకున్నారని స్పష్టం. అది కూడా ఆరుద్ర దృక్పథాన్ని తెలుపుతుంది కదా!

డా. దార్ల: వేమన ఒక పద్యానికి ఆరుద్ర వ్యాఖ్యానం ఇది- 

"బాపడనగనేమి? భక్తుడనగనేమి? 

భోగియనగనేమి సొంపులేక 

 ఎన్నిపేరులైన ఇనజుడు పనితీర్చు 

విశ్వదాభిరామ వినురవేమ". తమ కులాలకు ఎన్ని పేర్లు పెట్టుకున్నా అందరి పనీ యముడు పడతాడు. లోకమంతా ఒకే కుటుంబం, లోకులంతా ఒకే కుటుంబంలోని వ్యక్తులు. ఎవరూ పంక్తి బాహ్యులు కారు. అందరూ ఒక్క కంచాన తింటే అన్ని బాధలకూ హేతువైన కులభేదం రూపుమాసిపోతుంది. సఖ్యత ఉంటుంది. ఈ సత్యాన్ని లోకులు విశ్వసించేటట్టు తలమీద చేయివేసి ప్రమాణపూర్వకంగా చెప్పరా? అని ఆదేశం. (ఇటీవల కాలంలో సామ్యవాద సాధకులైన వామపక్షాలవారు కూడా తమ పార్టీ సభ్యులు ఒకే కమ్యూన్లో ఆరగించాలని నియమం పెట్టుకున్నారు) అని బ్రాకెట్టుల్లో కూడా తన వైయుక్తిక అభిప్రాయాన్ని వ్యాఖ్యానంలో చెప్పటం ఆరుద్ర విమర్శలో మార్క్సిస్టు దృక్పథం కన్పించడం సందేహాలకు చోటు లేకుండా చేస్తోంది.

'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'లో కూడా వేమనను చారిత్రక, సామాజిక దృక్పథాల నుండి పరిశీలించినా, తులనాత్మక పరిశీలన కన్పిస్తున్నా అవన్నీ మార్క్సిస్టు విమర్శనా దృక్పథానికి అంతర్భాగంగానే కొనసాగాయి. 

'వ్యాసపీఠం'లో ఆరుద్ర భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యానాలూ ఆయన మార్క్సిస్టు దృక్పథాన్ని స్పష్టం చేస్తాయి.

'భగవద్గీత' వర్ణ వ్యవస్థను సంరక్షించే గ్రంథమని, దీనివల్ల సమసమాజ నిర్మాణం సాధ్యం కాదనీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న భగవద్గీతను ముగ్గురు వ్యక్తులు వేర్వేరు కాలాలలో రచించారని ఆరుద్ర అభిప్రాయం. ఆ ముగ్గురు ఎవరో పేర్లు ప్రకటించలేదు. ప్రథమాచార్యుడు, ద్వితీయాచార్యుడు, తృతీయాచార్యుడు అనే అన్నారు. కొన్ని చారిత్రక కారణాల వల్ల ప్రథమాచార్యుడు ఉన్నత వర్గాల ప్రయోజనం కోసం 'గీత' రచన చేస్తే, రెండవ ఆచార్యుడు తాత్త్వికుల కోసం, మూడవ ఆచార్యుడు ఆర్తులకోసం, జిజ్ఞాసువుల కోసం ఈ గీత రచన చేసి అన్యదేవతా భక్తులను తన దైవానికి భక్తులను చేయదలిచాడని ఆరుద్ర వివరణ.

ప్రథమాచార్యుడు క్రీ.పూ. 600 కు పూర్వుడనీ, ద్వితీయాచార్యుడు క్రీ.పూ. 600-500 మధ్యకాలాలకు చెందినట్లు పేర్కొన్నారు. వర్గ, వర్ణరహిత సమాజం తృతీయాచార్యుడు క్రీ.పూ. 300-200 మధ్యకాలాలకు రావాలనే దృక్పథమే ఈ వ్యాసంలో ప్రధాన ప్రతిపాదన.

లహరి: గురజాడ మీద ఆరుద్ర దృక్పథంలోని ప్రత్యేకత ఏమిటి?

డా. దార్ల: జీవితం పట్ల, సాహిత్యం పట్ల గురజాడకున్న గంభీరమైన దృష్టి, సాహిత్య శిల్పకళా దృక్పథం, ఆయన సువిశాల మానవీయత ఎందరో ప్రతిభావంతులను ఆకర్షించింది. శెట్టి ఈశ్వరరావు, శ్రీశ్రీ, డాక్టర్ సి. నారాయణరెడ్డి - నవ్యాంధ్ర సాహిత్యానికి ఇద్దరు యుగకర్తలుగా గురజాడతో బాటు రాయప్రోలునూ భావించినా - కె.వి.ఆర్., గురజాడ మీద ఎంతో విలువైన ఆలోచనలు అందించారు. అగ్రశ్రేణి పరిశోధనలు విమర్శనాత్మకంగా, పరిశోధనగా కొనసాగించారు. గురజాడ జీవితాన్ని, రచనలనూ ఆరుద్ర చారిత్రక, తులనాత్మక విమర్శనా పద్ధతులను ఉపయోగించుకొని, గురజాడ అప్పారావు రచనల్లో కన్పించే అభ్యుదయ దృక్పథాన్ని, లక్ష్యాన్నీ నిరూపించారు.

గురజాడలో వేమన ప్రభావంతో బాటు పింగళి సూరన కళాసిద్ధాంత ప్రభావం కూడా కనిపిస్తుందంటారు ఆరుద్ర. గురజాడ చేసిన స్వతంత్ర రచనలో కళాసిద్ధాంతాల్ని, వేమన సామాజిక స్పృహనీ ఆకళింపు చేసుకున్నాడని నిక్షిప్తం చేయడంలో ఆరుద్ర పరిశీలన లోతైనది.

గురజాడ కంటే ముందుగా తెలుగు సాహిత్యంలో సామాజిక స్పృహ గల కవులుగా వేమన, వీరేశలింగం గార్లు కన్పిస్తున్నా వేమనను సంస్కరణవాదిగా, వీరేశలింగంగారిని ఆధునికాంధ్ర సాహిత్య నిర్మాతగా, గురజాడను 'ఆధునికాంధ్ర సాహిత్య జనకుడు'గా, శ్రీశ్రీని అభ్యుదయ సాహిత్య యుగకర్తగా ప్రకటించడం ఆరుద్రకు తెలుగు సాహిత్యం పట్ల గల లోతైన అవగాహనను తెలుపుతుంది.

లహరి: ఆరుద్ర తరంలో కె.వి.ఆర్., రా.రా., త్రిపురనేని మధుసూదనరావు గార్లు శక్తివంతమైన విమర్శకులుగా పేరు పొందారు. సోమసుందర్ విమర్శనాత్మక రచనలు విరివిగా చేశారు. ఆరుద్ర ప్రధానంగా పరిశోధకుడా? విమర్శకుడా? ఈ రెండింటికీ తేడా ఏమిటి?

డా. దార్ల: 'పరిశోధన' అనే పదానికి చాలా విస్తృతమైన పరిధి ఉంది. సత్యాన్వేషణ దీని ప్రధాన లక్ష్యం. పరిశోధనలో అనేక స్థాయిలు కూడా ఉన్నాయి. సేకరణ, వర్గీకరణ, విశ్లేషణ, సిద్ధాంతీకరణ, నూతన సిద్ధాంత స్థాపన, తులనాత్మక అధ్యయనం వంటి స్థాయిలన్నీ పరిశోధనలో ఉంటాయి.

దీంట్లో శాస్త్రపరిశోధన, కళాపరిశోధన రెండూ విలువైనవే ఉన్నాయి. సాహిత్య పరిశోధన కళాపరిశోధనల పరిధి కిందకే వస్తుంది. శాస్త్ర పరిశోధనలలో భౌతిక సత్యానికీ, కళా పరిశోధనలలో దార్శనిక సత్యానికీ ప్రాధాన్యత ఉంటుంది. అయితే కళా రంగంలో పరిశోధనలు చేసే వారికి కొన్ని కొన్ని ‘దృక్పథాలు' ఉంటాయి. ఆ దృక్పథాల ననుసరించి వారి పరిశోధనలలో భిన్న ఫలితాలు వస్తాయి. శాస్త్ర పరిశోధనలలో భిన్న ఫలితాలు రావు. అయితే పరిశోధనలలో పరిశోధకుడి వైయుక్తిక దృక్పథం కన్నా ఆ రచన వెలువడడానికి కారణమైన అన్ని పరిస్థితులనూ చూడగలిగే, పరిశీలించగలిగే మార్గమే ముఖ్యం.

విమర్శలో నాలుగు ప్రధానాంశాలు కనిపిస్తాయి. విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, వ్యాఖ్యానం, నిర్ణయం. దీంట్లో విమర్శకుని 'అభిరుచి' కూడా ఉంటుంది.

ఆరుద్ర పరిశోధకుడు, విమర్శకుడు రెండూ. ఆయన దృక్పథం మార్క్సిస్టు విమర్శనా దృక్పథమే అని ఆయన రచనలను పరిశీలించిన ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. అయితే నిర్మొహమాటంగా చెప్పవలసినది తత్త్వంగా, లేదా బాగా అలవాటు చేసుకున్నదిగా కనిపిస్తుంది.

లహరి: ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచనలో 'సమగ్రత' విషయం ఏమిటి? చిన్న సన్నాయి నొక్కుడు ఉంది కదా!

డా. దార్ల: (నవ్వారు). ఉంటుంది. దేనికైనా ఆ నొక్కుడు మంగళకరమే. సమగ్రత అంటే ఒక కాలంలో అవతరించిన ప్రతి రచననూ తెచ్చి కుక్కటం కాదు. సాహిత్యం ప్రారంభమైంది మొదలుకొని సంపుటాలు వెలువడినంతవరకున్న సాహిత్యం అంతటినీ అందించేదని భావించకూడదు. ఆరంభం నుండి, అన్ని సంపుటాలు వెలువడిన నాటి వరకూ సాహిత్యంలో గుర్తించదలచిన వాటిని విస్మరించకుండా రచన కొనసాగించగలగడం. ఆనాటి సాహిత్య స్పృహను, అవగాహన కల్పించడానికి ప్రయత్నించడం ఒక స్వరూపాన్ని, అవగాహనను కల్పించడంగా భావించాలి. ఆరుద్రే పదమూడవ సంపుటిని ముగిస్తూ 'స్వస్తివాచకం'లో చెప్పుకున్నట్లు సాహిత్య చరిత్రకు ముగింపు అంటూ ఉండదు. 'సమగ్రత' అంటే తెలుగు సాహిత్య ఆరంభవికాసాల్ని అవగతం చేసుకోవడానికి జరిగిన ప్రయత్నంగా గుర్తించాలి. సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర తొలిముద్రణల పీఠికలో గిడుగు సీతాపతిరావు గారు వెలుబుచ్చిన అభిప్రాయం- "ఆరుద్ర రచించిన గ్రంథాల్లో అన్ని విషయాలు సమగ్రంగా చర్చించడానికి అవకాశం కలిగింది. '... సమగ్ర శబ్దము సాపేక్షము' ఒక దృష్టిలో చూసినట్లయితే ఎంత విపులంగా రాసినా ఏదీ సమగ్రమవ్వదు. పదమూడు సంపుటాల్లో ఎంత వరకు సాధ్యం కాగలదో అంతవరకూ వీరి సాహిత్య చరిత్ర రాశారని" అన్నారు.

లహరి: కొందరు కవులను ఉటంకిస్తూ ఆరుద్ర వీరిని వదిలిపెట్టాడని ఆరుద్ర 'సమగ్రత'ను విమర్శించిన వారు పరిశోధక పరమేశ్వరుడు శ్రీ నిడదవోలు వెంకటరావు గారు.

డా. దార్ల: అది తొందరపడి చేసిన విమర్శే. అయినా నిడదవోలు వారో, మరొకరో పేర్కొన్న కవుల్ని అందర్నీ సాహిత్య చరిత్రకారుడు పేర్కొనాలనేది ఏమీ లేదు. కావ్య విలువల్ని బట్టి ఆ రచనను సాహిత్య చరిత్రలో ఉటంకించాలో వద్దో రచయిత విచక్షణ నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని మరింత విపులంగా నా థీసిస్ లో చర్చించాను.

లహరి: ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర అనుసరించిన యుగ విభజన పద్ధతి...

డా. దార్ల: అబ్బా! ఇది చాలా పెద్ద విషయం. ఎందరెందరో దిగ్దంతులు ఎన్నెన్నో వ్యాఖ్యలు చేశారు. వాటినన్నిటినీ పేర్కొని, ఒక్కొక్క ఆక్షేపణను నా సిద్ధాంత వ్యాసంలో చర్చించి ఆరుద్ర దృక్పథాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ఆరుద్ర చాలా వివేచించుకున్నాక తన సాహిత్య చరిత్రలో రాజుల, పోషకుల పేర్లను అనుసరించే యుగవిభజన చేశారు. ఆంగ్ల సాహిత్య చరిత్రలో యుగ విభజన కాలాన్ని అనుసరించి, చారిత్రక పరిస్థితుల్ని క్రమంగా అధ్యయనం చేయడానికి వీలుగా రాజుల, పోషకుల్ని అనుసరించి చేశారు. అయితే ఈ విభజనలో ఆయన ఏకసూత్రతను పాటించలేదు. ఉజ్జాయింపు ప్రణాళిక అనీ, మరికొన్ని మార్పులు చేసిన యుగవిభజన అనీ, మొదట్లో వేసుకున్న ప్రణాళిక అనీ చాలాసార్లు యుగవిభజనని మార్పు చేశారు.

చరిత్రకైనా, సాహిత్య చరిత్రకైనా కాల స్పష్టత, కాలం చాలా ముఖ్యమైంది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో కాలానుసరణమని, చారిత్రక సామాజిక అంశాల్ని మిళితం చేసి సాహిత్య చరిత్రని రచించినా కాలాన్ని స్పష్టంగా చెప్పకుండా, రాజుల పాలనా కాలాన్ని పేర్కొని, యుగవిభజన చేసి రచన కొనసాగించారు. కాల నిర్దేశంలో వివిధ రాజుల పాలనా కాలాలు కలిసిపోవడం వల్ల స్పష్టంగా గీతగీసినట్లు చెప్పకుండా తప్పించుకున్నారు. కానీ, సురవరం ప్రతాపరెడ్డి చేసిన యుగవిభజన ప్రభావం ఆరుద్రలో కన్పిస్తుంది. ఒక కాలంలోని ఒక ప్రసిద్ధ కవి పేరును బట్టి యుగవిభజన చేసినవారు ఉన్నారు. ఇది వైయుక్తిక దృష్టికోణమే. ఇలాంటి యుగ విభజన కూడా విమర్శల పాలైంది. యుగ విభజన సమంజసంగా ఉండడమనేది కూడా ఒక్కొక్క చరిత్రకారునికి ఒక్కో ప్రణాళిక ఆధారంగా ఉంటుంది.

లహరి: చాలా థాంక్స్ సార్. మీ అమూల్య సమయం వెచ్చించి ఆరుద్ర గురించి ఎన్నో విలువైన విషయాలు మాకు అందించారు. చివరగా ఒక ప్రశ్న: ఒక పరిశోధకుడుగా ఆరుద్ర చాలా విలువైన వ్యక్తి. అది ఇంకా మనం అంటే మేం గుర్తించదగినంతగా గుర్తించడం జరగలేదు. ఆ కోణంలో ఆరుద్ర గురించి మీ పరిశోధన ఎన్నో విలువైన అంశాలను పరిశీలించి, విశ్లేషించి సమన్వయ పరచింది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఇంత విలువైన సిద్ధాంత వ్యాసాన్ని మీరెందుకు విస్తృత పాఠకుల దృష్టికి తీసుకురాలేదు? సిద్ధాంత వ్యాసాన్ని మీరెందుకు ప్రచురించలేదు?

డా. దార్ల: అంటే నేను ఎందుకు ప్రచురించలేదు? అని మీరు అడుగుతున్నారు. పుస్తక ప్రచురణ అనేది చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం. అది నా చేతుల్లోని విషయం కాదు. దాని మీదకు ఎందుకో నాకు మనసు పోలేదు. కానీ, ఆరుద్ర మనకు అవసరం. ఆరుద్రకీ మనం అవసరం. సమాజం మీద ప్రభావం కలిగించగల రచయిత ఆరుద్ర.

లహరి: నమస్తే. మీ కృషికి విస్తృత పాఠకలోకాదరణ కలగాలని ఆశిస్తాను.

డా. దార్ల: థ్యాంక్యూ సర్! చూద్దాం.


18 సెప్టెంబర్, 2026

భారతీయ సాహిత్యంలో ‘శకుంతల’ (నినాదం దినపత్రిక 18.10.2026 సౌజన్యంతో)

 భారతీయ సాహిత్యంలో  ‘శకుంతల’


నినాదం దినపత్రిక, సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 18.10.2026 సౌజన్యంతో 

భారతీయ సాహిత్య సంప్రదాయంలో శకుంతల పాత్రకు విశిష్టమైన స్థానం ఉంది. వైదిక వాఙ్మయంలో కనిపించే ప్రాచీన సూచనల నుంచి మహాభారతంలోని శకుంతల కథ వరకు ఈ కథా పరంపర వివిధ రూపాల్లో పరిణామం చెందింది. మహాభారతంలో శకుంతల తన ఆత్మగౌరవాన్ని, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, తన కుమారుని హక్కులను ధైర్యంగా ప్రకటించే స్త్రీగా దర్శనమిస్తుంది. మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకంలో ఈ పాత్రకు ప్రకృతి ప్రేమ, శృంగార సౌందర్యం, విరహవేదన, మానవీయ సున్నితత్వం వంటి పార్శ్వాలను జోడించి విశిష్టమైన కళారూపాన్ని అందించాడు. ఒకే కథలోని పాత్ర భిన్న రచయితల సృజనాత్మక దృష్టిలో విభిన్న లక్షణాలను సంతరించుకోవడం భారతీయ సాహిత్య పరిణామంలోని వైవిధ్యానికి నిదర్శనం. శకుంతల కథ సంస్కృత సాహిత్యానికే పరిమితం కాకుండా తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో పునఃసృజన పొందింది. నన్నయ మహాభారతంలోని శకుంతకథ, పిల్లలమర్రి పినవీరభద్రుని ‘శృంగార శాకుంతలం’ వంటి రచనలు తెలుగు సాహిత్యంలో ఈ కథకు లభించిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి. కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆంగ్లం సహా పలు యూరోపియన్ భాషల్లోకి అనువాదమై ప్రపంచ సాహిత్య దృష్టిని ఆకర్షించింది. గోథే వంటి యూరోపియన్ సాహిత్యవేత్తల ప్రశంసలను పొందిన ఈ నాటకం భారతీయ సృజనాత్మక ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శకుంతల పాత్రను కేవలం ఒక పురాణగాథలోని స్త్రీగా.  మాత్రమే  చూడలేంము. ఒక స్త్రీ వ్యక్తిత్వం, ప్రేమ, ప్రకృతి, ధర్మం, ఆత్మగౌరవం వంటి అంశాలకు ప్రతీకగా శకుంతల పాత్రను పరిశీలించాలి. ఈ వ్యాసంలో శకుంతల పాత్రను వివిధ సాహిత్య ప్రక్రియల్లో వచ్చిన రచనలను తులనాత్మకంగా పరిశీలిస్తూ, భారతీయ సాహిత్యంలో ఆమె స్థానాన్ని, పాత్ర పరిణామాన్ని, సాంస్కృతిక ప్రభావాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

‘శకుంతల’ కథామూలాలు:

శకుంతల–దుష్యంతుల కథా మూలాలను పరిశీలించినప్పుడు, మహాభారతంలోని ఆదిపర్వంలో కనిపించే కథనానికి ముందే వైదిక వాఙ్మయంలో ఈ కథకు సంబంధించిన కొన్ని ప్రాథమిక సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా శతపథ బ్రాహ్మణంలో శకుంతల, భరతుల ప్రస్తావన, ఐతరేయ బ్రాహ్మణంలో దుష్యంతుని కుమారుడైన భరతుని రాజ్యవిజయాలు, యజ్ఞాల వివరణ ఈ కథా పరంపర ప్రాచీనతను సూచిస్తాయి. అలాగే ఋగ్వేదంలోని పురూరవుడు–ఊర్వశి సంవాదం మానవుడికి, దివ్య స్త్రీకి మధ్య ప్రేమ, వియోగం వంటి అంశాలను ప్రతిబింబిస్తుంది. ఈ వైదిక కథనాల్లోని కొన్ని అంశాలు శకుంతల–దుష్యంతుల కథతో పోలికలను కలిగి ఉండటంతో, మహాభారతానికి పూర్వం లేదా దానికి స్వతంత్రమైన ప్రాచీన సాహిత్య సంప్రదాయాల్లో ఈ కథకు సంబంధించిన బీజరూపాలు ఉండి ఉండవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ కథనాల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది.

సంస్కృత మహాభారతంలో ‘శకుంతల’:

వ్యాస మహర్షి రచించిన సంస్కృత మహాభారతంలోని ఆదిపర్వంలో  శకుంతల వృత్తాంతం ఒక ముఖ్యమైన ఉపాఖ్యానంగా కనిపిస్తుంది. ఈ ఇతిహాసంలోని శకుంతల పాత్ర కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’లోని శకుంతల పాత్రతో పోలిస్తే కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. కాళిదాసు నాటకంలో ప్రేమ, సున్నితత్వం, విరహవేదన ప్రధానంగా ప్రతిఫలిస్తే, మహాభారతంలోని శకుంతల ఆత్మవిశ్వాసం, బుద్ధికుశలత, స్వతంత్ర నిర్ణయశక్తి కలిగిన ధీర వనితగా కనిపిస్తుంది. కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చిన దుష్యంతునితో ఆమె హుందాగా సంభాషిస్తూ, తన జన్మవృత్తాంతాన్ని తానే స్వయంగా వివరిస్తుంది. తన వ్యక్తిత్వాన్ని, వంశపరమైన నేపథ్యాన్ని స్పష్టంగా వెల్లడించడం ద్వారా ఆమె తన ఆత్మగౌరవాన్ని, ఆలోచనా పరిణతిని చాటుతుంది. దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకోవాలని కోరినప్పుడు, ఆమె మానసిక సంఘర్షణకు మాత్రమే ప్రాధాన్యమివ్వకుండా, తమకు జన్మించే కుమారుడే రాజ్యానికి వారసుడు కావాలనే స్పష్టమైన షరతును విధిస్తుంది. దుష్యంతుడు ఆ షరతుకు అంగీకరించిన తరువాతే ఆమె వివాహానికి సమ్మతిస్తుంది. ఈ సంఘటన శకుంతలలోని దూరదృష్టిని, హక్కుల పట్ల అవగాహనను, తన భవిష్యత్తు పట్ల ఉన్న స్పష్టతను ప్రతిబింబిస్తుంది. ఈ విధంగా మహాభారతంలోని శకుంతల తన వ్యక్తిత్వాన్ని, తన కుమారుని హక్కును ధైర్యంగా ప్రకటించే స్త్రీగా రూపుదిద్దుకుంటే, కాళిదాసు తన నాటకంలో ఆమె పాత్రకు ప్రేమ, విరహం, భావోద్వేగ సౌందర్యం వంటి పార్శ్వాలను విశేషంగా విస్తరించాడు. ఈ రెండు రచనలలోని శకుంతల పాత్రలను పోల్చి పరిశీలించడం ద్వారా ఒకే కథ కాలానుగుణంగా, కవుల సృజనాత్మక దృష్టికి అనుగుణంగా ఎలా విభిన్న సాహిత్య రూపాలను సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు.

కణ్వాశ్రమంలోనే శకుంతల భరతుడికి జన్మనిచ్చి, అతడు బాల్యం నుంచి ఎదిగే వరకు అక్కడే పెంచుతుంది. అనంతరం తన కుమారుడి హక్కులను పొందేందుకు ఆమె స్వయంగా దుష్యంతుడి రాజ్యసభకు వెళ్తుంది. అయితే, దుష్యంతుడు ఆమెను గుర్తించనట్లు ప్రవర్తిస్తూ, ఆమె మాటలను తిరస్కరించినప్పుడు శకుంతల వెనుకడుగు వేయలేదు. సభాసదుల సమక్షంలో రాజును నిలదీస్తూ, సత్యం యొక్క గొప్పతనాన్ని, ధర్మాన్ని, పితృబాధ్యతను వివరిస్తూ ఎంతో తెలివి తేటలతో మాట్లాడుతుంది. తనను భార్యగా అంగీకరించకపోయినా, తన కుమారుడు రాజ్యానికి అర్హుడనే విషయాన్ని ఆ సభలో శక్తివంతంగా ప్రకటిస్తుంది. చివరకు ఆకాశవాణి శకుంతల చెప్పిన మాటలు సత్యమని ధ్రువీకరించడంతో దుష్యంతుడు ఆమెను, భరతుడిని స్వీకరిస్తాడు. ఈ విధంగా వ్యాస మహాభారతంలోని శకుంతల తన వ్యక్తిత్వాన్ని, సత్యనిష్ఠను, మాతృత్వంలోని బాధ్యతను, కుమారుని హక్కుల పట్ల తన నిబద్ధతను ధైర్యంగా చాటిన స్త్రీగా కనిపిస్తుంది. ఆమె పాత్ర స్త్రీ ఆత్మగౌరవానికి, ధర్మం పట్ల నిబద్ధతకు, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నన్నయ్య శకుంతల కథలో వర్ణించిన కొన్ని పద్యాలు  కంఠస్థం చేయాలనిపిస్తాయి. శకుంతల దుష్యంతుడి సభకు తన కుమారుడైన భరతుడిని తీసుకుని వస్తుంది. కానీ దుష్యంతుడు లోకాపవాదానికి భయపడి, ఆమెను ఎరుగనట్లు నటిస్తూ వాదిస్తాడు. ఆ సందర్భంలో శకుంతల దుష్యంతునికి పితృప్రేమ యొక్క గొప్పతనాన్ని, బిడ్డను దగ్గరకు తీసుకోవడంలో ఉండే ఆనందాన్ని వివరిస్తూ చెప్పిన అత్యంత ప్రసిద్ధమైన పద్యంలో స్పర్శ సుఖం గురించి నన్నయ అత్యంత సుందరంగా వర్ణించారు.

విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా

త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం

ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రగా

త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే.(ఆంధ్రమహాభారతం, ఆది,చతుర్థః,91)

ఓ మహారాజా! ఈ అనవసరమైన వాదోపవాదాలు ఎందుకు? నీ కుమారుడిని కౌగిలించుకుని, ఆ కౌగిలింత ఇచ్చే పరమ సుఖాన్ని అనుభవించు. లోకంలో ముత్యాల హారాలు, దట్టమైన కర్పూర పొడి, మంచి గంధం, చల్లని వెన్నెల... ఇవేవీ కూడా కన్నబిడ్డను కౌగిలించుకున్నప్పుడు ప్రాణులకు కలిగే మనోహరమైన ఆనందాన్ని, చల్లదనాన్ని (శాంతిని) కలిగించలేవు. బిడ్డ కౌగిలింతే అన్నింటికంటే మిన్న అని చెప్పే ఈ భావం  అనుభవించినవారికే తెలుస్తుంది.

నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్కస

త్క్రతువది మేలు; తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు; త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్‌..(ఆంధ్రమహాభారతం, ఆది,చతుర్థః,94)

దుష్యంతుడు అసత్యం పలుకుతున్నాడని గ్రహించిన శకుంతల, సత్యం యొక్క విలువను వివరిస్తూ చెప్పిన పద్యం కూడా ఎంతో బాగుంటుంది.

తడయక పుట్టిననాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ

బడితి; నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ!

నుడువులు వేయు నిం కేల? యిప్పాటినోములు తొల్లి

కడఁగి నోఁచితిని గా కేమి’ యనుచును గందె డెందమున.ఆంధ్రమహాభారతం, ఆది,చతుర్థః103)

దుష్యంత మహారాజు సభలో అందరి సమక్షంలో తాను అవమానంపాలై, భర్తచే త్యజించబడిన దుర్భర పరిస్థితులలో శకుంతల పడే అంతర్మథనాన్ని, తన దైవారాధనను, విధివంచనను తలచుకుని కుమిలిపోయే వేదనను ఈ మధ్యాక్కర పద్యం కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. ఇలాంటి పద్యాలెన్నో నన్నయ సందర్భోచితంగా వర్ణించాడు.

కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’లోని శకుంతల

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల పాత్ర సుకుమారత్వానికి, ప్రకృతి ప్రేమకు, నిష్కల్మషమైన ప్రేమానుభూతికి ప్రతీకగా రూపుదిద్దుకుంది. కణ్వ మహర్షి ఆశ్రమంలోని వృక్షాలు, లతలు, పుష్పాలు, లేళ్లతో ఆమెకు గాఢమైన ఆత్మీయ అనుబంధం ఉంటుంది. వాటిని తన కుటుంబ సభ్యుల్లా ప్రేమిస్తూ, వాటి పెరుగుదలలోనూ, సంరక్షణలోనూ ఆనందాన్ని అనుభవిస్తుంది. దుష్యంతుడిని తొలిసారి చూసినప్పుడు ఆమె మనసులో చిగురించే ప్రేమ, అనసూయ, ప్రియంవదలతో పంచుకునే భావాలు ఆమె సహజమైన యువతీ మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తాయి. మహాభారతంలోని శకుంతల తన హక్కుల పట్ల స్పష్టమైన అవగాహనతో, దృఢమైన వ్యక్తిత్వంతో కనిపిస్తే, కాళిదాసు శకుంతల ప్రేమలోని సున్నితత్వానికి, అంతరంగ సంఘర్షణలకు, భావోద్వేగ సౌందర్యానికి అధిక ప్రాధాన్యమిచ్చాడు. దుష్యంతుడితో గాంధర్వ వివాహం చేసుకున్న ఆమె, అతని ప్రేమపైనే నమ్మకంతో భవిష్యత్తును ఊహించుకుంటుంది. దుష్యంతుడు రాజధానికి తిరిగి వెళ్లిన తర్వాత, అతని జ్ఞాపకాలలో మునిగిపోయిన శకుంతల ఆశ్రమానికి వచ్చిన దుర్వాస మహర్షిని గమనించదు. ఆగ్రహించిన దుర్వాసుడు, ఆమె మనసులో ఎవరిని తలచుకుంటున్నదో ఆ వ్యక్తి ఆమెను మరచిపోతాడని శపిస్తాడు. సఖి ప్రియంవద అభ్యర్థనపై, దుష్యంతుడు ఇచ్చిన గుర్తింపు చిహ్నమైన ఉంగరాన్ని చూపినప్పుడు శాపప్రభావం తొలగుతుందని శాపవిముక్తిని అనుగ్రహిస్తాడు. ఈ శాపం, ఉంగరం నాటకంలోని వియోగానికి, అనంతర పరిణామాలకు కీలకమైన ఎంతో  మలుపులుగా నిలుస్తాయి."అభిజ్ఞాన శాకుంతలం" సంస్కృత నాటకంలో కూడా శ్లోకాలు ఎంతో రసభరితంగా ఉంటాయి. కాళిదాసు ప్రతి శ్లోకాన్ని రసభరితంగా అందించాడు.

అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహైః

రనావిద్ధం రత్నం మధు నవమనాస్వాదితరసం।

అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం

న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః॥

(కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం, ద్వితీయాంకం, శ్లోకం 10.)

శకుంతలను తొలిసారిగా చూసిన దుష్యంతుడు ఆమె అపురూప సౌందర్యానికి ముగ్ధుడై, ఎవరి స్పర్శకూ గురికాని పువ్వు, లేత చిగురు, చెక్కబడని రత్నం, ఆస్వాదించని తేనె వంటి ఉపమానాలతో ఆమె సహజమైన నిర్మలత్వాన్ని వర్ణిస్తాడు. ఈ శ్లోకం ద్వారా కాళిదాసు శకుంతల సౌందర్యాన్ని మాత్రమే కాకుండా, ఆమెను తన జీవితంలో పొందాలనే దుష్యంతుని ఆకాంక్షను, విధి వారిద్దరినీ ఎలా కలుపుతుందోననే అతని ఆలోచనను కూడా వ్యక్తం చేశాడు.

మీ శ్లోకాన్ని తెలుగులో అందంగా అనువదించారు. రాయప్రోలు వారు రాసిన ‘శకుంతల’ నాటకంలో ఈ పద్యం ఎంతో బాగుంటుంది. 

శకుంతలను తన భర్త దగ్గరకు పంపించే  సన్నివేశం సంస్కృత సాహిత్య లోకంలోనే అత్యంత కరుణరసార్ద్రమైన ఘట్టం. ఆశ్రమవాసి తపస్వి అయిన కణ్వమహర్షి తన పెంపుడు కూతురైన శకుంతలను అత్తగారింటికి సాగనంపే వేళ, ఒక తండ్రిగా ఆయన అంతరంగం పడే వేదన వర్ణనాతీతం. "సంసార బంధాలకు దూరంగా అడవిలో జీవించే తమకే పుత్రికా వియోగం ఇంతటి క్షోభను కలిగిస్తుంటే, నిత్యం లౌకిక బంధాలతో గడిపే సామాన్య గృహస్థులు తమ కూతుళ్లను అత్తగారింటికి పంపేటప్పుడు వారి హృదయాలు ఎంతగా తల్లడిల్లిపోవాలి!" అంటూ కణ్వుడి హృదయ స్పందనగా కవి ఆవిష్కరించిన ఈ శ్లోకం మానవ సంబంధాలలోని సున్నితమైన మమకారాన్ని విశ్వజనీన సత్యంగా చాటుతుంది.

‘’యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా

కంఠః స్తంభితబాష్పవృత్తికలుషశ్చింతాజడం దర్శనమ్।

వైక్లవ్యం మమ తావదీదృశమిదం స్నేహాదరణ్యౌకసః

పీడ్యంతే గృహిణః కథం న తనయావిశ్లేషదుఃఖైర్నవైః॥’’

ఈ శ్లోకం కణ్వ మహర్షి హృదయంలోని తండ్రి ప్రేమను, కుమార్తెను సాగనంపే సందర్భంలోని భావోద్వేగాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.  ఈ శ్లోకాన్ని కూడా కందుకూరి వీరేశలింగం రాయప్రోలు సుబ్బారావు గార్లు అద్భుతంగా పద్యాలుగా ఆవిష్కరించారు. 

దుష్యంతుడి రాజసభలో శకుంతల పాత్ర కరుణరసాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్తుంది. శాపప్రభావం వల్ల తనను గుర్తించలేకపోతున్న దుష్యంతుడు ఆమె మాటలను అంగీకరించనప్పుడు, శకుంతల తీవ్ర మానసిక వేదనకు గురవుతుంది. మహాభారతంలోని శకుంతల మాదిరిగా రాజును ధర్మం పేరుతో సుదీర్ఘంగా నిలదీయకపోయినా, తన ప్రేమలోని నిజాయితీని, తన మాటల్లోని సత్యాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన దగ్గర ఉన్న గుర్తింపు చిహ్నమైన రాజముద్రికను చూపించబోయే సమయంలో అది శచీతీర్థంలో జారిపోయిందని తెలుసుకొని దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. దుష్యంతుని నిరాకరణ ఆమె హృదయాన్ని గాయపరుస్తుంది. ఆమె కన్నీరు, ఆవేదన, నిస్సహాయత ప్రేక్షకులలో కరుణరసాన్ని కలిగిస్తాయి. 

సభలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న శకుంతలను రక్షించడానికి ఆకాశం నుండి ఒక దివ్యమైన అదృశ్యశక్తి (తేజస్సు) రూపంలో ఆమె తల్లి అయిన మేనక వస్తుంది. ఆ దివ్యశక్తి శకుంతలను దుష్యంతుడి సభ నుండి ఆకాశ మార్గంలో తీసుకెళ్తుంది. అక్కడి నుండి మేనక శకుంతలను కశ్యప (మారీచ) మహర్షి ఆశ్రమానికి చేరుస్తుంది. అక్కడే శకుంతల తన కుమారుడైన భరతుడికి (సర్వదమనుడు) జన్మనిచ్చి, అతడిని పెంచుతుంది. కాలక్రమేణా రాజుకు ఉంగరం దొరికి శాపవిమోచనం జరిగాక, వేట నిమిత్తం వచ్చిన దుష్యంతుడు కశ్యప ఆశ్రమంలో కొడుకు భరతుడితో కలిసి ఉన్న శకుంతలను తిరిగి కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ విధంగా కాళిదాసు శకుంతలను కేవలం అమాయక ప్రేమికురాలిగా మాత్రమే కాకుండా, విధి, శాపం, వియోగం వంటి పరిణామాల మధ్య తన ప్రేమలోని నిజాయితీని మోసుకెళ్లే సున్నితమైన మానవీయ వ్యక్తిత్వంగా చిత్రించాడు. అభిజ్ఞాన శాకుంతలంలోని ఈ పాత్ర చిత్రణ భారతీయ నాటక సాహిత్యంలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించింది.

హంసపది అనే అంతఃపుర కాంత పాడిన ఒక విరహ గీతాన్ని విన్న తర్వాత, దుష్యంతుడు తన మనసులో కలిగిన తెలియని వ్యాకులతను వ్యక్తపరిచే సందర్భంలో కాళిదాసు వర్ణించిన ఒక శ్లోకం సాహితీవేత్తలను ఎంతగానో ఆకర్షించింది. కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుని, ఆమెను మరచిపోయి హస్తినాపురానికి తిరిగి వస్తాడు దుష్యంతుడు. ఒకరోజు అంతఃపురంలో హంసపది అనే రాణి పాడిన పాట విన్న రాజుకు, తానేదో కోల్పోయాననే భావన కలుగుతుంది. తాను ప్రస్తుతానికి సంతోషంగానే ఉన్నా, మనసు ఎందుకు ఇంతలా తహతహలాడుతోందా అని ఆశ్చర్యపోతూ, మానవ మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ దుష్యంతుడు ఈ శ్లోకాన్ని చెబుతాడు.

‘’రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన-

ప్యుత్సుకీభవతి యత్సుఖితోऽపి జంతుః |

తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం

భావస్థిరాణి జననాంతరసౌహృదాని ||’’

మనం ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో కూడా, ఏదైనా అందమైన వస్తువును చూసినా లేదా మంచి సంగీతం విన్నా మనసులో ఏదో తెలియని ఒక వెలితి లేదా బాధ కలుగుతుంది. దానికి కారణం మన అంతరాత్మలో దాగివున్న పూర్వజన్మల జ్ఞాపకాలే అని కాళిదాసు ఈ శ్లోకం ద్వారా వివరించాడు.

"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా

తత్రాపిచ చతుర్ధోంకః తత్ర శ్లోక చతుష్టయమ్" అని ఈ నాటకాన్ని విమర్శకులు  ప్రశంసిస్తారు. కావ్యాలన్నింటిలోకి నాటకం ఎంతో రమ్యమైనది (సుందరమైనది). ఆ నాటకాలన్నింటిలోనూ 'అభిజ్ఞాన శాకుంతల నాటకం' అత్యంత శ్రేష్ఠమైనది. ఆ నాటకంలో కూడా నాల్గవ అంకం మరీ విశిష్టమైనది. ఆ నాల్గవ అంకంలో ఉన్న నాలుగు శ్లోకాలు అన్నింటికన్నా అత్యుత్తమమైనవిగా విమర్శకులు భావిస్తారు.

పిల్లలమర్రి పిన వీరభద్రుని ‘శకుంతల’

పిల్లలమర్రి పినవీరభద్రుడు రచించిన శృంగార శాకుంతలం నాలుగు ఆశ్వాసాల తెలుగు ప్రబంధ కావ్యం. శకుంతల–దుష్యంతుల ప్రణయగాథ ఇతివృత్తంగా సాగే ఈ కావ్యానికి మహాభారతంలోని శకుంతలోపాఖ్యానం ప్రధాన ఆధారం కాగా, కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’లోని కొన్ని కథనాంశాలు, నాటకీయ పద్ధతులు కూడా దీనిలో చోటుచేసుకున్నాయి. వేటకు వెళ్లిన దుష్యంతుడు కణ్వాశ్రమంలో శకుంతలను చూసి ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అనంతరం ఆమెకు రాజముద్రికను గుర్తుగా ఇచ్చి రాజధానికి తిరిగి వెళ్తాడు. దుష్యంతుని విరహంలో మునిగిన శకుంతల ఆశ్రమానికి వచ్చిన దుర్వాస మహర్షిని గమనించకపోవడంతో ఆయన శాపానికి గురవుతుంది. దుష్యంతుని వద్దకు వెళ్లే ప్రయాణంలో శచీతీర్థం వద్ద రాజముద్రిక పోవడంతో, శాపప్రభావానికి లోనైన దుష్యంతుడు ఆమెను గుర్తించలేక తిరస్కరిస్తాడు. తరువాత ముద్రిక రాజుకు చేరడంతో పూర్వస్మృతి కలుగుతుంది. కశ్యప మహర్షి ఆశ్రమంలో భరతుడితో ఉన్న శకుంతలను దుష్యంతుడు తిరిగి కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.ఈ కావ్య విశిష్టత ఇతివృత్త స్వీకరణలోనే కాక, దానిని తెలుగు ప్రబంధ సంప్రదాయానికి అనుగుణంగా పునఃసృజించడంలోనూ కనిపిస్తుంది. పినవీరభద్రుడు శృంగారరసానికి ప్రాధాన్యమిస్తూ ప్రకృతి సౌందర్యం, నాయికానాయకుల ప్రేమభావాలు, విరహవేదన, ఆశ్రమ జీవన చిత్రణలను పద్య సౌందర్యంతో విస్తరించాడు. శకుంతల దుష్యంతునిచే తిరస్కరించబడే ఘట్టంలో కరుణరసాన్ని ప్రభావవంతంగా ఆవిష్కరించాడు. మహాభారత ఇతివృత్తం, కాళిదాసు నాటకంలోని కొన్ని అంశాలు, కవి స్వీయ కల్పనాశక్తి సమన్వయంతో ఈ రచన ప్రత్యేకతను సంతరించుకుంది. శబ్దచమత్కారం, భావగాంభీర్యం, వర్ణనా వైచిత్రి పినవీరభద్రుని కవిత్వానికి విశిష్టతను చేకూర్చాయి. 

ఆంధ్ర మహాభారతంలో తనను గుర్తించకుండగా తన కొడుకుని కూడా పట్టించుకోకుండా ఉన్న దుష్యంత మహారాజుకి తన కొడుకుని ఆలంగనం చేసుకోమనే సందర్భంలో అద్భుతమైన పద్యం చెప్పాడు నన్నయ. దాన్ని పిల్లలమర్రి పినవీరభద్రుడు  ఎంతో ఆస్వాదించాడు. ఆపద్యాన్ని తన కావ్యంలో పెట్టుకోవాలనుకున్నాడు. యధాతథంగా పెడితే బాగుండనుకున్నాడేమో  కొన్ని మార్పులు చేసుకున్నాడు. దుష్యంతుడు తన భార్యగా శకుంతలను,  కుమారుడిగా సర్వదమనుడినీ  అంగీకరించి దగ్గరకు తీసుకునే సందర్భంలో ఈ పద్యాన్ని ఉపయోగించుకున్నాడు. 

సీ.పచ్చందనముకంటెఁ జందనంబునఁ గల 

వంబుచేసిన కప్పురంబుకం టెఁ,

బుప్పొడికంటెఁ, బుప్పొడిలోనఁ బొరలించి 

వెలచిన చెంగల్వ విరులకంటే, 

హిమజలంబులకంటె, హిమబలంబుల నాన 

వైచిన బిసపల్లవములకంటె

నిండువెన్నెలకంటె నిండువెన్నెల

చేతఁ బరనైన చంద్రబింబంబుకంటె

నెరయఁగూర్చిన; వీనియన్నిటినికంటె 

నిసుమడియు ముమ్మడియునైన మనుజవిభుని

యుల్లమెల్లను మిగులఁగఁ జల్లఁ జేసె

నందనాలింగమునఁ జెన్నొంద సుఖము ( పిల్లలమర్రి పిన వీరభద్రుడు, శృంగార శాకుంతలం, చతుర్థాశ్వాసం, పద్యం:146).

పచ్చని చందనం కంటే, చందనంలో కలిపిన కర్పూరం కంటే, పుప్పొడి కంటే, పుప్పొడిలో పొర్లి వికసించిన చెంగల్వ పుష్పాల కంటే, హిమజలాల కంటే, మంచుతో చల్లబడిన తామర చిగుళ్ల కంటే, నిండైన వెన్నెల కంటే, ఆ వెన్నెలలో మరింత శోభించే చంద్రబింబం కంటే కూడా కుమారుని ఆలింగనం కలిగించే సుఖం మూడింతలు అధికమైనదని కవి వర్ణిస్తున్నాడు.ప్రకృతిలోని సుగంధాలు, పుష్పాల సౌందర్యం, చల్లని జలాలు, వెన్నెల, చంద్రబింబం వంటి ఆహ్లాదకరమైన అనుభూతులన్నింటినీ మించినది కుమారుని ఆలింగనం. ఆ ఆలింగనం తల్లిదండ్రుల హృదయానికి అపారమైన ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని, అంతులేని మానసిక ప్రశాంతతను అందిస్తుంది. లోకంలోని సుఖాలన్నింటికంటే బిడ్డను గుండెలకు హత్తుకోవడంలో కలిగే ఆనందం గొప్పదనే మాతృపితృ వాత్సల్యాన్ని ఈ పద్యం చక్కగా వ్యక్తీకరిస్తుంది.

నన్నయ ప్రతిపాదించిన ఈ వాత్సల్యభావాన్నే మరింత విస్తృతమైన వర్ణనతో, సమృద్ధమైన ప్రకృతి ప్రతీకలతో ఆవిష్కరించాడు. నన్నయ పద్యంలో ముత్యాలహారం, కర్పూరం, చందనం, చంద్రకాంతి వంటి వస్తువులు ప్రధానంగా కనిపిస్తే, పినవీరభద్రుని పద్యంలో చందనం, కర్పూరం, పుప్పొడి, చెంగల్వ పుష్పాలు, హిమజలాలు, తామర చిగుళ్లు, నిండువెన్నెల, చంద్రబింబం వంటి అనేక ఉపమానాలు వరుసగా విస్తరిస్తాయి. అంతేకాక, వీటన్నింటి కంటే కుమారుని ఆలింగనం కలిగించే సుఖం ముమ్మడిగా అధికమని చెప్పడం ద్వారా భావానికి మరింత తీవ్రతను, వర్ణనకు మరింత సౌందర్యాన్ని చేకూర్చాడు. ఈ రెండు పద్యాల్లోనూ ప్రకృతిలోని శీతలమైన వస్తువులన్నింటినీ అధిగమించే మానవీయ అనుభూతిగా పుత్రవాత్సల్యం నిలుస్తుంది. నన్నయ పద్యంలో భావసాంద్రత ప్రధానమైతే, పినవీరభద్రుని పద్యంలో ఆ భావాన్ని విస్తరించి, ఉపమాన పరంపర ద్వారా శృంగార–వాత్సల్య సౌందర్యాన్ని మరింత ప్రభావవంతంగా మలచడం ప్రత్యేకత.ఈ విధంగా శృంగార శాకుంతలం తెలుగు ప్రబంధ సాహిత్యంలో ప్రాముఖ్యమైన రచనగా నిలిచిపోయింది.

హిందీ సాహిత్యంలో ‘శకుంతల’

హిందీ సాహిత్యంలో శకుంతల కథకు మరియు దాని అనువాదాలకు విశేషమైన స్థానం ఉంది. సంస్కృతంలో కాళిదాసు రచించిన "అభిజ్ఞాన శాకుంతలం" నాటకాన్ని హిందీలోకి అనువదించి, ఆధునిక హిందీ గద్య వికాసానికి పునాది వేసిన ఘనత రాజా లక్ష్మణ్ సింగ్ (1862) కే దక్కుతుంది. ఆయన సరళమైన, స్పష్టమైన 'ఖడీ బోలీ' (ఆధునిక హిందీ) లో చేసిన "శకుంతలా నాటక్" అనువాదం హిందీ సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆధునిక యుగ ప్రసిద్ధ కవి మైథిలీశరణ్ గుప్త్ కూడా "శకుంతల" పేరుతో ఒక విశిష్టమైన కావ్యాన్ని రచించారు. హిందీ సాహిత్యకారులు శకుంతల పాత్రలోని పతిభక్తిని, ఆత్మగౌరవాన్ని మరియు శృంగార-కరుణ రసాల మేళవింపును ఎంతో ఉదాత్తంగా కీర్తించారు.హిందీ నాటక రంగంలో మరియు చలనచిత్ర జగత్తులోనూ ఈ కథ అత్యంత ప్రజాదరణ పొందింది. భారతీయ సినిమా పితామహుడు వి. శాంతారాం 1943లో తెరకెక్కించిన "శకుంతల" హిందీ చలనచిత్రం వాణిజ్యపరంగా, కళాత్మకంగా పెద్ద విజయం సాధించి, ఉత్తర భారతదేశంలో ఈ కథను సామాన్యులకు మరింత చేరువ చేసింది. హిందీ సంస్కృతిలో శకుంతల-దుష్యంతుల పుత్రుడైన 'భరతుడి' (సర్వదమన్) పేరు మీదుగానే మన దేశానికి 'భారతదేశం' (భారతవర్ష్) అనే పేరు వచ్చిందనే చారిత్రక నమ్మకం బలంగా ఉండటం వల్ల, ఈ కథకు హిందీ వాఙ్మయంలో కేవలం సాహిత్యపరంగానే కాక, జాతీయ సాంస్కృతిక ప్రతీకగానూ అత్యున్నత గౌరవం లభించింది.

కందుకూరి వీరేశలింగం ‘శకుంతల’

ఆధునిక ఆంధ్ర వైతాళికుడు కందుకూరి వీరేశలింగం కాళిదాసు సంస్కృత నాటకాన్ని "అభిజ్ఞాన శాకుంతలము"గా తెలుగులోకి అనువదించారు. తెలుగు సాహిత్య చరిత్రలో రంగస్థల ప్రదర్శనకు అనుగుణంగా వచ్చిన తొలి ప్రామాణిక నాటకానువాదంగా దీనికి విశేషమైన గుర్తింపు ఉంది. మూల గ్రంథంలోని నాటకీయతను దెబ్బతీయకుండా, సాధారణ పాఠకులకు సైతం సులభంగా అర్థమయ్యేలా ఆయన ఈ నాటకాన్ని మలిచారు. కరుణ, శృంగార రసాల మేళవింపుతో సాగిన ఈ అనువాదం ఆంధ్రదేశమంతటా వందలాది ప్రదర్శనలు పొంది తెలుగు నాటక వాఙ్మయంలో ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచిపోయింది.

‘’దుష్యంతుడు లౌకిక ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. శకుంతల ఆత్మ ధర్మానికి ప్రతీకగా నిలబడుతుంది. అతడు ఒక అవస్థలో చిక్కుకొన్న వ్యక్తి. స్వీయధర్మాన్ని రక్షించుకోటానికి యత్నిస్తాడు. ఆమె గార్హస్త్య వ్యవస్థా ధర్మాన్ని పరిరక్షించుకోటానికి ప్రయత్నిస్తుంది. వ్యక్తిధర్మం లోకాపవాద భీతితో వ్యవస్థాధర్మాన్నీ గార్హస్థ్య ధర్మాన్నీ నిరాకరిస్తే ఏర్పడే ధర్మసంకటస్థితిని చిత్రించేది ఈ కథ. ధర్మసంకటాన్ని కలిగించేది లౌకికవ్యవస్థకు అధిపతి అయిన దుష్యంత మహారాజా. ధర్మస్థితి నిలుపుకొనేది "ధర్మో రక్షతి రక్షితః" అనే సత్యాన్ని కాపాడిన శకుంతల.’’ అని జి.వి.సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు ( కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆది పర్వం, మొదటి భాగం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ,2008, పుటః xLviii)

భారతీయ సాహిత్య గగనాన కాలం చెరగని ధ్రువతారగా వెలుగువెలుగుతున్న శకుంతల పాత్ర ప్రయాణం, మన ప్రాచీన సాహిత్య వైభవానికి, మానవతా విలువలకు సజీవ సాక్ష్యం. వేదకాలపు మూలాల నుండి వ్యాస మహర్షి మహాభారతంలో ఆత్మగౌరవ ప్రతిరూపంగా, కాళిదాసు దృశ్యకావ్యంలో ప్రకృతి ప్రేమికురాలిగా, నన్నయ మరియు పినవీరభద్రుల వంటి తెలుగు కవుల లేఖినులలో రమణీయ రూపాలు సంతరించుకున్న శకుంతల... దేశ సరిహద్దులు దాటి ప్రపంచ సాహిత్య లోకాన్ని కూడా అబ్బురపరిచింది. కేవలం ఒక పౌరాణిక పాత్రగానే కాకుండా, భారతీయ నారీమణుల త్యాగానికి, ధైర్యానికి మరియు సౌందర్య తత్వానికి ప్రతీకగా నిలిచిన శకుంతలా కథ, తరతరాలుగా సాహిత్య ప్రియుల హృదయాలలో అమరమై నిలుస్తూనే ఉంటుంది.

డా.దార్ల వెంకటేశ్వరరావు, 

ప్రొఫెసర్, తెలుగు శాఖ, 

స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 

హైదరాబాద్. ఫోన్: 9989628049.