"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

దార్ల కవిత్వం విశ్లేషణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దార్ల కవిత్వం విశ్లేషణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

03 అక్టోబర్, 2026

'లోపలిమాట’లో దార్ల కవితపై విల్సన్ రావు కొమ్మవరపు గారి విశ్లేషణ..

 ప్రముఖ కవి విమర్శకులు, కవి  విల్సన్ రావు కొమ్మవరపు గారు నవ మల్లెతీగ మాసపత్రికలో  ‘లోపలిమాట’  పేరుతో ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఒక కవిత తీసుకొని ఆ కవి లేదా కవయిత్రి జీవిత విశేషాలను, సాహిత్య కృషిని సంక్షిప్తంగా సమగ్రంగా పరిచయం చేస్తూనే, ఆ కవితను తనదైన దృక్పథంతో లోతుగా విశ్లేషిస్తున్నారు. సాహిత్య చరిత్రకు, సాహిత్య విమర్శల వికాసానికి ఈ శీర్షిక ఎంతగానో సహకరిస్తుంది. ఈనెల నవ మల్లెతీగ మాసపత్రిక, అక్టోబర్ 2026, పుటలు: 17- 19 (103 వ సంచిక) లో నా కవిత ‘ఎన్నాళ్ళీ దృష్టి మరల్చే కళ?’ కవితను పరిచయం చేసి చక్కటి విశ్లేషణను అందించారు. 

అందుకు వీరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. తమ పత్రికలో ప్రచురించిన పత్రిక సంపాదకులకు, యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఈ కవితను మొదట ప్రచురించిన ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులకు, ముఖ్యంగా సత్యాజి గారికి నాకు కృతజ్ఞతలు. ఈరోజుల్లో ముద్రణ పత్రికలు తగ్గిపోతున్న తరుణంలో ఈ పత్రిక రెగ్యులర్ గా రావడమే కాకుండా, ఉత్తమ సాహిత్యాన్ని అందిస్తున్నందుకు పత్రికా నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. పత్రిక కావలసినవారి సౌకర్యార్థం చందా వివరాలను పంపించవలసిన ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను. సంవత్సర చందా రూ.280/- మాత్రమే. ఫోన్: 9246415150.


...

(పూర్తి వ్యాసం...ఆ పత్రిక సౌజన్యంతో...)

  భుజం మీద మతం, నుదుటి మీద కులం..ఇదే నేటి ఇజం

   తెలుగు సాహిత్య విమర్శారంగంలో నిరంతర అన్వేషణ, సామాజిక నిబద్ధత మూర్తీభవించిన అరుదైన విద్వత్ శిఖరం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా తెలుగు అకడమిక్ రంగాన్ని విస్తృత పరిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకవైపు విశ్వవిద్యాలయ తరగతి గదుల్లో సంప్రదాయ సాహిత్యపు మూలాలను బోధిస్తూనే, మరోవైపు సమకాలీన సామాజిక ఉద్యమాల తాత్వికతను సిద్ధాంతీకరించిన అక్షర తపస్వి.

     1990ల నాటి సామాజిక ఉద్యమాల్లో భాగంగా వెలువడిన ‘మాదిగ చైతన్యం’ (1997) ఉపసంపాదకత్వం నుంచి మొదలుకొని, డా. ఎస్.టి. జ్ఞానానందకవి ‘ఆమ్రపాలి’ పరిశీలనతో పరిశోధనారంగంలో అడుగుపెట్టిన ఆయన కలం ఏనాడూ విరామం ఎరుగదు. ‘దళిత తాత్త్వికుడు’ (2004), ‘నెమలి కన్నులు’ (2016) వంటి సంపుటాలతో వచన కవిత్వంలో ఆర్ద్రతను, పదునైన అభివ్యక్తినీ నింపిన దార్ల గారు, ‘దార్లమాట’ (2021) ద్వారా శతక ప్రక్రియలోనూ తనదైన ముద్ర వేశారు. ‘దళిత సాహిత్యం - మాదిగ దృక్పథం’ (2008), ‘బహుజన సాహిత్య దృక్పథం’ (2012), ‘పునర్మూల్యాంకనం’ (2010), ‘వీచిక’ (2009) వంటి విమర్శనా గ్రంథాల ద్వారా దళిత, బహుజన సాహిత్యానికి శాస్త్రీయమైన విమర్శనా ప్రమాణాలను నెలకొల్పారు. సిద్ధాంతాల పరంగా మార్క్సిజం పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, పుట్టిన నేలకు సంబంధించిన దేశీయ అవసరాలను, అస్తిత్వ ఆకాంక్షలను గుర్తెరిగి దళిత-బహుజన భావజాలాన్ని బలంగా నమోదు చేశారు.

    వీరి రచనలు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ‘Voice of Dalit’, ‘Cultural Identity and Dalit Literature’ రూపంలో ఆంగ్లంలోకి అనువాదమై అంతర్జాతీయ పాఠకులకు సైతం దళిత సౌందర్యశాస్త్రాన్ని పరిచయం చేశాయి. 2023లో వెలువడిన ‘నెమలి కన్నులు’ (ఆత్మకథ - బాల్యం) వారి జీవితంలోని అనుభవాల లోతులను సాహితీ ప్రపంచం ముందుంచింది.

     కేవలం రచయితగానే కాక, హైదరాబాదు విశ్వవిద్యాలయం (HCU) తెలుగు శాఖలో ఆచార్యులుగా ఆయన అకడమిక్ రంగంలో తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకమైనవి. యూజీసీ ప్రవేశపెట్టిన ‘ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్’ (CBCS) స్ఫూర్తిని అందిపుచ్చుకుని, కేవలం మార్కుల కోసమే కాకుండా విద్యార్థుల్లో ఉద్యోగ, అనువర్తిత నైపుణ్యాలు పెరిగేలా ఎం.ఏ. స్థాయిలో ‘పరిశోధన గ్రంథ రచనా నైపుణ్యాలు’, ‘సృజనాత్మక నైపుణ్యాలు’, ‘దళిత సాహిత్యం’, ‘ప్రవాసాంధ్ర సాహిత్యం’ వంటి వినూత్న కోర్సులను ప్రవేశపెట్టిన మార్గదర్శి. సాహిత్యాన్ని.. జీవితానికి, ఉపాధికి, సామాజిక న్యాయానికి వారధిగా మలచిన గొప్ప అధ్యయనశీలి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు. ఇటీవల ఆయన రాసిన “ఎన్నాళ్ళీ దృష్టి మరల్చే కళ?’’ కవితపై విశ్లేషణ ‘నవ మల్లెతీగ’ మాసపత్రిక పాఠకులకు ప్రత్యేకం.

_____________________________

 

ఎన్నాళ్ళీ దృష్టి మరల్చే కళ?

 

నా చేతిలో

ఎప్పుడూ ఏదొక దరఖాస్తే

రేషన్ కార్డు కోసమో,

ఆధార్‌లో పేరు సరిచేయించుకోవడానికో,

పింఛన్ కోసమో,

ఆరోగ్యశ్రీ కోసమో,

ఓటుని నిలబెట్టుకోవడం కోసమో...

నా జీవితాన్ని

ఒక కిటికీ ముందు నిలబెట్టి

నువ్వు నిశ్చింతగా వేడుక చూస్తుంటావు.

‘సర్వర్ పనిచేయడం లేదు…’

అనే ఒక్క వాక్యం

నా రోజంతా మింగేస్తుంది.

వేలిముద్ర పడదు.

ఓటీపీ రాదు.

తలుపు తెరుచుకోదు.

ఒక యంత్రం నన్ను గుర్తుపట్టే వరకూ

నేను మనిషినని కూడా నిరూపించుకోవాల్సిందే.

నా చేతిలోని టోకెన్,

కౌంటర్ దగ్గర వినిపించే సంఖ్యలే

నా ప్రపంచమైపోతాయి.

నువ్వు నా భుజం మీద మెల్లగా

ఒక మతాన్ని ఉంచుతావు.

నా నుదుటిపై ఒక కులాన్ని రాస్తావు.

నా చుట్టూ ఒక ప్రాంతాన్ని గీస్తావు.

చివరికి

ఒక జెండాను నా చేతిలో పెట్టి

“ఇదే నీ దేశం’’ అనీ అంటావు.

నేను

ఆ జెండా రంగుల గురించే

వాదిస్తూ ఉంటాను.

నా ఇంటి పొయ్యిలో

మంట ఆరిపోయిందన్న వాస్తవాన్ని

గమనించలేను.

నా బిడ్డ

ఉద్యోగ ప్రకటన కోసం

ప్రతిరోజూ వార్తాపత్రికను తిరగేస్తున్న

వాడి ఆందోళనను చూడలేను

నా తండ్రి మందుల సీసాలో

పెరుగుతున్న ఖాళీనీ నేను చూడలేను.

నా ఊరి చెరువు

రోజుకో అడుగు చొప్పున

మాయమవుతోందన్న నిజాన్నీ

ఎవరూ చెప్పరు.

ఒకరోజు

సినిమానే దేశమవుతుంది.

మరొకరోజు

ఒక వ్యాఖ్యే యుద్ధమవుతుంది.

ఇంకోరోజు

సోషల్ మీడియానే నా కోపానికి చిరునామా!

 

అంతలోనే

ఒక చట్టం

నా జీవితంలోకి నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది.

ఒక హక్కు

నా చేతిలోంచి శబ్దం చేయకుండా జారిపోతుంది.

నేను మాత్రం

హ్యాష్‌ట్యాగ్‌లతో గెలిచానని

నన్ను నేనే అభినందించుకుంటాను.

 

అప్పుడు అర్థమవుతుంది

నన్ను ఓడించింది నీ బలం కాదు,

నా దృష్టిని మరల్చే నీ కళ.

ఎన్నాళ్ళిలా…ఏదొకనాడు

నేను క్యూలో నిల్చున్న మనిషిని కాను.

ప్రశ్న అడగడం నేర్చుకుంటున్న పౌరుడినవుతాను.

 

ప్రజాస్వామ్యం

ఓటు వేసిన రోజుతో ముగిసే పండుగ కాదనీ,

ప్రతి రోజూ అధికారాన్ని ప్రశ్నించే

సజీవమైన జ్ఞాపకమనీ గుర్తు చేస్తాను.

 

ఆ జ్ఞాపకం మేల్కొన్న రోజు

సర్వర్లు మాత్రమే కాదు,

మౌనాలూ పనిచేయడం మొదలుపెడతాయి.

కార్డుల కంటే ముందు మనిషి కనిపిస్తాడు.

జెండాల కంటే ముందు ఆకలి కనిపిస్తుంది.

నినాదాల కంటే ముందు నిజమే వినిపిస్తుంది.

 

ఆ రోజు

తలవంచి క్యూలో నిల్చున్న “నన్ను” కాదు,

తలెత్తి ప్రశ్నించే ఓ పిడికిలిని చూస్తావు.

-డా.దార్ల వెంకటేశ్వరరావు

___________________________

  వర్తమాన సమాజంలోని సగటు పౌరుడి బతుకు చిత్రాన్ని, రాజకీయ వంచనలను అత్యంత పదునుగా ఆవిష్కరించిన ఈ కవిత అద్భుతమైనది, సమకాలీనమైనది.

  ఆధునిక కాలంలో సాంకేతికత పేరిట సామాన్యుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి దృష్టిని అసలైన సమస్యల నుంచి మరలించే పాలకుల పద్ధతులను నిలదీస్తూనే... ప్రజాస్వామ్యంలో సగటు మనిషి తలెత్తి ప్రశ్నించే స్థాయికి ఎలా ఎదుగుతాడో ఈ కవిత ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. ఈ చైతన్యం నేడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న 'జెన్ జీ' (Gen Z) యువతరపు ఉద్యమ స్ఫూర్తికి కూడా అచ్చమైన ప్రతిబింబంగా నిలుస్తుంది.

  ఈ కవితావస్తువు నేటి నయా-ఉదారవాద, డిజిటల్ యుగంలో సామాన్యుడికి ఎదురవుతున్న అస్తిత్వ వేదన. రాజ్యాంగం పౌరుడికి కల్పించిన హక్కులను పక్కనబెట్టి, పాలకుల వ్యవస్థలు సగటు మనిషిని కేవలం పథకాల కోసం దరఖాస్తులు పట్టుకుని గంటల తరబడి ‘క్యూ’లో నిలబడే ఒక అర్జీదారుడిగా మార్చేశాయి.

  కవిత ప్రారంభమే నిత్యం ఎంతోమంది అనుభవిస్తున్న, చూస్తున్న అత్యంత సహజమైన వాస్తవంతో మొదలవుతుంది. నా చేతిలో ఎప్పుడూ ఏదో ఒక దరఖాస్తు వుంటూనే ఉంటుందని, రేషన్ కార్డు కోసమో, ఆధార్‌లో పేరు మార్పు కోసమో, పింఛను, ఆరోగ్యశ్రీ లేదా ఓటును కాపాడుకోవడం కోసమో నిత్యం పోరాడాల్సి వస్తోందని కవి చెప్తారు. ఈ క్రమంలో “సర్వర్ పనిచేయడం లేదు” అనే ఒక్క మాట సగటు మనిషి రోజంతటినీ మింగేస్తుంది. వేలిముద్ర పడక, ఓటీపీ రాక, ఒక యంత్రం తనను గుర్తుపట్టేంత వరకు తాను మనిషినని కూడా నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.



  ఆధునిక సాంకేతికత పేరిట మనిషి ఉనికిని ఎంత తేలికగా పరిగణిస్తున్నారో చెప్పడానికి కవి వాడిన ఈ యంత్రాల సాంకేతిక  పరిభాష చాలా బలంగా హృదయాలను తాకుతుంది. ఇటువంటి దైనందిన ఇబ్బందుల్లో మగ్గుతున్న పౌరుడిని హెచ్చరిస్తూ, వ్యవస్థలు అతడి దృష్టిని అసలైన బతుకు సమస్యల నుంచి ఎలా పక్కకు మళ్లిస్తున్నాయో కవి ఎంతో చమత్కారంగా, లోతుగా వివరించారు.

  ప్రజలపై మతాన్ని రుద్దడం, నుదుటిపై కులాన్ని రాయడం, చుట్టూ ప్రాంతీయ హద్దులు గీయడం, చివరికి చేతిలో ఒక జెండా పెట్టి ఇదే నీ దేశం అని చెప్పడం ద్వారా... ప్రజలను భావోద్వేగాల పరంపరలో తడిపేస్తారు. దాంతో ప్రజలు ఆ జెండా రంగుల గురించే వాదించుకుంటూ ఉండిపోతారు కానీ, తమ ఇంట్లో పొయ్యిలో మంట ఆరిపోయిందన్న నిజమైన ఆకలిని గమనించలేరు.

  ఉద్యోగ ప్రకటనల కోసం ప్రతిరోజూ పేపరు తిరగేస్తున్న బిడ్డల ఆందోళనను, మందుల సీసాలో పెరుగుతున్న ఖాళీతో కుమిలిపోతున్న తండ్రి బాధను, ఊరి చెరువు రోజుకో అడుగు చొప్పున మాయమవుతున్న పర్యావరణ నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. ఒకరోజు సినిమానే దేశమవుతుంది, మరోరోజు ఒక చిన్న వ్యాఖ్యే పెద్ద యుద్ధమవుతుంది, సోషల్ మీడియానే కోపానికి చిరునామా అవుతుంది. ఇలాంటి చిల్లర గొడవల్లో, హ్యాష్‌ట్యాగ్‌ల పోరాటాల్లో గెలిచామని భ్రమపడుతున్న సమయంలోనే... ఒక చట్టం నిశ్శబ్దంగా వచ్చి ఒక హక్కును లాక్కెళ్ళిపోతుంది. అప్పుడు గానీ పౌరుడికి అర్థం కాదు—తన్ను ఓడించింది పాలక వ్యవస్థల బలం కాదు, తన దృష్టిని అసలు సమస్యల నుంచి పక్కకు మళ్లించే వారి కళ అని!

ఈ కవితా నిర్మాణం, రూపకాల అల్లిక ఎంతో నాటకీయంగా ఉంది. శిల్పపరంగా చూస్తే, కవిత ప్రారంభంలో డిజిటల్ సమస్యలతో నలిగిపోయే సగటు మనిషి నిస్సహాయత నుంచి మొదలై, మధ్యలో మతం, కులం, మీడియా మాయాజాలాన్ని విశ్లేషిస్తూ, చివరకు ప్రశ్నించే పౌరుడిగా మారే వరకు ఒక క్రమమైన పెరుగుదల కనిపిస్తుంది. అలాగే డిజిటల్ యంత్రాల ముందు మనిషి పడే వేదనను, భావోద్వేగాల మాయలో బందీ అయిన స్థితిని పక్కపక్కనే నిలిపి కవి సమాజంలోని అసమానతలను కళ్లముందుంచారు.

ఇందులో ‘క్యూలో నిలబడడం’ అనేది విధేయతకు గుర్తు అయితే, ‘తలెత్తి ప్రశ్నించడం’ అనేది చైతన్యానికి గుర్తు. ఈ మార్పునే కవి శిల్పసౌందర్యంగా ఆవిష్కరించారు.

  ఇందులోని అభివ్యక్తి, ప్రతీకలు నిత్య జీవిత దృశ్యాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. సాంకేతిక భాష అయిన ఓటీపీ, వేలిముద్రలు, టోకెన్లు, సర్వర్లు వంటి పదాలను కవి వాడిన తీరు... డిజిటల్ నియంత్రణలో నలిగిపోతున్న మనిషి ఉనికిని స్పష్టంగా చూపుతుంది.

  అలాగే భుజం మీద మతం, నుదుటి మీద కులం, చేతిలో జెండా అని చెప్పిన ఊహలు అత్యంత శక్తివంతమైన దృశ్యాలుగా నిలుస్తాయి. పాతకాలపు కష్టమైన పదాలు గానీ, సంక్లిష్టమైన అలంకారాల భారం గానీ లేకుండా, నిత్యం మన వాడుకలో ఉండే సరళమైన భాషతోనే లోతైన కవితాత్మక పదును తీసుకురావడం ఈ కవి శైలిలోని ప్రత్యేకత.

  ముఖ్యంగా ఈ కవితలో ‘సర్వర్, ఆధార్, పింఛన్, ఓటీపీ, టోకెన్, కౌంటర్, సోషల్ మీడియా, హ్యాష్‌ట్యాగ్’ వంటి ఆంగ్ల పదాలను వాడటం అనేది ఆధునిక కవితా నిర్మాణంలో వస్తున్న ఒక గొప్ప మార్పుకు సూచిక.

  ఒకప్పుడు కవిత్వం అంటే గ్రాంథికమో లేక కేవలం ప్రకృతి వర్ణనలతో కూడిన గ్రామీణ భాషో ఉండేది. కానీ నేటి సామాన్యుడి రోజువారీ  అనుభవాలు ఈ డిజిటల్ పరిభాషతో ముడిపడి ఉన్నాయి. ఓటీపీ రాకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం అనేవి నేటి సగటు మనిషి నిజమైన బాధలు. వాటికి అచ్చతెలుగు అనువాదాలు వెతికితే ఆ అనుభవంలో ఉండే నిజాయితీ, తాజాదనం దెబ్బతింటాయి. అందుకే కవి ఆ ఆంగ్ల పదాలను ఫ్యాషన్ కోసం కాకుండా, సగటు మనిషి వేదనను యథాతథంగా ఆవిష్కరించడానికి, అలాగే సాంకేతికత పేరిట జరుగుతున్న ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఇది నేటి యువ కవులకు ఒక గొప్ప పాఠం. ఆంగ్ల పదాలను ఎలా పడితే అలా వాడకూడదని, అనుభవంలోని నిజాయితీని చెప్పడానికి, సమాజంలోని యాంత్రికతను ఎత్తిచూపడానికి మాత్రమే వాడాలని ఈ కవితలో దార్ల గారు చెప్పకనే చెప్పారు.

  అలాగే కేవలం ఆక్రోశాన్ని నింపడం కాకుండా, ఆలోచనను రేకెత్తించే రీతిలో కవిత్వాన్ని ఎలా నడపాలో కూడా నేటి యువతకు ఇది దిశానిర్దేశం చేస్తుంది.

ఈ కవితలో వ్యక్తమైన లోతైన చైతన్యాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా రూపుదిద్దుకుంటున్న జెన్ జీ (Gen Z) ఉద్యమాల పోరాట నమూనాతో నేరుగా ముడిపెట్టి చూడవచ్చు. సాంకేతికతనే ఆయుధంగా మలచుకోవడం ఈ తరం ప్రత్యేకత. పాలక వ్యవస్థలు సోషల్ మీడియాను, హ్యాష్‌ట్యాగ్‌లను ప్రజల దృష్టి మరల్చడానికి వాడుతుంటే... నేటి జెన్ జీ యువత అదే వేదికల ద్వారా నిజమైన సమస్యలను బట్టబయలు చేస్తూ అధికారాన్ని నిలదీస్తోంది.

  కవి ఆవేదన చెందినట్లు మతం, కులం, ప్రాంతం, రాజకీయ పార్టీల జెండాల చుట్టూ తిరిగే పాత నమూనాను జెన్ జీ తిరస్కరిస్తోంది. “జెండాల కంటే ముందు ఆకలి, కార్డుల కంటే ముందు మనిషి” అనే సూత్రంతో నిరుద్యోగం, పర్యావరణ వినాశనం, హక్కుల హరణంపై వీధుల్లోకి వస్తోంది. ప్రభుత్వాలు ఇచ్చే హామీల కోసం క్యూలో నిలబడే బాధితుల్లా కాకుండా, ప్రశ్నించే పౌరులుగా మారే ఈ క్రమం జెన్ జీ ఉద్యమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

  ఈ కవిత ముగింపు కూడా సరిగ్గా అలాంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య మేల్కొలుపునే ఆవిష్కరిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేసి ఊరుకునే పండుగ కాదని, అది ప్రతిరోజూ అధికారాన్ని ప్రశ్నించే సజీవమైన జ్ఞాపకమని కవి ఉద్బోధిస్తారు. ఆ జ్ఞాపకం మేల్కొన్న రోజు సర్వర్లు మాత్రమే కాదు, ప్రజల మౌనాలు కూడా మాట్లాడటం మొదలుపెడతాయి. రాజ్యాంగ కార్డుల కంటే ముందు మనిషి కనిపిస్తాడు, రంగుల జెండాల కంటే ముందు ఆకలి కనిపిస్తుంది, రాజకీయ నినాదాల కంటే ముందు పచ్చి నిజమే వినిపిస్తుంది. ఆ రోజు తలవంచి క్యూలో నిల్చున్న సగటు జీవిని కాక, తలెత్తి ప్రశ్నించే ఒక పిడికిలిని ఈ వ్యవస్థ చూస్తుందని కవి చెప్పిన తీరు అత్యంత ప్రభావవంతమైనది.

వర్తమాన సంక్షోభాన్ని కవిత్వంలోకి ఎలా ఆవహింపజేయాలో, ఆధునిక పరిభాషను కవితాత్మక అస్త్రంగా ఎలా మలచుకోవాలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ఈ కవిత ద్వారా కళ్లకు కట్టినట్లుగా నిరూపించారు. దృష్టి మరల్చే రాజకీయాల మాయను పటాపంచలు చేస్తూ, ప్రశ్నించే కొత్త తరానికి దిశానిర్దేశం చేసిన నేటి కాలానికి ఎంతో అవసరమైన ఒక గొప్ప సామాజిక సందేశం.

-విల్సన్ రావు కొమ్మవరపు

  89854 35515

 

 

 




03 ఆగస్టు, 2026

కోనసీమ కోయిల’ పలికిన తాత్విక జీవన వేదం

 మట్టి నుంచి మౌనం వైపు: ‘కోనసీమ కోయిల’ పలికిన తాత్విక జీవన వేదం


=======================

తెలుగు సాహిత్య క్షేత్రం ఎంతో సువిశాలమైనది, ఎన్నో అద్భుతమైన ప్రక్రియలకు, నూతన ప్రయోగాలకు ఆలవాలమైనది. ఇటువంటి సాహితీ వనంలో విమర్శ, పరిశోధన, సృజన అనే మూడు భిన్నమైన పాయలను ఒకే చోట కలిపిన త్రివేణీ సంగమంగా నిలిచిన అరుదైన, విశిష్ట మేధావి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు. ఆయన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే, ఆధునిక సాహిత్యంలో వస్తున్న నూతన ధోరణులపై ఎంతో లోతైన పరిశోధనలు చేస్తూ, ఆయన చేస్తున్న ఈ విశేష కృషి నిజంగా అనిర్వచనీయమైనది. ఈ అపారమైన సాహిత్య వినీలాకాశంలో దార్ల గారికి అనేకమైన విభిన్న సాహిత్య ప్రక్రియలలో అత్యంత లోతైన పరిచయం ఉండటం ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. అలాగే మానవ జీవనంలోని అనేక సామాజిక కోణాలను, ఎత్తుపల్లాలను ఆయన తన రచనల్లో అత్యంత సత్యనిష్ఠతో, ఏమాత్రం రాజీపడకుండా విశ్లేషించారు. ఒక విమర్శకుడిగా ఆయన ఎంతటి కచ్చితమైన నిబద్ధతను ప్రదర్శిస్తారో, ఒక సృజనకారుడిగా తన రచనల్లో అంతటి ఆర్ద్రతను, సున్నితత్వాన్ని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత అని చెప్పవచ్చు. ముఖ్యంగా దళిత, బహుజన సాహిత్యాలపై తనదైన అధికారికమైన ముద్ర వేసిన దార్ల గారు, కేవలం ఒకే సిద్ధాంతానికో లేదా ఒకే రంగానికో పరిమితం కాకుండా, సాహిత్యాన్ని ఒక సమగ్రమైన జీవన దర్శనంగా భావించే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఒకవైపు తనదైన పదునైన విమర్శతో పాటు, మరోవైపు మృదువైన కవిత్వాన్ని కూడా సమానంగా పండించగల సవ్యసాచిగా ఆయన సాహిత్య లోకంలో కీర్తించబడుతున్నారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు కేవలం ఒక విద్యావేత్తగానే కాకుండా, సమాజం పట్ల అత్యంత సామాజిక స్పృహ కలిగిన ఒక గొప్ప మానవతావాదిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన రచనల్లో ఎప్పుడూ అణగారిన వర్గాల ఆవేదన ఎంతటి గాంభీర్యంతో, ఉగ్రరూపంతో ధ్వనిస్తుందో, అదే సమయంలో ప్రకృతి పట్ల ఆయనకున్న అపారమైన అనురాగం అంతే సున్నితంగా ఆవిష్కృతమవుతుంది. ఆయన విమర్శలో ఉన్న పదును సృజనలోకి వచ్చేసరికి అద్భుతమైన తాత్విక పరిణతిని సంతరించుకోవడం పాఠకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ఆయన 'హైకూ' అనే అత్యంత సూక్ష్మమైన కవితా ప్రక్రియలోకి ప్రవేశించి, 'కోనసీమ కోయిల' అనే అద్భుతమైన కావ్యంతో తన అక్షర ప్రయాణాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

సాధారణంగా హైకూ అనేది జపాన్ దేశంలో జన్మించిన ఒక అత్యంత సూక్ష్మమైన, నిశితమైన కవితా ప్రక్రియ. ఇది కేవలం ఐదు, ఏడు, ఐదు (5-7-5) మాత్రల పరిమితితో సాగే ఎంతో చిన్న కవితా రూపం. మనకు తెలిసినంత వరకు సాధారణంగా హైకూలు ఏకవాక్య లేదా మూడు పాదాల స్వతంత్ర భావచిత్రాలుగా, ఒకదానికొకటి సంబంధం లేని విడివిడి కవితలుగా మాత్రమే మిగిలిపోతాయి. కానీ, ఆచార్య దార్ల గారి చేతిలో ఇవి కేవలం పేర్చిన విడివిడి కవితలుగా కాకుండా, ఒక సజీవమైన స్రవంతిలా, ఒక నిరంతర ధారలా మారాయి. జననం అనగా మట్టి నుండి ప్రారంభమై, వృద్ధాప్యం వరకు సాగి, ఆపై మరణం అనగా మౌనం వరకు సాగే ఒక నిరంతర మానవ జీవన ప్రయాణంగా ఈ హైకూలు అత్యంత అద్భుతంగా అల్లబడ్డాయి. ఇందులో ఒక దశ ముగియగానే మరో దశ దానికి కొనసాగింపుగా వస్తూ, పాఠకుడిని ఒక మహత్తర యానంలోకి తీసుకువెళుతుంది. ఒక అనుభూతి మరో అనుభూతితో ముడిపడి, ఏ ఒక్క హైకూను విడదీయలేని విధంగా ఒక మహా ప్రవాహంలా ఈ కావ్య యానం ఆసాంతం కొనసాగుతుంది. ఈ అపురూపమైన అంతర్గత అనుసంధానమే ఈ అక్షర మాలికను కేవలం ఒక సాధారణ కవితా సంకలనంగా కాకుండా, ఒక పరిపూర్ణమైన 'తాత్విక కావ్యం' స్థాయికి చేర్చిందని చెప్పాలి. గతంలో ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు తమ 'విశ్వంభర' మహాకావ్యంలో మానవుని ఉత్థాన పతనాలను శాస్త్రీయంగాను, ఆధ్యాత్మికంగానూ సుదీర్ఘమైన వచన కావ్యంగా అద్భుతంగా ఆవిష్కరించిన విషయం మనకు విదితమే. ప్రపంచంలో ఈ రెండు భిన్నమైన ఆలోచనలు ఒకదానితో ఒకటి కలవకుండా సమాంతరంగా ఎలా పయనిస్తున్నాయో ఆ మహాకావ్యంలో వారు వర్ణించారు. ఆచార్య దార్ల గారు ఆ మహాకావ్యానికి ఏమాత్రం తీసిపోని విధంగా, అదే సువిశాల జీవన గమనాన్ని అత్యంత సూక్ష్మమైన ఈ 'హైకూ' ప్రక్రియలో బంధించే సాహసోపేతమైన, అరుదైన ప్రయోగం చేశారు. సినారె గారు సుదీర్ఘమైన వచనంలో సాధించిన విశేషమైన తాత్విక లోతును, దార్ల గారు నిశితమైన భావ పరంపరతో, పదునైన పదబంధాలతో కేవలం మూడు పాదాలలో సాధించడం నిజంగా అసామాన్యమైన ప్రతిభ. ఈ కావ్యంలో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మానవుడు పొందే వివిధ దశల అనుభూతులను కవి అత్యంత లోతుగా ఆవిష్కరించారు. ఈ అనుభూతులను కేవలం భౌతికంగా జరిగే మార్పులుగానే పరిమితం కాకుండా, మానవుని అంతరంగంలో సాగే భావవాద దృష్టితోనూ ఆయన నిశితంగా విశ్లేషించారు. సమాజంలో మనిషి నిత్యం ఎదుర్కొనే ఒడిదుడుకులు, మానవుల విభిన్న ఆలోచనా విధానాలు, వారిలో నిరంతరం జరిగే తార్కిక సంఘర్షణలు ఇందులో అడుగడుగునా కళ్లకు కట్టినట్లు వర్ణితమయ్యాయి. ముఖ్యంగా, జీవితపు ఆఖరి అంకంలో మనిషి మరణించేది, అది కేవలం జీవక్రియలు ఆగిపోయే ఒక 'భౌతిక శాస్త్రమా'? లేక అది ఆత్మ, అంతరాత్మ, జీవాత్మల పరమార్థ తత్వమా? అనే మహత్తరమైన జిజ్ఞాసను కవి ఏకపక్షంగా ఎక్కడా తీర్పునివ్వలేదు. పాఠకుల ముందు దాన్ని ఒక లోతైన 'ప్రశ్నార్ధకంగానే' ఉంచి ఆలోచింపజేశారు. ఒక గొప్ప తాత్విక కవి మాత్రమే చేయగలిగే అత్యున్నత నిలకడ ఇది అనడంలో సందేహం లేదు.

ఈ కావ్యాన్ని కవి 18 భాగాలుగా విభజించడంలోని ఆంతర్యం వెనుక ఎంతో గొప్ప తాత్వికత దాగి ఉంది. భారతీయ తాత్విక చింతనలో అష్టాదశ పురాణాలు, అలాగే భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు మనిషికి సంపూర్ణ జీవన మార్గాన్ని ఎలా బోధించాయో, ఈ కావ్యంలోని పద్దెనిమిది సోపానాలు కూడా సరిగ్గా అలాగే నడుస్తాయి. దానికి తోడు ఇందులో జపాన్ దేశపు 'జెన్' (Zen) తాత్విక చింతన కూడా అంతర్లీనంగా అద్భుతంగా ఇమిడి ఉంది. ముఖ్యంగా భారతీయ సమాజంలో 18 అనే సంఖ్యకు ఒక విశిష్టమైన జీవ శాస్త్రీయ, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. ఒకటి మరియు ఎనిమిది అంకెలను కలిపితే వచ్చేది తొమ్మిది (1+8=9). ఈ తొమ్మిది అనగా మానవ దేహంలోని 'నవరంధ్రాలకు' ప్రతీక. ఈ భూమి మీద మానవుని జీవన వ్యాపారమంతా ప్రధానంగా ఈ నవరంధ్రాలతోనే ముడిపడి, వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ విశిష్టమైన అంకెల వెనుక ఉన్న అపారమైన శాస్త్రీయతను, జెన్ తాత్విక చింతనను అత్యంత సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూనే, కవి ఈ మానవ యానాన్ని పద్దెనిమిది భాగాలుగా నిర్మించే అద్భుతమైన ప్రయత్నం చేశారు. మానవుని జీవన వ్యాపారమంతా ముందుగా భౌతికమైన మట్టితోనే ముడిపడి ఉంది. జపాన్ 'జెన్' తత్వంలో మూలాలను స్మరించడం అనేది ఒక గొప్ప ధ్యాన స్థితి. దార్ల గారు ఈ కావ్యాన్ని 'మట్టి'తో ప్రారంభించడం వెనుక ఖచ్చితంగా ఈ అస్తిత్వవాద కోణమే దాగి ఉంది. 

“కోనసీమలో 

మట్టి చినుకు రాగం 

ముత్తైదువ నవ్వు!” అంటూ కవి మట్టి వాసనను కేవలం ఒక ప్రకృతి వర్ణనగా మాత్రమే కాకుండా, ప్రాణోద్భవానికి ఆరంభంగా గుర్తించారు.

ఆ తర్వాత బాల్యాన్ని సామాజిక కల్మషం ఏమాత్రం అంటని దైవత్వానికి ప్రతీకగా చూపిస్తూ

“నింగి జాబిలి 

నేలపైన నవ్వెను 

ముద్దుల బాబు” అనే హైకూ ద్వారా చిన్ననాటి అమాయకత్వంలోని అసలైన అందాన్ని పట్టుకున్నారు. నవరంధ్రాలతో కూడిన ఈ భౌతిక దేహానికి తొలినాళ్ళలో ఎలాంటి భావవాద కల్మషాలు అంటవని ఎంతో వివరిస్తూ

“కమల దళాలు 

చిన్ని చిన్ని చేతులు 

 కమల దళము” అని అత్యంత సున్నితంగా అక్షరాల్లో మలిచారు. ఇక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మించేది, భౌతికమైన దేహానికి భావోద్వేగాలను అద్దేది కుటుంబ వ్యవస్థే. ఆ కుటుంబంలో అమ్మ త్యాగాన్ని ఎంతో ఆర్ద్రంగా వర్ణిస్తూ “కరిగిపోయేను 

 వెలుగునిచ్చే వత్తిలా 

అమ్మ జీవితం” అనే అద్భుతమైన దృశ్యకావ్యాన్ని కవి ఆవిష్కరించారు. అలాగే నాన్నను కుటుంబానికి పునాదిగా చూస్తూ 

“మోయును బరువు 

 బిడ్డల ఎదుగుదలకై 

నిచ్చెన నాన్న” అనే భావం తండ్రి బాధ్యతను శిఖరాగ్రాన నిలబెడుతుంది. నాన్న చేసే నిశ్శబ్దమైన త్యాగానికి 

“చిరిగిన చొక్కా 

బిడ్డ కొత్త బట్టలు 

నాన్న సంబరం” అనే హైకూ కచ్చితంగా అద్దం పడుతుంది. ఇక్కడ కవి వ్యక్తపరిచిన తార్కిక సంఘర్షణ ఏమిటంటే, తన భౌతిక దేహం నశిస్తున్నా, తన సంతానం ఎదుగుదల అనే భావవాదం కోసం తల్లిదండ్రులు పడే తపన. దీనిని మరింత విశ్లేషిస్తూ... 

“కలిసి ఉన్నప్పుడు 

మహావృక్షమే కుటుంబం 

నీడ నిచ్చును” అని కుటుంబ సామాజిక భద్రతను విశ్లేషించారు.

దార్ల గారు ‘శ్రమ'ను దైవంగా భావించే ఒక గొప్ప కర్మ యోగి. భౌతికమైన శ్రమ ద్వారా భావవాదపరమైన దైవత్వాన్ని ఎలా చేరుకోవచ్చో వివరిస్తూ... 

“శిల్పి శ్రమలో 

రాయి దైవమయే 

చెమట పూజ!” అని శ్రమలోని పవిత్రతను ప్రపంచానికి చాటారు. ఒక సామాజిక విమర్శకుడిగా ఆయన కలం సమాజంలోని అంతరాలను తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తుంది. నేటి యాంత్రిక జీవనంలో దెబ్బతింటున్న మానవ సంబంధాలను 

“మనుషుల మధ్య 

 ప్రేమ లేని గోడ 

 ఒంటరి ద్వీపం!” అంటూ పాఠకుల కళ్లకు కట్టారు. అలాగే సమాజంలోని ఆర్థిక అసమానతలను నిర్భయంగా ఎత్తిచూపుతూ... 

“చెత్త కుప్పలో 

మెతుకు కోసం వెతుకు 

దేశ భాగ్యం” అని కవి చేసిన వ్యంగ్యాస్త్రం నేటి సమాజ దుస్థితిని తీవ్రంగా ప్రశ్నిస్తుంది. అలాగే స్త్రీల రక్షణపై స్పందిస్తూ...

 “ఆడబిడ్డపై 

 జరుగుతున్న దాడులు 

 మానవ ద్రోహం” అంటూ సామాజిక బాధ్యతను ఒక వాడియైన శస్త్రంలా సంధించారు. ఈ మహాకావ్య విస్తృతికి సైన్స్, ఆధ్యాత్మికతల అపూర్వ సమన్వయం అనే భాగం ఒక ప్రాణవాయువు లాంటిది. దార్ల గారు ఈ కావ్యంలో లేవనెత్తిన అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ సృష్టికి మూలం శాస్త్రమా? లేక ఆధ్యాత్మిక తత్వమా?. 

ఒక హైకూ కవి విజ్ఞానశాస్త్ర ప్రతీకలను వాడుతూనే వాటికి మునుపెన్నడూ లేనివిధంగా ఆధ్యాత్మికతను జోడించడం బహుశా మన తెలుగులో ఇదే తొలిసారి కావచ్చు. “టెలిస్కోపులో 

కనిపించని దేవుడు 

కంటి పాపలో!” అంటూ భౌతికమైన అన్వేషణ కన్నా, భావవాదపరమైన అంతరంగ శోధన గొప్పదన్న అద్వైతాన్ని కవి బోధించారు. కృత్రిమ మేధస్సు గురించి ఎంతో లోతుగా ప్రస్తావిస్తూ... 

“రోబోకు ప్రాణం? 

సైన్సు ఓడిపోయే చోట 

ఆత్మ ఉదయించు!” అని ఆత్మ యొక్క విశిష్టతను ఉన్నతంగా చాటారు. భౌతికదేహానికి, ప్రాణానికి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను... 

“రెక్క సైన్సు 

ఎగిరే ఊపిరి దైవం 

పక్షి జీవితం!” అని అద్భుతంగా నిర్వచించారు. చివరికి ఆధునిక జీవశాస్త్రమైన డి.ఎన్.ఏ ని కర్మ ఫల సూత్రంగా మలుస్తూ...

 “డి.ఎన్.ఏ కోడ్ 

కర్మ ఫల సూత్రమే 

సృష్టి సంతకం!” అని విశ్లేషించడం కచ్చితంగా కవి ప్రయోగాత్మక మేధస్సుకు గీటురాయి అని చెప్పాలి. బౌద్ధ ధర్మంలోని కర్మతత్వం, హిందూమత భావనలోని కర్మసిద్ధాంతం మధ్య ప్రాథమికమైన వ్యత్యాసాన్ని సైతం ఈ కావ్యం స్పృశించింది. హిందూమతంలో కర్మ అనేది ఆత్మతో ముడిపడి ఉంటుంది; ఒక ఆత్మ తన మునుపటి జన్మల ఫలాలను అనుభవిస్తూ, దైవిక నిర్ణయం లేదా ఒక శాశ్వతమైన 'నేను' (ఆత్మ) ఆధారంగా పునర్జన్మ పొందుతుందని వివరిస్తుంది. కానీ బౌద్ధంలో 'అనాత్మ' అంటే ఆత్మ అనేది శాశ్వతం కాదు అనే సిద్ధాంతం ప్రధానమైనది. ఇక్కడ కర్మ అంటే కేవలం 'చేతన' లేదా సంకల్పం మాత్రమే. బౌద్ధం ప్రకారం, కర్మ అనేది ఒక వ్యక్తిపై విధించబడిన దైవిక శిక్ష లేదా బహుమతి కాదు; అది ఒక కార్య-కారణ సంబంధం. విత్తనం నాటితే చెట్టు ఎలా వస్తుందో, ఒక ఆలోచన లేదా పని తన ప్రభావాన్ని తాను చూపుతుంది. ఇక్కడ అనుభవించే వ్యక్తి శాశ్వతమైన ఆత్మ కాదు, అది ఒక నిరంతర చైతన్య ప్రవాహం మాత్రమే. క్లుప్తంగా చెప్పాలంటే, హిందూమతంలో కర్మ ఆత్మ చుట్టూ తిరిగితే, బౌద్ధంలో అది కేవలం మనిషి సంకల్పం, దాని పర్యవసానాల చుట్టూ తిరుగుతుంది.

ఇటువంటి లోతైన తార్కిక సంఘర్షణ, మనిషి తనలోని కోరికలతో చేసే అంతరంగ పోరాటమే ఈ సోపానం. కోనసీమ బిడ్డగా ఆయన సప్త గోదావరి పాయలను మానవ అనుభూతులకు అద్భుతమైన ప్రతీకలుగా మలిచారు. “నది నడక 

ఎన్ని మలుపులో 

జీవన యాత్ర!” అంటూ జీవితంలోని కష్టనష్టాలను నది మలుపులతో పోల్చారు. గోదావరి అలలను “సుఖదుఃఖాల హోరు” గా భావిస్తూనే, ఈ ప్రవాహంలో మనిషి తనలోని శత్రువులను జయించాలన్నారు. 

“కోపపు చిచ్చు 

 తగలబడేది మనమే

క్షమయే చల్లదనము!” అంటూ క్రోధం ఎదుటివారిని కాక తన దేహాన్నే దహిస్తుందనే మనస్తత్వ శాస్త్ర సత్యాన్ని ఒక అపురూపమైన సూక్తిలా అందించారు.

లౌకిక వ్యామోహాలన్నీ దాటిన తర్వాత నవరంధ్రాల దేహం చేరే అత్యున్నత స్థితిని ఈ కావ్యం చివరి సోపానాలు ఎంతో గొప్పగా వివరిస్తాయి. జెన్ తత్వంలోని 'నిశ్శబ్ద ధ్యానం' (Satori) ఇక్కడే ఆవిష్కృతమవుతుంది. 

“తుఫానులో దీపం 

చలించని మనస్సు 

ధీరుడి లక్షణం!” అని స్థితప్రజ్ఞతను కవి అత్యుత్తమంగా నిర్వచించారు. బంధాల మధ్య ఉంటూనే అనాసక్తంగా జీవించడాన్ని...

 “సంసారమందున 

తామరాకు పై నీరు 

ముట్టని బంధం!” అని వేదాంతాన్ని కేవలం ఒక చిన్న బొట్టులో చూపించారు. శబ్దం కంటే నిశ్శబ్దానికే ఎక్కువ విలువనిస్తూ... 

“కోయిల మౌనం 

పాటలో ఉండదు 

నిశ్శబ్దంలోనే!” అన్నారు. చివరగా మనిషి మరణం అనే గమ్యాన్ని చేరుకున్నప్పుడు దార్ల గారు ఒక అద్భుతమైన తాత్విక ప్రశ్నను సంధించారు. ఆ మరణం కేవలం భౌతిక జీవక్రియ ఆగిపోవడమా? లేక ఆత్మ ఈ విశాల విశ్వంలో లీనమవ్వడమా?. “నది సముద్రమై / తన ఉనికిని మరచి / అనంతం లోన!” అనే పంక్తులతో ఈ మహాకావ్యం పరిపూర్ణతను పొందుతుంది. నది తన పరిమిత ఉనికిని సముద్రంలో ఎలాగైతే కరిగించుకుంటుందో, అలాగే మనిషి తన అహాన్ని వీడి అనంతమైన విశ్వ చైతన్యంలో లీనమవ్వడమే 'జీవన్ముక్తి' అని కవి ఏకపక్షంగా చెప్పకుండా, పాఠకుడి అంతరంగంలో ఒక గొప్ప తాత్విక అన్వేషణకు నాంది పలికారు. మానవ జీవన ప్రయాణం ఒకవైపు భౌతిక అన్వేషణ వైపు, మరొకవైపు ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుక్కోవడం వైపు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండింటిని కోనసీమ కోయిల హైకు కావ్యం లో మానవుని అంతర్గత సంఘర్షణగా కవి వర్ణించాడు. దీనిని ఒకసారి చదివితే కవి భౌతిక వాదేమో అనిపిస్తుంది, మరోసారి చదివితే కవి ఆధ్యాత్మిక తత్వాన్ని చెప్తున్నట్లు అనిపిస్తుంది. రెండింటిని సమదృష్టితో చూసినప్పుడు ఈ విశ్వంలో మానవుడు పడుతున్న సంఘర్షణకు ఇది ఒక గొప్ప ప్రతీకాత్మక కావ్యంగా కనిపిస్తుంది. మనిషి బాహ్య ప్రపంచాన్ని జయించే క్రమంలో సైన్స్ మరియు తర్కాన్ని ఆశ్రయిస్తూ చేసే భౌతిక శోధన ఒక వైపు కనిపిస్తే, తన ఉనికిని తాను తెలుసుకోవడానికి అంతరంగ మౌనంలోకి సాగించే ఆధ్యాత్మిక ప్రయాణం మరోవైపు కనిపిస్తుంది. కవి ఈ రెండింటిని పరస్పర విరుద్ధమైనవిగా కాకుండా, పక్షికి ఉండే రెండు రెక్కల వలె జీవన సమతుల్యతకు ఖచ్చితంగా అవసరమైనవిగా చిత్రించారు. మనిషి పుట్టింది మొదలు అనేక జనన మరణాలు కొనసాగుతున్న నేటి వరకు జరుగుతున్న ప్రగతిశీలతను, పరిణామాన్ని భౌతిక సత్యాలతో నిరూపించే ప్రయత్నం జరుగుతూనే ఉంది, అయినా అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. కవి ఈ రెండు రకాల అన్వేషణల మధ్య మానవ జీవితం బాల్యం, యౌవనం, వివాహం, బాధ్యతలు, సంఘర్షణలు, మళ్లీ పసి పిల్లవాడిగా మారిపోవడం లాంటి నిరంతర పయనాన్ని ఎంతో గొప్పగా చూపించారు. 

భౌతికమైన సత్యాలు అనిపించేవి ఆధ్యాత్మిక సత్యాలు కావడం, ఆధ్యాత్మిక సత్యాలుగా కనిపించేవి భౌతిక సత్యాలు కావడం... హైకూ తత్వం అందించిన గొప్ప అనుభూతి సత్యం. అదే ఈ కావ్యంలోని పరమార్థం, జీవన తత్వం. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి 'కోనసీమ కోయిల' కేవలం ఒక కవితా సంపుటి కాదు; అది మనిషి అంతరంగాన్ని మేల్కొలిపే ఒక 'తాత్విక జీవన వేదం'. సినారె గారి 'విశ్వంభర' మహాకావ్యంలో మానవ పరిణామ క్రమాన్ని ఒక మహా ప్రవాహంలా చూస్తే, దార్ల గారి ఈ హైకూ కావ్యంలో ఆ ప్రవాహంలోని ప్రతి నీటి బిందువులోనూ విశ్వరూపాన్ని మనం దర్శించవచ్చు. మట్టితో మొదలైన భౌతిక దేహపు ప్రయాణం, నవరంధ్రాల ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తూ.. తార్కిక సంఘర్షణలను దాటుకుని చివరకు 'మౌనం' అనే ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకోవడం ఇందులో అత్యంత సహజంగా ఆవిష్కృతమైంది. ఈ కావ్యంలోని ప్రతి హైకూ జీవితంలోని ఒక మధుర క్షణాన్ని బంధించిన స్నాప్ షాట్ లా అనిపిస్తూనే, మనల్ని లోతైన ఆత్మాన్వేషణ వైపు నడిపిస్తుంది. ఒక ఆధునిక విమర్శనాత్మక, పరిశోధనాత్మక దృష్టితో విశ్లేషించినప్పుడు తెలుగు సాహిత్య చరిత్రలో హైకూల ద్వారా నిర్మితమైన తొలి తాత్విక మహాకావ్యంగా 'కోనసీమ కోయిల' ఎప్పటికీ ఒక అక్షర ధ్రువతారగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.

✍️డా. బండారు విజయ్ కుమార్

(ఈ వేళ దినపత్రిక, 3.8.2026 సౌజన్యంతో)(

08 జూన్, 2026

‘రాత్రి సింఫని’ ఒక సార్వత్రిక మానవ హృదయ నాదం ( మహా దినపత్రిక, 8.6.2026)

 ‘రాత్రి సింఫని’  ఒక సార్వత్రిక మానవ హృదయ నాదం


(మహా దినపత్రిక, సాహిత్య అనుబంధం 8.6.2026 సౌజన్యంతో)

డాక్టర్ బాణాల శ్రీనివాసరావు ఆధునిక తెలుగు కవిత్వ రంగంలో తనదైన విశిష్ట ముద్రను వేసిన కవి. ఆయన సరికొత్త కవితా సంపుటి ‘రాత్రి సింఫని’ (అక్టోబర్ 2023) సమకాలీన సామాజిక, తాత్విక, అస్తిత్వ స్పృహల సమాహారం. ఆంగ్ల సాహిత్య నేపథ్యంతో పాటు దేశీయ, ప్రాంతీయ మూలాల పట్ల అవగాహన ఉన్న కవి కావడంతో, ఈ సంపుటిలోని కవితలలో వస్తు వైవిధ్యం, అద్భుతమైన అభివ్యక్తి శిల్పం గోచరిస్తాయి. ‘నా సాహితీవృక్షానికి తల్లివేరు మావూరే’ పేరుతో తన సాహితీ నేపథ్యాన్ని అద్భుతంగా వివరించారు కవి. ఆంగ్లసాహిత్యంపై పరిశోధన చేయడంతో పాటు, కవిత్వాన్ని కూడా సాధన చేస్తుండటం వల్ల ఆయన కవిత్వం ఎంతో పదునుతో వెలువడుతుంది. ఆయన తన జీవిత నేపథ్యం నుండి తన తండ్రి చేసే వృత్తిని వర్ణిస్తూ ‘కుంపటి’ దీర్ఘకవిత కవిగా ఆయనకు గొప్పగుర్తింపుని తెచ్చింది. అది ‘వెంటాడే కలాలు’ బి.సి. వాద అస్తిత్వ గొంతులను కవిత్వీకరించే లక్ష్యంతో వర్ణించిన కవిత్వం. అందువల్ల దాని నిండా జీవితమే కవిత్వమయ్యింది.  అది తర్వాత అనేక కవితాసంకలనాల్లో చోటు సంపాదించడమే కాకుండా, ఆంగ్లంలోకి కూడా అనువాదం అయ్యింది. ఆ తర్వాత అనేక పత్రికల్లో చిక్కనైన కవిత్వం రాశారు. వాటిలో కొన్నింటిని ‘రాత్రి సింఫని’ పేరుతో ప్రచురించారు.  ‘రాత్రి సింఫని’’ పేరుతోనే ఒక కవిత ఉంది. 'సింఫనీ' అంటే రకరకాల వాయిద్యాల కలయికతో పుట్టే ఒక సుదీర్ఘమైన, గంభీరమైన సంగీత రచన. రాత్రి అనేది కేవలం నిశ్శబ్దం కాదు, అందులో ఎన్నో శబ్దాలు, భావాలు, దృశ్యాలు దాగి ఉన్నాయి. వాటి కలయికే ఈ కవిత. ఇది నాలుగు విభిన్న దశల్లో (మూవ్‌మెంట్స్) సాగింది. మొదటి భాగం ప్రశాంతత - యాంత్రికత ల మధ్య సంఘర్షణను చిత్రిస్తుంది.

 "ఆ గది గూటిలో అలసిపోయి 

 హాయిగానిదురిస్తున్నరొండు చిన్ని పక్షులు" ఇది ఒక అందమైన, సున్నితమైన గృహ వాతావరణాన్ని చూపిస్తుంది. కానీ వెంటనే "సముద్ర హోరును తలపించే నిరంతరం సింఫని సంగీతం" అంటూ పక్కనే ఉన్న ఫ్యాన్ శబ్దమో లేదా ఏసీ శబ్దమో... ఆధునిక జీవితపు యాంత్రిక హోరును ప్రకృతితో పోల్చిన తీరు అద్భుతం. 

రెండవ భాగం 

‘రాత్రి రక్షణ సహజత్వాన్ని కవిత్వీకరిస్తుంది. వీధి కుక్కల అరుపులను కేవలం శబ్దంగా కాకుండా, "నిదురించే కాలనీని నిద్ర లేపుతున్న" ఒక హెచ్చరికగా, రాత్రి వేళ కాపలాగా అభివర్ణించడం నిత్యజీవిత సత్యాన్ని ఆవిష్కరించింది. 

మూడవ భాగంలో ఆర్ద్రత - మనోవేదన నను పలికిస్తుంది. ఇక్కడ కవిత్వం మరింత లోతుకు వెళ్ళింది. ఆకాశాన్ని సముద్రంతో, చందమామను ఒంటరి నావికుడితో పోల్చడం క్లాసిక్ ఇమేజరీ.

"అక్కడో పచ్చి బాలింత 

అలిసిపోయి పడుకుంది 

 పాలకోసం పసిపాప గుక్కపెట్టి ఏడుస్తున్నట్లు...

"రాత్రి వేళ వినిపించే ఏడుపు లేదా ఏదో ఒక ఆర్తి, నిద్రపట్టని కవి/రచయిత మనసును మెలిపెట్టడం ఇక్కడి భావోద్వేగాన్ని పెంచింది. బాహ్య ప్రపంచం నుంచి కవి అంతరంగంలోకి ప్రయాణం ఇక్కడ కనిపిస్తుంది. నాల్గవ భాగంలోఆశావహ దృక్పథం - మేల్కొలుపు లోకి తీసుకెళ్తుంది. చీకటి పలచబడటాన్ని "వెలుగుమొగ్గలు విచ్చుకుంటున్న నిశ్శబ్ద పరిమళం" అనడం ఎంతో నవ్వమైన భావచిత్రం. కాంతికి పరిమళాన్ని ఆపాదించడం కవితకు హైలైట్. అంటే ఒక ఇంద్రియ అనుభూతిని మరొకదానితో పోల్చడంలో కవి ప్రతిభ కనిపిస్తుంది. ‘‘నిదురిస్తున్నరొండు" లో ‘రెండు’ బదులుగాను, ‘‘చందమామ’’ అనకుండా "సందమామ" అనే పదాన్ని ప్రయోగించడం బహుశా గ్రామీణ/జానపద శైలిని సహజత్వం కోసం కావాలనే వాడారేమో. అయితే, కవిత మొత్తం ఆధునిక/వచన శైలిలో సాగింది. కవిత్వనిర్మాణ పరంగా గుర్తించాల్సిన ఇలాంటి ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. 

వైయక్తికానుభూతులను కలిగిస్తూనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలపై కవిత్వీకరించడం మరొక ప్రత్యేకత. కవి కేవలం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మాత్రమే కాక, ప్రపంచీకరణ సృష్టించిన సంక్షోభాలను కూడా కవిత్వీకరించారు. "అరచేతిలో గ్లోబు",  అమెరికా ఎలా "గ్లోబల్ నేరస్థుడు"గా మారుతుందో అద్భుతంగా వర్ణించాడు కవి. కవి ప్రకృతి నియమాలతో కవితను ప్రారంభిస్తూ, "లేడిని పులి వేటాడటం" అనేది ఒక సహజమైన ప్రకృతి ధర్మమని చెప్పారు. కానీ, ఆధునిక ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు తమ స్వార్థం కోసం బలహీన దేశాలపై ఆధిపత్యం చలాయించడాన్ని 'ప్రాంతీయ ధర్మం', 'అంతర్జాతీయ ధర్మం' అంటూ అందమైన పేర్లతో సమర్థించుకోవడాన్ని కవి ఈసడించుకున్నారు.  

‘‘లేడిని పులివేటాడితే! 

ప్రకృతిధర్మం

ఒక ప్రాంతానింకో

ప్రాంతం ఆక్రమిస్తే!

ప్రాంతీయధర్మం

ఒకదేశాన్ని

 మరోదేశం కబళిస్తే

 అంతర్జాతీయ ధర్మం

దేశాధ్యక్షున్ని కూలదోసి

ఆ దేశన్యాయస్థానంలో

నేరస్థున్ని చేసి

మరణ శిక్షవేయించి మట్టుబెడితే 

ఇది ఏ ధర్మం? '' 

అనిఅమెరికా అగ్రాధిపత్యాన్ని ప్రశ్నించి, దానికి అది చేస్తున్న ‘‘అంత్యతాధునిక ఆయిల్ ధర్మమా!’’ అని వ్యంగ్యంగా ఆ దేశ అనైతికతను ఎత్తి చూపిస్తాడు కవి. చివరికి ‘‘ఓ గ్లోబల్ నేరస్థుడా! ‘‘ అని సంబోధిస్తూనే ఏదొక నాడు బలవంతమైన సర్పం కూడా ‘‘చలిచీమల చేచిక్కిన పాములా’’  ఆ దేశం ఇతర దేశాల చేతుల్లో పడి చావకతప్పదని భవిష్యదర్శనాన్ని చూపిస్తున్నాడు కవి. ఎంతటి శక్తివంతమైన శత్రువైనా, ప్రపంచ ప్రజలంతా ఏకమైతే లొంగక తప్పదని చెప్పడానికి "చలిచీమల చేచిక్కిన పాములా" అనే అద్భుతమైన సామెతను ప్రతీకగా వాడారు. అమాయక ప్రజల కన్నీళ్లు ఊరికే పోవని, ఆ "కన్నీటి అక్షరాలతో" ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు రాసే 'మరణశాసనాన్ని' ఏ గ్లోబల్ నేరస్థుడూ తప్పించుకోలేడని కవి సామ్రాజ్యవాద శక్తులకు తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు కవి.  "మార్చింగ్ టూ బీజింగ్" వంటి కవితలు ప్రపంచవ్యాప్త రాజకీయాలు, మానవ సంబంధాల విధ్వంసాన్ని ప్రశ్నిస్తాయి. గ్లోబలైజేషన్ వల్ల మనుషులు ఎంత యాంత్రికంగా మారిపోతున్నారో, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా విస్తరిస్తోందో ఈ కవితలు ఎత్తిచూపుతాయి. 

‘‘జీవితానికి పర్యాయపదం గాయం

 నిరంతరం గాయపడుతూ

ఆయుధాలనన్ని ఎదుర్కొన్నప్పుడే!

అద్భుత ఔషధాయుధమవుతావు

చివరాఖరికి నీవో తెల్లపావురమవుతావ్అప్పుడు

నీ అరచేతిలో

గ్లోబవుతుంది 

 ఈ భూగోళం…‘‘ 

ఈ సంపుటిలో అంతస్సూత్రంగా సాగే మరొక ముఖ్యమైన వస్తువు 'అస్తిత్వ వాదం'. కవి, విమర్శకుడు సిద్ధార్థ తన ముందుమాటలో అన్నట్లు, బాణాల శ్రీనివాసరావు "అస్తిత్వ జలాల్లో కదిలే ఒంటరి నావికుడు". మనిషి ఎదుర్కొంటున్న అంతరంగిక సంక్షోభం, భయం, ఒంటరితనం వీరి కవితల్లో స్పష్టంగా కనిపిస్తాయి. "భయం ఊబిలో..", "నేనేమౌతానో!", "ఐసోలేషన్" వంటి కవితలు వర్తమాన కాలంలో మనిషి అనుభవిస్తున్న అభద్రతా భావాన్ని, ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తాయి. 

కవికి తన పుట్టిన ఊరు, తల్లిదండ్రుల పట్ల ఉన్న గాఢమైన అనుబంధం కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంది. "అమ్మొక సముద్రం.." కవితలో అమ్మ ప్రేమలోని అనంతత్వాన్ని ఆవిష్కరించారు. తన సాహితీ వృక్షానికి తల్లివేరు తన ఊరేనని కవి సగర్వంగా ప్రకటించుకున్నారు. "మమ్మల్నిలా బతకనీయండిరా!", "బహుజనం", "వలసజీవులు" వంటి కవితలు సమాజంలో అణచివేతకు గురవుతున్న శ్రమజీవుల, వలస కార్మికుల పక్షాన గొంతుకను వినిపిస్తాయి. వ్యవస్థలోని అసమానతలపై తిరుగుబాటు, పీడిత ప్రజల పట్ల సానుభూతి వీరి వస్తువులలో ప్రధానమైనవి. 

‘‘కులం కంపు ఇంకా.. ఇంకా.. 

ఈ దేశం దేహంనిండాప్రవ హిస్తున్నందుకేగా

 మేమింకా కులవృత్తుల గుంజలకు

కుట్టివేయబడ్డ మూగజీవాలమైనం

 నయానాగరికులమధ్య

 బతుకుబండినీడ్చే బహుజనులమైనం’’ అని కులవృత్తుల పేరుతో ఆర్థికంగా, సామాజికంగా జరుగుతున్న అణచివేతను కవిత్వీకరించి, సామాజిక వాస్తవికతకు ప్రధానమైన పీఠం వేశాడు కవి. 

చిన్నతనంలో ఊరిలో చూసిన భజనలు, తోలుబొమ్మలాటలు, అమ్మ పాడిన బతుకమ్మ పాటల లయ ఒకవైపు... ఆంగ్ల సాహిత్య పఠనం ద్వారా అబ్బిన అంతర్జాతీయ ఆధునిక దృక్పథం మరోవైపు వీరి కవిత్వ శైలిని సుసంపన్నం చేశాయి. నిశ్శబ్దాన్ని శబ్దంగా మార్చడం, ఆవేదనను అక్షరబద్ధం చేయడంలో వీరి శైలి విశిష్టమైనది. 

బాణాల శ్రీనివాసరావు గారి కవిత్వంలో వస్తువు ఎంత బలంగా ఉంటుందో, దానిని వ్యక్తపరిచే శైలి, శిల్పం కూడా అంతే రమణీయంగా ఉంటాయి. ఆంగ్ల కవులైన కీట్స్, వర్డ్స్వర్త్ లతో పాటు అమెరికన్ బీట్ కవులు, తెలుగు దిగంబర కవుల ప్రభావం వీరి అభివ్యక్తిని మరింత పదును పెట్టిందనిపిస్తుంది.

రోమన్ కవి హొరేస్ అన్నట్లు "సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం బోధించడంతో పాటు ఆనందింపజేయడం కూడా". బాణాల శ్రీనివాసరావు గారి 'రాత్రి సింఫని' ఈ రెండు లక్షణాలను అనేక కవితల్లో నెరవేరుస్తుంది. సమాజంలోని రుగ్మతలను, మనుషుల అంతరంగిక మథనాన్ని వస్తువుగా స్వీకరిస్తూనే, వాటిని అత్యంత కళాత్మకమైన, హృద్యమైన అభివ్యక్తితో కవిత్వంగా మలిచడం విశేషం. కవి తన కవిత్వంలో సందర్భానుసారంగా అద్భుతమైన ప్రతీకలను, భావచిత్రాను ఉపయోగిస్తారు.  "నీటినిప్పు", "వెన్నెలశిల్పం" వంటి పదబంధాలు వారి సృజనాత్మక అభివ్యక్తికి అద్దం పడతాయి.

పర్గేటోరియో స్వాగతం" కవితా పంక్తులు కవిత్వ ఆంతర్యాన్ని, దాని సామాజిక బాధ్యతను, వర్తమాన సాహిత్య విమర్శలోని లోపాలను అత్యంత ప్రగతిశీల, తాత్విక కోణంలో విశ్లేషించాయి. పర్గేటోరియో' (Purgatorio) అనేది ఇటాలియన్ మహాకవి డాంటే అలిఘేరి (Dante Alighieri) రాసిన ప్రపంచ ప్రసిద్ధ కావ్యం "ది డివైన్ కామెడీ" (The Divine Comedy) లోని రెండవ భాగం పేరు. క్రిస్టియన్ (కథోలిక్) మత విశ్వాసాల ప్రకారం, మరణం తర్వాత ఆత్మలు నేరుగా స్వర్గానికో (Heaven), నరకానికో (Hell) వెళ్ళే ముందు.. తాము చేసిన పాపాలను పశ్చాత్తాపంతో కడుక్కొని, తమను తాము శుద్ధి చేసుకునే మధ్యంతర స్థలాన్ని 'పర్గేటరీ' లేదా ఇటాలియన్ భాషలో 'పర్గేటోరియో' అంటారు. ఇక్కడ ఆత్మలు బాధలను అనుభవిస్తూనే, చివరికి పవిత్రతను సాధించి స్వర్గానికి వెళ్ళడానికి అర్హత పొందుతాయి. ఈ పదాన్ని ఒక శక్తివంతమైన రూపకం (Metaphor)గా వాడుకున్నారు. కవి దృష్టిలో వర్తమాన సాహిత్య విమర్శ, సమాజం ఒక సంక్షోభంలో ఉన్నాయని భావిస్తున్నాడు. కేవలం అలంకారాలు, ప్రతీకలతో రాసే బాధ్యతారహితమైన కవిత్వాన్ని కాకుండా, సమాజంలోని దోపిడీని ఎండగట్టే నిబద్ధ కవిత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందంటాడు కవి. సమాజంలో లేదా సాహిత్యంలో పేరుకుపోయిన కల్మషాన్ని, నిస్సహాయతను వదిలించుకుని, బాధ  అంతర్మథనం ద్వారా సరికొత్త చైతన్యాన్ని, పవిత్రతను పొందే ప్రక్రియకు 'పర్గేటోరియో' ఒక ప్రతీకగా ప్రయోగిస్తూ కవిత్వం బాధ్యతాయుతంగా ఉండాలని భావిస్తున్నాడుకవి.  "సుప్తచేతనలోని కలల అలలు కరిగితే కవిత్వమా?" అని ప్రశ్నిస్తూ, కవిత్వం అనేది కేవలం మనస్సులోని అంతర్గత కలలు, ఊహల నుండి మాత్రమే పుట్టదని స్పష్టం చేశారు. కవిత్వంలో సామాజిక నిబద్ధత అనేది అబద్ధం కాదని, సమాజం నుండి పారిపోయి ముక్కు మూసుకుని తపస్సు చేసే కవులుగా కాకుండా, వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కవి పిలుపునిచ్చారు. "బాధలోంచి వచ్చే భావమే కవిత్వం! వేదనలోంచి వచ్చే నాదం కవిత్వం!!" అని మనిషి అనుభవించే బాధ, శ్రమజీవుల అంతరంగ వేదనల నుండి పుట్టే నాదమే నిజమైన కవిత్వమని, అది సమాజానికి సింఫనిలా (సంగీత లయలా) వినిపించాలని కవి ఈ పంక్తుల ద్వారా నిరూపించారు. ఇది కేవలం కవిత్వ విశ్లేషణ మాత్రమే కాదు, కవుల సామాజిక బాధ్యతను గుర్తుచేసే ఒక గొప్ప సాహిత్య మేనిఫెస్టో. ఈ కవితా సంపుటి నిండా కవిత్వం, సామాజిక స్పృహ రెండూ మిళితమై ప్రవహించాయి. ఒకేసారి హృదయాన్ని పల్లవింపజేస్తూనే, మెదడుని ఆలోచింపజేస్తుంది కూడా. అందుకే ఈ కవిత్వం ‘‘రాలిపడుతున్న పూలతో పాటు జారిపడుతున్నపరిమళాల

 గాయాల్నిచూడాలి

 ఆ గాయాలకు

కనీసం

 చూపుల లేపనం రాయాలి’’ అన్నట్లుగా సాగింది. 

డాక్టర్ బాణాల శ్రీనివాసరావు గారి ‘రాత్రి సింఫని’ కవితా సంపుటి సమకాలీన తెలుగు కవిత్వ రంగంలో ఒక వైవిధ్యభరితమైన, ఆలోచనాత్మకమైన మైలురాయి. ఈ సంపుటి కేవలం సామాజిక రుగ్మతలను ఎత్తిచూపే వేదిక మాత్రమే కాదు; ఇది అంతర్జాతీయ రాజకీయ సంక్షోభాలు, గ్లోబలైజేషన్ తెచ్చిన విచ్ఛిన్నత మొదలుకొని మనుషుల అంతరంగిక వేదనలు, అస్తిత్వ ఆరాటాల వరకు ప్రతి అంశాన్ని స్పృశించిన ఒక సమగ్ర జీవన దర్పణం. సాంప్రదాయ మూలాల పట్ల గౌరవం, ఆంగ్ల సాహిత్య పరిజ్ఞానంతో కూడిన ఆధునిక దృక్పథం కలగలిసిన వీరి శైలి తెలుగు కవిత్వానికి సరికొత్త నవ్యతను చేకూర్చింది. కవిత్వంలో నిబద్ధతను చాటుతూనే, బాధను భావంగా, వేదనను నాదంగా మలిచిన ఈ 'సింఫని'.. పాఠకుడిని కేవలం ఆనందింపజేయడమే కాకుండా, ఒక నూతన సామాజిక-తాత్విక చైతన్యం వైపు నడిపిస్తుంది. చీకటి లాంటి వర్తమాన సంక్షోభాలను చీల్చుకుంటూ మానవత్వం, శాంతి అనే తెల్లపావురాల ఆశావహ దృక్పథాన్ని ప్రకటించిన ‘రాత్రి సింఫని’ అక్షరరూపం దాల్చిన ఒక సార్వత్రిక మానవ హృదయ నాదం. 

(పీచర సునీతారావు స్మారక సాహిత్య పురస్కారాన్ని ‘రాత్రిసింఫనీ’ కవితా సంపుటికి ప్రకటించిన సందర్భంగా…)

– డా.దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, పూర్వశాఖాధ్యక్షులు, తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్. ఫోన్: 9989628049


08 ఫిబ్రవరి, 2026

దార్ల మాట.. సామాజిక చైతన్య నీతి.. శతక పరిమళం...( ఒక స్పందన)

 దార్ల మాట..

సామాజిక చైతన్య నీతి.. శతక పరిమళం...

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో 'శతకం' ఒక విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుంది. భక్తి, నీతి, వైరాగ్యాలను సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా చేరవేయడంలో శతక కవుల కృషి అనన్యసామాన్యం. నేడు సమాజం విలువలు కోల్పోయి, యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, డా. దార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన 'దార్ల మాట' శతకం ఒక చల్లని వెన్నెల జల్లులా, నైతిక మార్గదర్శిలా ఆవిర్భవించింది. ఈ శతకంలోని పద్యాలను, అందలి అంతరార్థాలను పరిశీలిస్తే రచయిత సామాజిక బాధ్యత, మానవీయ కోణం స్పష్టంగా కనిపిస్తాయి.

రచయిత ఈ శతకంలో కుటుంబ వ్యవస్థకు పెద్దపీట వేశారు. "తల్లి తండ్రి నిలుచు సాటి త్యాగ శీలములేదు / అన్ని అందగ నున్న చో భయము లేదు" అని చెబుతూ తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటిచెప్పారు. రామాయణ గాథలోని రాముడి పితృవాక్య పరిపాలనను, భరతుని సోదర ప్రేమును నేటి కాలానికి అన్వయిస్తూ ఆయన రాసిన పద్యాలు అద్భుతం. ముఖ్యంగా "అమ్మ వలె నీవు మమతను పంచగలుగు / ఆడ పడుచును గౌరవ పరచ వలయు" అన్న పద్యం నేటి సమాజంలో స్త్రీ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని నొక్కి చెబుతోంది.

మిత్రత్వం అంటే ఎలా ఉండాలో చెబుతూ, భాగవతంలోని కృష్ణ-కుచేల మైత్రిని ఉదహరించిన తీరు అమోఘం. "ఆప దందున ఆదుకొను నట్టి వాడె / మంచి మిత్రుడని తెలియు మనువ పందు". సంపదలు ఉన్నప్పుడే కాదు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని, అటువంటి స్నేహం సమాజానికి రక్షణ కవచమని కవి వర్ణించిన తీరు ప్రశంసనీయం.

కేవలం అక్షర జ్ఞానం విద్య కాదు, అది వివేకాన్ని, క్రమశిక్షణను ప్రసాదించాలని రచయిత ఆకాంక్షించారు. 'చదువు నేర్చిన బిడ్డలే జాతి సంపద' అని చెబుతూ, విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, మానవత్వం విలువలు కలిగిన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

డా. దార్ల వెంకటేశ్వరరావు గారు తమ పద్యాలలో ఎక్కడా క్లిష్టమైన పదజాలాన్ని వాడకుండా, తేటతేనెల తెలుగులో, సరళమైన శైలిలో గొప్ప జీవన సత్యాలను నిక్షిప్తం చేశారు. ప్రతి పద్యం చివర 'దారి చూపించు నట్టిది దార్ల మాట' అనే మకుటం ఒక హెచ్చరికలా, ఒక భరోసా లా వినిపిస్తుంది. ప్రస్తుత కాలంలో ఇటువంటి శతకాలు రావడం సాహిత్యానికి మాత్రమే కాకుండా, సమాజానికి కూడా ఎంతో అవసరం. దార్ల వారు తమ కలం ద్వారా మరిన్ని ఇటువంటి సామాజిక స్పృహ కలిగిన, నీతిని ప్రబోధించే శతకాలను వెలువరిస్తారని, భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారని ఆశిస్తున్నాను.

డా. దార్ల వెంకటేశ్వరరావు గారు చేపట్టిన ఈ సాహిత్య యజ్ఞం నిరంతరం కొనసాగాలి. మీరు ఇంకా మరెన్నో శతకాలను, సాహిత్య వ్యాసాలను రచించి తెలుగు భాషా సరస్వతిని అలంకరించాలని మనసారా కోరుకుంటున్నాను.

Bureddy blooms.

B.RamakrishnaReddy

Paloncha.

Ph: 7382546949.

( అక్షరి వాట్సాప్ గ్రూప్, 8.2.2026 సౌజన్యంతో)

26 మే, 2025

పహెల్గామ్ కవితాసంకలనం ముందుమాట 2025

 

  దేశభక్తిని ప్రతిధ్వనించే

భారతీయ ఆకాంక్షల ప్రతిఫలనం

 


 

22 ఏప్రిల్ 2025 వ తేదీన మన భారత భూభాగంలో, మన భారతదేశపాలనలో ఉన్న, జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు ముస్లిమేతర పర్యాటకులపై  దాడి చేసి 26 మంది పర్యాటకులను దారుణంగా చంపేశారు. ఈ ఉగ్రవాదులను పాకీస్తాన్ దేశం పెంచి పోషిస్తుంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ఒకరు ఒక ఇంటర్వ్యూలో ఆ ఉగ్రవాదులను తమ దేశమే తయారుచేసిందని కూడా ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు, ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులు మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాలవారూ ఈ దుశ్చర్యను ఖండించారు. ఈ దాడి ఒక పథకం ప్రకారం భారతీయులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా కాశ్మీర్ ని అస్తవ్యస్తం చేసి, దాన్ని స్వాధీనం చేసుకొని, దాని ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి, మరింత అల్లకల్లోలాన్ని సృష్టించాలనేది వారి వ్యూహంగా కనిపిస్తుంది. ఈ పహల్గమ్ దాడికి స్పందించి ఎంతోమంది కవులు పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కవిత్వం రాస్తున్నారు. ప్రముఖ సాహితీవేత్త డా.వైరాగ్యం ప్రభాకర్ గారు పహల్గామ్ దాడి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది క


వుల కవితలను సేకరించి పుస్తకంగా తీసుకొస్తున్నారు. దేశ ప్రజలకు, సైనికులకు అండగా మేము ఉన్నామనే ఒక సందేశాన్ని కవితా సంకలనం ద్వారా పంపిస్తున్నారు. దేశంలోని హిందువులు, ముస్లిములు, ఇతర మతాలకు చెందిన వారు కూడా ముక్తకంఠంతో ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, ఒకప్పటి కాశ్మీర్ ప్రస్తుతం ఎలా ఉందో, దాన్ని భవిష్యత్తులో కూడా ఎలా కాపాడుకోవాలో కవులు తమ కవితల ద్వారా తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

కాశ్మీర్: సాహిత్య, సాంస్కృతిక సంపద:

కాశ్మీర్ అనేది కేవలం అందమైన లోయలతో  మాత్రమే కాదు, ఇది భారత సాహిత్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఒక మహోన్నత కేంద్రం.

‘’శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం, సోన్మార్గ్

అందానికే అందంలా స్వర్ణ వర్ణ కాంతి

ధార అవనిపైన విరబూసిన అందమైన వెన్నెల స్విట్జర్లాండ్ మినీగా పేరొందినదీ నేల’’ (వెల్ముల జయపాల్ రెడ్డి)అనడం ద్వారా కాశ్మీర్ , తదితర ప్రాంతాలలో కేవలం సౌందర్యం మాత్రమే కాదు, దాని వెనుక ఒక ఐతిహాసిక (historical), సాంస్కృతిక నేపథ్యం ఉందంటున్నారు. కాశ్మీర్ ప్రాచీనంగా ‘శారదాపీఠం’, ‘శారదా దేశం’ అని పిలువబడేది. శారదాదేవి ఆలయం ఇక్కడే ఉండటం వల్ల ఇది విద్యా కేంద్రంగా పేరు పొందింది. అనేకమంది సంస్కృత పండితులు, తత్వవేత్తలను ప్రపంచానికి అందించింది. ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ శారదా పీఠాన్ని సందర్శించారు. స్విట్జర్లాండ్ లో ఉండే మంచు పర్వతాలు, తోటలు, సరస్సులు‌ వంటివి ఎన్నో ఇక్కడ ఉన్నాయి. 20వ శతాబ్దంలో భారతీయ చలనచిత్రాలు కాశ్మీర్ లో చిత్రీకరించడంతో  దీనికి ‘‘మినీస్విట్జర్లాండ్’’ అనే పేరొచ్చింది. ఇది కేవలం ఉపమానమే కాక, ప్రాంతానికి ఉన్న అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సూచించే మాట. కాశ్మీర్‌కు ఉన్న అపూర్వ సౌందర్యాన్ని శక్తివంతంగా వ్యక్తీకరిస్తూ స్వర్ణ వర్ణ కాంతి అన్నారు. సూర్యోదయ సమయంలో ఆ మంచు పర్వతాలపై పడే వెలుగు, బంగారు రంగులో మెరుస్తూ మనసును మైమరిపింపజేసే దృశ్యాన్ని మనముందుంచారు.

‘’అక్కడ వేద పండితుల వేదఘోష

సజీవంగా వినబడుతుంది.

ఆది శంకరులు తిరుగాడిన వేదభూమి

శారదామాత జ్ఞానవీచికలు కాశ్మీరాన్ని

పండితుల స్వర్గధామమై నిలిపింది

శాంతి ధామం అనాటి కాశ్మీరం

నేడది వుగ్రవాదుల అడ్డాగా మారింది.’’ (వారణాసి భానుమూర్తి రావు).  నిజమే కదా… కాశ్మీర్ కేవలం అందాల నందన వనమే కాదు; ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచిన ప్రాంతం. అలంకార శాస్త్రంలో ప్రపంచానికి తల మాణికమై నిలిచే ఎంతోమంది ఆలంకారిక శాస్త్ర పండితులు ఈ ప్రాంతం నుండే వచ్చారు. కావ్యాన్నీ, దాని శబ్దార్థాలలోతులను అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడే గొప్ప సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం. ఇది ‘ధ్వన్యా లోకం’ అనే లక్షణ గ్రంథాన్ని ఆనంద వర్ధనాచార్యులు వారు అందించారు.  ఆయన కాశ్మీర్ రాజు అవంతి వర్మ ఆ స్థానపండితుడు. ఈ గ్రంథానికి ‘లోచనమ్’  పేరుతో వ్యాఖ్య రాసిన వారు, భరతుని నాట్య శాస్త్రానికి ‘అభినవభారతి’ పేరుతో భాష్యం రాసిన వారు, సహృదయ తత్వాన్ని ప్రపంచానికి చాటిన వారు అభినవగుప్తుల వారు. ఆయన కూడా ఈ ప్రాంతం నుండి వచ్చిన వారే. వక్రోక్తి సిద్థాంత కర్త కుంతకుడు, ఔచిత్య సిద్థాంత కర్త క్షేమేంద్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహా పండితులు ఈ ప్రాంతం నుండే వచ్చారు.కాశ్మీర్ చరిత్ర, ఆ రాజుల చరిత్రకు దర్పణం పట్టే రాజతరంగిణిని రచించిన కల్హణుడు కూడా కాశ్మీర్ నుంచి వచ్చినవాడే. కావ్యాన్ని అర్థం చేసుకొనే జ్ఞానాన్ని  ప్రపంచానికి అందించారు. అందుకే అది భారతదేశానికి పవిత్రమైన, మహిమాన్విత భూమిగా భావిస్తారు. భరతమాతకు శిరస్సుగా అభివర్ణిస్తారు. అక్కడ ఇప్పుడు ఉగ్రవాదమూకలు చేరాయనే బాధను కవులు వ్యక్తం చేస్తున్నారు.

‘’మృగాలతో ఆడిన భరతుని రాజ్యమిదిరా!

త్యాగాలకు స్ఫూర్తినిచ్చిన పుణ్యభూమిరా ! సత్యాహింసల ధర్మనిరతిగల ధరణీరా!

వీరమాత తిలకం దిద్దిన భారత భూమిరా! అలెగ్జాండర్ను మార్చిన అవనిరా!

భిన్నత్వంలో ఏకత్వం గల

మానవత్వమున్న మహీరా !

దేశమాతను కాపాడే ధీరులం భారతీయులం మేమేరా!’’ (గుందవరం కొండల్ రావు) అని భారతదేశానికి ఉన్న చారిత్రక వారసత్వాన్ని, ఆ వీరత్వాన్ని గుర్తుచేస్తారు కవి.

 భారతదేశం విభిన్నజాతుల ప్రదర్శనశాలగా చరత్రకారులు భావిస్తారు. అందరూ కలిసిమెలిసి, ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకొనే గొప్పగుణం భారతీయలది అంటూ…

‘’భిన్న సంస్కృతుల సమాహారం

నా జన్మభూమి వివిధ వర్ణాల పూదండ

నా భరతఖండం

యే వినాశ కాలమో, మరే విపరీతబుద్ధో

పహల్గామ్ పర్యాటకులపై పాశవిక దాడి

పిట్టల్లా కాల్చి పొట్టన పెట్టుకున్న ఉగ్రమూక

కుంకుమ పువ్వులు పూయాల్సిన ప్రాంతాన

నెత్తుటి ఏర్లు చిమ్ముతున్నాయి.’’ (నాంపల్లి సుజాత అన్నవరం)

‘‘భిన్న సంస్కృతుల సమాహారం’’ ‘‘వివిధ వర్ణాల పూదండ’’ వంటి పదబంధాలు భారతదేశం యొక్క బహుళ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చిత్రిస్తున్నాయి.

"కుంకుమ పువ్వులు పూయాల్సిన ప్రాంతాన / నెత్తుటి ఏర్లు చిమ్ముతున్నాయి’’: ఈ పంక్తులు కవితలో సాహిత్య సౌందర్యాన్ని శిఖరప్రాయంగా చూపిస్తుంది. కాశ్మీర్ లోయ యొక్క సౌందర్యాన్ని, శాంతిని, సంప్రదాయాన్ని సూచించే ‘కుంకుమ పువ్వులు’ను, హింస, మరణం, విధ్వంసాన్ని సూచించే ‘నెత్తుటి ఏర్లు’తో వ్యతిరేకించడం ద్వారా కవయిత్రి దాడి యొక్క దారుణాన్నీ,, కాశ్మీర్ యొక్క దుర్గతినీ శక్తివంతంగా చిత్రిస్తారు. ఈ వ్యతిరేక చిత్రణ కాశ్మీర్ యొక్క గత వైభవం, వర్తమాన దుఃఖం మధ్య సంఘర్షణను హృదయస్పర్శిగా వ్యక్తీకరిస్తుంది.

ఉగ్రవాదం:మానవత్వంపై దాడి:

పహల్గామ్ దాడి కేవలం ఒక భౌగోళిక సంఘటన కాదు, ఇది భారతీయ సంస్కృతి, మానవత్వం, శాంతి ఆదర్శాలపై దాడి. కవులు ఈ దాడిని ఖండిస్తూ, దాని దారుణతను, భావోద్వేగ ప్రభావాన్ని తమ కవితలలో స్పష్టంగా చిత్రించారు. కాశ్మీర్ యొక్క పవిత్రత నిండిన ఆ హిమగిరులను రక్తంతో మరకలు చేయడం ద్వారా దాడి యొక్క భీకర స్వభావాన్ని,, సౌందర్యం మీద జరిపిన హింస,  విధ్వంసాలను దృశ్యాత్మకంగా చిత్రిస్తూ…

‘’రుధిరంతో తడిపారు

కాశ్మీరపు హిమగిరులను...

మిన్నంటిన భారతీయుల ఆర్తనాదాలతో పంచభూతాలు ప్రకంపించాయి.’’ (ఎస్.స్రవంతి) అని వర్ణించారు. పంచభూతాల ప్రకంపనం అనడం ద్వారా ఆ దాడి యొక్క సామూహిక, విశ్వవ్యాప్త ప్రభావాన్ని సూచిస్తూ, మానవత్వంపై జరిగిన అన్యాయాన్ని హృదయవిదారకంగా వ్యక్తీకరిస్తుంది. పంచ భూతాల ( పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం)  ఘన స్థితిని సూచిస్తుంది. హిందూ తత్వశాస్త్రంలో ప్రకృతిని రూపొందించే ఐదు ప్రాథమిక మూలకాలుగా భావిస్తారు. ఇవి సృష్టి యొక్క మూలాధారాలుగా పరిగణించబడతాయి.  సమస్త విశ్వం ఈ ఐదు భూతాల సమ్మేళనంతో రూపొందినదని నమ్ముతారు. ఉగ్రవాదుల దాడి వల్ల భారతీయుల ఆర్తనాదాలు (విషాదం, ఆవేదన)  విశ్వవ్యాప్తంగా, సమస్త సృష్టిని (పంచభూతాలను) కంపించేంత శక్తివంతమైనవిగా చిత్రీకరించడం వల్ల, ప్రపంచ దేశాలన్నీ ఎలా స్పందించారో చిత్రించినట్లయ్యింది. అటువంటి ప్రకృతిలో భాగమే అక్కడ హిమాలయాలు… అక్కడి లోయలు… అక్కడ ప్రజలు.. వారి స్థితి ఎలా ఉందో చెప్తూ..

‘’ఎరుపెక్కిన హిమాలయాలు..

మూగబోయిన కాశ్మీరీ లోయలు..

నివ్వెరబోయిన పర్యాటకులు..

భరతమాత సిగలో తూటాలు..’’ (అక్కిమీ సింహ) అన్నారు.  ఆ భూమిని సాధారణంగా భరతమాతకు శిరస్సుగా భావిస్తారు. పరిమళాలు వెదజల్లే కాశ్మీర్లో తూటాలు పేల్చిన దుండగుల దుశ్చర్యలను సిగలో తూటాలుగా అభివర్ణించి వారి వికృత చేష్టలను మనముందుంచారు.

‘’మంచుగడ్డలు నెత్తుటి ముద్దలై

పసుపుతాళ్లను తెంచుకుంటూ..

కర్కశత్వపు గుండె తొడుగుకున్న

పరాన్నజీవులు ఉగ్ర తూటాలై

శాంతి కపోతాల

మరణ శాసనాన్ని ముద్రించాయెందుకో..!’’ (డాక్టర్ మోటూరి నారాయణరావు)  అని ప్రతి భారతీయుడు బాధపడిన దుఃఖ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని కవిత్వమయం చేశారు. కవిత్వం కానీ పదం లేదు ఈ కవితలో.  ఈ దాడిలో పర్యాటకులలో అనేక మంది నూతన వధూవరులు ఉన్నారు. భార్యల ముందే వారి భర్తలను నేరుగా కాల్చి చంపారు. హృదయవిదారకమైన ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో ఎంతో మందిని కదిలించాయి. దీన్ని కవిత్వీకకరిస్తూ…

‘’కాశ్మీరలోయలో కన్నీరు వరదలై

మిన్నంటే నవవధువు ఆర్తనాదం

కట్టెదుట ముష్కరదాడికి

పతులను కోల్పోయి సతులు

భయాందోళనతో భోరున విలపించిన భీకరక్షణాలు’’ (ముడుంబై శేషఫణి) గా అభివర్ణించారు.

 ఇలాంటి దాడులు ఎలాంటి వాళ్ళు చేశారు చెప్తూ...

‘’మతి తప్పిన

గతి తప్పిన

మతోన్మాదం చేసిన విషాదమిది’’ ( ఆకుల రఘురామయ్య) అని మతం పేరుతో చేసిన ఉన్మాదాన్ని కవిత్వీకరించారు.

సాధారణంగా మతం ప్రేమను పెంచాలి. మానవత్వాన్ని పెంపొందించాలి. కానీ మతం పేరుతో...  

‘’చంపడం,చావడం పగలగొట్టడం,

నేనే గొప్ప అనుకోవడం నీచం... నీచత్వమే...మతం అనడం మూర్ఖం’’ (షాజీదా భేగం) అవుతుందని తన ఆగ్రహాన్ని కవిత్వంగా వర్ణించారు.

ఒకప్పుడు ఎటు చూసినా సుందర దృశ్యాలతో  అలరారే దాంతో ఎలా ఉందో వర్ణిస్తూ…..

‘’ఏం చూసేట్లు లేదు! ఏం వర్ణించేట్లు లేదు!

కాశ్మీర్ చెట్ల నిండా తూటాల పండ్లు

 పచ్చని ప్రకృతి లోయల్లో రక్త జల ప్రవాహలే

ఒక దృశ్యం చూసి మరో దృశ్యం కనాలంటే

అణువణువునా ముష్కరుల గాలాలు వేసి వున్నాయి.’’ (తమ్మా రాజా) అని ప్రతి భారతీయుడు బాధపడుతున్న వేదన కవిత్వమయ్యింది. ఉగ్రవాదులు ఇలా ఎందుకు చేస్తున్నారు? మేధావులు పలు రకాలుగా ఊహిస్తున్నారు.

జమ్మూ & కాశ్మీర్‌లో సాధారణస్థితి తిరిగి రావడాన్ని దెబ్బతీయడం, భారతదేశంలో మతసామరస్యాన్ని రెచ్చగొట్టడం, 2024లో కాశ్మీర్ లోయను సందర్శించిన 23 మిలియన్ల పర్యాటకులుగా నమోదైన ఆర్థిక వ్యవస్థ మరియు పర్యాటక వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేయాలనుకోవడం, పాకిస్తాన్ నుండి సీమాంతర ఉగ్రవాదం కొనసాగడానికి అవకాశాలను సృష్టించడం వాళ్ళ లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

ఈ ప్రాంతంలో ఈ ఉగ్ర మూకల దాడి అనేకసార్లు చేశారు. ఆ దాడుల్లో ఎంతోమంది చిన్నపిల్లలు, మహిళలు చనిపోయారు. దీన్ని కవిత్వం చేస్తూ…

‘’పసి మొగ్గలు, పడచు స్త్రీలు.

పండు ముదుసలులు

ఒరిగి పొయిన వారి వంశ వృక్షాలను జూసి

వలవలా ఏడుస్తుంటే ...!

కట్టలు ద్రించు కొని ప్రవహించే కన్నీరు

సింధూ నదిలో కలుస్తదనుకోలేదు.

మతం పేర మారణ హోమం సృష్టిస్తుంటే

సుందర కాశ్మీరం విరిగి పోయి

దిక్కులు పిక్కటిల్లేలా విలపిస్తోంది!

రక్త తర్పణానికి రాలి పోయిన

కుంకుమ పూలతో అంజలి ఘటిస్తోంది!’’ (చిట్యాల ఉపేందర్)  అని దుఃఖ దృశ్యాన్ని మనముందు నిలుపుతున్నారు.

        

‘’ముష్కరుల చేతలకు

నుదుటి కుంకుమ నివ్వెరపోయింది

కాళ్ల పారాణి కన్నీరు పెట్టింది.

…

ఏ శిక్షతో చెరపాలి ఈ చేదు జ్ఞాపకాన్ని

తడియారని ఆ కంటి చెమ్మను

ఏ దౌత్యం సమాధాన పరుస్తుంది!?

ఏ మతం రప్పిస్తుంది.

తీసిన ఆ ప్రాణాలను?’’ (కవిత పాటిబండ్ల) అని ఆ దాడులలో మరణించిన వారి బంధువులు, మానవతావాదులు నిలదీస్తున్నారని కవిత్వమయ్యారు.

‘’కొద్ది నిమిషాల్లోనే

ఇరవై ఆరు నిండు ప్రాణాలను

నిలబెట్టి బలి తీసుకున్నాయి ముష్కర మూకలు

ఆ దారుణం చూడలేక

మంచు కొండలు నీరైనాయి.

ఆ ఘాతుకం గాంచలేక

ఎర్రని యాపిళ్ళు నల్లగైనాయి.

ఎందుకింత దారుణ మారణ హోమం.!

ఏమైపోయింది మనిషిలోని దయాగుణం.?

ఎక్కడ దాక్కుంది మానవతా దైవత్వం.!?

మతోన్మాద ఉగ్రవాదమా !

 నీవింత నీచమా.!!’’ ( బొమ్మరాత యల్లయ్య)

మంచు కరిగిపోయి నీరవ్వడం సహజం. కానీ దీన్ని ప్రకృతి కన్నీళ్లు పెట్టుకుంటుందని ఊహించడం కవి భావుకతకు నిదర్శనం. దీనితో పాటు కొంతమంది మతాన్ని దానిలోని మూల సూత్రాలను విస్మరించి, వక్రీకరించి ప్రబోధిస్తుంటారు.  ఆ వక్రీకరణతో గొప్పదని తీవ్రవాద భావజాలం ఉగ్రవాదం కంటే భయంకరమైంది. అలాంటి దాన్ని మతోన్మాద ఉగ్రవాదంగా అభివర్ణిస్తున్నాడు కవి.  ఘోరమైన ఆ దృశ్యాన్ని కుంకుమపూల దుఃఖ సముద్రంగా అభివర్ణించడం ఎంతో సమయస్పూర్తితో.  ఔచిత్యభరితమైన వర్ణనగా చెప్పుకోవచ్చు.

‘’సుందర కాశ్మీరం నెత్తురోడుతుంది.

మతోన్మాద ఉగ్రవాదం ఇనుప హృదయం

ప్రకృతంత స్వచ్ఛమైన పర్యాటక ప్రేమికుల్ని చిదిమేసిన వైనం

కంట తడి పెట్టించే భయానక దృశ్యం

కుంకుమ పూల దుఃఖ సముద్రం’’(పప్పుల రాజిరెడ్డి).

కాశ్మీర్ లోయ యొక్క సహజ సౌందర్యాన్ని మతోన్మాద ఉగ్రవాదం యొక్క హింసతో గాఢంగా విరుద్ధపరుస్తూ, దాని విషాదకర రక్తపాతాన్ని హృదయవిదారకంగా చిత్రించాడు కవి. “సుందర కాశ్మీరం నెత్తురోడుతుంది” అనడం ద్వారా లోయ యొక్క స్వచ్ఛమైన సౌందర్యాన్ని హింసతో కలుషితం చేయడాన్ని సూచిస్తుంది, అయితే “కుంకుమ పూల దుఃఖ సముద్రం” అనేది ఒక గొప్ప ఇమేజరీ. సాధారణంగా కాశ్మీర్ నుండి వచ్చే కుంకుమ పూలు  పుట్టబోయే పిల్లలు అందంగా, తెల్లగా పుట్టాలని గర్భిణీ స్త్రీలకు పాలలో కలిపి ఇస్తారు. ఇప్పుడు అవి రక్తంతో మునిగిన పుష్పాలుగా మారి దుంఃఖ సముద్రాన్ని తలపింపజేస్తున్నాయని  ఉత్ప్రేక్షిస్తారు కవి.

 “ఇనుప హృదయం”, “భయానక దృశ్యం” వంటి వర్ణనలు ఉగ్రవాదం యొక్క క్రూరత్వాన్ని, పర్యాటకులు, అక్కడ ఉండే స్థానికుల బాధను  శక్తివంతంగా ఆవిష్కరిస్తుంది. ఈ కవిత సౌందర్యాన్ని , దానిలో చేరిపోయిన విషాదం యొక్క సమ్మేళనంతో, కాశ్మీర్ యొక్క సంఘర్షణను సునిశితంగా వ్యక్తీకరిస్తారు కవి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే భారతీయులు యుద్ధం చేయవచ్చు కదా అనిపించవచ్చు. కానీ భారతీయులు శాంతిని కోరుకుంటారు. ఒక ఆధ్యాత్మిక దృక్పథం కలిగిన దేశం. ఎంతోమంది ఋషులు నడయాడారు. కనుక ఆ సంస్కారం ఇంకా కొనసాగుతున్న నేల. దీన్నిలా వర్ణిస్తారు కవయిత్రి.

‘’మా మౌనం నీకు చేతకానితనంగా అనిపిస్తుందేమో అది సద్గురువుల ఆశీస్సులతో వచ్చిన సభ్యత నిండిన సంస్కారం’’                         ( నెల్లూరు ఇందిర)

 ‘’మతమంటే కాదురా మారణ హోమం

మతమంటే కావాలి మానవ హితం

మనమంతా నేర్వాలి పరమత సహనం

కాశ్మీరం కావాలి భూతల స్వర్గం’’ (కనపర్తి లక్ష్మయ్య)

పాట.

‘’హింసాత్మక మతవాదం

మానవ ఉనికికి

ఏనాటికైనా పెనుముప్పే’’ (ఎం.రాజశేఖర్)

‘’మానవత్వమే నిజమైన తత్వం మనిషి తత్వం మానవుడిని మతంతో చూడొద్దు

మానవత్వంతో చూద్దాం’’ ( అబ్దుల్ హకీమ్)

 ఈ మూడు కవితా ఖండికలు  కాశ్మీర్ సంఘర్షణ యొక్క నేపథ్యంలో మతోన్మాద హింసను విమర్శిస్తూ, మానవత్వం, సహనం,శాంతిని ప్రతిపాదిస్తాయి. కనపర్తి లక్ష్మయ్య యొక్క పాట సామాజిక చైతన్యాన్ని లయబద్ధంగా అందిస్తుంది, రాజశేఖర్ గారి ఖండిక హింస యొక్క విధ్వంసకరతను సంక్షిప్తంగా హెచ్చరిస్తుంది, హకీమ్ గారి కవిత మానవత్వాన్ని సర్వోత్కృష్టంగా ఉద్ఘాటిస్తుంది. సౌందర్యపరంగా, ఈ కవితలు సరళమైన భాష, శక్తివంతమైన చిత్రణ, భారతీయుల భావోద్వేగాల్ని ఎంతో లోతుగా పహెల్గామ్  విషాదాన్ని, మరొకవైపు శాంతి కోసం పడే ఆకాంక్షను సమర్థవంతంగా వ్యక్తం చేస్తాయి. ఈ కవితా ఖండికలన్నీ మత దుర్వినియోగాన్ని ఖండిస్తూనే, మానవత్వం ఆధారంగా కాశ్మీర్‌ను భూతల స్వర్గంగా పునర్నిర్మించాలనే ఉదాత్త ఆశయాన్ని వ్యక్తంచేస్తాయి. ఈ కవితా సంకలనంలో ఇంచుమించు అందరూ మతానికి సంబంధించిన మరొక విధ్వంసక కోణాన్ని చిత్రించి, దాన్ని ఖండించారు. ఈ దృష్టి కోణంతో ఛందోబద్ధమైన పద్యాలను కూడా వర్ణించిన కవులున్నారు.

‘’ఏ గ్రంథం చెప్పిందోయ్..

ఇతరులను చంపమని?

ఏ దేవుడు చెప్పాడోయ్

ప్రాణాలను తీయమని?

ఏ చదువున దాగుందోయ్

హింసతోడ రక్తపాతం?

ఏ బడిలో చదివావోయ్

దారుణాల క్రూరత్వం?’’ (వరలక్ష్మి యనమండ్ర) మీ ప్రశ్నిస్తూ నిజమైన మతం నిజమైన దేవుని యొక్క ఆకాంక్షలు క్రూరత్వంతో నిండి ఉండవంటారు కవులు.

‘’అందాల కాశ్మీరు నవలోకమునకెళ్ళ కాల్చియుచంపిరి కసిగవారు

దొంగదెబ్బలుతీసి దొరకకవెళ్ళియు

రెచ్చిపోయిరివారి పిచ్చిమతము’’ (గాండ్ల నర్సింహులు)

‘’మతము పేరుతోడ మనుషులవేర్దేసి

జాతి భేదమించి జతలుకట్టి

కాల్చి చంపివేయు కర్కశులందర్కి

శిక్షవేయవలెను! కక్షధీర!!’’ ( మల్లముల కనకయ్య)

●       1993 – ముంబయి బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 257 మంది మృతి చెందారు. పాక్ ఐఎస్ఐ మద్దతుతో దావూద్ ఇబ్రాహీం, టైగర్ మేమన్ ఈ దాడికి పాల్పడ్డారు.

●       1999 – కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ మిలిటరీ ముజాహిదీన్ల వేషంలో కశ్మీర్‌లోకి చొరబడ్డారు. ఆ దాడిని తిప్పికొట్టి భారత్ విజయం సాధించింది.

●       2001 – డిసెంబర్ 13న భారత పార్లమెంట్‌పై ఉగ్రవాదులదాడి జరిగింది. లష్కరే తోయ్బా, జైషే మహ్మద్ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. 9 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

●       2005 – ఢిల్లీ నగరంలో పలు బాంబు పేలుళ్లు జరిగాయి. అనేక మంది పౌరులు మరణించారు. దాడుల వెనుక పాకిస్తాన్ మూలాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.

●       2008 – నవంబర్ 26న ముంబయి 26/11 ఉగ్రదాడి జరిగింది. 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చారు. వీరికి పాక్ లోని లష్కరే తోయ్బా శిక్షణ ఇచ్చింది.

●       2016 – జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులదాడి జరిగింది. జైషే మహ్మద్ సంస్థ ఈ దాడి చేయించింది.

●       2016 – సెప్టెంబర్‌లో ఉరీలో భారత సైనిక క్యాంపుపై దాడి జరిగింది. 19 మంది జవాన్లు మరణించారు. భారత్ ఆ వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది.

●       2019 – ఫిబ్రవరి 14న పుల్వామాలో CRPF బస్సుపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. 40 మంది జవాన్లు మృతి చెందారు. దాడి వెనుక జైషే మహ్మద్ ఉంది.

●       2019 – ఫిబ్రవరి 26న భారత్ బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడి (ఎయిర్ స్ట్రైక్) జరిపింది. ఇది పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిగింది

ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు చేతులు కట్టుకుని కూర్చోకూడదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ పాకిస్థాన్ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని, దాని ద్వారా మాత్రమే నిజమైన శాంతి కలుగుతుందంటూ కవులు తమ కవితలను రచించారు. కేవలం పహెల్గామ్ సంఘటన మాత్రమే కాకుండా అంతకు ముందు జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేస్తూ, సహనం మంచిది కాదంటూ, ఆ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలంటారు కవులు.  కార్గిల్ లో మ్రోగించిన విజయఢంకా మరోసారి మ్రోగించకతప్పదంటారు.

‘’స్వతంత్ర భారతి జననం మొదలుగా

కశ్మీరం నేటికీ చిందుతున్నదిరుధిరం

రక్తం మరిగిన తోడేళ్ళు విచ్చలవిడిగా చంపుతున్నది జనుల వడివడిగా’’ (జనశ్రీ డాక్టర్ జనార్ధన్ కుడికాల) పాట.

ఆవేదన నుండి సంకల్పం వరకు:

 ఈ సంకలనంలోని కవితలు కేవలం ఆవేదన వ్యక్తీకరణతో ఆగిపోలేదు. అవి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పాన్ని, శాంతిని, మానవత్వాన్ని పునరుద్ధరించాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తాయి.

‘’పుల్వామాతో ఎగిసిన నెత్తుటి ముద్దలు

భూతల స్వర్గాన్ని బుగ్గి పాలు చేశాయి

హద్దు దాటి రెచ్చగొట్టిన వారిని

హద్దులో పెట్టండి కార్గిల్ సాక్షిగా’’ ( మాడిశెట్టి సుజాత)

 

‘’వక్రమార్గమందువంకరచేష్టల

తట్టి లేపి నావు తాటతీయు

జుట్టుపట్టి యీడ్చి జాడిచ్చి గొట్టియు మట్టిగప్పగలము మట్టుబెట్టి’’(ఆకుల మల్లికార్జున్)

 

‘’ఈ నరమేధానికి ముగింపు పలకాలని,

ప్రపంచ దేశాలు ఏకం కావాలని,

ప్రపంచశాంతిని నెలకొల్పాలని,

భావితరాలకు భద్రతనివ్వాలని,

వినమ్రంగ వేడుకుంటుంది 'పహెల్గాం'!’’(చెలుపూరి పూర్ణచంద్ర శర్మ)

 

‘’ఆక్రమిత కాశ్మీరాన్ని ఆజాదీగా పునర్జీవింపజేయాల్సిందే!

మన భద్రతా దళాలు ఈ ఘాతుకానికి

ధీటైన జవాబు చెప్పాల్సిందే

విశ్వమహమ్మారి ఈ ఉగ్రవాదాన్ని

కూకటివేళ్ళతో నిర్మూలించాల్సిందే!’’(సంకేపల్లి నాగేంద్రశర్మ)

 

‘’భారత వీర జవానుల

 ఆగ్రహావేశాలకు గురయ్యారో

భస్మీపటలం కాక తప్పదు..!

ఆదిపరాశక్తి ప్రతిరూపమైన

మా భరతమాతతో పెట్టుకున్నారో

మీ బతుకులు ఛిద్రం కాక తప్పదు’’ ( చౌడూరి నరసింహారావు)

 

‘’ఊకదంపుడు మాటలు కాదు ఇప్పుడు కావాల్సింది.

రక్తపు మరక మానకముందే

మరో సంఘటన జరగక ముందే

యుద్ధం చేసి గెలవాల్సిందే

మరొకడు మన జోలికి రాకుండా

 గుణపాఠం చెప్పాల్సిందే.’’.  (కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి )

ఈసారి చేసే యుద్ధం దేశ ప్రజల ఆకాంక్షగా, దేశ ప్రజలందరూ కలిసికట్టుగా చేసే ఒక హెచ్చరికగా భావిస్తామంటున్నారు.

‘’బోర్డర్

ఇక విభజన రేఖ కాదు

నూట ఏబై కోట్ల

ఈ దేశపు ప్రజల హెచ్చరిక అవ్వాలి !!’’ (తిప్పాన హరిరెడ్డి)

భారతదేశం తగిన విధంగా పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు బుద్ధి చెప్పడం ద్వారా మాత్రమే మళ్లీ మన కాశ్మీర్ భరతమాత శిఖలు ఒక పువ్వులా  పరిమళిస్తుందనే ఆకాంక్షలు వ్యక్తం చేస్తారు.

‘’కాశ్మీరం ఎప్పటికీ తల్లి భారతి సిగ వువ్వే..

ఇది అనంతానందపు తొలి వెలుగుల నవ్వే’’ (పిల్లా వెంకటరమణమూర్తి)

భారతీయ సమైక్యత,  శాంతి కాంక్ష :

 ఈ సంకలనంలోని కవితలు భారతీయ సమైక్యతను, బహుళ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఉద్ఘాటిస్తాయి. యుద్ధానంతరమే నిజమైన శాంతి వస్తుందని ఎంతోమంది మేధావులు కూడా భావించారు. అప్పుడు మనం నేర్పవలసినవి ఏమిటో కూడా కవులు సూచిస్తున్నారు. అవన్నీ తరతరాలుగా భారతీయులు అనుసరిస్తున్న మార్గాలు.

‘’ప్రతి పాఠశాలలో శాంతి పాఠం బోధించాలి,

 ప్రతి ప్రార్ధనలో ప్రేమే మొదటి రాగం కావాలి

దేవుడు ప్రతి హృదయంలో కొలువై ఉండాలి

ఆ హృదయాల్లో మతాలకన్నా

మానవతే ఎక్కువగా ఉండాలి.

మనిషిని చంపే మతం

దేవునికి దూరంగా ఉంటుంది

 ప్రేమించే హృదయం

దేవాలయానికి సమానం.’’ (నూతి పద్మ)

 

‘’మెదల్ల నిండా చీకట్లు నిండిన చోట

మానవత్వమే ప్రేమ జ్యోతులు వెలిగించాలి

విశ్వ మానవ సౌభ్రాతృత్వం

ఈ భూగోళం మీద ప్రాణ వాయువై

పచ్చగా విస్తరించాలి.’’ (తోకల రాజేశం)

ఈ భావన  భారతీయుల శాంతి జీవనానికి, సాంస్కృతిక సమైక్యతకు నిదర్శనం. ఇటువంటి భావాలే ఈ కవితా సంకల్పం నిండా ఉన్నాయి. మొత్తం మీద ఈ కవితా సంకల్లోని కవితలన్నీ పహల్గామ్ లోయలో జరిగిన హృదయ విదారక ఉగ్రవాద దాడిని ఖండించాయి. అది  భారతదేశ చరిత్రలో మరో దుర్దినంగా నిలిచిపోయిందని నినదించాయి. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ దుర్మార్గపు చర్య, మానవత్వంపై దాడి మాత్రమే కాదనీ, దేశ సమైక్యతను కదిలించే కుట్ర కూడా అని గుర్తించాయి. ఈ సందర్భంగా పెల్లుబికిన ధర్మాగ్రహమే తమ కవితల ద్వారా ఆవేదన, ఆగ్రహం, శాంతి కాంక్షగా ఈ సంకలనంలో స్పష్టంగా కనిపిస్తాయి. కులాలు, మతాలు, ప్రాంతీయ విద్వేషాల పేరుతో విద్వేషాన్ని కనిపెట్టిన కవులు

‘’భారత సమైక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు. మానవత్వం నిలుస్తుంది, శాంతి వెల్లివిరుస్తుంది’ అని నినదిస్తున్నారు.

అయితే, మనసహనం చేతకానితనంగా ఉండకూడదు. ఇలాంటి ఉగ్రవాదులను

‘’ప్రపంచ దేశాలన్నీ ఏకమై జల్లెడపట్టాలి అస్త్రశస్త్రాలతో అష్టదిగ్బంధం చేయాలి.

ఉగ్రవాదం అంతమయ్యే వరకూ

అది నిరంతరం కొనసాగాలి.’’ అనే బలమైన ఆకాంక్షల్ని కూడా వ్యక్తీకరిస్తున్నారు కవులు.ఈ కవితలు కేవలం ఆవేదనల వ్యక్తీకరణ మాత్రమే కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే సంకల్పం, మానవత్వాన్ని, శాంతిని పునరుద్ధరించాలనే ఆకాంక్ష కూడా. ఈ సంకలనం పాఠకులను ఆలోచింపజేస్తూ, ఐక్యత, శాంతి కోసం కృషి చేయమని ప్రేరేపిస్తుంది. దీనిలో వర్ణనల సౌందర్యాన్ని, అభివ్యక్తి వైవిధ్యాన్ని కాదు,ఆవేదన కెరటాలు చూడాలి. ఈ కవితల్లో ఆవేదనలతో రగిలి పోతున్న గుండెల్లో ప్రవహిస్తున్న లావాలను చూడాలి. మానవత్వం కోసం తపిస్తున్న మనుషుల ప్రేమని చూడాలి. కలిసిమెలిసి ఉండాలనే బహుళ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చూడాలి. ఈ కవితల్లో భారతీయులుగా కలిసిమెలిసి ఉన్నామని ధ్వనిస్తున్న సందేశాన్ని వినాలి.

‘ఆపరేషన్ సిందూర్’ భారతీయుల ఆకాంక్షల ప్రతిఫలనం:

భారతీయులందరి ఆకాంక్షల ప్రతిఫలనంగానే అన్నట్లు‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో మన భారత సైన్యం పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 2025 మే 7న  దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుపెట్టారు.  దీనికి ఆర్మీలోని మహిళలే నాయకత్వం వహించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పహల్గామ్ లో 26 మంది పౌరులు, ప్రధానంగా హిందూ పర్యాటకులు, తమ మతాన్ని అడిగి దగ్గరి నుంచి మరీ కాల్చి చంపేశారు. ఈ దాడిలో చాలా మంది నవ దంపతులు ఉన్నారు. వారిలో కావాలనే వారి భార్యలను వదలేసి భర్తలు వారి కళ్ళముందే చంపేశారు. అందువల్ల భారత ప్రభుత్వం "ఆపరేషన్ సిందూరం" అనే పేరుతో యుద్ధం చేసింది. సిందూరం అనేది ఒక బలమైన సాంస్కృతిక సంప్రదాయాన్ని, భారతీయుల భావోద్వేగాన్ని తెలియజేస్తుంది. సిందూరం లేదా కుంకుమ, హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు  ధరించే ఒక రకమైన ఎరుపు రంగు పొడి.  ఇది వారి భర్త జీవించి ఉన్నాడని సూచిస్తుంది. చనిపోయిన తమ భర్తల మరణానికి ప్రతీకారంగా వీరతిలకంతో చేసిన యుద్ధంగా భావించింది. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క సంకల్పాన్ని, బాధితులకు న్యాయం చేయాలనే నిబద్ధతను కూడా సూచిస్తుంది. దీన్నే ఈ సంకలనంలోని కవులు కూడా కోరుకున్నారు. ఈ ఆపరేషన్ సిందూర్’ ద్వారా దీన్ని భారతీయవీరుల గుర్తుగా కూడా పరిగణిస్తున్నామనే సంకేతాన్ని ప్రభుత్వం అధికారికంగా పంపిస్తుంది.  ఇది ఈ ఆపరేషన్ సిందూర్ వీరుల స్ఫూర్తిని, దేశం యొక్క దృఢ నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ సంకలనంలో కవుల ఆకాంక్షలకు ప్రతిఫలనంగా భారత ప్రభుత్వం సైనికులు సరియైన దిశలో పయనిస్తున్నారు. ఈ సంకలనంలోని కవితల ద్వారా భారతీయల ఆత్మను, ఆకాంక్షలను మన తెలుగు కవులు శక్తివంతంగా ప్రతిఫలిస్తున్నారు. అయితే, అన్ని కవితల్లోనూ కవిత్వమే ఉందని చెప్పలేను. కానీ, దేశభక్తి అక్షరాల్లా ఆవేశమై,  వీర రస స్ఫూర్తితో కవిత్వమై పొంగిందని మాత్రం తప్పకుండా చెప్పగలను. ఇందులో నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా కానీ, నేను కొంతమంది కవితలను మాత్రమే ఉటంకించాను.  అంటే మిగతా వాళ్ళ కవితలలో కవిత్వం లేదని కాదు. అందరినీ ఈ ముందుమాటలో మనం పేర్కొనలేం. కానీ అందరి ఆలోచననూ, వారి భావుకతను శ్లాఘించకుండా ఉండలేం. ఇంత వేగంగా దేశభక్తిని ప్రేరేపించే భారతీయ ఆత్మలను ప్రతిబింబించే ఒక కవితా సంకలనాన్ని తీసుకురావడమనేది సామాన్యమైన విషయం కాదు.

డా. వైరాగ్యం ప్రభాకర్ గారి సాహిత్య సేవ:

ఈ సంకలనాన్ని తీసుకురావడంలో ప్రముఖ కవి, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేశభక్తిని ప్రేరేపించే సాంస్కృతిక యోధుడు డా. వైరాగ్యం ప్రభాకర్ గారి కృషి అమోఘం. ఈ సంకలనం ద్వారా దేశభక్తిని, భారతీయ ఆత్మను ప్రతిబింబించే కవితలను ఒకచోట చేర్చారు. ఈ సంకలనం కేవలం కవితల సంపుటి మాత్రమే కాదు; ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ఒక సామూహిక స్వరం; శాంతి కోసం ఆకాంక్షించే హృదయ స్పందన. ఒకవైపు ఆ సంఘటన జరుగుతుండగానే ఆ కవితలను పుస్తకంగా తీసుకాని రావాలనుకోవడం డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఆయన గతంలో కూడా దాశరథి కృష్ణమాచార్య గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మొట్టమొదటి కవితా సంకలనాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. ఈ దేశంలో జీవిస్తూ ఈ దేశంలో గాలి నీరు ప్రకృతి వనరులను అనుభవిస్తూ ఈ దేశం మీద ప్రేమను పెంపొందించుకోవలసిన అవసరాన్ని దేశభక్తిని నిలువెల్లా నింపుతున్న ఈ సంస్థకు,  డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారికి, కవులకు నా హృదయ పూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

-        ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,

హైదరాబాద్.

8.5.2025