14 మే, 2026

ఆ పొర వీడిన అనంతరం 'నేను'

 

ఆ పొర వీడిన అనంతరం ‘నేను’!

నేనో శిఖరాన్ని

ఎత్తైన గమ్యాన్నని విర్రవీగిన శిఖరాన్ని 

ఎడతెగని వర్షపు ధారలకు అరిగి అరిగి

లోయలోని పచ్చదనానికి ప్రాణధారగా మారినప్పుడే

నా ఎత్తుకు నిజమైన ఓ నిండుదనం !


నేనో పక్షిని

నింగిని తాకించగల రెక్కలున్న పక్షిని నేను

గాలివాటు తన దిశను మార్చిన క్షణాన

నా రెక్కల బలం ఆ నిశ్శబ్దపు గాలి దయ

ఒదిగి ఒదిగి ఒప్పుకుంది 

నాలోని గర్వం!


నేనో నీటి బిందువుని

ముత్యమంత మెరుపును చూసి

మురిసిన నీటి బిందువుని

అలల తాకిడికి ఆవిరై 

అనంత వాయువులో కలిసినప్పుడు

నా ప్రత్యేక ఉనికి కంటే ఆ అనంతమే గొప్పదని

రహస్యంగా చెప్పింది

నా మౌనం నాతోనే!


నేనో వృక్షాన్ని 

గుబురుగా ఎదిగి

 నీడను పంచుతున్న వృక్షాన్ని

వసంతం వచ్చి ఆకులను రాల్చిన మరుక్షణం

నా వైభవం కేవలం ప్రకృతి అప్పు అని

సత్యాన్ని చాటాయి

నాలోని ఎండిన కొమ్మలు!


నేనో సూర్యుణ్ణి

నేనే వెలుగుల కిరణాల మూలమన్న సూర్యుణ్ణి 

చీకటి తెరలు రాత్రిని ఆహ్వానించిన వేళ

నా వెలుగు మరో లోకపు ఉదయానికి బానిసని

ఓ పాఠం నేర్పింది

నా పడమటి అస్తమయం!


పదవి ఒక వెలిగే ఎండమావి

అధికారం ఒక కదిలే నీడ

నేను అనే అడ్డుగోడను కూల్చుకున్న రోజు

విశ్వమనే మహాసముద్రంలో నేనొక బిందువుని!


వినయమే నా సింహాసనం, 

ప్రేమే నా సామ్రాజ్యం

అనుభవం నేర్పిన నా అంతరాత్మ ప్రబోధమిది!

— డా. దార్ల వెంకటేశ్వరరావు, 13.5.2026

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి