13 మే, 2026

ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం- 2026

 ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం

(World Ego Awareness Day)


అహంకారం -నష్టం:

నేను ననుచును తిరుగుచు నింగి ముట్టు

గర్వ మనెడిది కన్నుల గప్పి వేయు

దారి తెలియక మనిషియు తడబడెడిని

వినయమొకటె ప్రకాశించు వెలుగు బాట.

(భావం: "నేను" అనే అహంకారంతో ఆకాశాన్ని తాకుతున్నట్లు గర్వపడే మనిషికి, ఆ గర్వం కళ్లకు గంతలు కడుతుంది. దీనివల్ల సరైన దారి తెలియక జీవితంలో తడబడతాడు. వినయం మాత్రమే మనిషికి సరైన మార్గాన్ని చూపే వెలుగు.)


అహంకారం - పతనం: 

కొండ నెక్కిన వాడైన కూలి పోవు

అహము నెత్తిన కెక్కిన యధము డగుచు

నిజము నెరుగని వాడును నీచ మందు

శాంతి చేకూరు గర్వము చచ్చినపుడె.

(భావం: భౌతికంగా ఎంత ఎత్తైన కొండను ఎక్కిన వాడైనా, ఒక చిన్న అడుగు తడబడితే కిందకు కూలిపోక తప్పదు. అలాగే, నేను అనే గర్వం మనిషి నెత్తిన కెక్కితే, అతడు ఎంతటి గొప్పవాడైనా సరే, తన విచక్షణను కోల్పోయి అధముడిగా మారిపోతాడు. ఈ లోకంలోని శాశ్వతమైన సత్యాన్ని గ్రహించలేని వాడు తన గర్వం వల్ల సమాజంలో నీచత్వాన్ని, అవమానాన్ని పొందుతాడు. మనిషి తనలోని ఆ గర్వాన్ని చంపుకున్నప్పుడు మాత్రమే మనసుకి నిజమైన శాంతి లభిస్తుంది.)


అస్థిరమైన సంపద:

కలిమి గలిగిన గర్వము గలుగ నేల?

నీటి బుడగ వంటిది గద నిఖిల సిరియు

గాలి వీచిన యంతనే గలసి పోవు

నమ్రతయె నిల్చు నెప్పుడు నవని పైన.

(భావం: సంపద కలిగినప్పుడు అహంకారం ఎందుకు? ఈ లోకంలోని సిరి సంపదలన్నీ నీటి బుడగ వంటివి. గాలి వీచినప్పుడు నీటి బుడగ ఎలాగైతే అదృశ్యమవుతుందో, సంపద కూడా అలాగే పోతుంది. కానీ మనిషి చూపే వినయం మాత్రమే ఈ భూమిపై శాశ్వతంగా నిలిచి ఉంటుంది.)

అల్ప విద్య - అహంకారం:

అల్ప విద్యను నేర్చిన అహము పెరుగు

నిండు కుండయు తొణకదు నెమ్మదిగను

జ్ఞాన వృద్ధుడు వంగును గరిమ తోడ

గర్వ మజ్ఞాన చిహ్నము గాదె చూడ.

(భావం: తక్కువ విద్య నేర్చుకున్న వాడు గొప్పలు చెప్పుకుంటూ అహంకరిస్తాడు. కానీ నిండు కుండ తొణకనట్లుగా, పరిపూర్ణ జ్ఞాని ఎంతో నిమ్మదిగా, వినయంగా ఉంటాడు. పండ్లతో నిండిన కొమ్మ నేల వైపు వంగినట్లు, జ్ఞాన వృద్ధుడు గౌరవంతో వొంగుతాడు. అహంకారం అనేది అజ్ఞానానికి గుర్తు మాత్రమే.)


స్నేహము - అహంకారం:

కన్ను గానని వాడౌను గర్వ మన్న

నెత్తి కెక్కిన యంతనే నిక్క చూచు

ప్రక్క నున్నట్టి మిత్రులే పగతు లౌదు

అహము వీడిన కలుగును హాయి జూడ.

(భావం: అహంకారం తలకెక్కిన మనిషి కళ్లుండి కూడా చూడలేని వాడవుతాడు. అందరినీ తక్కువగా చూస్తూ గర్వంతో నిక్కడం వల్ల, తన మేలు కోరే మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. ఆ అహంకారాన్ని వదిలేస్తేనే జీవితంలో హాయి, సుఖం లభిస్తాయి.)


అధికార గర్వం:

నేడు ఉన్నట్టి అధికార మెల్ల కాల

ముండ దెప్పుడు మన తోడ నుర్వి పైన

నిలిచి యుండును కేవల నిర్మలత్వ

మహము వీడితే దొరకును నమృత సుఖము.

(భావం: ఈ రోజు మన చేతిలో ఉన్న అధికారం గానీ, హోదా గానీ ఎప్పటికీ మనతోనే ఉండవు. కాలం మారుతున్న కొద్దీ అవి పోయేవే. కానీ మనలోని నిర్మలమైన స్వభావం, వినయం మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటాయి. గర్వాన్ని విడిచిపెడితేనే అమృతం లాంటి తీపి కలిగిన సుఖం దొరుకుతుంది.)

డా.దార్ల వెంకటేశ్వరరావు 12.5.2026



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి