16 ఏప్రిల్, 2026

మహాకవి వాల్మీకి (ఖండ కావ్యం )

 మహాకవి వాల్మీకి 

(ఖండ కావ్యం )




1. అగ్నిశర్మ జననం.

తే.గీ.

విప్ర వంశాన జన్మించె విజ్ఞు డొకడు

అగ్ని శర్మయే నామము నలరు చుండ

వేద విద్యలు నబ్బక వెర్రి వాడు

బాట సారుల దోచుచు బ్రతుకు సాగె!


2. దారి దోపిడి.

ఆ.వె.

అడవి లోన దిరిగి అగ్నిశర్మ యపుడు

దొంగ యగుచు నరుల దోచు చుండ

మునుల గాంచి నంత మోక్ష మార్గము తోచ

మారి పోయె నతడు మహిని జూడ!


3. తపస్సు.

కం.

వనమున తపమును జేయగ

వినయముతో నతని చుట్టు విమలము గాగన్

వనివని బుట్టలు పెరగగ

వినతిని వాల్మీకి యనగ వెలసెను ధరపై!



4. బోయవాడి రాక 

ఆ.వె.

రామ కథను వ్రాయ రాక ముందె నతడు

బోయ వాని జూడ పొడమె నాశ

క్రౌంచ పక్షులచట కలిసి యుండగ గనె

వేట గాడు రాగ వేగ మపుడు!



5. క్రౌంచ పక్షి వధ

ఆ.వె.

బోయ వాడు వేయ పొలుపారు బాణము

నేల కూలె పక్షి నింగి నుండి

ఆడ పక్షి యేడ్వ అగ్నిశర్మకు నపు

శోక మంత శ్లోక శోభ దాల్చె!


6.శోకమే శ్లోకమగుట.

కం.

శోకము హృదిలో కలుగగ

శోకము నందుండి పుట్టె సుమహిత శ్లోకన్

శోకమె కావ్యము నయ్యెను

శోకపు తన్మయత రామ సుకథగ నిలిచెన్!


7. నారదుని రాక.

ఆ.వె.

నార దుండు వచ్చి నయముగ పల్కెను

అగ్ని శర్మ నీవు ఆర్య సుతుడ

రామ కథను వ్రాయ రమ్మని పిలిచెను

లోక హితము గోరి లోల మతిని!


8.రామాయణ రచన

తే.గీ.

బ్రహ్మ పల్కగ నపుడు సంబరము తోడ

రామ రాజ్యము నంతయు రాసె నతడు

శరణు జొచ్చిన సీతమ్మ చరిత నంత

కావ్య మిటులుగా వెలయించె ఘనము గాను!


9. లవకుశుల గానం.

ఆ.వె.

చిన్న పిన్న లపుడు శీఘ్రము గా వచ్చి

గాన మలరి రచట గాధ నంత

రాము డంత జూచి రమ్యమౌ కథ యని

మెచ్చె నపుడు వారి మితము లేక!



10.అగ్ని శర్మయే వాల్మీకి:

తే.గీ.

అగ్ని శర్మయే వాల్మీకి వాసికెక్కె

రామ గాథను వ్రాయగ రాజ్యమందు

బోయ వానిచే పొడమిన పొంకమగుచు

శోక మంతయు శ్లోకమై శోభ నిలిచె!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి