14 ఏప్రిల్, 2026

అతడొక ఆత్మగౌరవ సంతకం!

 అతడొక ఆత్మగౌరవ సంతకం!



చరిత్ర పుటల మధ్య

అణచివేత ముద్రల కింద

నలిగిపోయిన 

మా వేల ఏళ్ల మౌనానికి

అతడొక బహిరంగ ప్రకటన!

దాహం వేస్తే

చెరువులు వెలివేసిన చోట

అతడొక మహా జలపాతం!

అవమానాలు నడిరోడ్డుపై 

మమ్మల్ని నగ్నంగా నిలబెట్టినప్పుడు

అతడొక జ్ఞాన వస్త్రం!

ఆయన పట్టుకున్న పుస్తకం

మాజాతి తలరాతను

తిరగరాసిన అక్షరాయుధం!

తనను తాను వెలిగించుకొని

చీకటి సామ్రాజ్యాన్ని తగలబెట్టి

సమసమాజానికైన 

వెలుగిన సూర్యుడతడు!

మూగబోయిన గొంతులకు మాటనిచ్చి

కాళ్లు లేని ఆశలకు నడక నేర్పి

చట్ట సభల్లో సింహాసనపై

మమ్మల్ని కూర్చోబెట్టిన

ఒక అజేయమైన ధీశాలి అతడు!

అవమానాలు సన్మానాలయ్యే చోటే

ఆత్మగౌరవం సంతకం చేయించిన ధైర్యమతడు! 

నేడతడు

మా ప్రతి ఆత్మగౌరవ పోరాటంలో

మౌనంగా వినిపించే మా యుద్ధ నినాదం!


- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 

14.4.2026

అంబేద్కరా! 

నువ్వు మళ్ళీ మాలో జన్మించాలి!


వందల ఏళ్ల అణచివేతల మధ్య

మొద్దుబారిన సమాజపు విలువల మధ్య

గుండె మండుతున్న 

ఓ నిప్పు కణికవు నువ్వు!

దప్పిక తీర్చుకునే హక్కు లేని చోట

జ్ఞానపు సాగరాన్నే 

ఒడిసి పట్టిచ్చిన ధీశాలివి నువ్వు!

నువ్వు నడిచిన దారి

మా వేల గొంతుకల నిరసన కేక!

నువ్వు రాసిన రాజ్యాంగం

మా జాతి వెన్నెముకై నిలబెట్టిన ధైర్యం!

ఓ బాబాసాహెబ్ అంబేడ్కర్!

నువ్వంటే.. 

మా చినిగిన చొక్కాల్లో 

గూడు కట్టుకున్న ఓ ఆత్మగౌరవం!

నువ్వంటే.. 

మా చీకటి గుడిసెల ముందు 

ఉదయించిన అక్షర భానుడవు!

ఎదురు దెబ్బలే మెట్లుగా మార్చుకొని

అవమానాలనే ఆయుధాలుగా మలచుకొని

నువ్వు వేసిన అడుగే.. 

ఈ దేశపు తలరాతనే మార్చేసింది.

మనుషుల మధ్య గోడలు కట్టిన చోటే

మాకు నువ్వో వారధివై నిలిచావు

తలవంచి బతికే మా బతుకులకు

తల ఎత్తుకొని బతికే మార్గాన్ని చూపించావు

ఓ బాబా!

కొంతమందికి నువ్వొక నినాదమయ్యావు

ఓ బాబాసాహెబ్!

మరికొంతమందికి నువ్వొక వినోదమయ్యావు

ఓటు రాజకీయాల్లో 

నిన్నో ఆటబొమ్మలా చేస్తున్నారు!

నువ్విచ్చిన రాజ్యాంగంలో

ప్రతి అక్షరాన్ని దిద్దేస్తున్నారు

నువ్వు 

మళ్ళీ మళ్ళీ మాలో పుట్టాలి!

నువ్వే మేమై 

అక్షరమై ఉదయించాలి

నీ పిడికిళ్ళే 

మాలో కొత్త శక్తినిచ్చే 

పోరాటమై కదలాలి!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 

14.4.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి