14 ఏప్రిల్, 2026

అంబేద్కర్ కి అక్షర నీరాజనం

 అంబేద్కర్ కి అక్షర నీరాజనం





కం.

పలికెడిది భీమ చరితట

పలికించెడి వాడు జ్ఞాన భాస్కరుడట యీ

పలికిన జన్మసఫలమట

పలికెద నన్యుల చరిత్ర పలకగ నేలా?


కం.

ధారుణి బుధజన వినుతుడు

నీరజ భవుడనగ వెలుగు నిరతము భువిలో

క్రూరపు కట్టులు తెంచిన

ధీరుడు భీముండు లోక దివ్వెగ నిలిచెన్.


తే.గీ.

కులపు కట్టుల నన్నిటి కూల్చి వేసి

మనుజులందరి నొకటని మహిని చాటి

ప్రేమ తోడను సమతను పెంచె నతడు

భారతమ్మకు నూతన ప్రాణ మిచ్చె.


తే.గీ.

మగువ బ్రతుకున వెలుగును మల్లె వోలె

సమత తోడను నిలిపెను శాంతి మార్గ

కోడు బిల్లును తెచ్చెను కోర్కె తీర

అబల లందరి సబలగ అవని జేసె.


తే.గీ.

భీమ నామము జపముగ భీతి బాపి

ప్రేమ తోడను పిలచెను  పెద్ద లెల్ల

అక్షరమ్మె నీ యాయుధ మవని పైన

జయము భీమని పాడెద సాటి లేక.


తే.గీ.

ధర్మ పీఠము నందున ధైర్య శాలి

రాసె రాజ్యాంగమును తాను రమ్య ఫణితి

హక్కులన్ గూర్చి సర్వుల కవని యందు

పాలనము నందు -ప్రబలమౌ మార్పు దెచ్చె.


తే.గీ.

కష్ట జీవుల క్షేమము గారవించి

కూలి జనులకు హక్కుల కూర్మి నొసగె

చెమట నొడ్చెడి వారల చింత బాపి

పాలనము నందు నీడగా నిలిచె నతడు.


తే.గీ.

ఆడ వారల బతుకున ఆర్తి మెరియ

హిందు కోడును తెచ్చెను హితము గూర్ప

ధరణి యందున మహిళలు ధన్య లనగ

సమత గెలిపించి నిలిపెను సతము వారి.


తే.గీ

భారతమ్మకు కవచమై  భాసిలంగ

వ్రాసె రాజ్యాంగమును తాను రమ్య ఫణితి

ధర్మ పీఠము నందున ధైర్య శాలి

శిల్పి వోలెను దిద్దెను స్వేచ్ఛ నిలను.


తే.గీ.

దళిత జనులకు లోకాన దారి జూప

పడెను కష్టము లెన్నియె బాగు కోరి

వసతు లన్నియు నిచ్చెను వాసి కెక్క

రాయితీలను నిల్పెను రాజ వీధి.


తే.గీ.

అల్ప సంఖ్యాక వర్గాల కాశ నిచ్చి

రక్షణము నిచ్చె నెల్లెడ రాజనీతి

భయము లేకుండ బ్రతుకగ భారతమున

హక్కు లొసగెను భీముడు హర్ష మొదవ.


తే.గీ.

మతము మార్చెను శాంతికై మనసు నిల్పి

బుద్ధ దేవుని మార్గము పుడమి చాటె

ధర్మ చక్రము త్రిప్పెను ధరణి యందు

కరుణ తోడను నడిపెను కలుగు జనుల


తే.గీ.

కడలి దాటెను విద్యకై కసిని బూని

నేర్చె శాస్త్రము లెన్నియొ నిపుణ మతిని

పశ్చిమమ్మున వెలుగును పట్టు కొనియె

ధాత్రి మెచ్చెడి రీతిగ ధన్య మూర్తి.


తే.గీ.

ద్రవ్య లోటును తీర్చగ దారి జూపె

రూప్య మన్నది పుట్టుక రుచిని జూపె

ఆర్థికమ్మున మేటిగ నవని నిలిచె

విత్త పద్ధతి దిద్దెను విమల మతిని.


తే.గీ.

వార్త లనెడి యాయుధమును వరుస గూర్చి

అణచి వేసిన గొంతుల కండ నిచ్చె

కలము పట్టియు జాతిని కదలి నడపె

తెలివి నూదెను నిదురించు తెగలకతడు.


తే.గీ.

శ్రమను దోచెడి కాలము చక్క దిద్ది

ఎనిమి దే గంట లనియెను ఇలను దాను

చెమట జీవుల కష్టము చింద కుండ

కూలి జనముల పాలిటి కోటి వెలుగు.



తే.గీ.

దాహ మణచగ చెరువున దారి జూపి

నీటి హక్కును చాటెను నిఖిల జగతి

గుండె బలమున పోరాడి గెలుపు నొందె

తలపు నందున నిలిచెను ధైర్య శాలి.



తే.గీ.

ఆడ వారల బతుకున ఆర్తి నింపి

నేర్పు తోడను హక్కుల నెనరు గూర్చె

మనువు కట్టుల నన్నిటి మంట గలిపి

చట్ట సభలను గెలిచెను సాటి లేక.


తే.గీ.

భాష లెన్నియొ నేర్చెను భరత భూమి

వివిధ శాస్త్రము లందున విదురు డతడు

అక్షరమ్మొక యస్త్రమై అవని వెలిగె

చదువు సంపద పంచియు చరిత కెక్కె.


తే.గీ.

ఏరు లన్నియు నొకటిగ నెంచి నాడు

జలము పంపెను పంటల చలువ కోరి

వనరు లన్నియు ప్రజలకు వశము జేసె

పంట భూముల వెలుగుగ బ్రబలె నతడు.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

14.3.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి