15 ఏప్రిల్, 2026

ప్రపంచ కళా దినోత్సవం

 ప్రపంచ కళా దినోత్సవం 



చూడ చక్కని చిత్రాలు సుందరముగ

చిత్త మలరించు నాట్యము చిత్రముగను

గాన మాధురి వీనుల విందు జేయ

లలిత కళలెన్నొ లోకాన వెలుగు చుండు.


మట్టి ముద్దను మలచును మహిమ తోడ

జీవ మున్నట్లు శిల్పము సిద్ధ మగును

చెమట చిందించి సృజనను చేయు వాడు

ధన్య జీవిగా వెలుగొందు ధరణి యందు.


బాధ లన్నియు మర్చిపో బడలి కలను

కళలు తోడైన హాయిగా గడచు నిజము

మనసు రంజింప జేయును మాధురి గను

కళలె జీవన గతికిని కాంతి రేఖ.


భాష లేకున్న భావముల్ పండ జేయు

గీత లేకున్న రంగులు గీయు చుండు

విశ్వ మంతయు నిండిన వింత కళలు

మాన వత్వపు మమతను మనకు నేర్పు.


జాతి గౌరవ చిహ్నముల్ జగతి యందు

కళల నారాధ్య దైవముల్ గాగ నెంచి

నేటి తరమున యువతకు నేర్ప వలయు

భవ్య సంస్కృతి నిలచును నివ్యమగుచు.



రంగు రంగుల కలయిక రమ్య చిత్ర

కల్ప నల్ సేయు కుంచెయు కవన మగును

భాష లేకయె పలుకుచు భావ ముట్టి

కంటి కింపుగ వెలుగును కాంతి తోడ.


పాట లందున పలికెడి పదిను రవళి

రంజ కంబుగ వినబడు రాగ మమరు

గుండె లయలను తాకుచు కుశల మిచ్చు

నాద బ్రహ్మమె జీవన నాడి గదర.


వేష భాషల నభినయ వేద్య మగుచు

రంగు లోకము కనులము రాగ నిలుచు

సత్య శోధన చేయుచు సాగు చుండు

నాట కమ్మది జీవిత నావ గదర!


రాతి గుండెను కరిగించు రంగు శిల్పి

ఉలిని దెబ్బలు తగిలిన ఉమ్మ దనము

పాణ మున్నట్లు ముచ్చట పలుకు చుండు

దైవ రూపము శిలలందు దర్శనమగు!


దీక్ష తోడను నేర్చెడి దేవ కళలు

సాధ నమ్మది సలిపిన సాధ్య మగును

నేర్పు తోడను కృషిచేయ నిలచు కీర్తి

కళల కన్నను మిన్నది కాన రాదు!


రంగు రంగుల కుంచెతో రాయు చిత్ర

మనసు భావము తెల్పెడి మాట లగును

నింగి నేలల అందము నిలుప వచ్చు

కళల లోనన చిత్రము కాంతి రేఖ.


భావ యుక్తము గమ్మని భాష తోడ

అక్ష రమ్ములు అమృతపు అలలు గాగ

కవిత పండెడి వేళన కాంతి కలుగు

లోక మెల్లను మెచ్చెడి లోల కళది.


కాళ్ళ మువ్వలు ఘల్లున కాంతి నీయ

అడుగు వేయగ అందము అలరు చుండు

మేను వంచుచు నాట్యము మేటి గాగ

జగతి మెచ్చెడి కళలివి జాతి సొమ్ము.


కళల సేవను చేయుట కామ ధేను

పుడమి యందున పుణ్యము పుట్టు నచట

మాన వత్వము చాటెడి మమత తోడ

దీప్తి నిచ్చును కళలెన్నొ దేవ గతులు.


కట్ట డమ్ములు వింతగ కాన వచ్చు

శీల్ప నైపుణి చాటును స్థిరము గాను

రాతి కట్టడ మందున రాజ్య లక్ష్మి

నేర్పు తోడను వెలుగును నిఖిల జగతి.


కనుల సైగన భావము కాన బడును

మాట లేకయె మనసును మలచ వచ్చు

అవయ వమ్ముల కదలిక అంద మిచ్చు

ముఖము పలికెడి రసములు ముదము గూర్చు.


పచ్చ నైనట్టి ప్రకృతికి పర్వముగను

రంగు లద్దుచు గీయగా రమ్య మగును

కొండ కోనల అందము కోరి నిలుచు

కంటి కింపుగ వెలుగును కాంతి తోడ.


కళను నమ్మిన వాడును కష్ట పడడు

విశ్వ మంతయు తనదని విర్ర వీగు

జాతి సంపద పెంచుచు జగతి యందు

ధన్య జీవిగ వెలుగును ధరణి పైన.


పూల తోటల నందము పొదుగు చుండు

రంగు రంగుల విరులవి రాణియించు

తావి వెదజల్లు సుమములు తన్మయముగ

విశ్వ సౌందర్య రూపమే విరియు చుండు.


చెక్క మీదను చెక్కిన చిన్న బొమ్మ

అద్ద మున్నట్టి వలువలు అలరు చుండు

చేతి నైపుణి చాటును చిత్ర ముగను

మట్టి లోనన పుట్టును మణియునొకటె.


కంటి చూపున బంధించు కాల గతులు

నిలిచి పోవును చిత్రము నిశ్చలముగ

భావ గర్భిత రూపముల్ భవ్య మగుచు

సాక్షి గా నిల్చు లోకాన సత్య మవగ.


రుచుల మేళన మందున రూపు దాల్చు

పిండి వంటల గుమగుమ ప్రీతి గూర్చు

వండి వార్చెడి నేర్పును వసుధ యందు

పాక శాస్త్రపు వైభవ పటిమ యగును.


తాత తండ్రుల నేర్చిన తపన విడక

ముందు తరముల వారికి ముదము తోడ

నేర్ప వలెను ఈ విద్యలు నిచ్చెనలుగ

కీర్తి నిలచును ఆ చంద్ర కేతు వగుచు.


అభిన యమ్మున భావముల్ హత్తు కొనగ

పాద గతులన తాళముల్ పరవ శించు

మువ్వ సవ్వడి మోగగ ముదము గలుగు

నృత్య కళయన్నె వెలుగును నిఖిల జగతి.


తనదు సుఖమును వీడియు తపన తోడ

కళల కై తన ప్రాణమున్ కడవరకును

ధార పోయుచు లోకాన ధన్య మగును

నిజముగా కళా కారుడే నిఖిల ప్రియుడు.


కళలె లోకాన సౌందర్య కాంతి రేఖ

మనిషి సృజనకు నిచ్చెనల్ మహిమ తోడ

జాతి గౌరవ చిహ్నముల్ జగము నందు

నిత్య నూతన శోభల నిలయ ములివి.

కళల లోకాన వెలుగులు కాంతి నిచ్చు

నిచ్చు నయ్యది సంతోష నిశ్చలముగ

నిశ్చలముగను సృజనలు నిత్య మవుచు

నిత్యమానందభరితంబు నిఖిలజగతి.


(కళల ప్రపంచం ప్రసాదించే జ్ఞానకాంతి మనసుకి నిశ్చలమైన ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి నిశ్చల స్థితిలో రూపుదిద్దుకునే కళా సృజనలు శాశ్వతత్వాన్ని పొంది, ఈ సమస్త ప్రపంచాన్ని నిరంతరం సంతోషమయం చేస్తాయి.)


రాతి గుండెను కరిగించు రమ్య శిల్పి

శిల్పి నైపుణి చాటును స్థిరము గాను

గాను పించెడి రూపముల్ గౌర వముగ

ముగను జూడగ కన్నుల ముదము గలుగు.

(కఠినమైన రాతిని కూడా శిల్పి తన నైపుణ్యంతో మెత్తబరిచి అద్భుత శిల్పంగా మలుస్తాడు. ఆ రూపాలు చూస్తుంటే ఎంతో గౌరవప్రదంగా ఉండి, చూసే కళ్లకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి.)


పాట లందున పలికెడి పదిను రవళి

రవళి వినగను తాపముల్ రద్దు మౌను

మౌను లైనను మెచ్చెడి మాధు రిదియె

ఇదియె జగతికి దొరికిన ఇద్ధ నిధియు.

(పాటల్లో వినిపించే పదునైన రాగం మనుషుల బాధలను తొలగిస్తుంది. మౌనంగా ఉండే మునులు కూడా మెచ్చే ఈ సంగీత మాధుర్యమే ఈ లోకానికి దొరికిన గొప్ప నిధి.)


భావ యుక్తము గావించు భవ్య కవన

కవన మమృతపు జల్లుల కాంతి నీయు

నీయు జ్ఞానము లోకాన నిత్య మవగ

అవగ సంస్కృతి నిలచును అర్ధ ముగను.


(భావయుక్తమైన కవిత్వం అమృతంలా కురిసి జ్ఞానకాంతిని ఇస్తుంది. ఆ జ్ఞానమే లోకంలో శాశ్వతమై, మన సంస్కృతికి ఒక అర్థవంతమైన రూపంగా నిలుస్తుంది.)



రంగు రంగుల కుంచెతో రాయు చిత్ర

చిత్ర మయ్యది పలుకును చిత్త మలర

మలర సృజనలు జగతికి మహిమ తోడ

తోడ నిలుచును కీర్తియు తొడరి చూడ.


(రంగులతో గీసే చిత్రాలు మనసు పులకరించేలా మాట్లాడుతాయి. ఆ సృజనలు ఈ జగత్తుకు గొప్ప మహిమను చేకూర్చడమే కాకుండా, కళాకారుడికి శాశ్వతమైన కీర్తిని తోడుగా ఉంచుతాయి.)

 ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 

15.4.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి