11 ఏప్రిల్, 2026

మహాత్మా జ్యోతిరావు ఫూలే

 మహాత్మా  జ్యోతిరావు ఫూలే 




తే.గీ.

చదువు లేకున్న నరుడు పశువుగ మారు

అక్షరమ్ములె ముక్తికి ఆద్యములను

సత్య శోధక సమాజము స్థాపనమును

చేసినట్టి ఫూలె మదిని జేతు గొలుతు.


తే.గీ.

కులము భేదము లేనట్టి కోవెలదిగ

మనుజ ధర్మమే మిన్నగా మలచినట్టి

విషమ భావాల గోడల విరిచినట్టి

విప్లవపు రూపు జ్యోతిని వినతి సేతు.


తే.గీ.

భారతమ్మకు నూతన భావగరిమ

నొసగినట్టి మహాత్ముని యశము వెలుగు

నేడు రేపును ఎల్లెడ నిలిచి యుండు

జ్యోతిరావును తలతుము ప్రీతి తోడ.



తే.గీ.

అవని నాడు మహాత్ముడు ఆద రమున

చక్క నేర్పెను సావిత్రి చదువు లెన్నొ

నారి లోకము నడచును నవ్య పథము

భావి భారత భాగ్యము పండె నిట్లు.


తే.గీ.

మనుజ ధర్మము మహిమను మలచి నట్టి

కులము భేదము కొట్టియు కూల్చి నట్టి

దీన జనులకు దిక్కయి నిలిచి నట్టి

జ్యోతి రావును జ్యోతిగ జూడ వలయు.


తే.గీ.

దీన జనులకు దీపిగ దిద్దు బాటు

ధైర్య మొసగుచు ధర్మము దారి జూపి

ముక్తి పథమున ముందుకు ముగ్గు లేసి

కీర్తి బొందెను కృషివల కృష్ణ మూర్తి.


తే.గీ.

సమత ధర్మము సాకగ సాధ్య మౌను

చదువు కొనమనె సావిత్రి శక్తిమీర

అవని లోన అజ్ఞానము అణగి పోవు

భాను రూపుడు భాసుర భావ మొసగె.


తే.గీ.

మనుజ ధర్మము మహిమను మలచ నెంచి

కులము భేదము కొట్టియు కూల్చనెంచి

సమత మార్గము సావిత్రి సహచరిణిగ

బాట వేసెను భాసుర భాను మూర్తి.


తే.గీ.

జ్యోతి రావును దలతుము జ్యోతి వోలె

జ్యోతి వోలెను సావిత్రి జతగ నిలిచె

నిలిచె నీడగ ఫూలెను నిఖిల జనుల

జనుల బాంధవు డయ్యెను జగతి లోన.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

11.4.2026




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి