10 ఏప్రిల్, 2026

​తోబుట్టువుల దినోత్సవం

 ​తోబుట్టువుల దినోత్సవం 


ఒక్క గర్భాన పుట్టిన ఓర్పు తోడ

రక్త సంబంధ మధురిమ రాజిలంగ

కలిసి మెలిసియు పెరిగిన కమ్ర గుణము

తోడబుట్టిన వారల తోడు నీడ.


కాలమెంతగ మారిన గారవమ్ము

వీడబోదది ఎప్పుడు వేళ యందు

ఆపదల వేళ నిలుచును ఆత్మ బంధు

తోడబుట్టిన వారేను తోడు నీడ.


ధరణిలోనన వెలసిన ధన్య చరిత

సోదరీ సోదరుల మధ్య శోభ లీను

కలిసి మెలిసియు సాగెడి కాంతి వీధి

' దార్ల' పల్కును సోదర ధన్య గీతి


అమ్మ వోలెనె లాలించు అక్క ప్రేమ

తమ్ముడంచును దీవించు ధన్య చరిత

కష్ట కాలాన నిలిచెడి కల్ప వల్లి

అక్క తమ్ముల బంధమే అమృతమమ్మ!



అన్న అండగ నిలిచిన అచల సుఖము

తమ్ము డెప్పుడు నీడగా తలచు భక్తి

రామ లక్ష్మణ సామ్యమై రమ్య మగును

అన్నదమ్ముల కూర్మియే అవని నొందు!


చిన్ని చెల్లెలి నవ్వులే సిరుల మూట

పలకరింపుల లాలన పరమ సుఖము

అన్న ప్రాణము చెల్లెలే అఖిల జగతి

కంటి రెప్పగ కాయును కరుణ తోడ.


చిన్ననాటి ఆ ఆటలు చిత్ర గతులు

దెబ్బలాటలు, ముద్దులు, తీపి గుర్తు

పంచుకున్నట్టి ముచ్చటల్ పచ్చనగును

తోడబుట్టిన వారితో తోడు కనుము.


పండుగలకును వచ్చేడి పసిడి సిరులు

పంచుకొనెడి ఆ బహుమతుల్ పరమ హితము

సోదరీ సోదరుల మధ్య శోభ లీను

ముచ్చటైనట్టి బంధమే ముక్తి పథము.


ఎన్ని దేశాల తిరిగిన ఏమి యుండె?

కన్నవారల ప్రేమయే మిన్న యెపుడు

దూరమున్నను మనసులు చేరువౌను

తోడబుట్టిన వారల తోడు నిలుచు.


రక్ష కట్టెడి వేళల రాజిలంగ

అన్న దీవించు మాటలే అమర సుఖము

చెల్లె కన్నుల వెలుగులే శ్రేయ మిచ్చు

బ్రతుకు పండించు బంధమే బాంధవమ్ము.


లోకమంతను గెలిచిన లోటు రాదు

తోడబుట్టిన వారేను తోడు నిలువ

గుండె ధైర్యము నింపుచు కూర్మి తోడ

బాట చూపును సోదర భవ్య రీతి.


అమ్మ లేనియెడల తాను అమ్మ యగును

ఆదరించును నెప్పుడు అక్క ప్రేమ

నీడ వోలెను నిలచును నిరతముగను

తోడబుట్టిన బంధమే దొడ్డ దిలను.


అల్లరిని చేయు తమ్ముడు అండ నిలుచు

కంటి పాపగ కాచును కష్టమందు

నవ్వులొలికెడి వదనమే నందనమ్ము

సోదరుని కూర్మి జగతికి శోభ నిచ్చు.


ప్రేమ నిండిన హృదయాల పెన్నిధి యిది

తోడబుట్టిన వారేను తోడు దొరలు

వసుధ చాటును వీరిల వరపు మేలు

' దార్ల' పల్కును సోదర ధన్య గీతి.


చదువు నేర్పుచు తమ్ముని చక్క దిద్ది

అక్క చూపును ఎప్పుడు అభయముండు

తమ్ము డెప్పుడు నీడగా తనరు చుండు

వీరి సఖ్యత ఎన్నడు వీడి పోదు.


పండుగలు రాగ నిండుగా పరవశించి

అన్నదమ్ములు చెల్లెండ్రు ఆదరమున

కలిసి మెలిసియు విందులు కుడుచు వేళ

కలుగు సుఖములు జగతిలో గాంచ లేము.


దూరమెంతగ నున్నను దరిని చేరు

మమత లొలికెడి సోదర మంత్ర మిదియె

ఆత్మ బంధము లెన్నడు ఆరిపోవు

గుండె లోపల నిలుచును కూర్మి తోడ!


మనసు వీణను మీటెడి మమత లొలికి

సోదరీ సోదరుల మధ్య శోభ లీన

నిత్యమైనట్టి బంధమే నిరత శోభ

' దార్ల' పల్కును సోదర ధన్య గీతి.


లోకమంతయు నెదిరించు లోటు రాక

తోడబుట్టిన వారలె తోడు నిలువ

గుండె ధైర్యము నింపుచు కూర్మి తోడ

బాట చూపును సోదర భవ్య రీతి.


నేల పైనను గీసిన నిత్య రేఖ

చిన్ననాటి ఆ ఆటల చిత్ర గతులు

కలిసి పెరిగిన ముచ్చటల్ కమ్ర గుణము

ప్రాణ మిత్రుల మించిన బంధ మిదియె.


అమ్మ వోలెనె లాలించు అనుగు అక్క

దీవనల నిచ్చు నెప్పుడు దేవతవలె

మురిసి పోవును తమ్ముని ముచ్చటలకు

త్యాగ గుణమున మిన్నయై తనరు నిలను.


వెన్ను తట్టియు నిలుచును వేళ యందు

ధైర్య మొసగును అన్నయు దయను కురిసి

బాట చూపును తమ్ముని భవికి నెపుడు

స్వచ్ఛమైనట్టి అనురాగ పథము నిదియె.


పడతి నవ్వుల వెలుగులు బతుకు నిండ

సోదరీ సోదరుల మధ్య శోభ లీన

కీర్తి చాటును సోదర కేతనమ్ము

' దార్ల' కవనము సోదర ధన్య గీతి.


పండుగలు రాగ చెల్లెలి పాద మెపుడు

పరగునని యన్న వేచియు పథము జూచు

కళ్ళలోనన వెలుగులు కాంతి నీను

మమత పండించు బంధమే మధుర నడక.


పుట్టినింటిని వీడిన పూవు వోలె

అలరు నత్తారి యింటను అమర రీతి

కానుకల కన్న అన్నయ్య కలుసుకొనుట

పెన్నిధిగ తోచు నెప్పుడు ప్రేమ తోడ.


కష్టమొచ్చిన వేళన కలత చెంద

అన్న వస్తున్న డన్నట్టి ఆశ చాలు

గుండె ధైర్యము నింపును కొండ వోలె

రక్త సంబంధ మాధుర్య రాజి యిదియె.


అత్తవారింట అడుగులు అలరు వేళ

ఆడపడుచుకు అన్నయె అండ యగును

దూరమెంతగ నున్నను దరిని జేరు

సోదరుల ప్రేమ డెందాన సుఖము గూర్చు.



ప్రేమ నిండిన బంధమే పెన్నిధి యిది

యిదియు నిచ్చును ఎప్పుడు అభయ పథము

పథము చూపును అన్నయ్య ప్రాణముగను

ప్రాణమగునయ్య సోదరి పసిడి నవ్వు.


జన్మ జన్మల బంధమే శాంతి పథము

పథము చూపును అన్నయ్య పావనముగ

నముగ జేయును సోదరి నవ్వు లెపుడు

లెపుడు వీడని బంధమే లీల యిదియె.


ఆట పాటల చిన్ననా డలరు గతులు

చిన్న ముచ్చటల్ పెరిగిన చిత్ర గతులు

జ్ఞాపకములగుచు నిలుచు జగతి లోన

రక్త సంబంధ మాధుర్య రాజి యిదియె.


భావ గర్భిత మైనట్టి భవ్య రీతి

జన్మ జన్మల బంధమే జయము నొసగు

కీర్తి చాటును సోదర కేతనమ్ము

' దార్ల' కవనము సోదర ధన్య గీతి.


కష్టమొచ్చిన వేళన కలత చెంద

అన్న వస్తున్నడన్నట్టి ఆశ చాలు

గుండె ధైర్యము నింపును కొండ వోలె

రక్త సంబంధ మాధుర్య రాజి యిదియె


తమ్ము డెదిగిన వేళన తన్మయమున

మురిసి పోవును అన్నయు ముక్తి పథము

నీడ వోలెను నిలచును నిరతముగను

వీరి సఖ్యత లోకాన వెలుగు బాట.


జగతి లోపల వెలసిన జానపదము

మట్టి మనుషుల మమతల మధుర గీతి

ప్రేమ పంచెడి వారల పెన్నిధి యిది

'దార్ల' పల్కును సోదర ధన్య గీతి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి