18 జూన్, 2026

అనురాగం అంబరమైతే…! (కవిత)

 అనురాగం అంబరమైతే…!


మొదట్లో

నీ జాగ్రత్తలు ప్రేమలా అనిపించాయి.

ఎండ తగలకూడదని

చెట్టు నీడలో నిలబెట్టినట్టుగా

వాన తడవకూడదని

గొడుగు పట్టినట్టుగా

దారి తప్పకూడదని

చేతి వేళ్లు పట్టుకుని నడిపించినట్టుగా

అప్పుడు

ఆ రక్షణలో మమకారమే కనిపించింది.


పంజరంలోని పక్షికీ

మొదట్లో గింజలు, నీళ్లు, 

భద్రత అన్నీ దొరుకుతాయి.

ఒక రోజు మాత్రం

ఆకాశమే గుర్తొస్తుంది.

బంగారు గొలుసుతో కట్టినా

ఏ బంధనాలు లేని జీవితం కావాలనిపిస్తుంది

కుండలో నాటిన మొక్కకు

మొదట నీళ్లు చాలానే దొరుకుతాయి.

వేర్లు విస్తరించాలనుకున్నప్పుడు

ఆ కుండే కారాగారమవుతుంది.

నదికి ఆనకట్ట కట్టినవాడు

నీటిని కాపాడుతున్నాననుకుంటాడు.

ప్రవహించడమే స్వభావమైన నీరు

ఒక రోజు తన దారిని తానే వెతుక్కుంటుంది.

"నువ్వు నాకే సొంతమనే" అనే మాట

మొదట ప్రేమగానే వినిపిస్తుంది.

అదే మాట

ప్రతి అడుగును ప్రశ్నించినప్పుడు,

ప్రతి పరిచయాన్ని అనుమానించినప్పుడు,

ప్రతి చిరునవ్వుకు అర్థాలు వెతికినప్పుడు,

ప్రతి మౌనాన్ని విచారించినప్పుడు,

అది ప్రేమ కాదు, స్వేచ్ఛ మీద వేసిన

అదృశ్య సంకెళ్లు అనిపిస్తుంది.

ఆ సంకెళ్లు వేసేవారు శత్రువులు కాదు.

మన మంచికే

మనల్ని కోల్పోతామనే భయంతోనే,

మన చుట్టూ గోడలు కడతారని తెలుసు.

పంజరంలోని పక్షి 

ఎగరలేకపోతే 

ఆకాశమంతా స్వేచ్ఛగా 

తాను వివహరించలేకపోతే

పంజరాన్ని ఛేదించాలనుకోవడమంటే

దాన్ని ఏర్పాటు చేసినవాళ్ళను వదులుకోవాలనుకోవడమే!


తననెంతో  ఇష్టపడే వారిపై

రోజు రోజుకీ

కొంచెం కొంచెం ప్రేమ తగ్గిపోతూ

ద్వేషం పూర్తిగా నిండిపోతుంది

తక్కెడ తల్లకిందులవుతుంది!

అది నిజానికి ద్వేషం కాదు

బతకడంలో స్వేచ్చ లేదనిపించడమే!


ప్రేమ అంటే 

ఎవరినైనా మన దగ్గర బంధించడం కాదు

ఆత్మీయత అంటే

అందరితో కలివిడిగా ఉంటూ

తన వ్యక్తిత్వాన్ని తాను నిలబెట్టుకొనేలా చేయడం

స్వేచ్ఛ అంటే 

వాళ్ళు ఎగరగలిగేంత ఆకాశాన్ని ఇచ్చి

తిరిగి తిరిగి తన విలువేంటో తెలుసుకొని 

మళ్ళీ తనదే లోకమనుకొనేలా

తన దగ్గరకొస్తే ఆనందించడం!

స్వేచ్చను బందిస్తే

రక్షణ కవచాలనే పేరుతో కట్టిన గోడలు 

ఏదొక రోజు 

ఇద్దరి మధ్య సమాధులుగానే నిలవక తప్పదు!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 18.6.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి