01 మే, 2026

బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు

 


ఆశలే దుఃఖ మూలమం చనెను విభుడు

శాంతి మార్గము జగతికి చాటి చెప్పె

హింస వీడియు కరుణను ఇలను నింపె

బుద్ధ దేవుని గొలుతుము పొగడి యెపుడు.


ముక్తి మార్గము వెదకెను మొనసి యతడు

కామ క్రోధము లణచెను ఘనత తోడ

సత్య శోధన జేసెను శాంతి కొరకు

బుద్ధ రూపుడు వెలిగెను పుడమి యందు.


దీన జనులను గాచిన దివ్య మూర్తి

గోత ముడనెడి పేరున గొప్ప వాడె

ఆత్మ జ్ఞానము జూపిన అనఘ చరితు

పరమ శాంతిని గూర్చెను ప్రజల కెపుడు.


దీన జనులను గాచిన దేవ దేవు

డక్క జంబుగ నెంచెడి యార్య గుణము

కరుణ తోడను జగతిని గాచు నెపుడు

బుద్ధ పూర్ణిమ నిచ్చును పుణ్య ఫలము.



లోక మెల్లను మెచ్చిన లోలు డతడు

కామ మేలన దుఃఖము గలుగు ననియె

శాంతి మార్గము జూపెను చాక చక్య

మొనసి ముక్తిని గాంచెను మోద మలర.


వైర మణచును కరుణతో వసుధ యందు

కోప మెల్లను వీడెను కొమరు మిగిలి

శాంతి సౌఖ్యము లొసగును చారు చరిత

బుద్ధ ధర్మము నెరుగుట పుణ్య మగును.


బోధి వృక్షము చెంతను పొందె జ్ఞాన

ముల్ల మలరగ| జూపెను ముక్తి ద్రోవ

జ్ఞాన జ్యోతిగ వెలిగెను జగము నెల్ల

ధన్య చరితుడు సిద్ధార్థు డనఘ మూర్తి.


కోప మణచిన వాడెగ గొప్ప వాడు

తియ్య నైనట్టి మాటలు దేట పరచు

హింస వీడిన మనమున ఇలను గెలుచు

ముక్తి దొరుకును నిర్వాణ ముదము తోడ.


వెలుగు జూపెను లోకాన విమల మూర్తి

కాంతి నిచ్చెను జగతికి గరిమ తోడ

ధర్మ మార్గము నిలబెట్టె ధరణి యందు

సిద్ధి బొందెను తపమున శివము గనగ.


మేలు జేయును బుద్ధుని మిగుల దయయు

ఆత్మ శుద్ధిని గూర్చును అనఘ మార్గ

మెల్ల రికిని నొసంగును ఏక దృష్టి

సత్య శోధన జేయుట శాశ్వతంబు.


అష్ట మార్గము లొసగెను అనఘు డతడు

శుద్ధ చిత్తము గలిగిన శోభ గలుగు

సత్య వాక్కున నిలవగ శాంతి దొరకు

బుద్ధ పూర్ణిమ పర్వము పొంద జేయు.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

1.5.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి