02 మే, 2026

అంతర్జాతీయ ఖగోళ దినోత్సవం- 2026

 అంతర్జాతీయ ఖగోళ దినోత్సవం


విజ్ఞాన నేత్రం (టెలిస్కోప్):

అంబరములోని వింతల నరయుటకును

దూరదర్శిని సాయాన దొరకు జ్ఞాన

మద్భుతములెన్నొ కనబడు నవని పైన

సాధ్యమగునుగ శాస్త్రమ్ము శక్తి తోడ!


అంబరములోని వింతల నరయుటకును

దూరదర్శిని సాయాన దొరకు జ్ఞాన

మద్భుతములెన్నొ కనబడు మహిని పైన

సాధ్యమగునుగ శాస్త్రమ్ము సత్య మెరిగి.


మానవ జిజ్ఞాస:

నింగి లోగిలి వింతల నీక్షణింప

ప్రజ్ఞతోడను జేసెడి ప్రక్రియలివి

జ్ఞాన దీపమ్ము లోకాన జైత్రయాత్ర

చీకటులు బాసి వెలుగును చిన్నె లలర.


విశ్వం - ఒక అద్భుతం:

అంతరిక్షాన వెలిగేటి నంతకోటి

తారకలు జూడ గన్నుల తాపమారు

వింతలెన్నొ దాగున్నట్టి విశ్వమందు

శాస్త్రవేత్తల కృషినిల శాశ్వతమ్ము.


నక్షత్ర మండలం:

మిలమిలమ్మని మెరిసెడి మిత్రులంత

గగన వీధిని వెలుగుచు గనుల విందు

తారకల రూపములనున్న ధన్య జీవు

లనగ నొప్పెడి చుక్కల నరయ వలయు.


సూర్య చంద్రులు

భాను డెప్పుడు వెలుగుచు భాసరిల్లు

చంద్ర బింబము రేయిని చల్ల నగును

గ్రహములన్నియు తిరుగుచు గతిని జూపు

సృష్టి లోపలి వింతల సృష్టి గనగ.


పాలపుంత (Milky Way):

పాలపుంతయు వెలుగుల పథము జూపు

వేల కోటుల తారల వెల్లి విరిసి

రంగు రంగుల వింతల రాశి యగుచు

చూడ జక్కని వింతల చోద్య మిదియె!


గ్రహాంతర అన్వేషణ:

చందమామను చేరగ చక్ర మెక్కి

మౌన వీధిని సాగెడి మార్గ మిదిగొ

నందనంబుగ మార్చును నరుని ప్రజ్ఞ

వింత లోకపు గుట్టుల విప్ప గలుగు!


భూమి - ఒక అద్భుతం:

నీలి గోళము నింగిని నిలచి యుండు

జీవ రాశికి నిలయమై జెలువ మొందు

భాను కాంతిని పొందుచు భవ్య రీతి

పుడమి తల్లియు తిరుగును పొల్పు మీర.


గెలాక్సీల సమూహం:

విశ్వ వీధిని తిరిగెడి వింత లొకటె

చూడ గననేక ములనిను చూపు నింప

రంగు రంగుల చుక్కల రాశులన్ని

గూడి యుండెడి వింతలు గొప్ప వగును.


తోకచుక్క (Comet):

తోక చుక్కయు నింగిని దూసి పోవ

జూడ గన్నుల కింపైన జోక్య మిదిగొ

వంకరైనట్టి గీతగా వరుస వెలుగు

సౌర మండల వీధిని చాటు వింత.


కాల ప్రవాహం:

కాల చక్రము తిరుగును గగన మందు

వేగ మెంతయో యున్నను వెలికి గాదు

భాను చుట్టూర తిరుగుచు భాసిరిల్లు

మార జేయును రుతువుల మహిని పైన.


శాస్త్రీయ దృక్పథం:

మూఢ నమ్మకమ్ముల బాసి ముందు కెళ్లి

నింగి మర్మము గనుగొన నీతి తోడ

ప్రాజ్ఞులందరు దెలిపెడి పద్ధతులివి

విశ్వ విజ్ఞాన భావము విరియు నెపుడు.


నింగి లోపలి వింతల నీక్షణింప

శాస్త్ర విజ్ఞాన దృష్టియు సాయపడును

విశ్వ మర్మము దెలిపెడి విధము నేడు

భావి తరముల కిచ్చును భాగ్య మెలమి.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

2.5.2026








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి