04 మే, 2026

తమిళనాట విజయ్ విజయం

 తమిళనాట విజయ్ విజయం 


తమిళ నాటను తనదైన తళుకు జూపి

ప్రజల హృదయాన ప్రేమతో పదవి నొందె

వరుస గా నత డరుదెంచె వాసి గనగ

విజయ దుందుభి విశ్వము వినగ మ్రోగె.


అగ్ని పర్వత మందలి అగ్ని వలెను

నివురు గప్పిన నిప్పుగా నిలిచి యుండి

తగిన సమయాన వెలువడె తమిళ నాట

ప్రజల హితమును గోరుచు ప్రభలు చింద.


తార కప్రభు మార్గాన తనదు అడుగు

వరుస తప్పక వేసెను వాసి గనగ

రంగు లోకపు మోహము రమ్యముగను

వీడి వచ్చెను ప్రజలకు వెలుగు నీయ.


రంగు లోకాన రాణించు రంజు వీడి

నీతి తోడను నిలిచెను నిక్కముగను

తమిళ నాటను తనదైన తళుకు జూపి

వరుస గా ప్రజ వాణియై వన్నె కెక్కె.


అణచి పెట్టిన ప్రజల యీ ఆశ లొకటె

ఉప్పె నై నేడు వచ్చెను ఉన్నతముగ

తమిళ జాతినే మేల్కొల్పు తరుణ మిదియె

విజయ బావుటా నెగరెను విశ్వ మందు.


తార కప్రభు జూపిన తావు కనియె

వరుస తప్పక నిలిచెను వాసి గనగ

రంగు లోకపు మోహము రమ్యముగను

వీడి వచ్చెను ప్రజలకు వెలుగు నీయ.


అచల మైయున్న ఆగ్నేయ అచల మట్లు

శక్తి యుతుడైన శాసకు డరుగుదెంచె

తమిళ భాగ్యము తానే గ తలచి నేడు

వింత యగు రీతి విజయంబు విస్తరించె.


నంద మూరి విలాసాల నైజ మెంచి

రాజ కీయాన నిలిచెను రామ విభుడు

రంగు లోకపు మాయను రట్టు జేసి

వీడి వచ్చెను ప్రజలకు విలువ లొసగ.


అగ్ని కొండల లోపల ఆగి యున్న

లావ ధారలు ఉప్పొంగి లాగు నట్లు

తమిళ జాతినే మేల్కొల్పి తనదు శక్తి

విశ్వ మందున చాటెను విజయు డిపుడు


పేద ప్రజలకై నిలబడె పేర్మి తోడ

న్యాయ మార్గాన సాగెను నవ్య రీతి

తార కప్రభు వాంఛిత తత్త్వ మిదియె

వరుస గా ప్రజ సేవయే వరము గాను.


దార్ల వెంకటేశ్వరరావు, 4.5.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి