27 ఏప్రిల్, 2026

దక్షిణాఫ్రికా స్వేచ్ఛా దినోత్సవం

 దక్షిణాఫ్రికా స్వేచ్ఛా దినోత్సవం 


నల్లని మేనిని జూచియు

చల్లని మది లేదటంచు చాటగ దగునా?

కొల్లగ గుణములు వెలయును

నల్లని కృష్ణుని భజించు నరులకు నెల్లన్.


మంచి మాటలు పలికిన మనుజు డెపుడు

కోయిలమ్మగ మెప్పును కొల్ల గొనును

కాకి వలెనుండి కటువుగ గరవ నేల?

తీపి పలుకులె సౌజన్య దీప్తములిల.


కష్ట మొచ్చిన కాలాన కలత పడక

ఓర్పు వహియించి యున్నట్టి యుత్తముండు

ధాత్రి మాతకు దగియున్న ధైర్యమట్లు

నిలచి గెలుచును నిశ్చల నీతి తోడ.


మంచి గుణములు వెలయును మానవులకు

మంచి గంధపు చెట్టును మదిని గనగ

గొడ్డలిని గూడ తావిని గూర్చు నదియు

సజ్జనుడు కీడు చేయును చల్ల గానె.


పరుల మేలును గోరెడు ప్రాజ్ఞు డెపుడు

వార్ధి జలముల గొనియును వాన కురిసి

ధరణి సస్యము లొసగెడు దాత మేఘు

డట్టు లాశించ డెప్పుడు నలరి ఫలము.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

27.4.2026



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి