27 ఏప్రిల్, 2026

వరల్డ్ గ్రాఫిక్ డిజైన్ డే - 2026

 వరల్డ్ గ్రాఫిక్ డిజైన్ డే 

(ప్రపంచ రూపకల్పన దినోత్సవం)



అందమైనట్టి రూపాల నలరి గీసి

భావ మెల్లను వెల్లడి పరచు చుండు

రంగు రంగుల పుష్పాల రాజి గనగ

తోట మాలిని చాటదే లోక మందు.


చూడ ముచ్చట చూపుల చూర గొనగ

రంగు రంగుల రాజిల్లు రమ్య చిత్ర

పురిని విప్పిన పులుగును పోలి యుండు

వన్నె లన్నియు వాస్తవ వరుస తోడ.


భౌతి కమ్మగు భావము భౌవ్య మవగ

స్పష్ట మగునట్లు శీఘ్రమే పరుల కెరుక

అద్ద మందున ఆకృతి అలరి నట్లు

శుభము గూర్చును సూటిగ శోభ తోడ.

అక్ష రమ్ముల అందము అలరి నట్లు

చిత్ర రూపాన చిన్నెలు చిందు తొక్కు

రంగు విరిసిన రవికాంతి రమ్య మవగ

మేఘ మాలల మెరుగులే మేలు గాదె.


నేర్పు తోడను నిర్మించు నిపుణ కలలు

అల్లి బిల్లగ అందము అలరి నట్లు

సాలె గూడున సవరించు చాతు రిమయు

వింత గొల్పును విజ్ఞాన వీథి యందు.


కొత్త రూపము కోరును కొల్ల గాను

భావ మెల్లను భాసిల్లు భాగ్య మవగ

చిగురు టాకులు చిన్నెలు చిందు నట్లు

వన్నె లొలుకును వాస్తవ వరుస తోడ.


భావ చిత్రము భాషగ భాస మవగ

చెప్ప నలవిగ చేయును చేత లందు

విరిసినట్టి ఆ విరుల లో వీచు తావి

దూర మేగును దురమున దొరకు రీతి.


అంద గింపుగ అమరిక అలరి నట్లు

తూక మెప్పుడు తుచ్ఛము తోయ కుండ

హంస నడకల అందము అలరి నట్లు

సమత నిలుపును సద్గుణ సరణి తోడ.


రంగు రంగుల రాజిల్లు రమ్య చిత్ర

వన్నె లన్నియు వాస్తవ వరుస తోడ

మింట నింద్రుని విల్లును మెరిసినట్లు

చూడ ముచ్చట చూపుల చూర గొనును.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 27.4.2026





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి