29 ఏప్రిల్, 2026

జాతీయ నత్తల దినోత్సవం (29.5.2026)

 జాతీయ నత్తల దినోత్సవం (29.5.2026)



సద్దు చేయక సాగును సరళ గతిని

వింత లోకపు వింతలన్ వీక్షణంబు

ముడుచు కొనునదె మొనసియు ముప్పు వేళ

నత్త జీవన నడకలు నవ్య మగును!


నత్త నడకల నొద్దిక నడచు నెపుడు

భార మైనట్టి గూటిని బలము తోడ

మోయు చుండును వీపున ముదము తోడ

ఓర్పు నేర్పును జగతికి ఒసగు చుండు!



ఆకు లలముల నడవిలో నారగించి

ప్రకృతి మాతకు సేవలు పదిల ముగను

చిన్న ప్రాణియె యైనను చిద్విలాస

సృష్టి కంతకు మేలును చేయు చుండు!


గమన మెంతగ గాంచిన గణ్య మగును

లాభ నష్టము లేనట్టి లలిత వృత్తి

మంద గతియైన మానదు మహిని సాగ

విక్ర మార్కుని వీరత్వ విధము తోడ!


కోప తాపము కూడదు కొంచె మైన

శాంత గుణమున సాగును సత్య పధము

వెనుక ముందుల వేగము విడచి తానె

తనదు దారిని తానుగా తరలి పోవు!



గర్వ మేర్పడ గాంచదు గణ్యమైన

జీవ యాత్రను జేయును జెమట కార్చి

భావి తరముల బాటకు భౌమమందు

స్థిరత నొసగుచు సిద్ధమై స్నేహమొసగు!


వాన కాలము వచ్చిన వరస తోడ

బైట కరుదెంచి బాటల భాసిలునది

పచ్చ దనమును ప్రేమను పంచు కొరకు

ధరణి జీవుల దరి జేరు ధన్య జీవి!


ఇల్లు వీపున నీశ్వరు డిచ్చె ననగ

ఎందు కేగినా ఏతెంచు నెమ్మదిగను

సొంత గూడే కదా యది సొగసు లొసగు

భార మెంచక బ్రతుకును భౌమమందు!


కాల మెరిగియు కదలును కష్ట పడుచు

వాన రాకను వేగము వలను దెలిసి

మట్టి లోపల మారును మహిమ తోడ

జీవ కోటికి జేయును జెలువు నెపుడు!


ధైర్య గుణమున ధాత్రిని ధన్య మగుచు

సార మెరిగియు సాగును సత్య పధము

మాట తప్పక మానవ మనుగ డలకు

బాట చూపును భాసిల్లి పరమ శాంతి!

డా.దార్ల వెంకటేశ్వరరావు 29.5.2026



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి