26 ఏప్రిల్, 2026

మేధో సంపత్తి దినోత్సవం 2026

 మేధో సంపత్తి దినోత్సవం 2026


మేధ నొలికించి కొత్తవి మిగుల జేయ

సృజన శీలుర విజ్ఞాన శేఖ రములు

లోక మునకెల్ల వెలుగులు లోలు పవగ

వన్నె దెచ్చెను విజ్ఞాన వర్థ నముగ.


కూరి  చినయట్టి  మేధస్సు కొల్ల  బోక

చట్ట బద్ధపు  హక్కుల  చాటు  చుండి

శ్రమము  నీదగు  ఫలితము సాధ్య  మయ్యె

హక్కె  కవచమై  నిలుచును  అనఘ  మూర్తి.


కొత్త బాటల నన్వేష కొనగ జేసి

యుక్తి తోడను విజ్ఞాన ఉద్ధ రించి

మాన వాళికి మేలును మహిని గూర్చు

మేధ సంపద జగతికి మేలు సుమ్మి.


ఆవి ష్కరణలు  హెచ్చుగ అలరు చుండ

జ్ఞాన  కిరణము  లెల్లెడ జాడ  జూప

మేధ  సంపద దినమున  మెలకు వగను

వంద  నములను  దెల్పుద వరుస గనగ.


ఏరు పారుచు పొలమును ఏల పండు?

కష్ట మొనరిన కర్షకు గరిమ గాదె

మేధ నొలికించి సృజనను మిగుల జేయ

శమము నీదగు ఫలితము సాధ్య మయ్యె.


అమరి నట్టిట్టి నిధులపై ఆశ యుండ

కోట రక్షణ నిచ్చును కొల్ల బోక

హక్కు కవచమై మేధకు అండ నిలుచు

దొంగలగజూడ హక్కుల దోచు కొనగ.


విరిసి నట్టిట్టి పుష్పము విలువ దెచ్చు

తావి దిశలను వెదజల్లి తనివి నిచ్చు

మేధ సంపద లోకాన మెలకు వగను

కీర్తి కాంతిని పంచెను కృషిని గనగ.


మేధ ననెడిట్టి కల్పక ముదిత మవగ

వింత లైనట్టి ఫలముల విసరు చుండు

హక్కు లనుకావ వలయును అవని పైన

సృజన శీలుర శ్రమయది చెడక యుండ.


దీప మున్నంత మాత్రాన దీప్తి రాదు

గాలి సోకక నుండగ గవచ మేది?

దొంగిలగకుండ హక్కుల దోడు నిడుము

మేధ సంపద చౌర్యము మిగుల కీడు.


ధనము పోయిన తిరిగియు దక్క వచ్చు

మేధ బోయిన కీర్తియు మెరవ బోదు

హక్కు చట్టము లున్నవి అండ గాను

సృజన నిలవగ లోకము స్థిరము గాను.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

26.4.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి