24 ఏప్రిల్, 2026

ప్రపంచ ప్రయోగశాల దినోత్సవం 2026

 జంతువులపై ప్రయోగాలు - ప్రాణ హింస


జ్ఞాన దాహాన జీవుల చావు గోరి

వేదనను జేయ తగదుర వెర్రి నరుడ!

ప్రాణ కోటిని గావగ భావ్యమగును

దీన జీవుల దయజూడ దివ్యపథము.


విశ్వ మంతయు ప్రాణుల విడచి లేదు

ధాత్రి పైనున్న జీవుల దయను గాంచు

పక్షి జాతియు మృగములు పావనమ్ము

వసుధ కందము వీనితో వచ్చు నయ్య!


శాస్త్ర మనుచును ప్రాణుల చంప తగదు

జీవ కారుణ్య మార్గము జేర రార

జ్ఞానమన్నది రక్షణ నొసగ వలెను

ప్రాణి కోటికి భయమును బాప వలెను.


క్రూర కృత్యము లొనరించి కుతక మెందు?

ప్రాణి కోటికి నమృతము పంచ వలెను

జ్ఞాన జ్యోతిని వెలిగించి జగతి పైన

శాంతి మార్గము జూపగ చాలు నయ్య!


విషము లెక్కించి జీవుల వేధ పెట్ట

ధార్మికము గాదు శాస్త్రము దయను వీడ

పరగు ప్రాణుల రక్షించు పావనతను

మహిని జూపగ వలెనయ్య మనుజు డెపుడు.


అమ్మ వలెనేని ప్రకృతిని ఆదరించి

మెలగ వలెనయ్య జీవుల మేలు గోరి

సృష్టి లోపల నందఱు స్నేహమునను

వసుధ పైనను బ్రతుకగ వలయు నిట్లు.


రక్త మాంసాల పిచ్చిని రద్దు జేసి

జీవ కారుణ్య దీప్తిని జేర రార

పాప భీతిని గల్గియు భావ్యమగును

మహిని ప్రాణుల బ్రోచుట మంచి గుణము.


ప్రకృతి ఒడిలోన పుట్టిన ప్రాణులెల్ల

స్వేచ్ఛ నొందగ వలయును స్థిరము గాను

బంధి గావించి చంపుట బరగు నగునె?

శాంతి మార్గము జూడగ చాలు నయ్య!


కన్ను లెదుటను మూగవి కరుణ గోర

మానవత్వము వీడక మనుజులార!

స్నేహ భావము జూపుట శేష గుణము

శాంతి నిచ్చును జగమున చాలు గాను.


చదువు నేర్చిన మనుజుడే చంప దలచు

ప్రాణి కోటికి రక్షణ ప్రాపును గదె

హింస వీడిన లోకము హీన మగునె?

దీన జీవుల బ్రోచుట దివ్య పథము.


దేహి యనుచును మూగవి దేర జూడ

పసిడి మనసున కరుణను పంచ వలెను

ముక్తి మార్గము జీవుల మోద మందు

శాంతి నిచ్చును జగమున చాలు గాను.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

24.4.2026

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి