16 జులై, 2026

ఆమె ఎప్పుడూ ఓ ప్రశ్నల కెరటమే!



ఆమె ఎప్పుడూ ఓ ప్రశ్నల కెరటమే!


ప్రతి క్షణం

ఆమె నోటిలో

ఒకే రకమైన ప్రశ్నలు 

“ఏం చేస్తున్నారు?”

“ఎక్కడున్నారు?”

“నీ పక్కన ఎవరు ఉన్నారు?”


ఫోన్ మౌనంగా ఉంటే

ఆ ప్రశ్నలు

మనసులో మరింత గట్టిగా మ్రోగుతుంటాయి,

సమాధానం ఆలస్యమయ్యేకొద్దీ

అనుమానం చిన్న మంటలా మొదలై

పెద్ద అగ్నిలా మారుతుంది.

ఆమె ఎక్కడడున్నా

ఆ మనసు మాత్రం

నా మది తలుపును తడుతూనే ఉంటుంది.


ఆమె మాటలు

చిరు జల్లుల్లా మొదలైనా

రాళ్ళవర్షంతోనే ముగుస్తాయి

ఆమె ఓ నిలువెత్తు అనుమానపు సంతకం!

ఆమె మనసు

ఎప్పుడూ ఒకే ప్రశ్న 

పలు విధాలుగా అడుగుతుంది:

“ఏం చేస్తున్నారు?”

“ఎక్కడున్నారు?”

“నీ పక్కన ఎవరు ఉన్నారు?”


నాకు మాత్రం

ఆ ప్రశ్నలు

సమాధానం కోరిన మాటల్లా అనిపించవు.

నన్ను మర్చిపోలేదుగా అని

ప్రేమతో అడిగే

మరో భాషలానే అనిపిస్తాయి!

దార్ల వెంకటేశ్వరరావు 16.7.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి