09 జులై, 2026

బ్యాలెన్స్ తప్పుతోంది!

 

బ్యాలెన్స్ తప్పుతోంది!



అడుగులు తడబడుతున్నాయి

 కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి

 గుండెల్లో దడ మొదలవుతోంది

 అయినా

 ఈ జీవితం చలనం ఆపడం లేదు.

ఒక్కో క్షణం

 ఒక్కో పరీక్షగా మారుతోంది.

 శరీరం

 నా మాట వినడం మానేస్తోంది.

 మనసు మాత్రం

 ఇంకొంచెం ముందుకే నడవమంటోంది.

చెమట చుక్కల్లో

 భయాలన్నీ కరిగిపోతుంటే,

 రక్తంలో

 లెక్కలన్నీ తిరుగుబాటు చేస్తున్నాయి.

నవ్వు కూడా

 కొలిచి నవ్వాల్సి వస్తోంది.

 తిండి కూడా

 కొలిచి తినాల్సి వస్తోంది.

 అలసట కూడా

 సమయం చూసుకుని వస్తోంది.

కాసేపు ఆలస్యమైతే

 లోకం యథావిధిగా ఉంటుంది,

 కానీ

 నా లోపల యుద్ధం మొదలవుతుంది.

చక్కెర తగ్గినా

 చీకటి కమ్ముకుంటుంది.

 ఎక్కినా

 శరీరమే భారమైపోతుంది.

జీవితం అంటే

 కోరికలు తీర్చుకోవడం కాదని,

 కొలతల్లోనే

 ప్రాణాన్ని కాపాడుకోవడమని

 ప్రతి రోజూ

 ఈ దేహమే నాకు పాఠం చెబుతోంది.

పడిపోకుండా ఉండటమే

 ఇప్పుడు విజయంగా మారింది.

 మరో అడుగు వేయగలిగితే

 అదే గెలుపుగా అనిపిస్తోంది.

బ్యాలెన్స్ తప్పుతోంది...

 కానీ

 ఆశ మాత్రం తప్పడం లేదు.

ఈ శరీరం

 ఎన్ని హెచ్చరికలు చేసినా,

 ప్రాణం మాత్రం

 ఇంకా బతకాలని కోరుకుంటోంది.

అందుకే

 తడబడుతున్న అడుగుల మధ్య,

 తూలుతున్న శరీరంలోనూ,

 వణుకుతున్న గుండెలోనూ

 నేను ఇంకా

 జీవితాన్నే పట్టుకుని నడుస్తున్నాను.

దార్ల వెంకటేశ్వరరావు 9.7.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి