04 జులై, 2026

పిడికిలెత్తేవరకే…! ...

 పిడికిలెత్తేవరకే…! 



వాళ్ళంటే భయపడాలట.

వాళ్ళంటే భయంతో వణికిపోవాలట.

వాళ్ళంటే మహాశక్తివంతులనుకోవాలట

హక్కులన్నీ 

అందరికీ సమానమేకావట!

వాళ్ళంటే

వాళ్లే శక్తి, వాళ్లే అధికారం,

వాళ్లే అంతా అనుకోవాలట!


సామాన్యుడు పిడికిలెత్తేవరకే

నాగరిక సమాజంలో 

ఆ అనాగరికపు 

విచ్చలవిడి స్వేచ్ఛామృగత్వం



మన భయాల మీద

వాళ్లు కట్టుకున్న సామ్రాజ్యాలు

ఒక్క ప్రశ్నతోనే బీటలు వారిపోతాయి.

ఒక్కసారి

మన గొంతు విప్పితే 

వాళ్ల గర్జనలన్నీ గుసగుసలైపోతాయి.

వాళ్ల బలం

మన భయంలోనే ఉందని

తెలిసిన క్షణం నుంచే

వాళ్ల నీడ చిన్నదైపోతుంది.

ఒక పిడికిలి చాలు.

ఒక స్వరం చాలు.

ఒక ప్రశ్న చాలు.

నిజం ముందు

అధికారం ఎంతకాలమో నిలడలేదు.

ధైర్యం ముందు

బెదిరింపులెంతకాలమో పనిచేయలేవు.

అహంకారం 

ఆధిపత్యం వికృత రూపమెత్తితే

గడ్డి పోచకూడా 

గొంతెత్తే స్వరమవుతుంది

ఆధిపత్యాలన్నీ

ఇసుక మేడల్లా కూలిపోతాయి.!

డా.దార్ల వెంకటేశ్వరరావు 4.7.2026.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి