06 మే, 2026

అంతర్జాతీయ ఆహార నియంత్రణ దినోత్సవం

 అంతర్జాతీయ ఆహార నియంత్రణ దినోత్సవం 



ముందు వడ్డించు కూడును ముక్కజేసి

వృథగ జేయుట పాపమౌ విశ్వమందు

ఎండ వానల కోర్చియు నిలచి రైతు

పంట పండించు రీతిని మరువ తగదు!


మెతుకు లేకను మాడెడు పేద గనక

పళ్లె మందున విడచుట పాడి కాదు

దాహ మైనట్టి వేళను దరికి జేరు

నీటి చుక్కను వదలని రీతి జూడ!


వండ వలయును తిండిని వలయు నంతె

పార వేయుట పుడమికి భార మగును

తేనె టీగలు గూడున తేనె నిట్లు

దాచు కొనెడి యా వింతను తలచు మయ్య!


తినెడి తిండిని హద్దుల తీర్చు కొనక

రోగ రాశులు జేరును రొంపి రీతి

మేర మీరిన నదిలోని నీరు మెరసి

ముంచు చందాన ఒప్పును మోద మబ్బ!


కూడు నెక్కువ వడ్డించి కుమ్మరించి

పార వేయుట పాపమౌ భరత భువిని

దాచు కొనెడిట్టి చీమల ధర్మ మచట

గాంచ వలయును బుధులును గారవమున!


విందు లందున వృథజేయు విందు నార

పేద కడుపును నింపును పెన్నిధిగను

పారు నీటిని నిలిపియు పరుల కొరకు

నడక జేసెడి కాల్వల నయము రీతి!


వండినట్టిది మిగిలిన వ్యర్థ మేల

ఆకలి గొనిన వారికి నర్పణమిడు

మేఘ మందలి నీరును మేది పైన

జల్లు కురిసిన చందాన చల్ల గనగ!


అల్ప మాహార మెప్పుడు నారగించు

మేను నందున నిలచును మిగుల శక్తి

దీప మందున చమురును దీప్తి నిడగ

దగిన రీతిన వెలుగును ధరణి లోన!

పంట పండించు కర్షకు ప్రాణ మెరిగి

మెతుకు వదలక తినుమమ్మ మేదినీన

ఒలిచి ముత్యాల హారమ్ము నుర్వి పైన

వదులు కొనెడిట్టి వింతను వదల వయ్య!


మితము మీరిన తిండియు మేను నందు

రోగ రాశుల దెచ్చును రొంపి రీతి

కట్ట తెగిపారు నీరంత కడలి జేర

పంట పొలముల ముంచెడు పగిది తోచు!


డా.దార్ల వెంకటేశ్వరరావు 6.5.2026




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి