01 మే, 2026

ఒక ఎర్రని సూర్యోదయం

ఒక ఎర్రని సూర్యోదయం



పొద్దుపొడుస్తుంది
అది కేవలం సూర్యోదయం కాదు
చేతులపై గట్టిపడిన గాయాల
నిశ్శబ్ద గాథల ఉదయం.

కూలి చెమట చుక్కలు
భూమిపై పడితే
అవి నీటి బిందువుల్లా అనిపించే
చరిత్ర రాసిన నా అక్షరాలు.

ఇనుప శబ్దాల మధ్య
నిశ్శబ్దంగా ముక్కలైన కలలు
మళ్లీ మళ్లీ లేస్తాయి

 పిడికిలి బిగించి.

అది నా శ్రమను రంగు చేసే
ఎర్ర జెండా
అది ఒక జ్ఞాపకం
రక్తంతో వ్రాసిన హక్కుల గీతం.

ఒక రోజు మీకో సెలవు దినం కావొచ్చు
ఈ రోజు
నాకు ఎన్నో రోజులు నిద్రపోయిన
న్యాయాన్ని లేపే కంఠధ్వని.

మేడే అంటే
కేవలం తేదీ మాత్రమేనా
మనిషి విలువను కొలిచే
మానవ గీతిక.

పొద్దు వెలుగులో
పనివాడి చెయ్యి పైకి లేస్తే
అది కేవలం సంకేతమేనా
సమానత్వం కోసం
సమయం తలుపు తట్టిన శబ్దం.

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 1.5.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి