26 ఏప్రిల్, 2026

సూర్యదేవుని వర్ణన (తేటగీతి పద్యాలు)

 సూర్యదేవుని వర్ణన (తేటగీతి పద్యాలు)


తేజమును వెదజల్లుచు దిశల యందు

ఎర్ర నైనట్టి రాతిపై నమరి యున్న

సప్త అశ్వాల రథమెక్కి సాగు చుండ్ర

గగన వీధిని సూర్యుడు గరిమ తోడ!


ఉషయు ప్రత్యూష లనెడి ఆ ఉవిద లిరుగ

ప్రక్క నుండగ వెలుగుల ప్రబల గనుచు

పద్మములను జేతులలోన భక్తి తోడ

ధరణి కంతట శక్తిని దయను నొసగు!


తొడలు లేనట్టి -సారథి -తోడు నిలువ

చక్ర మొకటియె గల్గిన శకట మందు

ఏడు ఛందస్సు లశ్వాల రీతి నడచు

కాల చక్రము తిరుగును ఘనము గాగ!


ఆత్మ రాముడు - లోకాన - నలరు చుండ

చక్షు వనగను - వెలుగుల - జారు నట్లు

జ్ఞాన మార్గము - జూపెడి - ఘనుడు తానె

భాస్కరు డనగ - ప్రబలను - భాతి తోడ!


కళల నిలయమై -కోణార్క -కాంతి మీర

నిలిచె శిల్పము -గరిమను -నిఖిల మందు

ధర్మ మార్గము -నిలుపగ -ధరను నెపుడు

భాను నెప్పుడు -హృదినిని -భక్తి తోడ!


రవియె దాతయై -యవనిని -రక్షణముగ

శక్తి నిచ్చుచు -నెప్పుడు -సాగు చుండు

వేద మంత్రాల -వెలుగుల -వికసితముగ

జపము జేయగ -గాయత్రి -జయము నిచ్చు!


రవియె జ్యోతియై -రాజిల్లు -రాశి యనగ

వెలుగు నిచ్చుచు -విజ్ఞాన -వితరణముగ

తమము బాపెడి -దైవమై -ధరను నిలుచు

నిత్య సాక్షిగ -నిఖిలము -నెరుగు నతడు!


కనుల కాంతియై - కాపాడు - ఘనుడు తానె

ప్రకృతి శక్తుల - ప్రాణమై - పరగు వాడు

కర్మ సాక్షిగ - కాలమున్ - కలుగు జేయు

భాను డొక్కడే - పరమాత్మ - భాతి తోడ!


రవియె జ్యోతియై -రాజిల్లు -రాశి యనగ

వారముల నేడు -వర్ణాల -వైఖరినియు

సప్త ఛందస్సు -లశ్వాల -సరణి నడువ

కాల చక్రము -తిరుగును -గరిమ తోడ!


ఉషయును మఱియు -ప్రత్యూష -లుభయ సంధ్య

లమరి యుండగ -వెలుగుల -నమితముగను

శక్తి జ్ఞానము -లొసగెడి -స్వామి యతడు

భాస్కరుడు జూపు -లోకాన -బ్రతుకు దెరువు!


జ్ఞాన దీపమై -వెలుగును -గాంచ నగును

పరిమళించెడి -పద్మముల్ -పాణి నుండ

నిత్య సాక్షిగ -నిఖిలము -నెరుగు చుండ

భాను డొక్కడే -పరమాత్మ -భాతి తోడ!


పరుల కోసమే - తపియించు - పరమ మూర్తి

 ఫలము కోరక - ప్రభలను - పంచు వాడు

త్యాగ గుణమును - నేర్పెడి - తత్త్వ మిదియె

భాస్కరుని సేవ - పరమార్థ - పథము జూపు!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

26.4.2026




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి