07 ఏప్రిల్, 2026

అమరావతి మన (ఆంధ్రుల) రాజధాని అమరావతి !




అమర పురియన నలరారు అమరవతియు

ఆంధ్రులకునిడు నెప్పుడు అధిక ముదము

రాజ ధానిగ భాసిల్లు రమ్యమగుచు

కళల తోడను శోభిల్లు కాంతి తోడ!


కృష్ణవేణమ్మ యొడ్డున కీర్తి గన్న

శిల్ప సంపద లమరును శ్రేష్ఠ పురియు

సాతవాహన విభులకు సాటిలేని

పాలనా కేంద్ర మయ్యెను భాసిలగను!


మురిపెముగ ఆంధ్రులెల్లరు మురియుచుండ

ఆత్మగౌరవ చిహ్నమై యవని పైన

నిలచి చాటెను మన జాతి నిఖిల శక్తి

అమరపురి యన వెలిగెను నద్భుతముగ!


చట్ట బద్ధత నొందిన - చదువులమ్మ

పాల నాకేం ద్రమైనేడు - భాసిలెడిని 

కోటి ఆశల కిరణమై - కొలువు దీరి 

వెలుగు లీనును ఆంధ్రుల - వేల్పు నగరి!


రాజ ధానిగ వెలిగెడి - రమ్య పురిని

చట్ట రూపము దాల్చెడి - చరిత లోన

అమర నగరపు కీర్తిని - అవని చాటు

భాగ్య సీమగ ఆంధ్రుల - భవన మగును.


కృష్ణ వేణమ్మ తటినిపై -గెలుపు మీర

బుద్ధ దేవుని శాంతితో -పొదుగ బడియె

ఆంధ్ర జాతికి మణిహార -మవని పైన

అమర పురియగు -ఆంధ్రుల -అమర నగరి.


చట్ట రూపము దాల్చెను -చక్క నగుచు

ఆంధ్ర పుత్రుల కలలెల్ల -అవని పైన

పుడమి తల్లియు మెచ్చెడి -పొలుపు మీర

నేటి రూపము - నొందెను - నాటి కీర్తి!


ధరణి పుత్రుల త్యాగము - ధన్య మయ్యె

న్యాయ మార్గము గెలిచెను - నమ్మకముగ

ఆంధ్ర కోవెల శిఖరమై - అలరు నేడు

అమర పురి రాజధానియె - అదిరి పోయె!


చట్ట రూపము దాల్చెను శాస నమ్ము

అమర పురియే మనకునిక ఆప్త మయ్యె

కోటి ప్రజల గళమ్మున కూడె నపుడు

జయము జయమని పలికెను జగతి నేడు.


అమర పురి మన యశముగ అవని నిలిచె

చట్ట సభలలొ నికనది చాట బడెను

ఆంధ్ర ప్రజలక లలనివి అక్ష రముగ

నేడు నిజమాయె వినుమిక నిశ్చ యముగ.


కృష్ణ వేణమ్మ చెంతన కృపను వెలయ

రాష్ట్ర రాజిది రంజిల్లె రాజ మార్గ

కోటి వెలుగుల కొలువైయు కోర్కె తీర్చు

చూడ ముచ్చట గొలిపెడి చూపు లొలుకు.


తెలుగు జాతికి దీపమై తెలియ జెప్పు

ఆత్మ గౌరవపు పతాక అమర పురిది

జాతి కీర్తిని జాటెడి జయము నిచట

నిత్య శుభముల నింపెడి నిలయ మయ్యె.


కృష్ణ వేణమ్మ చెంతన కృపను వెలయ

రాష్ట్ర రాజిది రంజిల్లె రాజ మార్గ

కోటి వెలుగుల కొలువైయు కోర్కె తీర్చు

చూడ ముచ్చట గొలిపెడి చూపు లొలుకు.


శాత వాహన పాలన శాంతి నిలయ

నిలయ మయ్యెను ఆంధ్రుల నిఖిల కీర్తి

కీర్తి వెలసెను అమరేశు కృపను నిచట

నిచట నమరావతి యనియే నెగడె గరిమ.


శాంతి మార్గము జూపెడి సామి నిలిచె
నిలిచె చిహ్నము నందున నిఖిల విభవ
విభవ మమరెను ఆంధ్రుల వెలుగు గనగ
కనగ నమరావ తిలకము కరుణ నిచట.


బోధి వృక్షము శాంతికి పొందు నిచట
పూర్ణ కుంభము సుమముల పూజ గొనును
ధర్మ చక్రము సాక్ష్యమై దారి జూపు
బుద్ధు నలమును ప్రతిమయె పుడమి మెచ్చ.

చర్మ కారుడు విధుకుడు చక్క నెంచి
చక్క నైనట్టి కుంభము సంత రించె
మంగళప్రద మయ్యెను మహిని నేడు
విశ్వ మంతయు వెలిగెను విభవ మొలికి.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

7.4.2026

(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టకేలకు 'అమరావతి' ని రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్ లోని ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకం అయ్యి, చట్టం రూపొందిన సందర్భంగా....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి