21 ఏప్రిల్, 2026

జాతీయ తేనీటి దినోత్సవం 2026

 జాతీయ తేనీటి దినోత్సవం 2026


వాన కురిసిన తరినైన, వాడి పోవు

ధరణి పై చినుకులు పడ దనియు నట్లు

అలసి వచ్చిన వేళకు నమృత మైన

టీని ద్రావిన తనువున ఠీవి హెచ్చు!


ఉదయ కాలాన టీకప్పు నొసగు తృప్తి

మంచు తెరలను చీల్చుచు భానుడెట్లు

లోకమున కెట్టు లొసగునో రోకటముగ

అట్టులే మేను చురుకుగా యలరుచుండు!


చలిని కాచుట కీనాడు చక్కనైన

వేడి టీకప్పు తోడగు వెచ్చదనము

మందు వలెనది తలనొప్పి మాన్పుచుండు

చిన్న టీకప్పు చేయును చిద్విలాసి!


పనిని జేయుచు నలసట పొందినపుడు

భాను డస్తమింపగ నింగి భాసిలునటు

ఒక్క కప్పు టీ త్రాగిన నొడలు నలరు

క్రొత్త శక్తియు వచ్చును కోరు నట్లు!


మితము నెరిగిన యెడలను మేలు కలుగు

అతిగ ద్రావిన కీడది యరుగు దెంచు

అర్థ మెరిగిన వారలే యవని యందు

సుఖము నొందుదు రని తల సోక నిమ్ము.


కూడు తినకున్న నొక పూట కొదవ లేదు

టీయె దొరకని యెడలను ఠీవి తప్పు

అన్నమును మాని నను దీని ననవరతము

గోరుదురు టీని ప్రాణముల్ గెలుచు ననగ!


పూల గంధము గాలితో పొదలు నట్లు

మైత్రి పెరుగును టీతోడ మనుజులందు

చక్కనైనట్టి మాటలు చాలు సాగ

మంచి తరుణము టీ నిచ్చు మహిమ తోడ!


చురుకుదనమును మేనికి జూపు నదియు

బద్ధకము బాపి పనులను బాగ జేయు

కష్టజీవుల కాధార కల్ప వల్లి

నిజము తేనీరు జగతిలో నీడవోలె!


పనిని జేయుచు నలసట పొందినపుడు

భాను డస్తమింపగ నింగి భాసిలునటు

ఒక్క కప్పు టీ త్రాగిన నొడలు నలరు

క్రొత్త శక్తియు వచ్చును కోరు నట్లు!


అతిథి అభ్యాగతులు ఇంటి కరుగుదేర

మంచి నీళ్ళకు బదులుగా మమత తోడ

టీని నొసగుట నేడుగా ఠీవి యండ్రు

వింత కాదిది యెన్నడు వేళ యందు!


విందు భోజన మైనను వేళ కపుడు

టీని ద్రావక తృప్తియు ఠీవి గలుగ

దనుచు భావింతు రెందరో ధరణి యందు

వరుసగా దీని ప్రాశస్తి వాసి కెక్కె!


ఏపుగానున్న టీయాకు లెన్ని యైన

వేడి నీళ్లలో కలియగా వెలుగు నిచ్చు

తీపి పాలతో జేరిన తీరు చూడ

భావమున నిండు తృప్తియు భాసిలునుగ!


మితము నెరిగిన యెడలను మేలు కలుగు

అతిగ ద్రావిన కీడది యరుగు దెంచు

అర్థ మెరిగిన వారలే యవని యందు

సుఖము నొందుదు రని తల సోక నిమ్ము!


పల్లెటూళ్లలో పట్టణ పాళులందు

అన్ని చోట్లను టీకొట్లు అమరి యుండు

అన్ని వర్గాల వారలు అచట జేరి

కలిసి త్రాగుట సమతను గలిగి యుండు.


ఒడలు అలసిన వేళను ఒక్క కప్పు

టీని ద్రావిన తనువున ఠీవి హెచ్చు

మత్తు వదలించి మేనిని మరల నిపుడు

పొంగు శక్తిని నింపియు పొదలు చుండు.


మితము నెరిగిన వారలే మేలు గాంతు

రధిక మైతేను హానియే యరుగు దెంచు

అతిని వర్జ్యము చేయుట యర్హ మగును

తేటగా దీని నెరుగుము తెలివి తోడ!


చదువు కొనియెడి బిడ్డల చాలు నిదుర

మత్తు వదలించి చదువుపై మక్కువమ్మ

టీయె నొసగును వారికి ఠీవి నపుడు

దెసలు మెచ్చగ గెలుపును తెచ్చు టకును!


అతిగ ద్రావిన కీడది యరుగు దెంచు

మితము నెరిగిన వారలే మేలు గాంతు

రసము లన్నిటి కన్నాను రాజ మనెడి

తేట తేనీరు జగతిలో తెలియ నగును!


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

21.4.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి