29 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ నృత్య దినోత్సవం-2026

 అంతర్జాతీయ నృత్య దినోత్సవం


ఆంగి కముతోడ నభినయ మరయగాను

హావ భావముల్ మనమున హత్తు కొనగ

తాళ గతులుగా నర్తన తాల పరచి

భాసు రమ్మగు కళనిది భావ మొనరు.


దేశ మంతయు నృత్యమే దేచు చుండ

ఆన దంబొస గెడునిది అను దినంబు

శాంతి నిచ్చుచు మనసును శాంతి పరచు

సాటి లేనట్టి విద్యది సత్య మయ్య.


ఏప్రి లను నెల లోనను ఎల్ల వేళ

నృత్య మును జేయ వలెనని నిశ్చ యించి

జాతు లన్నియు నొక్కటై జాగురూక

చాట వలె దీని జగమున చాల నపుడు.


చింత లన్నియు మదినుండి చెదరి పోవు

ఆట లాడిన తనువందు ఆశ నిండు

శాంతి గలుగును లోకాన సతము మనకు

నృత్య మనునది పరమాత్మ నిలయ మయ్యె.


పాద గతులును లయతోడ పరిమ ళించ

మెరుపు తీగగ మేనంత మెలగు చుండ

కనుల సైగలు భావముల్ కలిపి చూప

విశ్వ మంతయు నృత్యమౌ వింత జూడు.



భావ మక్కర లేనట్టి భంగి మలిది

తాళ గతులకు నింపుగా తనువు గదులు

లయలు సంగీత రీతుల లలిత మగును

నృత్త మన్నది శిల్పపు నిలయ మయ్యె.


(నృత్తం: ఇది కేవలం శారీరక కదలికల (అంగ విన్యాసాల) సమాహారం. ఇందులో భావం (Expressing emotions or story) ఉండదు. కేవలం తాళం, లయ మాత్రమే ప్రధానం. అందుకే దీనిని "Pure Dance" అంటారు.నృత్తానికి సంగీతం ఉంటుంది, కానీ ఆ సంగీతంలోని పదాలకు అర్థం  చెప్పడం ఉండదు. కేవలం జతులు, స్వరాల లయకు అనుగుణంగా అడుగులు వేయడం జరుగుతుంది.)


రసము లొల్కుచు భావముల్ రక్తి గట్ట

ముదము గూర్చెడు నభినయ ముఖ్య మిచట

పాట అర్థము జూపెడు పద్ధ తిదియె

నృత్య మందున ముద్రలే నియమ మయ్యె.


(నృత్యం: పాటలోని అర్థాన్ని, రసాన్ని హావభావాల ద్వారా, ముద్రల ద్వారా వ్యక్తపరచడం (Expository Dance).)


నృత్తం చేసేటప్పుడు కథను లేదా భావాన్ని అభినయించాల్సిన అవసరం లేదు, కేవలం శరీర కదలికలు తాళానికి అనుగుణంగా ఉంటే చాలు. సంగీతం మాత్రం రెండు ప్రక్రియల్లోనూ అంతర్లీనంగా ఉంటుంది.


చరణ గతులతో నందము చాటు చుండు

కఠిన తాళము లయలతో కదలు మేను

తనువు భంగిమ లొప్పెడు తరము నిదియె

నృత్త మనగాను తాళపు నియమ మున్న.


హస్త ముద్రలు భావముల్ హత్తు కొనగ

కథను వర్ణించు రీతిలో కనుల విందు

పదము అర్థము జూపెడి పద్ధ తిదియె

నృత్య మనునది రసమును నింపు చుండు.


నాట్య మనగాను లోకపు నడక తెలియ

అన్ని కళలకు నిదియొక అద్ద ముగను

ముక్తి నిచ్చుచు జ్ఞానము ముదము నిచ్చు

నృత్య నిరతులు గొలువుడి నిత్య ముగను.


నృత్య మందున భావము నిండి యుండు

చిత్ర మందున రూపము చెలువ మొందు

అన్న మయ్యని పాటలు అమృత ములుగ

ధన్య మయ్యెను భారతి ధాత్రి పైన.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

29.4.2026.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి