02 డిసెంబర్, 2025

సిద్ధం చేస్తున్నారు

 సిద్ధం చేస్తున్నారు


కొద్ది సేపట్లో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళతారు

ఇప్పుడేమీ త్రాగకూడదట 

ఇప్పుడేమీ తినకూడదట

తలపోటు వస్తోంది

రాత్రి

ఎంత రాత్రి అయినా 

పొయ్యి మీద పెట్టనదెంత మరిగిపోయినా

నా కోసం ఎదురు చూసి

నాతోపాటే కలిసి త్రాగే 

ఆ టీ రాత్రి నేను త్రాగలేదు

అందుకేనేమో ఈ తలపోటు!

పోనీ ఇప్పుడైనా ఓ టీ ఇస్తారేమో…

ఇవ్వరట

ఏమీ త్రాగకూడదట

వద్దనే కొద్దీ

గుర్తొస్తుంది 

పొద్దున్నే ఆమె అల్లం, యాలికలతో 

ఘుమఘుమలాడే ఆ వేడి వేడి 

టీ త్రాగాలనిపిస్తుంది!


నిన్నటి నుండి ఎన్ని పరీక్షలో 

మానిటర్ మీద అంకెలు 

అప్పుడప్పుడూ అరుస్తుంటాయి

సిస్టర్ పరుగునొస్తుంది

ఏవో ఇంజెక్షన్లు, మరేవో ట్యాబ్లెట్లు…

బిపి, హార్ట్ రేట్, పల్స్…

అన్నింటినీ మానిటర్ మాట్లాడుతుంది

నన్ను సిద్దం చేస్తున్నారు 

ఎక్కడ ఏమేమి శుభ్రం చేయాలో చేస్తున్నారు

ఎప్పుడేమివ్వాలో వాటినిస్తున్నారు

చేతుల మణికట్టు నరాల్లో నుండో

తొడల నుంచి వెళ్ళే నరాల నుండో

ఎక్కడ అనుకూలమవుతుందో 

అందుకే నేమో రెండు చేతులమీదా

రెండు తొడలమీద 

వెంట్రుకలేవీ లేకుండా కూడా తీసేశారు

తలకేదో టోపీలా పెట్టారు

ఏ క్షణంలోనైనా తీసుకెళతారు

అమ్మో ఆ అపరేషన్ థియేటర్ గుర్తొస్తేనే

గుండె గుభేలుమంటుంది

రెండు చేతులూ 

రెండుకాళ్ళూ గట్టిగా పట్టుకుంటారు

బాధతో అరుస్తుంటే కట్టేస్తారు కూడా!

ఆచార్య దా

ర్ల వెంకటేశ్వరరావు 

2.12.2025, 8.25 AM







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి