21 సెప్టెంబర్, 2025

ఆచార్య జి.వి.యస్ గారి సాహిత్య బోధన - పరిశోధనాంశాల ప్రేరణ ( దార్ల వ్యాసం)

 


ఆచార్య జి.వి.యస్ గారి సాహిత్య బోధన - పరిశోధనాంశాల ప్రేరణ

(The Literary Pedagogy of Professor G. V. S. and its Inspiration for Research Themes)



ప్రసిద్ధ సాహితీ విమర్శకులు, పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు మా గురువులు. నేను ఎం.ఏ., ఎం.ఫిల్., చదువుకొనేటప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన దగ్గర పాఠాలు వినే అదృష్టం కలిగింది. మాకు ఎం.ఏలో సాహిత్య విమర్శ, సిద్ధాంతాలు చెప్పేవారు. రససిద్ధాంతం చెప్తుంటే స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు దిగొచ్చేస్తారేమో అన్నంత రసభరితంగా ఉండేది. వెన్నపూస తినిపించినట్లుగా వివిధ సిద్ధాంతాల్ని వివరించేవారు. సంప్రదాయ సాహిత్యాన్ని కూడా కొన్ని పాఠాల్ని చెప్పారు. ఒక పద్యాన్ని ఎన్నివిధాలుగా వివరించవచ్చో ఆశ్చర్యమనిపించేది. భావం, అలంకారాలు, ఛందస్సు, దానిలోని శాస్త్రవిషయాలు, తాత్వికాంశాలు…ఇలా అనేకం ఆయన వివరించేవారు. ఆయన ప్రధాన సంపాదకులుగా వెలువడిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేసిన శ్రీమదాంధ్రమహాభారతం చదువుతుంటే మళ్ళీ ఆయనే మాముందు పాఠం చెప్తున్న అనుభూతి కలుతుంది. ఆయన అలంకారశాస్త్రాన్ని, సాహిత్య విమర్శను చెప్తుంటే మనం కూడా అలా చెప్పగలిగే సాధికారితను సాధించాలనే ప్రేరణ కలుగుతుంది. ఎం.ఫిల్ లో మాకు స్టడీస్ ఇన్ లిటరేచర్ చెప్తూ పరిశోధనలో నూతన సమన్వయం, నూతన ప్రతిపాదన, నూతన సిద్దాంతాలలో ఏదొకటి ఉండాలని చెప్పేవారు. ఆయన పాఠాల ప్రభావం, ఆయన రచనలు విస్తృతంగా చదివిన నాపై ఎంతవరకు వెళ్ళిపోయిందంటే డా.ద్వానాశాస్త్రి, ఆచార్య కె.కె.ఆర్, ఆచార్య జి.వి.యస్. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారి ప్రభావం వల్ల సాహిత్యవిమర్శవైపే వచ్చాను. ఆరుద్ర పరిశోధన, విమర్శలపై డాక్టరేట్ చేశాను. నాకిష్టమైన సాహిత్యవిమర్శ స్పెషలైజేషన్ లోనే సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకుడుగా ఎంపికయ్యాను. ఫలితంగా ‘‘ఒక పద్యాన్ని లేదా కవితను ఒకసైద్దాంతిక భావనతో అవగాహన చేసుకోవాలంటూ…’’ చెప్పడమో, రాయడమో నాలో కనిపిస్తుంది. వాటినే మా క్లాస్మేట్స్ నేటికీ పట్టుకొని జూనియర్ జీవియస్ అంటూ హాస్యమాడుతుంటారు. 

ఆచార్య జి.వి.యస్ గార్ని చూస్తే చదువుకొనేటప్పుడు మాకెందుకో భయంగా ఉండేది. పాఠం చెప్పేటప్పుడు మాత్రం ఎంతో సరదాగా ఉండేవారు. ఆయన పాఠాల్ని పర్మిషన్ తీసుకొని రికార్డు చేసుకొనేవాళ్ళం. ఆ పరిభాష అంతగొప్పగా ఉండేది. మళ్ళీమళ్ళీ వింటేగాని వెంటనే తెలియని అనేక నిగూఢమైన భావాలు ఉన్న పారిభాషిక పదాలతో పాఠాల్ని చెప్పేవారు. తాను తరగతిగదిలో చెప్పబోయే పాఠాలకు సంబంధించిన పుస్తకం తనతో పాటు తెచ్చుకొనేవారు. పద్యాలను వివరించేటప్పుడు మాత్రమే చూసేవారు. సిద్ధాంతాల్ని, లక్షణాల్ని వివరించి సమన్వయించేటప్పుడు అనర్ఘళంగా విశ్లేషించేవారు. మేమంతా ఒక అద్భతప్రపంచంలో విహరించేవాళ్ళం. ఆయన పాఠం అయ్యాక కూడా ఆయన మాటలు, ఆయన చెప్పిన భావాలే మమ్మల్ని వెంటాడుతుండేవి. అంతగాఢమైన ముద్రవేసేలా పాఠం చెప్పేవారు.

ప్రపంచానికి భారతీయ ఆలంకారికులు అందించిన మహత్తరమైన సిద్ధాంతాలలో రసం, ధ్వని అత్యంతముఖ్యమైనవి. వాటిని అవగాహన చేసుకోవడానికే అత్యధికులకు తమ జీవితం సరిపోదు. అటువంటిది ఆచార్య జి.వి.యస్ గారు తన ఇరవై ఐదో ఏటనే రససిద్ధాంతంలో నూతన సిద్దాంత సమన్వయాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాన్ని వివరించే వీరి ‘‘వీరరసం’’, ‘‘రసోల్లాసం’’ గ్రంథాలు ఆలంకారిక సిద్దాంత చర్చలో ఎప్పటికీ చర్చనీయాంశాలే. ఆ విధంగా ఆధునిక సాహితీవేత్తల్లో ఆయన ఒక ఆలంకారికసిద్దాంత ప్రతిపాదకుడుగా స్థిరమైన స్థానాన్ని పొందారు.







నాకు ఊహతెలిసనప్పటి నుండీ పత్రికలు చదవడం అలవాటు.  ప్రతి సోమవారం ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికలలో ఆచార్య జి.వి.యస్ గారి కాలమ్స్ వస్తుండేవి. ఆ విధంగా యూనివర్సిటీలో విద్యార్థిగా చేరకముందునుండే ఆయన నాకు గురువుగారు. వాటిని కటింగ్ చేసుకొని దాచుకొనేవాణ్ణి. ఆ తర్వాత తెలుగు అకాడమీవారు ‘‘సాహిత్యంలోచర్చనీయాంశాలు’’ పేరుతో  పుస్తకంగా వేశారు. దాన్ని ఒకటి కొనుక్కొని,మరొకటి మా ఫ్రెండ్స్ లో ఏవరొకరికి బహుమతిగా కూడా ఇచ్చేవాళ్లం. నేటికీ మా విద్యార్థులకు పాఠాలు చెప్పేటప్పుడు కొత్తగా చేయాల్సిన పరిశోధనాంశాలకు ఆ పుస్తకాన్ని చదువుతూ, చదవమని చెప్తుంటాను. అన్ని ప్రతిపాదనలు ఆ పుస్తకంలో ఉన్నాయి. 

తాను నిరంతరం చదువకపోతే ఆ శీర్షికలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రతి వ్యాసం పరిశోధనాత్మకంగా రాయడం ఆచార్య జివియస్ గారి ప్రత్యేకత. ఆ వ్యాసం చదివితే ఆ పుస్తకం చదివిన వారికి కూడా తెలియని ఆ గ్రంథతత్త్వం అవగాహన కలిగించేలా మూలంలోని వాక్యాల్ని సోదాహరణంగా వివరిస్తూ విశ్లేషించేవారు. ఆయన రాసిన ‘‘ఆంధ్రసాహిత్య విమర్శ - ఆంగ్ల ప్రభావము’’ గ్రంథంలో ఆంధ్ర, ఆంగ్ల గ్రంథాల్లోని అనేకాంశాలు అధ్యాపకులకు కూడా తెలియని అంశాలు అనేకం ఉన్నాయని స్ఫష్టమవుతుంది. ఆ మూల గ్రంథాలను చదవాల్సిన అవసరమేమిటో ఆ గ్రంథం చదవితేనే తెలుస్తుందనిపిస్తుంది. అది నేటికీ మాకు సాహిత్య విమర్శ పాఠం చెప్పడానికీ, సాహిత్య విమర్శ విద్యార్థులకు అవసరమైన గొప్పగ్రంథం. 

ఆచార్య జి.వి.యస్ గారితో భావజాల వైరుధ్యమున్నప్పటికీ, ఆయన ప్రతిపాదించిన నవ్వసంప్రదాయాన్ని ప్రతిపాదించి, సమర్థించిన వారిలో ఒకరిగా ఆయన్ని ప్రతి సాహితీవేత్త అంగీకరించకమానరు. ఆయనలో గొప్ప సృజనశీలి ఉన్నారని ‘సుశీలకథలు’ చదివితే తెలుస్తుంది. ఆయన  రాసిన అంకితాలు చదివితే ఆయనలోని కవిత్వం తెలుస్తుంది. ఆరుద్రపై చేసిన ఇంటర్వ్యూలు వంటివి చూస్తే ఆయనలోని సహృదయ సాహితీమూర్తిమత్వం తెలుస్తుంది.ఆయన ఎవరికైనా పీఠిక రాస్తే, తన హృదయాన్ని నిండుగా ప్రసరించేవారు. కొండొకచో అదే ఒక సిద్ధాంత గ్రంథంలా అనిపించేది. అంతేకాదు, ప్రబంధ లక్షణాల్లో ఆయన జాతి, వార్తా చమత్కారాలు, ఆయన సాహిత్య చరిత్ర, వికాస చరిత్రలపై విశేషమైన కృషి చేయడమే కాదు, సాహిత్య చరిత్రను ఒక ప్రక్రియగా గుర్తించాలనే ప్రతిపాదనలు ఎన్నింటినో చేశారు.వీటితో పాటు ఆధునిక వచన దీర్ఘకావ్యాల్ని అనుశీలించే విధానాన్ని, పరిశోధనలో వివిధ దశలను సూత్రీకరంచడం, సాహిత్య చరిత్రలలో విమర్శ, సృజనాత్మకతలు వంటి మరికొన్నింటిని ఆయన ప్రతిపాదించారు.  వాటిని నిరూపించే దిశగా నా దగ్గర సాహిత్య చరిత్రలపై కొంతమంది చేత పరిశోధన చేయించాను. మరింత కృషి జరచగవలసిన అవసరం ఉంది. 

ఆచార్య జి.వి.యస్ గారు తన డాక్టరేట్ కోసం సమర్పించిన ‘‘ప్రబంధమహాపురాణం–ప్రబంధ కథామూలము’’ గ్రంథం చదివితే పురాణ లక్షణాలు, స్వరూప స్వభావాలు, మనుచరిత్రము పై మార్కండేయ పురాణం ప్రభావం వంటివెన్నో విషయాలు తెలుస్తాయి. ఆ గ్రంథంలో ఆయన చూపించిన పరిశోధన ఆకరాలు ప్రతి పరిశోధక విద్యార్థీ చూసి తెలుసుకోవాలి. పరిశోధనలో ఒక ప్రకటనకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో దానిలో పేర్కొన్న ఉదాహృతాలు, దానికిచ్చిన ఆధారాలు మనకు తెలియజేస్తాయి. సాహిత్య అకాడమీ మొదలు కొని అనేక విశిష్టమైన పురస్కారాలను  తీసుకోవడమే కాదు, తాను కూడా తెలుగు సాహిత్య విమర్శలో విశేషమైన కృషి చేసినవారికి పురస్కారాలను ఇచ్చి సత్కరించేవారు. ఆ సందర్భంగా వారి కృషిని వారినోటితోనే వినిపించేలా చేసేవారు. తర్వాత కొంతమంది అయ్యాక పురస్కార గ్రహీతల సాహిత్యకృషిని తెలిపే విధంగా ‘‘మా విమర్శ ప్రస్థానమ్‌’’ పేరుతో ఒక వ్యాస సంకలనం తీసుకొచ్చారు. అది సాహిత్య విమర్శను అవగాహన చేసుకోవడానికి, సాహిత్య విమర్శ పై పరిశోధన చేసేవారికీ, పాఠాలు చెప్పేవారికీ ఎంతో ఉపయోగపడే గ్రంథం. అంతేకాదు, ఆ పురస్కార సభల్లో ఆయన సాహిత్యాన్ని విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టేవారు. వారి అమ్మాయి శ్రీమతి లక్ష్మిగారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉత్తమ సాహితీవేత్తలను తన తల్లిగారు శ్రీమతి సుశీలగారిపేరుతో కూడా ఇచ్చి గౌవరవిస్తున్నందుకు, వాటిని నిరంతరం కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ఈ సందర్భంగా మా గురువుగారు ఆచార్య జి.వి.యస్ పై ఒక సావనీర్ తీసుకొస్తూ నాకు నాలుగు మాటలు రాసేందుకు అవకాశం కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

పూర్వశాఖ అధ్యక్షులు, తెలుగుశాఖ, 

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

 హైదరాబాద్ – 500 046,

ఫోన్: 9989628049

తేది: 7.9.2025





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి