ఈ రోజు (20.11.2024) ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో జరిగిన ' National Work shop on Research Methodology (రీసెర్చ్ మెథడాలజీ )
లో భాగంగా ' ఊహాపరికల్పన ( హైపోథీసిస్) అనే అంశంపై మాట్లాడాను. ఈ ఉపన్యాసంపై వచ్చిన ఒక స్పందన. దీన్ని డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ, ప్రధాన సంపాదకులు, ఔచిత్యం మాసపత్రిక వారు తెలిపారు. వారికి నా కృతజ్ఞతలు.
ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లో ఆచార్య దార్ల ప్రసంగం.
(తెలుగు విభాగం, ఆధునిక భారతీయ భాషల విభాగం, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీగఢ్, ఉత్తరప్రదేశ్ వారు పరిశోధనా పద్ధతులపై (National Workshop on Research Methodology) ఒక జాతీయ ఆన్లైన్ వర్క్‌షాప్ (నవంబరు 18 – 23, 2024) నిర్వహించారు. ఇది ఆ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న విద్యార్థులతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిశోధన చేస్తున్న విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దీనిలో 20.11.2024 వ తేదీన నేను ( ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) 'ఊహా పరికల్పన'పై ప్రసంగించాను.
Department of Modern Indian Languages, Aligarh Muslim University తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ పఠాన్ ఖాశీం ఖాన్ గారికి ముందుగా నా నమస్కారాలు. కేవలం తమ శాఖ విద్యార్థులకు మాత్రమే కాకుండా తెలుగులో పరిశోధన చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు డా. పఠాన్ ఖాశీం ఖాన్ గార్ని అభినందిస్తున్నాను. Chairperson & Prof. of Malayalam, Department of Modern Indian Languages, Aligarh Muslim University Prof. T. N. Satheesan గార్కి నమస్కారాలు. ఈ వర్క్ షాప్ లో మాట్లాడబోతున్న వివిధ విశ్వవిద్యాలయ ఆచార్యులకు నా నమస్కారాలు. ముఖ్యంగా ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారికి మిత్రులందరికీ నా నమస్కారాలు
ప్రియమైన పరిశోధక మిత్రులారా, విద్యార్థులారా!
నేను ఈరోజు మీతో ఒక కీలకమైన పరిశోధనా అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనం పీహెచ్డీకో, ఎం.ఫిల్కో, లేదా ఒక పరిశోధనా పత్రం రాయడానికో సిద్ధమైనప్పుడు మన ముందుండే మొదటి సవాలు అసలు మన పరిశోధనకు ఒక నిర్దిష్టమైన ఆకృతిని ఎలా ఇవ్వాలి? అనేది.నేను నా బోధన, పరిశోధన అనుభవంలో గమనించిన విషయం ఏమిటంటే, చాలామంది విద్యార్థులు పరిశోధన అనగానే పుస్తకాలు తిరగేయడం, సమాచారాన్ని పోగు చేయడం అని మాత్రమే అనుకుంటారు. కానీ మిత్రులారా, సమాచార సేకరణ మాత్రమే పరిశోధన కాదు. ఆ సమాచారాన్ని ఏ కోణంలో చూడాలి, ఏ ప్రశ్నకు సమాధానం వెతకాలి అని మనకు దిశానిర్దేశం చేసే ఒక దిక్సూచి మనకు కావాలి. ఆ దిక్సూచే ‘ఊహాపరికల్పన’ (Hypothesis).
దీనిని మనం మరీ క్లిష్టమైన సాంకేతిక పదాలతో కాకుండా, మన నిత్య జీవితంతో ముడిపెట్టి అర్థం చేసుకుందాం.ఉదాహరణకు, మీకు విపరీతంగా తలనొప్పిగా ఉందనుకోండి. వెంటనే మీ మనసులో ఏమనిపిస్తుంది? "బహుశా నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదేమో, అందుకే తలనొప్పి వచ్చి ఉంటుంది" అని ఒక అంచనా వేస్తారు. ఈ అంచనానే శాస్త్రీయ భాషలో ఊహాపరికల్పన అంటారు. అంటే, ఒక సమస్య ఎదురైనప్పుడు, మనకున్న ప్రాథమిక అవగాహనతో మనం వేసుకునే ఒక ‘తాత్కాలిక సమాధానం’ (Tentative Solution). ఆ తర్వాత మీరు విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి తగ్గితే, మీరు వేసుకున్న అంచనా నిజమని తేలుతుంది. ఒకవేళ తగ్గకపోతే, వేరే కారణం ఏదైనా ఉందేమోనని వైద్యుడిని సంప్రదిస్తారు.
పరిశోధనలో కూడా మనం చేసేది సరిగ్గా ఇదే!
సాధారణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల విద్యార్థులకు ప్రయోగశాలలు ఉంటాయి. రసాయనాలను కలిపి, మైక్రోస్కోప్‌లో చూసి తమ ఊహాపరికల్పనను నిరూపిస్తారు. మరి తెలుగు భాషా సాహిత్య పరిశోధకులమైన మనకు ప్రయోగశాల ఏది? మన గ్రంథాలయమే మన ప్రయోగశాల! కవుల రచనలు, శాసనాలు, జానపద గేయాలు, ప్రజల వాడుక భాషే మన ప్రయోగ పరికరాలు! నేను నా పరిశోధనా కాలంలో ఆరుద్ర గారి ‘సమగ్రాంధ్ర సాహిత్యం’పై పనిచేస్తున్నప్పుడు గానీ, లేదా జ్ఞానానందకవి ‘ఆమ్రపాలి’ని విశ్లేషిస్తున్నప్పుడు గానీ ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించాను. మనం ఒక కవి గురించి పరిశోధన చేస్తున్నప్పుడు, "ఆ కవి ఎక్కడ పుట్టాడు, ఏం రాశాడు" అని కథలా రాసుకుంటూ పోతే అది కేవలం ఒక వ్యాసం అవుతుంది తప్ప, పరిశోధన కాదు. మరి మన పరిశోధనకు ఒక శాస్త్రీయమైన బలం రావాలంటే మనం ఎలాంటి ఊహాపరికల్పనలు చేసుకోవాలి? మీకు కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను.
మొదటిది, ప్రాచీన సాహిత్యాన్ని తీసుకుందాం: నన్నయ మహాభారతాన్ని ఎందుకు రాశాడు? రాజరాజనరేంద్రుడు కోరాడు కాబట్టి రాశాడు అని మనందరికీ తెలుసు. కానీ ఒక పరిశోధకుడిగా మీరు ఇలా ఆలోచించండి: "నాటి వేంగీ దేశంలో బలపడుతున్న జైన, బౌద్ధ మత ప్రభావాలను ఎదుర్కొని, వైదిక ధర్మాన్ని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నన్నయ మహాభారత అనువాదాన్ని ఒక సాధనంగా ఎంచుకున్నాడేమో!" ఇదొక అద్భుతమైన ఊహాపరికల్పన. ఈ ఒక్క ప్రతిపాదన మీ పరిశోధన గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు కేవలం కథను కాకుండా, నన్నయ మూల భారతానికి చేసిన మార్పులను, నాటి సామాజిక పరిస్థితులను లోతుగా విశ్లేషించడం ప్రారంభిస్తారు.
రెండవది, ఆధునిక సాహిత్యాన్ని పరిశీలిద్దాం: గురజాడ వారి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మీరు చదివే ఉంటారు. పైకి అది కడుపుబ్బా నవ్వించే హాస్య నాటకంలా కనిపిస్తుంది. కానీ, "19వ శతాబ్దపు చివరి నాటికి ఆంధ్ర సమాజంలో సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య జరిగిన సంఘర్షణకు 'కన్యాశుల్కం' ఒక సామాజిక దస్తావేజు" అనే ఊహాపరికల్పనతో మీరు ఆ నాటకాన్ని చదవండి. అప్పుడు గిరీశం మాటల్లోని డొల్లతనం, మధురవాణి వ్యక్తిత్వంలోని ఔన్నత్యం మీకు కొత్త అర్థాలను ఇస్తాయి.
మూడవది, మన సామాజిక దృక్పథపు పరిశోధనలు: నేటి తరం పరిశోధకులైన మీకు దళిత, బహుజన, స్త్రీవాద, మైనారిటీ సాహిత్యాలపై ఎంతో ఆసక్తి ఉంది. మీరు ఆ రచనలను పరిశీలిస్తున్నప్పుడు, "సామాజిక అసమానతల కారణంగానే ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలలో ఎందరో ప్రతిభావంతులైన కవుల రచనలు విస్మరించబడ్డాయి" అనే ఊహాపరికల్పనతో ముందుకు వెళ్లండి. అప్పుడు కుసుమ ధర్మన్న, మల్లవరపు జాన్, ముద్దుపళని వంటి వారి రచనలలోని సాహిత్య విలువలను మీరు సాధికారికంగా ప్రపంచానికి చాటిచెప్పగలుగుతారు.
నాలుగవది, భాషాశాస్త్ర అధ్యయనాలు: మీరు మీ ఊరి మాండలికంపై పరిశోధన చేస్తున్నారనుకోండి. "భౌగోళిక సరిహద్దులు, వృత్తిపరమైన అవసరాలు, వలసల వల్ల మన ప్రాంతపు తెలుగు పదాలలో ధ్వని మార్పులు సంభవించాయి" అని ఒక ఊహాపరికల్పన చేసుకోండి. ఆ తర్వాత ఊరూరా తిరిగి, ప్రజలతో మాట్లాడి, ఆ పదాలను సేకరించి మీ ప్రతిపాదనను పరీక్షించండి.
మిత్రులారా, ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేయాలి.మనం ఒక ఊహాపరికల్పన చేసుకున్న తర్వాత, "నేను అనుకున్నదే కచ్చితంగా నిజం కావాలి" అనే పట్టుదలకు ఎప్పుడూ పోకూడదు. అది పరిశోధనా ధర్మం కాదు. ఒకవేళ మీరు సేకరించిన ఆధారాల వల్ల, మీరు మొదట అనుకున్న ఊహాపరికల్పన తప్పని తేలితే ఏమాత్రం నిరాశపడకండి. ఒక శాస్త్రవేత్త ప్రయోగం విఫలమైనప్పుడు, "ఈ పద్ధతిలో ఫలితం రాదు" అని నిరూపించడం కూడా ఒక గొప్ప పరిశోధనా ఫలితమే! నిష్పక్షపాతంగా నిజాన్ని నిగ్గుతేల్చడమే నిజమైన పరిశోధకుడి లక్షణం. కాబట్టి విద్యార్థులారా, మీ పరిశోధనాంశం ఏదైనా సరే, ముందుగా దాన్ని ప్రశ్నించండి. ఆ ప్రశ్నల నుండే ఒక స్పష్టమైన, సంక్షిప్తమైన ఊహాపరికల్పనను రూపొందించుకోండి. మీ ఆలోచనలకు తార్కికమైన ఆధారాలను జతచేసి, తెలుగు భాషా సాహిత్య పరిశోధనలకు కొత్త వెలుగులు అద్దాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
విద్యార్థి 1: సర్, మనం ఒక ఊహాపరికల్పన చేసుకున్న తర్వాత, పరిశోధన మధ్యలో మనకు కొత్త ఆధారాలు దొరికితే ఆ ఊహాపరికల్పనను మార్చుకోవచ్చా?
ఆచార్య దార్ల సమాధానం: చాలా మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా మార్చుకోవచ్చు! ఊహాపరికల్పన అనేది స్థిరమైన శాసనం కాదు, అదొక పనిముట్టు మాత్రమే. మీరు క్షేత్రస్థాయిలోనో, గ్రంథాలయంలోనో పరిశోధన చేస్తున్నప్పుడు మొదటి ఊహకు భిన్నమైన బలమైన ఆధారాలు కనిపించవచ్చు. అప్పుడు మొండిగా పాత ఊహనే పట్టుకుని వేలాడకూడదు. ఆ కొత్త ఆధారాలకు తగినట్లుగా మీ ఊహాపరికల్పనను సవరించుకోవడం లేదా మార్చుకోవడం పరిశోధనలో నిజాయితీకి, పరిణతికి నిదర్శనం.
విద్యార్థి 2: సార్, ఒక పరిశోధనలో ఒక్క ఊహాపరికల్పన మాత్రమే ఉండాలా? లేక రెండు మూడు ఉండవచ్చా?
ఆచార్య దార్ల సమాధానం: మీ పరిశోధనాంశం పరిధిని బట్టి ఉంటుంది. ఒక చిన్న పరిశోధనా పత్రానికో, ఒక అధ్యాయానికో అయితే ఒక్క స్పష్టమైన ఊహాపరికల్పన సరిపోతుంది. కానీ పీహెచ్డీ స్థాయి విస్తృతమైన అంశం తీసుకున్నప్పుడు, ప్రధాన ఊహాపరికల్పనతో పాటు దానికి అనుబంధంగా ఒకటి రెండు ఉప-పరికల్పనలు ఉండవచ్చు. అయితే అవి పరస్పరం విరుద్ధంగా లేకుండా, ఒకదానికొకటి తోడ్పడేలా, మీ పరిశోధన దారి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.
విద్యార్థి 3: సార్, సాహిత్య పరిశోధనలో సంఖ్యాపరమైన గణాంకాలు (Statistics) తక్కువగా ఉంటాయి కదా! మరి ఇక్కడ ఊహాపరికల్పనను ఎలా నిరూపిస్తారు?
సమాధానం: సైన్స్, సోషల్ సైన్సెస్‌లలో లెక్కలు, సర్వేలు, ప్రయోగశాల ఫలితాలతో నిరూపిస్తారు. భాషా సాహిత్య పరిశోధనలలో మనం తార్కిక విశ్లేషణ (Logical Analysis)తో నిరూపిస్తాం. ఉదాహరణకు, ఒక కవి రచనలో నిర్దిష్టమైన సామాజిక చైతన్యం ఉందని మీరు ఊహించారు అనుకోండి. దాన్ని నిరూపించడానికి ఆ రచనలోని పదాలు, పాత్రల ప్రవర్తన, ఇతివృత్తం, రచనా కాలంలోని చారిత్రక, సామాజిక నేపథ్యాలను ఆధారాలుగా చూపిస్తూ, అంచెలంచెలుగా తర్కబద్ధంగా వాదనను నిలబెట్టాలి. మాండలికాలు, పదజాలం, ఛందస్సు వంటి భాషాంశాలలో అవసరమైన చోట గణాంకాలను కూడా చక్కగా వాడుకోవచ్చు.
విద్యార్థి 4: సార్, ఒక మంచి ఊహాపరికల్పనకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఏమిటి?
ఆచార్య దార్ల సమాధానం: చాలా సులభంగా గుర్తుపెట్టుకునేలా కొన్ని విషయాలు చెబుతాను
ఊహాపరికల్పనలో సందిగ్ధత ఉండకూడదు. మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారో సూటిగా, స్పష్టంగా ఉండాలి.
మీరు చేసుకున్న ఊహను ఆధారాలతో నిరూపించడానికి లేదా ఖండించడానికి వీలుగా ఉండాలి. కేవలం నమ్మకాలు, నిరూపించలేని ఊహలు పరిశోధనకు పనికిరావు.
అనవసరమైన పదాల పోగులా కాకుండా, ఒకటి రెండు స్పష్టమైన వాక్యాలలో ఇమిడిపోయేలా ఉండాలి.
మీరు ఎంచుకున్న పరిశోధనా సమస్యకు నేరుగా సమాధానం వెతికేదిగా ఉండాలి.
విద్యార్థి 5: సార్, కొత్తగా పరిశోధన మొదలుపెట్టే విద్యార్థులు తరచూ చేసే పొరపాటు ఏమిటి?
ఆచార్య దార్ల సమాధానం: అంశం ఎంచుకోకముందే, లేదా సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకముందే ముందే ఒక ముగింపుకు వచ్చేయడం చాలామంది చేసే పొరపాటు. మరికొందరు అసలు ఊహాపరికల్పన లేకుండానే, "ఈ కవి గురించి సమగ్ర పరిశీలన" అని చాలా విస్తారంగా, అస్పష్టంగా మొదలుపెడతారు. అలా కాకుండా, చిన్నదైనా సరే, ఒక నిర్దిష్టమైన ప్రశ్నను ముందుంచుకుని, దానికి ఒక ఊహాపరికల్పనతో ముందుకు వెళితే మీ పరిశోధన చాలా పదునుగా, ఆసక్తికరంగా ఉంటుంది.
విద్యార్థి 6: సార్, మనం ఒక ఊహాపరికల్పన చేసుకున్న తర్వాత, దాన్ని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు అసలు దొరకకపోతే ఏం చేయాలి?
ఆచార్య దార్ల సమాధానం: ఆధారాలు దొరకడం లేదంటే మనం మన అన్వేషణ పద్ధతిని ఒకసారి తనిఖీ చేసుకోవాలి. బహుశా మనం ఎంచుకున్న మూలాలు సరిపోవడం లేదేమో, లేదా మనం వేసుకున్న ఊహాపరికల్పన మరీ విస్తృతమైనది, లేక ఆ రచనలో ఆ కోణం అసలు లేదేమో ఆలోచించాలి. ఒకవేళ ఆ రచనలో ఆ అంశం లేదని స్పష్టమైన ఆధారాలతో తెలిస్తే, "ఈ రచనలో ఈ కోణం లేదు" అని నిరూపించడమే ఒక ఫలితం అవుతుంది. లేదంటే పరిశోధనాంశ పరిధిని లేదా ఊహాపరికల్పనను సవరించుకుని ముందుకు సాగాలి.
విద్యార్థి 7: సార్, పరిశోధనా ప్రతిపాదన (Synopsis / Research Proposal) రాసేటప్పుడే ఊహాపరికల్పనను ఖచ్చితంగా రాయాలా? లేక ముందుగా ఒక స్థూలమైన ఊహతో మొదలుపెట్టి, తర్వాత స్పష్టంగా రాసుకోవచ్చా?
ఆచార్య దార్ల సమాధానం: ప్రతిపాదన దశలో మీరు చదివిన ప్రాథమిక పుస్తకాలు, సమీక్షల ఆధారంగా ఒక స్పష్టమైన ప్రారంభ ఊహాపరికల్పనను రాయడం మంచిది. అది మీ ప్రయాణానికి ఒక దారి చూపుతుంది. అయితే, అధ్యయనం లోతుగా సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడతాయి. అప్పుడు ప్రతి అధ్యాయానికి అనుగుణంగా దాన్ని మరింత స్పష్టంగా, పదునుగా రూపొందించుకోవచ్చు. మొదటి ఊహను చివరివరకు మార్చకుండా పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు; ఆధారాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకోవచ్చు.
విద్యార్థి 8: సార్, ‘పరిశోధనా ప్రశ్న’ (Research Question)కు, ‘ఊహాపరికల్పన’కు మధ్య తేడా ఏమిటి? చాలామంది ఈ రెండింటినీ ఒకటే అనుకుంటారు.
ఆచార్య దార్ల సమాధానం: చాలా చక్కని సందేహం. పరిశోధనా ప్రశ్న అనేది మనం అడిగే ప్రశ్న. ఉదాహరణకు: "తెలుగు వచన కవిత్వంలో నగరీకరణ ప్రభావం ఎలా కనిపిస్తోంది?" అనేది ఒక పరిశోధనా ప్రశ్న. దానికి మనం మన ప్రాథమిక అవగాహనతో ఇచ్చే తాత్కాలిక సమాధానమే ఊహాపరికల్పన. ఉదాహరణకు: "నగరీకరణ వల్ల తెలుగు వచన కవిత్వంలో ప్రకృతి వర్ణనలు తగ్గి, ఒంటరితనం, యాంత్రికత, వలస జీవన వేదన ప్రధాన ఇతివృత్తాలుగా మారాయి" అనేది ఊహాపరికల్పన. ప్రశ్న అన్వేషణను రేకెత్తిస్తే, ఊహాపరికల్పన ఆ అన్వేషణకు ఒక దిశను ఇస్తుంది.
విద్యార్థి 9: సార్, కేవలం ఒక కవి రచనలను లేదా ఒక సాహిత్య ప్రక్రియను పరిచయం చేసే, విశ్లేషించే పరిశోధనలలో కూడా ఊహాపరికల్పన తప్పనిసరిగా ఉంటుందా?
ఆచార్య దార్ల సమాధానం: కేవలం పరిచయం చేయడం, సారాంశం చెప్పడం పరిశోధన లక్ష్యం కాదు. ఒక కవిని లేదా ఒక ప్రక్రియను అధ్యయనం చేస్తున్నా, అందులో ఏదో ఒక కొత్త కోణాన్ని మీరు ఎంచుకుంటారు కదా! ఉదాహరణకు: "ఈ కవి రచనలలో గ్రామీణ వృత్తుల జీవన విధానం వాస్తవికంగా నమోదైంది" అనే ప్రతిపాదనతో మీరు ముందుకు వెళ్లవచ్చు. అప్పుడు అది కేవలం పరిచయంలా కాకుండా, ఒక నిర్దిష్టమైన వాదనను నిరూపించే విశ్లేషణాత్మక పరిశోధనగా మారుతుంది.
విద్యార్థి 10: సార్, మనం ఒక ఊహాపరికల్పనను నిరూపిస్తున్నప్పుడు, మనకు అనుకూలంగా ఉన్న ఆధారాలను మాత్రమే ఎంచుకుని, వ్యతిరేకంగా ఉన్న విషయాలను దాచిపెట్టడం సరికాదు కదా?
ఆచార్య దార్ల సమాధానం: అస్సలు సరికాదు! అలా చేస్తే అది పరిశోధన కాదు, మన అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి చేసే ప్రచారం మాత్రమే అవుతుంది. మీ ఊహాపరికల్పనకు వ్యతిరేకంగా లేదా భిన్నంగా కనిపించే ఆధారాలను కూడా నిజాయితీగా పరిగణనలోకి తీసుకోవాలి. వాటిని విశ్లేషించి, ఎందుకు అలా జరిగిందో వివరించగలిగినప్పుడే మీ పరిశోధనకు విశ్వసనీయత, శాస్త్రీయత వస్తాయి.
ఈ వర్క్ షాప్ అయిపోయిన తర్వాత కూడా, మీ పరిశోధనకు సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు వ్యక్తిగతంగా కాల్ చేసి అడగండి. నాకు తెలిసినంతవరకు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
20.11.2024



కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి