17 జులై, 2023

కూలుతున్న దృశ్యాలు

 కూలుతున్న దృశ్యాలు 



ఒంటరిగా కాదు

నలుగురూ నడిచే రహదారిపైకెళ్ళగానే 

ఏదో తమలో తామే వెకిలినవ్వులతో ఎదురవుతూ

నాలో నేను చిత్రించుకున్న ఊహాసౌధాలన్నీ

ఒక్కొక్కటిగా కూలుతున్న దృశ్యాలు


ఇంతకాలమూ

నా చుట్టూ బూతద్దాలే ఉన్నాయేమో

ఒక్కదానిలోనూ నేనెలా కనిపిస్తున్నానో

నాకేమాత్రం నిజం తెలియనివేవో

గుసగుసలాడుకుంటూ నిజదర్పణలో 

శకలాలు శకలాలుగా కూలుతున్న దృశ్యాలు


అమాయకత్వం కాకపోతే 

నీటిమట్టంలాగానే

నీటి అడుగునా ఒకేలా  ఉండదు కదా

ఆంతరంగికులెవరో 

అట్టడుగున ఎత్తుపల్లాల్ని చేయిపట్టి చూపగానే

అప్పుడే నడక నేర్చుకుంటున్నపసివాడి పాదాల్లా 

తడబడుతూ కూలుతున్న దృశ్యాలు 


ఆ మైదానంలోకి చేరగానే చిరు జల్లులేవో 

కుంభవృష్టులతో జతకట్టినట్లున్నాయి

ప్రవహించి ప్రవహించి

దుఃఖం ప్రవాహమై పరుగులిడుతోంది

ఆకాశంలోని నీళ్ళన్నీపిండేసాక

కూలుతున్న దృశ్యాలు కనబడవు

నేలను ముద్దాడుతున్న ఆకాశం సిగలో

చిత్రితమైన సౌందర్యాత్మక దృశ్యంలో 

ఒక ముత్యమేదో మెరుస్తోంది!

  •  దార్ల వెంకటేశ్వరరావు

  • హైదరాబాద్ 

  • 9182685231

12.7.2023

(ప్రజాశక్తి దినపత్రిక, 17.7.2023 సౌజన్యంతో)












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి