Saturday, October 18, 2008

మాష్టార్జీ సాహిత్యం లో మట్టి పరిమళాలు


(పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాదులో 27-07-2007న "దళిత కళామండలి సృష్టించిన సాహిత్యం కళారూపాలు - సమాజంపై వాటి ప్రభావం" అనే అంశంపై జరిగిన సదస్సులో "మాష్టార్జీ సమగ్ర సాహిత్యం - ఒక పరిశీలన" పేరుతో సమర్పించిన పత్రం. ఈ వ్యాసం 19-10-2008 న ది హైదరాబాదు మిర్రర్ దినపత్రిక లో ప్రచురింపబడింది )

master jee దళిత స్త్రీల గురించి పాడిన ఒక పాటను కూడా ఇక్కడ అందిస్తున్నాను.
మాష్టార్జీ సాహిత్యం గురించి కత్తి పద్మారావు గారి ప్రసంగాన్ని గతంలోనే అందించాను
-డా//దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్ ,తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, 9989628049, vrdarla@gmail.com


మాష్టార్జీ పేరు వినగానే మూలవాసీ సిద్ధాంతం గుర్తుకొస్తుంది. మూలవాసీ సిద్ధాంతం పేరు విన్నా మాష్టార్జీ గుర్తుకొస్తాడు. ఆయన తెలుగులో ఆ సిద్ధాంతాన్నిఅంత అలా ప్రచారం చేశాడు. ఆయన ప్రతిపాటలోనూ మూలవాసీ ప్రస్తావన కనిపిస్తుంది. అందుకో దండాలు బాబా అంబేద్కరా... పాట విన్నాతెలిసిన వాళ్ళందరికీ మాష్టార్జీ గుర్తొస్తాడు. వీటన్నింటితో పాటు ఆయన గురించి ప్రత్యక్షంగా తెలిసిన వారికి మాష్టార్జీ ఒక నటుడు, దర్శకుడు అని కూడా స్పురిస్తాడు. ఆయన అసలు పేరు గంగాధరి శ్రీరాములు. అయినా ఆ పేరు కంటే అందరికీ ఆయన మాష్టార్జీగానే సుపరిచితులు. పాటల్ని పాడటం, ఆడటం అనేక మందికి నేర్పి 'మాష్టారు' అయ్యాడు. ఆయనలోని కళానైపుణ్యం 'మాష్టార్జీ' అని గౌరవించేలా చేసింది. జీవిత వివరాల లోతుల్లోకి వెళ్ళితే ఆయన వృత్తి వేరు. ప్రవృత్తి వేరు. జీవనోపాధి కోసం మాష్టారుగా బతకడం లేదు. కళను బతికించడం కోసం మాష్టారుగా జీవిస్తున్నాడు. ఆయన భారత ఆహార సంస్థలో ఒక ఉద్యోగి. అత్యంత దిగువ స్థాయి ఉద్యోగిగా చేరి నేడు ఆ స్థాయిని మరింత కొంత ముందుకెళ్ళగలిగాడు. ఆ ఉద్యోగ ఉపాధి కలిగిస్తుంది. అది చాల్ని కుంటే ఒక గొప్ప కళాకారుడు తయారయ్యేవాడు కాదు. తెలుగు సాహిత్యానికి అనేక మానవ విలువల్ని బోధించగలిగే అనుభవపూర్వక సృజనాత్మక సత్యాలందేవి కాదు.
మాష్టార్జీ పాటైనా, ఆటైనా ఆయనకు ఒక్కసారిగా పుట్టుకొచ్చింది కాదు. చిన్ననాటి నుండే అనుభవపూర్వక ఆవేదన నుండి, అవమానాల నుండి, అణచివేతల నుండి, ఆశల నుండి పుట్టు కొచ్చింది. ఆయన సాహిత్యంలో ఉండేదేమిటంటే అసలైన జీవితమని అది గమ్నించిన ప్రతివాళ్ళకీ తెలుస్తుంది.
మాష్టార్జీ తెలంగాణ ప్రాంతంలోని బొల్లారం లో 7 సెప్టెంబరు 1952 న సత్తెయ్య, రాజెమ్మలకు జన్మించాడు. ఇది సికింద్రాబాదుకి దగ్గర్లోనే ఉంటుంది. వీరి పూర్వీకులు మాత్రం మెదక్ జిల్లాలోని అనాజ్ పురం గ్రామంలో ఉండేవారు. వీరి తాత, తండ్రీ వెట్టి పని చేసే వారు. ఆకలి అన్నింటినీ నేర్పుతుందన్నట్లు దాన్ని తీర్చుకోవడానికి తాళ్ళుపేనే వారు. వాటిని ఊరూరా తిరిగి అమ్మేవారు. అలా సికింద్రాబాదులోని కంటోన్మెంటు ప్రాంతంలో కూడా ఆ తాళ్ళు అమ్మేవారు. అప్పుడే అక్కడి వాళ్ళతో బాగా పరిచయం అయ్యింది. ఒక వైపు వెట్టి చేసినా ఆకలి తీరకపోయినా, అనేక బాధలకు గురవ్వవలసి వచ్చేది.వాళ్ళకి ఆ బాధల నుండి తప్పించుకోవాలంటే ఆ ఊరి నుండి పారిపోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో మాష్టార్జీ తండ్రి బొల్లారం వెళ్ళిపోయి, తెలిసిన వారి సహకారంతో అక్కడే స్థిరపడ్డారు.
అక్కడే అనేక ఆటు పోట్ల మధ్య మాష్టార్జీ విద్యాభాసం కొనసాగింది. 1968 నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం బాగా ఊపందుకున్నపరిస్థితుల్లో పాఠశాలల్ని మూసేశారు. అందువల్ల చదువు అర్థాంతరంగా ఆగిపోయింది. అప్పటికి తొమ్మిదవ తరగతి పూర్తయినా, ఎస్.ఎస్.ఎల్.సీ పూర్తి కాలేదు. అయినా పట్టుదలతో తర్వాతైనా అంటే 1974 లో మెట్రిక్యులేషన్, 1986 లోబి.ఏ, 1995 లో ఎల్.ఎల్.బి., పూర్తిచేశాడు. ఇంకా చదువు పట్ల ఆసక్తి పోలేదు. దాన్నింకా ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు.ఈ డిగ్రీలన్నీ రెగ్యులర్ గా అన్నీ సమకూరిన తర్వాత చదువుకుంటే వచ్చినవి కాదు. ఒకవైపు పని, మరొక వైపు చదువు కోసం ఆరాట పడితేనే వచ్చాయి. ఆయనకీ డిగ్రీలు రాకముందు నుండే పాటల్ని రాసే అలవాటుంది. చిన్న నాటి నుండే అంబేద్కర్ పాటలు పాడటం, సినిమా పాటల్ని అనుకరిస్తూ రాయడం, క్రమేపీ సొంతంగా పాటలు రాసి, తానే బాణీలు సమకూర్చుకొని పాడటం బాగా అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత గేయ రూపకాల్ని రాసి ప్రదర్శించడం ... ఇలా కళారూపాలకు సంబంధించిన అనేక మెలకువల్ని నేర్చుకున్నాడు. పాటలతో పాటు, నాటకాల్ని, వీధి రూపకాల్ని, కవిత్వాన్ని రాసినా తనకు పాట రాయడం, అంతకంటే దాన్ని పాడటమే తన ప్రాణంగా ఆయన భావిస్తాడు. అణగారిని వర్గాలన్నీ ఏకమై ఏదొకనాడు రాజ్యాధికారానికి రావాలనే ఆశయమే ఆ పాటల నిండా కనిపిస్తుంటుంది. అందుకే అనేక ప్రక్రియల్లో రచనలు చేసినా పాటంటేనే ఆయనకు ప్రాణం. మాష్టార్జీ మూల వాసుల పాటలు, అఖండ విప్లవ జ్యోతి-అంబేడ్కర్(సాంఘిక నాటకం), ఔనుమల్లా! (వీధినాటకం), అంగుళీమాలుడు( చారిత్రక నాటకం), బౌద్ధ గీతాలు, మట్టిపూలు (కవితాసంపుటి) ఇవన్నీ 2008 లో పుస్తకరూపంలో వచ్చాయి. కానీ, వీటిలో పాటలు, కథలు చాలా వరకూ పుస్తకరూపంలో రాకముందే ప్రసిద్ధి చెందాయి.మాష్టార్జీ ని ప్రజావాగ్గేయ కారుణ్ణీ చేశాయి.
"మాష్టార్జీ నిర్వచించిన మూల వాసుల సిద్ధాంతం పడికట్టు సిద్ధాంతం ( Aristocratic Theory) కాదు. ఇది నిరంతరం మారే సిద్ధాంతంగా తన ప్రతిపాదనలో సూచిస్తాడు...మానవ పరిణామ క్రమంలోఆయా ఖండాలలోఉద్భవించిన మానవసమాజాలే మూలవాసులు. ఏప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతాల మీద రాజకీయ, సామాజిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, భాష ఆధిపత్యం ఉండాలన్నదే ఈ సిద్ధాంతం. నేడు దళితులని పిలవబడుతున్న ఎస్.సి., ఎస్.టి.,బి.సి, మైనారిటీ మతాల్లోకి మారిన అసలైన భారతీయులు మూలవాసులు" అని మాష్టార్జీ రచనలపై పరిశోధన చేసిన మద్దెల రాజు ఆ సిద్ధాంతాన్ని వివరించారు(మద్దెల రాజు,1998:26,30,31). ఆంధ్ర ప్రదేశ్ లోమొదటి సారిగా దళితకళామండలిని స్థాపించి, ప్రజల్ని చైతన్యపరు స్తున్నాడు.
దళితుల్ని గాంధీ హరిజనులని పిలవడాన్ని మాష్టార్జీ తన పాటల్లో నిరసించాడు. ఒకప్పుడు యఙ్ఞ యాగాదుల పేరుతో ఘోరంగా పశువుల్ని వధించిన వారే దళితులు మాంసాహారాన్ని తినడాన్ని అసహ్యించుకోవడాన్ని ఖండిస్తున్నాడు కవి. హిందూ మతం దళితుల్ని దారుణంగా అణచివేయడమే కాదు, తీవ్రంగా అవమానించడాన్ని సహించలేని తిరుగుబాటు తత్త్వం ఆయన పాటల నిండా వినిపిస్తుంది.
మాష్టార్జీ సాహిత్యంలో బహుజన హితం ఉంటుంది. మాష్టార్జీ సాహిత్యం బహుజన హితాన్ని కోరుతుంది. బహుజన వాదాన్ని బలపరుస్తుంది. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులు ఎస్.సి., ఎస్.టి.,బి.సి., మైనారిటీలని పిలవబడే ముస్లిమ్, క్రైస్తవులు సర్వసాధారణంగా శ్రామికవర్గానికి చెందిన వాళ్ళను మేధావులు బహుజనులని పిలుస్తున్నారు. కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా ఈదేశ మూలవాసులే అనేది మాష్టార్జీ సిద్ధాంతం. వీళ్ళకే రాజ్యాధికారం దక్కాలని వాదిస్తారీయన. ఈ భారత దేశంలో శ్రామిక వర్గం కులవృత్తుల రూపంలో ఉంది. పరిశ్రమలు ఎక్కువైన తర్వాత, యంత్రాలతోనే పని చేయించుకుంటూ వృత్తుల్ని , మానవ వనరులన్నీ రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. వైఙ్ఞానికంగా అభివృద్ధి చెందినా, మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకోకుండా, సర్వ మానవుల శ్రేయస్సుని కోరుకోకుండా జరిగే అభివృద్ధి నిజమైంద కాదని మాష్టార్జీ ఘోషిస్తున్నాడు. ఆ విధంగా ప్రపంచీకరణను కూడా వ్యతిరేకిస్తున్నాడని వేరే చెప్పాల్సిన పనిలేదేమో!
చైతన్య వంతమైన దళిత రచయితలు తమ జీవితంలో ఒక్క అక్షరమైనా తమ కోసమే జీవించిన దార్శనికుల్ని కీర్తంచకుండా ఉండరు. అలాగే మాష్టార్జీ కూడా కీర్తించారు. దాని ద్వారా భవిష్యత్తు తరాలకు స్పూర్తినిస్తున్నాడు. ఈ దృక్పథంతో పాటల్ని రాయడంలో, పాడడంలో, ప్రదర్శించడంలో మాష్టార్జీ ఎంతో ముందున్నారు.
"అందుకో దండాలు - బాబా అంబేద్కరా/అంబరాన ఉన్నట్టి - చుక్కలు గురవంగో/ముందుగా నిను దలచి - పాటలు పాడేము/చీకటి మా బ్రతుకుల్లో- సూర్యుడు పొడవంగో"(మాస్టార్జీ దళిత గీతాలు, 1994 : 6)అలా అంబేద్కర్ దళితులకు ఎలా చైతన్యమయ్యాడో మాష్టార్జీ వర్ణించాడు. ఈ ధోరణిలోనే గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు బా పూలే, సావిత్రీబాయి పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, జగజ్జీవన్ రామ్, జాషువా, నెల్సన్ మండేలా, సదాలక్ష్మి, కాన్సీరామ్ మొదలైన వారెందరి గురించో స్పూర్తి దాయకమైన పాటల్ని రాశాడు. వాటిని అనేక చోట్ల తన గళంలో పలికించారు. ఆయన గొంతు విన్న వాళ్ళెంతో మంది ఆ పాటల్ని కావాలన్నారు. పుస్తకం రూపంలో రానప్పుడు వాటిని రికార్డ్ చేసుకొని, దాన్ని జాగ్రత్తగా దాచుకొని, ఆపాటల్ని నేర్చుకొని ఆ దళితనేతల జయంతులు, వర్థంతుల్లో పాడుకొనే వారు. ఇప్పుడా పాటలు ''మాష్టార్జీ మూలవాసుల పాటలు'' పేరుతో 2008 లో అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
మాష్టార్జీ రాసిన వచన కవిత్వంలో కూడా ఇలా దళిత దార్శినికుల్ని కీర్తించడం కనిపిస్తుంది. మాదిగ సాహిత్యావాదాన్ని తెలుగు సాహిత్యంలో ఒక ధోరణిగా గుర్తించేలా చేసిన వారిలో నాగప్ప గారి సుందర్ రాజు ఒకడు. అతడు చనిపోయిన తరువాత ఎంతో బాధతో ఒక స్తృతి గీతాన్ని రాస్తూ " ఆకాశం అంచుదాకా ఎగర కుండానే/ నేలరాలావూ.../ఊరి చివరకు గెంటేసిన/ మనువాదుల మెడలు వొంచి/ మాదిగోడిని కావ్య నాయకుడ్నే చేసి/ తెలుగు సాహిత్య సౌందర్య శాస్త్రానికి/ నూతన అంగ వస్త్రాన్ని కప్పావు" అని గుర్తుచేసుకున్నాడు. అలాగే గిరిజనుల కోసం పోరాడిన సాహూని కీర్తిస్తూ.. గిరిజనుల దు:ఖానికి ఓదార్పుగా/ భయాన్ని పార్ద్రోలే భరోసాగా/ వాళ్ళ భాషనే నేర్చిన బంధువుగా/వాళ్ళ జీవితంలో భాగ స్వామిగా'' మారడాన్ని కీర్తిస్తున్నాడు. సాహూ గిరిజనుల్లో తెచ్చిన చైతన్యాన్ని మరచి పోలేనిదని విశ్లేషిస్తున్నాడు కవి. ఇలా బోయి భీమన్న గురించి కూడా రాశాడు. తమకు రావల్సిన వాటా తమకు దక్కాలని మాదిగలు, మిగిలిన దళిత ఉపకులాల వాళ్ళు చేస్తున్న వర్గీకరణ వాదంలో సామాజిక న్యాయాన్ని సమర్థిస్తూనే, రాజ్యాధికారానికి పయనించమంటున్నాడు.
తెలంగాణాపై కూడా స్పందించాడు. నాటి కోటిరత్నాల వీణాలా తెలంగాణా లేదని దానికి అగ్రవర్ణపాలకుల, భూస్వాముల పాలనే కారణమంటున్నాడు. ఇలా అనేక భావాలతో వచన కవితల్ని కూడా రాసి వారి చైతన్యంతో ముందుకెళ్ళమని ప్రబోధిస్తున్నాడు. దళిత, బహుజనులకు నిజమైన విముక్తి కలిగించగలిగే ప్రత్యామ్యాయాన్ని బుద్ధుని బోధనలనుండి, జ్యోతి బాపూలే, అంబేద్కర్ భావజాలాన్నుండీ స్వీకరించాలని భావిస్తున్నాడు.
"మన మేడ చదువుకుంటె వాళ్ళ చేతులుండరని/ మార్స్కు ముసుగు తొడుగుకున్న మనువాద బ్రాహ్మణులు / మన చదువులనాపుతుండ్రు తమవాదన కుట్రలతో/ మనువు గాడు ఆపె చదువు మార్క్సిస్టు ఆపె చదువు / ఇద్దరొక్కటన్న మాట ఇప్పుడు తెలుసుకున్నామో...(మాస్టార్జీ దళిత గీతాలు, 1994 : 32)" అని కొంతమంది మార్క్సిస్టులు తమ సంతానాన్ని విదేశాల్లో చదివించుకొంటూ, ఉద్యోగాలు చేయించుకొంటూ దళితుల్ని మాత్రం పోరాటాలకు ఉసిగొల్పుతున్న కుట్రను పసిగట్టవలసి ఉందని దళితులకు ప్రబోధిస్తున్నాడు. ఇక్కడ మాష్టార్జీ మార్స్కిస్టుల్ని, మార్స్కిజాన్ని నిందించడం లేదు. కులం వాసన పోని మార్స్కిస్టుల్ని మాత్రమే నిందిస్తున్నాడు.
మాష్టార్జీ రాసిన సాహిత్యంపై పరిశోధన చేసిన వారికి డిగ్రీలు వస్తున్నాయి. ఇప్పటికే పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మాష్టార్జీ రచనలపై పరిశోధన చేసినందుకు మద్దెల రాజుకు ఎం.ఫిల్., డిగ్రీ నిచ్చింది. అది "మాష్టార్జీ దళిత గీతాలు: మూలవాసుల సిద్ధాంతం" పేరుతో 1998 లో ప్రచురణ కూడా పొందింది. తాను పుట్తి పెరిగిన మట్టినుండి మహోన్నతమైన పరిమాళాల్ని వ్యాపింపజేస్తున్న మాష్టార్జీ సాహిత్యంపై మరిన్ని పరిశోధనలు జరగవలసిఉంది. మాష్టార్జీ సాహిత్యానికి అంత విస్తృత పరిధీ ఉంది.


1 comment:

kesav said...

Dear Darla
Thanks for writing a piece on Masterjee.Though Masterjee is a powerful stream in song culture of dalits, there is no evaluative works on him.This is a representative article on masterjee life and his literary works.

Kesava Kumar