Friday, January 19, 2007

అస్తిత్త్వవేదలను ప్రతిధ్వనించిన కళింగాంధ్రకవిత్వందార్ల వ్యాసాలు దగ్గరకు దారి"ఎక్కడ్నించి లేచి వచ్చామో ఆ నేలను వెతుక్కునే పనిలో పడ్డాం. ఇప్పుడు అందరం Again we are getting back to our roots,"ఎవరి మట్టిని వాళ్ళు own చేసుకునే స్పృహ" అందర్నీ ఊపేస్తుంది.ప్రపంచం నుంచి ప్రారంభమవడానికి బదులుగా సొంత ఊరు నుంచి బయలుదేరడానికే ఇష్టపడుతున్నాం..." అంటూ స్వీయ అస్తిత్త్వ గొంతులతో ఇటీవల "తూరుపు కళింగాంధ్రకవిత్వం" వెలువడింది. దీనికి అరుణ్ బవేరా, శ్రీ చమన్ సంపాదకులుగా వ్యవహరించారు. 'ఇవాళ జీవితం నిండా అలవికానంత వైవిధ్యం ఉంది. బతుకులోకి ఒకసారి తొంగి చూడడం మొదలు పెట్టామో మళ్ళీ తలతిప్పుకోలేమంటూ' "సమూహాన్ని కోల్పోతున్న వాళ్ళం" పేరుతో రాసిన ముందుమాటలో అరుణ్ బవేరా వ్యాఖ్యానించారు. నిజమే, ఇప్పడు ప్రతి పల్లె తన పూర్వ గుర్తులను ఒకసారి తిరిగి చూసుకుంటుంది. కోల్పోయినప్పుడే వాటి విలువేంటో తెలుస్తుందంటారు. పొద్దున్న లేచింది మొదలు నిద్రపోయేవరకు ప్రపంచీకరణ ప్రభావాన్నుండి ప్రతి పల్లె తప్పించుకోలేని స్థితిలో కూరుకుపోతుంది. ఇది ఒక భారతదేశానికి మాత్రమే వచ్చిన క్లిష్ట పరిస్థితి అనుకోవటానికి వీల్లేదు లేదు. ప్రపంచ దేశాలన్నింటినీ తనగుప్పెటలో పెట్టుకొని అమెరికా ఆడుతున్ననాటకంలో, అనివార్య పరిస్థితుల్లో కూరుకుపోయిన, పాత్రధారులవుతున్న దేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి! ఈ పరిస్థితుల్లో ప్రజలు పోరాటాలు చేయక తప్పని పరిస్థితే తలెత్తిందనవచ్చు!
" సిడ్నీ, బీజింగ్,ఢిల్లీ,శ్రీకాకుళం,చెచెన్యా
క్యూబా మెక్సికో, అర్జెంటీన, ఇథియోపియా
నికరాగువా... ఇంకా ఇంకా...
మనిషి బాధలొక్కటే, వెతుకులొక్కటే, కతలొక్కటే
" (వందనం - దుప్పల రవికుమార్, పుటః 97.) ఆ సామూహిక కష్టాలే ఒకనాడెప్పుడో ప్రజలందరినీ ఏకం చేసి పోరాటాలకు సిద్ధం చేయకతప్పదు. ఒక దేశంలోని ఒక ప్రాంతం అభివృద్ధి జరగకపోవటానికి పాలనా ప్రభావం, కొంత మంది స్వార్థం, స్వలాభం ఎలాగైనా ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటే, వాటి వెనుకున్న ప్రత్యామ్నాయ ప్రభావాలను కూడా లోతుగా చూడాల్సిందే! ఆ ప్రభావాలు తెలుసుకోలేనప్పుడు, వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకోక తప్పదు. అంటే అభివృద్ధి చెందిన వాళ్లు, చెందని వాళ్ళు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉంటారు. సమస్యమూలాల్లోకి వెళ్ళలేరు. మరొక వైపు రాజకీయ ప్రయోజకులు మేధావులను మాట్లాడ్నివ్వకుండా వివిధ మార్గాల్లో నోరు నొక్కేస్తుంటారు. కాని, కవి నోరు నొక్కటం అంత సులువు కాదు కదా! అందుకనే, అనేక అనుభవాలతో, అనుభూతులతో ప్రయోగాలతో వాటిని అభివ్యక్తీకరిస్తూనే ఉంటారు. ఆ అభివ్యక్తీకరణలో భాగంగానే ఈ కవిత్వాన్ని చెప్పుకోవాలి.
మన రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కోస్తా ఆంధ్ర లోని కొన్ని జిల్లాలనవచ్చు. అయితే, వాటి అన్నింటినీ ఒకే గాటన కట్టేయడానికి వీల్లేదని మన ఆర్ధిక సంఘాలిచ్చే నివేదికలే చెప్తున్నాయి. అలా చెప్పేవాటిని బట్టి చూసినా, తెలంగాణ, రాయలసీమల, కోస్తాలలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. అయినప్పటికీ, తెలంగాణలో వచ్చినంత ప్రాంతీయ చైతన్యం, ఇతర ప్రాంతాల్లో రాలేదు. వాటికి అనేక కారణాలున్నా గాని, ఒక ప్రాంతం వారికేమో నీటి సమస్య అంతగా లేదు. మరొక ప్రాంతం వారికేమో నాయకత్వం వహించగలిగే అవకాశానికి ఆటంకాల్లేవు. ఇప్పుడిప్పుడే ఆ సమస్యలు, ఆటంకాలు బయటపడుతున్నాయి. అవకాశాలు ఉన్నా, ఆటంకాలు లేకపోయినా, అవన్నీ ఆ ప్రాంతాల్లో జీవించే అన్ని తరగతులకు కాదని ప్రజలంతా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా సామాజికంగా కింది తరగతులుగా, వర్గాలుగా పరిగణనలో ఉన్నవారిలో చాలా చైతన్యం వచ్చింది. ఇతర ప్రాంతాలతో, ఇతర వర్గాలతో పోల్చుకున్నప్పుడు తమ లోటుపాట్లు గ్రహించగలుగుతున్నారు. ఆ లో టుపాట్లను తమ రాష్ట్రంలోని ప్రజల వల్లే అని కాకుండా ప్రప్రంచ దృష్టి కోణం నుండి చూడగలుగుతున్నారు. తమ జాతి, తమ భాష, తమ సంస్కృతి, తమ పంటలు, తమ భూమి, చివరికి తామే పరాధీనం కావటాన్ని గమనించ గలుగుతున్నారు. పరాయీకరణకు ఆందోళన చెందుతున్నారు. ప్రతీదీ వ్యాపారమయం కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవన్నీకవులు తమ కవితల్లో వ్యక్తీకరిస్తున్నారు. కవులు తమ ప్రాంతాల్లో పండే పంటల వైభవాన్ని నెమరు వేసుకోవలసిన పరిస్థితులు ఎదురైయ్యాయి. అందుకనే కాగే మంట ల్లో కాల్చుకు తిన్న కందికాయల తీయని జ్ఞాపకాలు దీనిలోకవిత్వమయ్యాయి. పెట్టుబడికే సరిపోక, పండిన పంటంతా
" అప్పుల పెనుగాలికి
కళ్ళం పొల్లు గింజై ఎగిరి పోయినప్పుడు
ఒట్టిపోయిన కళ్ళాన్ని చూస్తే
నాకిప్పుడు వల్లకాడే గుర్తొస్తుంది
" అంటాడో కవి ( కళ్ళం - సిరికి స్వామినాయుడు . పుటః 18).
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని నిరసనలు ఎదురైనా కోకోకోలా వంటి కంపెనీలు ఇంచుమించు అన్ని దేశాల్లోనూ నీళ్ళను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. ప్రజలకు కనీస అవసరాలను సమకూర్చ వలసిన ప్రభుత్వాలకు కూడా వ్యాపార దృష్టిని కలిగించేశాయి. పాల కంటే నీళ్ళకే అధిక సొమ్ముని వెచ్చించవలసిన దారుణమైన పరి స్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితులు కేవలం నగరాలకో, పట్టణాలకో మాత్రమే కాదు. పల్లె పల్లెకీ విస్తరించబడ్దాయి. ఈ పరిస్థితుల్ని స్పురింపజేస్తూ...
"వాళ్ళు సూర్య కిరణాల్ని అమ్ముకుంటారు
చంద్రుని వెన్నెలనమ్ముకుంటారు
నీళ్ళనమ్ముకుని పొలాల పచ్చని ఊ పిరినాపేస్తారు
" అని తాగడానికే నీళ్ళివ్వని వాళ్ళు పొలాలకు నీళ్ళెలా ఇవ్వనిస్తారని, ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి పోరాటం తప్పదంటారు కవి ( నిశ్శబ్ద విస్ఫోటనం - అద్దేపల్లి రామమోహనరావు, పుటః 20). పోరాటం జీవితం లో ఒక అనివార్యమైపోక తప్పదంటారు. నగరంలో మనుష్యులుంటారు. కానీ, మానవ సంబంధాలుండవు. అవసరాలుంటాయి... ఆత్మీయతలుండవు. ఈ రెండింటికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అవసరాలకే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలి. బాతా ఖానీ పెట్టుకుంటే ఎలా? అంటూ హెచ్చరిస్తుంటుంది నగర వాతావరణం! అదిప్పుడు గ్రామాల్లో ప్రవేశించింది. అదొక్కటే కాదు, కేబుల్ టి.వి తెచ్చిన మానవ సంబంధాల విచ్చిన్నత అంతా ఇంతా కాదు. సోమరితనం పెంచుతుంది. సులువైన మార్గాల్లో, కష్టపడకుండా డబ్బు సంపాదించ వచ్చని చెప్తూ, విలువలను పాతర వేయటం నేర్పుతుంది. ఇప్పుడు పల్లె కూడా రూపాయి మయమైపోయింది.
"పల్లె దీపం తల్లిలా పిల్లాపాపలను కౌగలించుకొనేది
ఆకాశం వంక ఆశగా ఆపేక్షగా చూస్తునే పల్లె జనం
కలల్ని మొలకల్లా నాటుకుంటూనే
బంగారు లోకాలకి వలస పోయేవాళ్ళు
నాగరికత వలువలు చుట్టుకున్న పల్లె పల్లెతనం కోల్పోయి
సత్తు రూపాయి బిళ్ళాలా మిగిలిపోయింది" (నా పల్లె తల్లిః బద్ది నాగేశ్వరరావు, పుటః 31) అని బాధను దిగమింగుకోవలసిన పరిస్థితిలో కూరుకుపోయింది. మరోవైపు మీడియా వాస్తవాల్ని దాచేసి, కొంత మంది చేతుల్లో నలిగిపోయి, ఉక్కిరిబిక్కిరిలో కూరుకుపోయింది. వాస్తవానికి - అవాస్తవానికీ మధ్య తేడా తెలుసుకోవడం అంత సులువు కాని పరిస్థితులు ఆవరించేసి ఉన్నాయి. తమకి అనుకూలంగానే వార్తా కథనాలు ప్రసారమవుతాయి. అలా కాదంటే, ఆ ఉద్యోగి తక్షణం తప్పుకోవలసిందే!
"తిరగేసిన అద్దాల్లో చరిత్రను చూపిస్తున్నారు శ్వేత ముఖులు
తలకిందుల కథల్ని ఆక్రమించుకున్నారీ క్రమంగా అతిరథ మహారథులు
భూతద్ధం వాళ్ళదే ఆకాశవాణి వాళ్ళదే"(
మళ్ళీ...మళ్ళీ డా. మానేపల్లి , పుటః 34) ఇప్పుడు పల్లెటూరిలో జీవితం కూడా అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. ఒక తాత్కాలిక జీవనంలాగే ఉంది. నగర స్వభావం అక్కడ కూడా వేగవంతమైపోయింది. అక్కడ కూడా రియల్ఎస్టేట్, చేపలచెరువులు, ఎమ్సెట్ ల ప్రభావావంలోనే ఉంది. ఇప్పుడు సాయంత్రం ...
"చిన్నసైజు జీవితంలాంటి
క్యారీ బ్యాగు లా ఉంది
."(పుటః 45) రైతులకిచ్చే విత్తనాల్లో, కరెంటులో అన్నింటిలో ప్రపంచ దేశాల ఆధిపత్యమే కనిపిస్తుంది.టెర్మినేటెడ్ విత్తనాలు వద్దని ప్రజలు అప్పట్లో ఎంత మొత్తుకున్నా, మన పాలకులు సైతం పెడచెవిని పెట్టి, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. రైతులకు తమ పంటంతా విత్తనాలు కొనుక్కోవటానికే సరిపోవట్లేదు. పోనీ, ఎలాగో కష్టపడి పండించినా ఒక వేళ ఎలాగోలా కొన్నా నకిలీ విత్తనాలు. పోనీ, ఎలాగో కష్టపడి పండించినా అగ్రరాజ్యాలిప్పుడు మన దేశంలో పండే పంటలపై కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. పేటెంట్ల పేరుతో, మేథోహక్కులపేరుతో మనదేశ రైతుఇప్పటికే అన్యాయానికి గురవుతున్నాడు. వీటితో పాటు..
"కళలు ,సంస్కృతి, సంపద
దోచుకెళ్ళిన వారే...
మనవృక్షాల్ని మోడు చేసిన వారే ....
మళ్ళీ...
మన కళ్ళకు కనిపించని వలలు విసురుతున్నారు
" (సంకర విత్తులు శ్రీ చమన్). సంకరవిత్తులు ఈ సంకలనంలో గొప్పకవిత. కృత్రిమంగా, అతికీ అతకనట్లు యాంత్రికమైపోతున్న జీవితాన్ని ప్రతీకాత్మకంగా వర్ణించారు. పుస్తకానికి కళింగ్రాంధ్ర కవిత్వం అని పేరు పెట్టినా, ఈ సమస్యలు ఇంచుమించు రాష్ట్రమంతటా ఉన్నాయి. భారతదేశమంతటా ఉన్నాయి. ప్రపంచమంతటా ఉన్నాయి. అయితే, మనలో మనకి విభేదాలను సృష్టించటంలో విదేశీయుల పాత్ర ఎంతో ఉంది. విదేశీ పెట్టుబడుల పాత్ర ఉంది. విదేశీ కంపెనీల పాత్ర ఉంది. దీన్ని ఎంతో సమర్థవంతంగా , కవిత్వానుభవాలతో నిరూపించగలిగారీ కవిత్వంలో.
"మనదగ్గర మనమే పనిచేస్తూ
కనిపించని ప్రభువుల పల్లకీ మోసే
బోయీలయ్యేందుకు
కొట్టుకుంటూ...కుమ్ముకుంటూ..నీదిది..నాదిదని
భాగించి...విభజించి
సంకరజాతి మొక్కల్ని వాటాలు వేసుకు
"నే పరిస్థితిని కళింగాంధ్ర కవిత్వీకరించింది. ఒక ప్రాంతం నుంచి , ఆ ప్రాంతం పేరుతో కవిత్వం వచ్చింది కనుక, ఇది ఆ ప్రాంతానికి సంబంధించిన కవిత్వమే అనుకోవటానికి వీల్లేదు. కానీ, ఆ రకమైన భావజాలాన్ని వివరించటంలో మాత్రం తొలి ప్రయత్నం చేసిన కవితాసంకలనం ఇదే నేమో! అంతకుముందే ఇంచు మించు దీనికి దగ్గర భావనలతో మావూరు, అమ్మ కవితాసంకలనాలు వచ్చినా, వాటిలో సెంటిమెంటికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. దీనిలోనూ సెంటిమెంటున్న కవితలు కొన్ని ఉన్నా, స్థానీయతలో విశ్వజనీనతే ఇమిడి ఉంది. ఇప్పడు కోస్తా ఆంధ్ర పరిస్థితి కూడా ఒకప్పటిలా లేదు. అన్నపూర్ణలా అసలే లేదు. నిత్యం వరదలు, తుఫానులు. మరోపక్కONGC తవ్వకాలు,రొయ్యల చెరువులు ...ఇంక పంటెక్కడిది.
" ఏదో చెప్పాలనే ఉంది
కానీ ఏమని చెప్పను
ఆకలి కేకలతో దద్దరిల్లే
నా ధరిత్రి అన్నపూర్ణ అని చెప్పనా"
(ఎలా చెప్పను! నాధరిత్రిని- కొప్పిరెడ్డి , పుటః 67) అన్నట్లు మారిపోయిందీ సశ్యశ్యామల ప్రాంతం! నిజం చెప్పాలంటే ఆ ప్రాంతమిప్పుడు...
"ముంపొక అశనిపాతం
సర్వం కోల్పోయిన వైనం
ఏదీ సొంతం కాదనే వైరాగ్యం
"(అడపా రామకృష్ణ, పుటః 77)లో కూరికి పోయింది." " పేర్లేవైతేనేమి దోపిడీల నయావలసవాదమే " ఇక్కడా కొనసాగుతుంది. "ఒంట్లో ఇంట్లో కంట్లో అన్నింట్లో ఏవేవో ప్రలోభాలు" వెంటాడుతున్నాయి. బతకాలి కనుక బతుకుతున్న జీవితాలెన్నో! పుట్టి పెరిగిన ఊరిని వదిలి పోలేక అక్కడే జీవితాలు చాలిస్తున్నవాళ్ళింకొందరైతే, ప్రాణం పట్టుకొని పల్లెను వదిలేసి పారిపోతున్నవాళ్ళెంతమందో...
"మనుషులు ఖాళీ చేసిన ఊరు
ఈ చీకటిని జయించడానికి
కన్నీళ్ళు చాలవు
నాకళ్ళనిండా
పొలంలో ధాన్యం గింజలేరుకుంటున్న పిట్టలే
వర్షంలో తడిసి చెట్లమీద రెక్కలారేసుకుంటున్న పక్షులే
యిప్పుడు సన్నివేశాలకి సన్నివేశాలే మారిపోయాయి.
కొత్తగా చెరిగిపోతున్న దృశ్యాన్ని నేనే
యిది అంతా
సామాన్లు సర్ధుకుని వెళ్ళిపోతున్న దుఃఖం
గూళ్ళు చెదిరి గువ్వలెరిగిపోయిన వేదన
లోపలి ఆకాశం అరుస్తూనే ఉంది
. (మనుషులు ఖాళీ చేసిన ఊరు -అరుణ్ బవేరా, పుటః101). బహుళజాతి కంపెనీల్లో భాగంగా రోడ్ల విస్తరణ జరుగుతుంది. ప్రాజెక్టులు కట్టబడ్తాయి.నిర్వాసితులకు నష్టపరిహారమిస్తామంటారు. ఎప్పటికీ రాకపోయేసరికి అడిగితే,ఆందోళనలు చేస్తే, పోలీసులచేతిలో చావుదెబ్బలు తినవలసిందే. దొంగకేసుల్లో ఇరుక్కోవలసిందే. అవసరమైతే ఎన్ కౌంటర్ కి సిద్ధమవ్వాల్సిన పరిస్థితులను, మన మనుషులతోనే చేయించగలుగుతుందీ అగ్రరాజ్యాధిపత్యం! గంటేడు గౌరునాయుడు రాసిన 'కట్టండి ప్రాజెక్టులు'లో ఇలాంటి కవిత్వాన్ని ఆస్వాదించవచ్చు. కళింగాంధ్ర ప్రాంత వైభవాన్నిఅనేకకోణాల్లో 'అపూర్వులు మాపూర్వులు' కవితలో నల్లి ధర్మారావు వర్ణించి, ఆ వైభవమంతా ఏమైపోతుందనే ఆవేదనను పలికించగలిగారు. దీనిలో ఇంకా చాలా మంది మంచి కవిత్వాన్ని రాశారు. దాట్ల దేవదానం రాజు, చాయారాజ్, సి.కామేశ్వరరావు, వాసా ప్రభావతి, ఎల్.కె.సుధాకర్, కె.వరలక్ష్మి, పి.ఎస్ నాగరాజు, సాధనాల వెంకటస్వామినాయుడు, మహ్మద్ అబ్లుల్ అజీజ్, విరియాల లక్ష్మీపతి వంటి వారెంతో మంది ఆర్థ్రతతో రాసిన కవితల్నిందులో ఎంపిక చేశారు.కవితలన్నీ ప్రపంచీకరణ వల్ల పల్లెలు ఎలా విధ్వంసానికి గురైపోతున్నాయో, మానవ సంబంధాలెలా మంటగలిసిపోతున్నాయో, వలసలెలా పెరిగిపోతున్నాయో ప్రతిధ్వనించేవి గానే ఉన్నాయి. దానికి ఆనవాలుగా కళింగాంధ్రను చూపుతున్నారు. నిజానికి ఏ ప్రాంతం చూసినా ఇదే పరిస్థితి. దీన్నే చెప్తూ"స్థానిక గొంతులే...?" పేరుతో దార్ల వెంకటేశ్వరరావు రాసిన కవిత (పుటః90)లో వర్ణించినట్టు
" ఒక్క ప్రాంతమైనా చూడగలరా...?
ఇవిగో నమ్ముకున్న నేలతల్లికి పెట్టిన రంద్రాలు
చమురన్వేషణలో పచ్చదనాల్లోని విధ్వంసాలు
కుప్పకూలిన చెట్టంత అనుబంధాలు
పైసాపైసా కూడబెట్టుకున్న అరెకరం
కొండచిలువలు మింగేసిన రొయ్యల చెరువు

చూపలేనివి ఇంకా ఎన్నెన్నో..." ఈ కవితా సంకలనం నిండా ఉన్నాయి. ఈ సంకలనంలో కవితల ఎంపిక పట్ల చాలా జాగ్రత్తలు పాటించార్నిపిస్తుంది. ఇది కళింగాంధ్ర నుంచి వస్తున్న కవితాసంకలనం. ఏదో ఓ ప్రాంతానికి పోటీగా వస్తున్నది కాదు. తమ ప్రాంత వెనుకుబాటుతనానికి ఇతర ప్రాంతాల్లో జరిగే అభివృద్ధిపై దృష్టి పెట్టి నిందించటమో, నిరసించటమో చేయలేదు. మన సమస్యలన్నింటికీ ఒక మూలం ఉందని నిరూపించేటట్లున్నకవితలనే తీసుకున్నారు. అయితే, తూర్పుగోదావరి జిల్లాను కూడా కళింగాంధ్రలో ఎలా భావిస్తున్నారనే ఒక ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదు. భాషాశాస్త్రవేత్తల ప్రకారంగానే ఇంత వరకూ కళింగాంధ్రను చూసిన వారికి ఇది ఒక కొత్త విభజన రేఖను చూపిస్తుంది. కానీ, భౌగోళికంగా చూసినప్పుడు గోదావరికి ఇవతలి ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజల జీవన విధానంలో కూడా అనేక సారూప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ నాలుగు జిల్లాలను కేంద్రంగా చేసుకొనే ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో కొనసాగుతుంది. ఏ విధంగా చూసినా విశాఖ పట్నం వైపే తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చూస్తుంటారు.కనుక కళింగాంధ్రగానే తూర్పుగోదావరి జిల్లాను పరిగణించటంలో సామంజస్యం కనిపిస్తుంది. ఈ ప్రాంతాలనుండి ప్రాంతీయతలో విశ్వజనీనతను చూపే ప్రయత్నంతో కవితాసంకలనం రావటం ఆహ్వానించదగిన పరిణామం! ఈ ప్రాంత సమస్యలపై కూడా పాలక వర్గాలు దృష్టి పెట్టాలి.

-డా.దార్ల వెంకటేశ్వరరావు
vrdarla@gamil.com

దార్ల వ్యాసాలు దగ్గరకు దారి


No comments: