"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

23 December, 2017

ప్రజల్లో చైతన్యం, ప్రభుత్వ విధివిధానాల్లో మార్పుల వల్లే తెలుగు భాషాభివృద్ధి

ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు
తెలుగు భాషామాధ్యమంలో విద్యాబోధన కొనసాగాలన్నా, తెలుగులో చదువుకున్నవాళ్లకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా ప్రజల్లో చైతన్యం, ప్రభుత్వ విధివిధానాల్లో మార్పులు రావడం వల్లనే సాధ్యమవుతుందని సోమవారం (18 డిసెంబరు 2017) అబిడ్స్ లోని హైదరాబాదు విశ్వవిద్యాలయ ప్రాంగణం ‘గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన చర్చాగోష్ఠిలో వక్తలు పేర్కొన్నారు. అనువర్తిత భాషాశాస్త్ర అనువాద అధ్యయనాల కేంద్రం (CALTS)హైదరాబాదు విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చర్చాగోష్ఠి జరిగింది. కాల్ట్స్ విభాగాధిపతి ఆచార్య రాజ్యరమ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 
సమావేశ లక్ష్యాలను వివరిస్తున్న ఆచార్య రాజ్యరమగారు
మాతృభాషగా తెలుగు మాధ్యమం అమలు, భాషా ప్రణాళిక, తెలుగు కంప్యూటరీకరణ, వివిధ సాంకేతిక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి, ఆ సారాంశాన్ని తెలుగు భాషావేదిక ద్వారా భాషాశాస్త్రవేత్తలకు, ప్రభుత్వానికి నివేదించడానికి ఉపకరించడమే దీని లక్ష్యమని తెలుగు భాషా గోష్టి లక్ష్యాలను ఆచార్య రాజ్యరమ ప్రకటించారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య రెడ్డిశ్యామల గారు

తెలుగు పాఠ్యాంశాల్ని రూపొందించేటప్పుడు పాఠ్య నిర్ణాయక సభ్యులుగా తామెంతో లోతుగా ఆలోచించవలసి వచ్చేదనీ,  తెలుగు ఒక అంశంగా కొనసాగడానికీ, తెలుగు భాషామాధ్యమంగా కొనసాగడానికీ మధ్య వ్యత్యాసం ఉందనీ ఈ సమావేశంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర అధ్యాపకురాలు ఆచార్య రెడ్డి శ్యామల అన్నారు. తెలుగు అమలుకి కొన్ని సమస్యలున్నాయనీ, తగిన నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కొక్కసారి తెలుగు మీడియంలో చదివితే ఎదుర్కునే సమస్యలకు ఇంటిలోని సభ్యులు అడిగే ప్రశ్నలకే కొంత స్థాయిలో సమాధానం చెప్పినా, పూర్తివాళ్ళనే సంతృప్తిపరచలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుందని కొన్ని ఉదాహరణలను వివరించారు. పాలకుల విధాన నిర్ణయాలు తెలుగుభాష అమలులో కీలకమైన పాత్రను పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు.
            తెలుగు భాషా మాధ్యమం అమలులో అనేక సమస్యలున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయంలోనే తమకెన్నో అటంకాలు ఎదురయ్యాయని, అయినప్పటికీ కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేశామని ప్రసిద్ధభాషాశాస్త్రవేత్త ఆచార్య అయినవోలు ఉషాదేవి వివరించారు. 


సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య అయినవోలు ఉషాదేవి గారు

భాషారాష్ట్రాలు ఏర్పడకముందే కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటివాళ్ళెంతోమంది రకరకాల శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు రావడానికి కృషిచేశారన్నారు. కొంతమంది తాము పుట్టి పెరిగిన ప్రాంతం తెలుగే అయినప్పటికీ అది తమ భావాల్ని సమర్థవంతంగా వ్యక్తీకరించలేకపోతున్నామనేవాళ్ళున్నారనీ, అలాంటి వాళ్ళలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడంలో విశేషమైన కృషి చేసిన డా.రామిరెడ్డి లాంటివాళ్ళున్నారు. దానికి కారణాల్ని మనం అన్వేషించాలి. మాధ్యమానికి కావాల్సిన సరుకుని తయారుచేసుకోవాలి. తెలుగు మాధ్యమంలో భాషాబోధన జరగాలంటే ప్రభుత్వం పూనుకోవాలి. వాటికి కావలసిన నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు కావాలి. మనం తయారుచేయాలి. నేను చదువుకునే రోజుల్లో ‘వాక్కాయ’ అనేపదం వచ్చింది. నాకు తెలియలేదు. దాన్ని తెలంగాణాలో ‘కలింకాయ’ అంటారు. అలాంటి పదాల్ని నిఘంటువుల్లో అందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పదాలు కథల్లోను, కవితల్లోను  మనం మాట్లాడే తెలుగు భాషలోనే రాసుకోవాలనే గురజాడ అసమ్మతి పత్రం రాశారనీ గుర్తుచేశారు. మనం చాలా వరకు వాళ్ళ ప్రాంతాల్ని బట్టి గొప్పతనాన్ని ఆపాదించడం సరైందికాదని చెప్పారు.

శ్రీ సురేశ్ కొలిచాల, ఆచార్య దార్ల వెంకటేశ్వరారావు, ఆచార్య రాజ్యరమ గార్లు చిత్రంలో ఉన్నారు.
            ఆచార్య రాజ్య రమ మాట్లాడుతూ చేకూరి రామారావు,  కె.కె.రంగనాథాచార్యులు, భద్రిరాజు కృష్ణమూర్తి మొదలైన వారి ప్రభావం వల్ల భాషాశాస్త్రంలోకి వచ్చాను. తెలుగు భాషకు సంబంధించినదాన్నే ఆంగ్లంలో పరిశోధన చేశానని, తర్వాత నాకు ఉమామహేశ్వరరావుగారిచ్చిన ప్రోత్సాహాన్ని మరిచిపోలేనని అన్నారు. తెలుగు మాధ్యమం గురించి మనం చర్చించుకుంటున్నాం. దాన్ని ప్రభుత్వం అమలుచేస్తే గనుక, దాని విధివిధానాల్ని మనం రూపొందించుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో చదివిన వాళ్ళు ఎంతో విజయపథంలో పయనిస్తున్నారు. దీనికి కారణం ప్రణాళికలేనని స్పష్టమవుతుంది. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే, దాన్ని మనం అమలు చేసుకోవాలా? లేక ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి అవకాశం కల్పించకపోతే దాన్నెలా సాధించుకోవాలి? దీనికి మనమెలాంటి ప్రయత్నాలు చెయ్యాలి? వంటివన్నీ మనం ఈ గోష్టిలో నిర్ణయించుకోవాలి. ఒక వేళ మనం ఇప్పుడే పూర్తిస్థాయిలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెడితే దానికి కొన్ని సాధకబాధకాలున్నాయనిపిస్తుంది. ఆంగ్ల మాధ్యమంలో ఉన్నవాళ్ళస్థాయిలో మనం తెలుగు మాధ్యమంలో బోధించగలమా? బోధనకు కావలసిన పారిభాషికపదాలు, అనువాద గ్రంథాలు వంటివన్నీ ఉన్నాయా? అనేవన్నీ నాకు అనుమానాలనిపిస్తున్నాయి. వీటితో పాటు అంతర్జాలంలో తెలుగు భాషా వాడుక గురించి జరుగుతున్న చర్చల్ని చూస్తుంటే తెలుగుభాషకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందనిపిస్తుంది. మనం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో పాఠ్యాంశాల్ని బోధిస్తున్నామంటున్నా, నిజానికి చాలా చోట్ల తెలుగులోనే వాళ్ళకు పాఠాలు చెప్తున్నారు. అప్పుడది ఆంగ్లమాధ్యమం అవుతుందా? తెలుగు మాధ్యమం అవుతుందా? ఇవన్నీ తనకెంతో గందరగోళాన్ని కలిగిస్తున్నాయని వీటి గురించి లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సురేశ్ కొలిచాల గారు

అమెరికా నుండి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఈమాట అంతర్జాజాల మాసపత్రిక వ్యవస్థాపకులు, ప్రముఖ భాషావేత్త సురేశ్ కొలిచాల  ఈ చర్చాగోష్ఠిలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష కూడా ఆర్థిక భాషగా మారనంతవరకు ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ భాషను పట్టించుకోవడం సాధ్యంకాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే భాషల్లో తెలుగు ఉండకూడదని కోరుకునేవాళ్ళంతా ముందుగా తెలుగు భాషను అన్నిరంగాల్లోను వాడుకోవడానికి ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్నారు. అమెరికాలోని కొన్ని సాప్ట్వేర్ సంస్థల్లో తెలుగువాళ్లు అత్యధికంగానే ఉన్నప్పటికీ, తెలుగు భాషను కొన్నింటిలో చేర్చలేకపోవడానికి దాని వాడుక తక్కువగా ఉందని గుర్తించడమేనన్నారు. సురేశ్ కొలిచాల మాట్లాడుతూ తాను ప్రత్యేకించి భాషాశాస్త్ర చదువుకోలేదనీ, కంప్యూటర్ ఇంజనీర్ గా ఉన్నా, సాహిత్యాభిలాషితో ‘ఈమాట’ అంతర్జాల పత్రికను 1998లో ప్రారంభించాం. అప్పుడే యూనికోడ్ గురించి ఆలోచించాం. ఈ శతాబ్ది అంతానికి చాలా భాషలు అంతరించిపోతాయని, అలాంటి అంతరించిపోయే భాషల్లో తెలుగు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సురేశ్ కొలిచాల అన్నారు. తెలుగులో రాసే వాళ్ళున్నా ప్రచురించే పత్రికలు మూత పడిపోతున్నాయని గమనించాం. ఇంగ్లీష్ తో పోటీ పడాలంటే తెలుగులో మంచి పత్రికను తీసుకొని రావాల్సిన అవసరం ఉందని భావించి ఈమాట అంతర్జాల పత్రికను ప్రారంభించాం. తెలుగులో మొట్టమొదటిసారిగా అంతర్జాలంలో ఈమాట అనే పత్రిక ద్వారా డైనమిక్, యూనికోడ్ లిపుల ద్వారా తెలుగు భాషలో పత్రికను నడిపేవాళ్ళమని వివరించారు. యూనికోడ్ కోర్ కమిటీలో తాను కూడా ఒక సభ్యుడిగా ఉండి తెలుగు యూనికోడ్ భాష కావడానికి తన కృషి, తన మిత్రుల కృషి  కూడా ఉందని చెప్పారు. అమెరికాలోని ప్రిన్సిటన్  విశ్వవిద్యాలయంలో తొలిసారిగా ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారిని 1999లో కలుసుకున్నానని, అప్పటినుండి భాషా శాస్త్రం పై ఆసక్తిని పెంచుకున్న అని ఆయన వివరించారు. 
సమావేశంలో పాల్గొన్న సభ్యులు
అంతకుముందు వరకూ భద్రిరాజుకీ బూదరాజుకీ  మధ్య తేడా కూడా తనకు తెలియదని చెప్పారు.  ఆచార్య రాజ్యరమ గారు మాట్లాడుతూ తాను పాల్గొన్న అంతర్జాల సమావేశాన్ని చూసిన తర్వాత తెలుగుభాష అంతరించి పోవటం లేదని ఆశాభావం కలుగుతుందని అనిపిస్తుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరువేల భాషల్లో తొంబై శాతం భాషలు అంతరించి పోతాయని భాషాశాస్త్ర వేత్తలు అంటున్నారు. భారతదేశంలో కూడా హిందీవల్ల అనేక భాషలు అంతరించి పోయాయని గణాంకాలు చెబుతున్నాయి. అలా ప్రపంచ  అనేక భాషలు అంతరించిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అలా మిగిలి భాషలలో ఒక పది భాషలు మాత్రమే ఉండవచ్చని వహిస్తున్నారు. అంతరించిపోయే 10 భాషలలో తెలుగు భాష ఉండాలా లేదా అనేది ప్రభుత్వ విధానాలు, ప్రజల చైతన్యం, ప్రజల ఆలోచనలు నిర్ణయిస్తాయని అన్నారు. అంతరించపోకుండా మిగిలే భాషల్లో తెలుగు భాష కూడా ఉండాలంటే ఆరు అంశాలు ప్రధానమైన పాత్రను నిర్వహిస్తాయన్నారు. వాటిలో భాష ఆర్థిక భాషగా మారడం ప్రధానమని అన్నారు. వినియోగదారులు తాము కొనే ఉత్పత్తులపై  తమ భాష ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తులను కొనడానికి ముందుకు రావడం భాష ఆర్థిక భాషగా మారడానికి దోహదం చేసే ఒక ప్రధాన అంశం. ప్రకటించలేదు తమ సాఫ్ట్వేర్ కంపెనీలలో భాష వాడుక కు సంబంధించి లోతైన మార్కెట్ పరిశీలన చేస్తాయని, అలా ఫిన్లాండ్   చిన్న దేశమైనప్పటికీ ఆ దేశ ఫినిష్ భాష ఆర్థిక భాషగా మారగలిగిందన్నారు. భాష ఆర్థిక భాషగా మారడానికి  ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల సహకారం, ప్రజల చైతన్యం ఎంతో అవసరం అన్నారు. తమది తెలంగాణ లోని జగిత్యాల్లో పుట్టిన వాడినేనని, తమ బంధువుల్లో స్త్రీలు కొంతమంది ఉన్నత చదువులు పూర్తి చెయ్యలేకపోవడానికి తమ మాతృభాషలో విద్యాబోధన లేకపోవడమేనని వివరించారు. 
సమావేశంలో పాల్గొన్న సభ్యుల గ్రూపుఫొటో
ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తమ మాతృభాషగా తెలుగు చదువుకుంటున్నారు, కానీ వాళ్ళ ఇంటి భాష గోండి. మరెందుకు తెలుగు అని చెప్తున్నారనేది గమనించాలి. ఆ భాష లో మాట్లాడితే తమని తక్కువగా చూస్తారేమోననే న్యూనతా భావమే కారణం. తాము కూడా చాలా కాలం వరకూ గుంటూరు, కోస్తా జిల్లాల భాషలో మాట్లాడకపోతే గుర్తించరేమోననే భావన ఉండేదన్నారు. కొన్ని సామాజిక వర్గాలు తెలుగులో చదువుకుంటే తమకు ఉద్యోగాలు రావని భయపడ్డంలో తప్పులేదనీ, దానికి ప్రస్తుత ప్రభుత్వ  విధానాలే కారణమవుతున్నాయన్నారు. కానీ, నిజానికి ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలనీ, ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. వాస్తవానికి సినిమా వంటి రంగంలో తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారని చెప్పారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ భాషాశాస్త్రవేత ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు హాజరైయ్యారు. ప్రజల ఆకాంక్షల్ని ప్రభుత్వాలే నెరవేర్చవలసి ఉంటుందని, దానికి ముందుగా ప్రజలు తమకేమి కావాలో ప్రభుత్వానికి తెలియజేయాలని, అలా తెలియజేయాలంటే ముందుగా ప్రజలకు తమ మాతృభాష ప్రాధాన్యం, దానివల్ల దేశాభివృద్ధి జరుగుతున్న తీరుతెన్నుల పట్ల లోతైన అవగాహన ఉండాలన్నారు. మాతృభాషలో చదువుకుంటే సమగ్రంగా అవగాహన అవుతుందని ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య గారపాటి ఉమా మహేశ్వర రావు అన్నారు.  సెంట్రల్ యూనివర్సిటీలతో సహా తమ మాతృ భాషలో పరీక్షలు, సిద్ధాంతం గ్రంథాలు రాయనివ్వాలన్నారు. ఆంగ్లం లో రాయడం వల్ల నేటికీ అక్షర దోషాల్ని దిద్దేపరిస్థితి వస్తుందన్నారు. కొరియా వంటి దేశాల్లో తమ మాతృభాషలోనే ఉన్నత విద్యాబోధన కూడా జరుగుతుంది. అందువల్ల వారిలో విషయ నైపుణ్యం పెరుగుతుందన్నారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతున్నారని అన్నారు. తెలుగు భాషకు సంబంధించిన పారిభాషిక పదాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదనీ, అవసరాలను బట్టి అప్పటికప్పుడు ఆ పారిభాషిక పదాలు కూడా తయారవుతుంటాయని అన్నారు. ముందుగా తెలుగు భాష మాతృభాషగా, తెలుగు భాష మాధ్యమంగా అమలు చేయాలనే కృతనిశ్చయం, దానికి సంబంధించిన అవగాహన మనలో కలగాలన్నారు. ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క సైనికుడిలా మారగలగాలనీ, ఆ దిశగా ముందుగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు.

సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు

హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు విభాగానికి చెందిన ప్రముఖకవి, విమర్శకుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సమావేశానికి అధ్యక్షత వహించి వక్తల ప్రసంగాల్ని, సభ్యుల చర్చను సమన్వయం చేశారు. చర్చలో డా.క్రిష్టాఫర్, పరిశోధక విద్యార్థులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

 ఫోటోల సౌజన్యం : ఎం.చంద్రమౌళి, మసాన్, పరిశోధక విద్యార్థులు, హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

1 comment:

sam said...

dear sir telugu information very well and your blog is very good
Telangana News