"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

19 February, 2017

మాతృభాషలోనే ప్రాథమిక విద్య(ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ!)

నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమున్నత స్థాయికి చేర్చేందుకు తాము అవిరళ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు భాషాసంస్కృతులకు మహోన్నత వైభవాన్ని చేకూర్చేందుకు సంకల్పించి, అందుకోసం స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటుచేస్తామని, ఆ వ్యవస్థ రూపకల్పనకై శాసనసభ ఉపసభాపతి, సాంస్కృతికశాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, అధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు, 2016 ఆగస్టు 29న తెలుగుభాషాదినోత్సవ సభలో తాము ప్రకటించారు. నెలరోజుల్లో ఆ కమిటీ నివేదికను తెప్పించుకొని తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ కమిటీవారు ఇటీవలనే తమకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తున్నది.

 
అయితే ఆ నివేదిక వచ్చేలోపుగానే తమ ప్రభుత్వం విద్యారంగంలో తెలుగు మీడియంకు స్వస్తి పలికి, ఇంగ్లీషు మీడియంను వెంటనే ప్రాథమిక స్థాయినుంచే ప్రవేశ పెడుతూ జీవో నెం. 14/2.1.2017ను పురపాలక మంత్రిత్వశాఖ నుంచి జారీచేసింది. ఆ వెంటనే మెమో నెం. 7176/డి1/2016: తేదీ. 5.01.2017 ద్వారా ఈ మార్చితో ప్రారంభ మవనున్న విద్యాసంవత్సరం నుంచి దానిని అమలుచేస్తున్నట్లు ప్రకటించింది. దాని కనుగుణంగా శరవేగంతో పనులు ప్రారంభించింది. ఈచర్య తొలుత మీరు ప్రకటించిన లక్ష్యాలకు, హామీలకు విరుద్ధంగా ఉన్నది. కమిటీ రిపోర్టు రాకుండానే, తెలుగును కూకటివేళ్ళతో పెకలించే ఈ చర్య -తమరి ఆశయాలను ఖండిస్తున్నట్లుగా ఉంది.
 
ఇక్కడ తమకు ముఖ్యంగా మనవి చెయ్యవలసినదేమిటంటే- ప్రాథమిక స్థాయిలో మాతృభాషామాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం(అధికరణం 35– ఎ) చెప్పింది. కొఠారి కమిషన్‌ చెప్పింది. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ‘యునెస్కో’నేకాదు అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెప్తున్నాయి. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం, విభాగం29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాషామాధ్యమాన్ని అమలు చెయ్యాలని నిర్దేశించింది. తాము నియమించిన కమిటీ కూడా తమ రిపోర్టులో బహుశా ఇదే సిఫారసు చేసి ఉంటుందని మేము దృఢంగా నమ్ముతున్నాము.
 
విద్యారంగంలో పేద, ధనిక వర్గాల మధ్యగాని, మరోవిధంగా గాని విచక్షణ చూపడం తగనిపని. అందరికీ ఒకే రకమైన విద్య అందుబాటులో ఉండాలి. అందువల్ల ఆర్ధికంగా బలహీనులైన వారికి ప్రభుత్వ పాఠశాలలనీ, డబ్బున్నవారికి ప్రయివేటు స్కూళ్ళనే పరిస్థితి ఎంతమాత్రం తగదు. కనుక- మొత్తం రాష్ట్రంలో ప్రయివేటు, ప్రభుత్వ స్కూళ్ళంన్నింటికీ వర్తించే విధంగా ఒకే విధానం ఉండాలి. కనుక -ప్రాధమిక విద్యలో కనీసం 5వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో మాతృభాషామాధ్యమాన్ని తప్పనిసరి చెయ్యాలని, 6వ తరగతి నుండి విద్యార్ధి ఎంపిక ప్రకారం ఏ మాధ్యమంలోనైనా చదువుకోడానికి వీలుగా రెండు మాధ్యమాల్లోనూ 10వ తరగతి వరకూ సమాంతరంగా తరగతులుండాలని మనవి చేస్తున్నాము. ఇదే శాస్త్రీయ విద్యావిధానం అవుతుంది తప్ప, పసిబిడ్డలను పాఠశాలకు పంపడంతోనే- తనకు తెలియని భాషలో తెలియని జ్ఞానాన్ని నేర్చుకోవాలనడం- అవివేకం, అశాస్త్రీయం. పరాయిభాషలో ప్రాథమిక విద్యనుంచీ చదువు చెప్పడం ఎంత అసమంజసమో, అభివృద్ధి చెందిన దేశాలను చూచి మనం గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
 
భాషను వినియోగించేకొద్దీ అభివృద్ధి చెందుతుంది. తెలుగును కూడ వృద్ధిచేసుకొంటేనే అన్నిరంగాల్లోనూ దాన్ని ఒక అత్యాధునిక భాషగా పెంపొందించుకోగలం. అదే సమయంలో ఇంగ్లీషును వద్దు అనడం విజ్ఞత కాదు. ఇంగ్లీషేకాదు, మరే ఇతర భాషను నేర్చుకోవాలన్నా మాతృభాషలో పునాది పటిష్ఠంగా ఉండాలి. విషయ గ్రహణశక్తిని, విషయ వివరణ శక్తిని మాతృభాషలో పొందుతూ, ప్రక్కన ఒక భాషగా ఇంగ్లీషును 1వ తరగతినుండే అర్హతగల టీచర్ల చేత నేర్పాలి. అప్పుడు మెరికల్లాంటి విద్యార్థులు తయారౌతారు. అటు తెలుగు సరిగా రాక, ఇటు ఇంగ్లీషు సరిగా రాని నేటి తరాలకు బదులు, మాతృభాష తెలుగులోనూ, ఇటు ఇంగ్లీషులోనూ సమర్థులైన పౌరులు తయారౌతారు. వారు మన దేశంలోనూ, బయటి దేశాల్లోనూ మన తెలుగుజాతి శక్తిని మరింతగా చాటుతారు.
 
ఇంతటి విప్లవాత్మకమైన చర్యను మీ ప్రభుత్వం చేపట్టాలని కోరుతున్నాం. మేము చేస్తున్న విన్నపంలో ఎటువంటి అశాస్త్రీయత, అసంబద్ధత లేదని మనవిచేస్తూ -తాము ఈ కింది కోరికలను మన్నిస్తూ తగు అధికారిక ఉత్తర్వులివ్వాలని కోరుతున్నాం.
 
1. ప్రాథమిక విద్యను మాతృభాషలో/రాష్ట్ర అధికార భాషలో రాష్ట్రమంతటా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళలో (మిషనరీ స్కూళ్ళతో సహా) తప్పనిసరి చెయ్యాలి. ఇదే సమయంలో ఇంగ్లీషును ఒక భాషగా పటిష్ఠంగా బోధించాలి. ఎటువంటి తేడా లేకుండా అందరికీ ఒకేరకమైన విద్యను అందించడానికి ఇది తొలిచర్య అవుతుందని మనవి చేస్తున్నాను. 2. జి.ఒ.నెం.14ను వెంటనే రద్దుచెయ్యాలి. 3. ఉన్నతపాఠశాలల్లో ఆంగ్లంలోనూ, తెలుగులోనూ సమాంతర తరగతులుండాలి. 4. తెలుగు మంత్రిత్వశాఖ ఏర్పడివున్నందున, తాము ప్రకటించిన విధంగా వెంటనే ప్రాధికారసంస్థను ఏర్పాటుచేస్తూ, అన్నిరంగాల్లో తమ ప్రభుత్వ భాషావిధానాన్ని వెంటనే రూపొందించాలి.
తెలుగుభాషకు, తెలుగు ప్రజలకు అన్ని విధాలా మేలు కలిగించాలనే తమ సంకల్పానికి జేజేలు. తమ సంకల్ప సాధనకు పైన పేర్కొన్న చర్యలు రాచబాటను ఏర్పర్చుతాయి.
ధన్యవాదాలతో..
డాక్టర్‌ సామల రమేష్‌బాబు
19-02-2017 
తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు
మాతృభాషా మాధ్యమ వేదిక సారథ్యసంఘ సభ్యుడు

No comments: