"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

21 July, 2014

విమర్శకుడిగా ఆచార్య కొలకలూరి ఇనాక్‌


(దళితసార్వత్రిక విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌ వారు నిర్వహించిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి              ఇనాక్‌ గారి జీవితం`సాహిత్యంఅనే అంశంపై 12, 13 జూలై 2014 తేదీల్లో నిర్వహించిన                                      జాతీయసదస్సులో సమర్పించడానికి రాసిన పరిశోధన  పత్రం. అయితే, దీన్ని ది 19 జూలై 2014 న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి గ్రంథాల ఆవిష్కరణ సభ, రవీంద్రభారతి, హైదరాబాదులో సమర్పించాను) 

-డా. దార్ల వెంకటేశ్వరరావు,
                అసిస్టెంటు ఫ్రొఫెసరు, తెలుగు శాఖ, 
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు,
హైదరాబాదు-46,  ఫోను: 998962 8049

                సృజనాత్మక రచయితల కలం నుండి విమర్శ వెలువడ్డం, విమర్శకుల కలం నుండి సృజనాత్మక రచనలు వెలువడ్డం తెలుగుసాహిత్యంలో కొత్తేమీ కాదు. కొంతమంది ఈ రెండింటిలోను చక్కని ప్రతిభను ప్రదర్శించిన   వాళ్ళున్నారు. ఆచార్య కొలకలూరి ఇనాక్‌గారు కూడా ఈ రెండింటిలోను రచనలు చేసి, సృజనలోను, విమర్శలోను తనదైన ముద్రను సంపాదించుకున్నారు. ఈ పత్రంలో ఇనాక్‌గారి విమర్శను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే చాలామంది విమర్శకుడిగా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారి కృషిని చాలా వరకు విశ్లేషించారు. వారి కృషిని గుర్తిస్తూనే నాదైన దృక్పథంతో వివరించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను.
                విమర్శకుడిగా ఆచార్య ఇనాక్‌గార్ని గుర్తించే ముఖ్యమైన సిద్థాంత గ్రంథాలుగా మూడింటిని వెంటనే చెప్తారు. అవి ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం (1996), శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం(1996), జానపదుల సాహిత్య విమర్శ (2010). వీటితో పాటు ఈయన పరిశోధన గ్రంథం తెలుగు వ్యాస పరిణామం(1980) కూడా మరికొంతమంది ప్రస్తావిస్తుంటారు. కానీ, సృజన రంగంలో కథలు, నవలలు, నాటకాలు రాసినట్లే ఆయన సాహిత్య విమర్శ కృషికూడా కొనసాగింది. సృజన రచనల ప్రాచుర్యానికిచ్చిన ప్రాధాన్యం విమర్శకు పెద్దగా ఇవ్వలేదోమోననీ అనిపిస్తుంది. ఆయన వివిధ కలం పేర్లతోను, ప్రత్యక్షంగా తన పేరుతోను రాసిన విమర్శ రచనలను ఒకచోటికి చేర్చి చూస్తే సాహితీవేత్తలు అబ్బురపాటుకి గురవుతారు. ఆయనలో దాగి ఉన్న విమర్శకుడు, పరిశోధకుడు, సిద్థాంతకర్త, దార్శనికుడు మనల్ని సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తాడు. కొందర్ని ఆనందపరుస్తాడు. మరికొందర్ని భయపెడతాడు. దళితులు, బహుజనులు, సామాజిక ప్రగతిని ఆకాంక్షించేవాళ్ళు సంతోషిస్తారు. సమాజం ఆధిపత్యాల, పీడనల సంఘర్షణలతోను కొనసాగాలనుకునేవారికి ఆందోళనను కలిగిస్తాడు. సాహిత్యానికీ, కళకీ గల ప్రయోజనాన్ని స్ఫష్టంగా విశదీకరిస్తాడు. గతంలో చాలామంది ఇనాక్‌గారి విమర్శక దృష్టిని ప్రస్తావించారు. కనుక, పునరావృత్తికి పోకుండా ముఖ్యాంశాలను వివరించుకొంటూ, విమర్శకుడిగా ఇనాక్‌గార్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థమైన రీతిలో వివరించే ప్రయత్నం చేస్తాను.
ముందుగా,  ఇనాక్‌ గారు రాసిన విమర్శ రచనలను పరిచయం చేసుకుందాం. తెలుగువ్యాసాలు (1974), సాహిత్యదర్శిని(1984), సమీక్షణం (1987) లతో పాటు ఆయన చేసిన పరిశోధనలు కూడా విమర్శకుడిగా ఇనాక్‌గారి దృక్పథాన్ని వివరిస్తాయి. ఆధునిక సాహిత్యంలో స్త్రీ (1975), ఆధునిక సాహిత్యంలో హరిజనులు (1976), తెలుగులో పునరుక్తి(1977), వైరిసమాసం(1978), కావ్యప్రయోజనం (1979`81), తెలుగుసాహిత్యంలో ముస్లిములు (1979`81),జస్టీస్‌ పార్టీ ఉద్యమం`సాహిత్యం (1982), అంబేద్కర్‌ జీవితం,లక్ష్యం (1985), నవయుగకవిచక్రవర్తి(1988). తెలుగు నవల తీరుతెన్నులు (1990), ఆధునిక కవిత్వం సామాజిక సంబంధాలు(1992), దళితసాహిత్యం అధ్యయన ఆవశ్యకత (1993`95), దండోర-సామాజిక దృష్టి (1996). ఇవన్నీ ఈయన ప్రాజెక్టులుగా చేసిన కొన్ని పరిశోధనాంశాలు. వీటిని పరిశోధన చేయాలనుకోవడంలోనే ఒక దార్శినికత కనిపిస్తుంది. ఈయన విమర్శదృక్పథం తెలుస్తుంది. సమాజపరిణామంతో పయనించిన విమర్శపరిణామం గోచరిస్తుంది. అన్నింటినీ మించి సాహిత్యానికున్న ప్రయోజనాన్ని వివరించాలనే ఆకాంక్ష వెల్లడవుతుంది. ఈయన ఇటీవల తాను గతంలో రాసిన వ్యాసాలు, సమీక్షలు పుస్తకాలుగా బయటకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఈయన సాహిత్య విమర్శకున్న విస్తృతి బయటకొస్తుంది. వీటిని ఇక్కడున్న పరిధి,పరిమితులను దృష్ట్యా పరిచయం చేసుకుందాం.
సాహిత్య సమీక్ష (2013) :
                దీనిలో 1964 నుండి 1978 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో కొలకలూరి, కె.ఇనాక్‌, మనోరాణి, రవి, జ్యోతి మొదలైన కలం పేర్లతో సమీక్షలు చేశారు. ఇవి కవిత్వం, కథానిక, నవల, నాటకం ,వ్యాసం, అనువాదం ప్రక్రియలకు చెందినవి. ఈ సమీక్షలన్నీ ఇనాక్‌గారి విమర్శదృక్పథం, పరిణామాల్ని అవగాహన చేసుకోవడానికి సహకరిస్తాయి. ఇనాక్‌గారు 1967 నవంబరు భారతిలో మనోరాణిపేరుతో సినారె పుస్తకంపై ఒక సమీక్ష రాశారు. నెహ్రూ జీవితాన్ని సినారె జాతిరత్నంపేరుతో కావ్యంగా రాశారు. దీనిలో కథానికా విధానం ఉందనీ, కావ్యాన్ని చదివిన వారికి నిరాశ కలగకపోవచ్చుగానీ, అత్యంతానందం మాత్రం కలగదు (పుట:12) అని తన నిర్ణయాన్ని ప్రకటించారు.రవిఅనే కలంపేరుతో బోయిభీమన్నగారి అకాండతాండవంకావ్యాన్ని లాక్షణిక దృష్టితో విమర్శించారు.
పత్రత్రయి (2013) :
                పరిశోధన, విమర్శరంగాలలో నేటికీ కూడా మారని అభిప్రాయాలు ఈ వ్యాసాల్లో ఉండటం వల్లవీటిని ఒకచోటకి చేర్చి ప్రచురిస్తున్నట్లు ఇనాక్‌గారు తన ముందుమాటలో రాసుకున్నారు. దీనిలో మూడు వ్యాసాలు ఉన్నాయి. తెలుగులో జానపద సాహిత్య పరిశోధనం (1842`1982), తెలుగు వ్యాస పరిణామం  (1947-1972), సాహిత్య విమర్శనం(1966`1976) అనేవి ఈ మూడు వ్యాసాలు. ఒకటి తన పిహెచ్‌.డి., సిద్ధాంతగ్రంథానికి సంబంధించింది. మిగతావన్నీ జానపద, విమర్శల పరిణామాల్ని వివరించే వ్యాసాలు. ఒక విహంగ వీక్షణంగా ఈ వ్యాసాలు కొనసాగాయి. సాహిత్య విమర్శ, పరిశోధన పరిణామాల్ని, వికాసాన్ని గుర్తించడానికి ఆకరాలుగా గుర్తించదగిన వ్యాసాలుగా చెప్పవచ్చు.
సాహిత్య పరామర్శ (2013) :             ఇందులో 24 మంది రచయితలు ప్రచురించుకున్న పరిశోధనలు, విమర్శ గ్రంథాలకు రాసిన ఇనాక్‌ గారు రాసిన అభిప్రాయాలు, ముందుమాటలున్నాయి. ఇవన్నీ తెలుగు సాహిత్యంలో ప్రతిఫలిస్తున్న సంస్కృతికి సంబంధించిన  నూతన ఆలోచనలు ఉన్నాయి.
సాహితీ పరిచయం (2013) :
                కవిత్వంపై ఇనాక్‌గారి అభిప్రాయాల్ని ప్రతిఫలించే గ్రంథంగా కనిపిస్తున్నా, కవుల్ని ప్రోత్సహించే సహృదయతత్త్వం అత్యధికంగా దీనిలో కనిపిస్తుంది. సుమారు 24 మంది కవుల కవితా సంపుటాలకు ఇనాక్‌గారు రాసిన అభిప్రాయాల మాలిక.
తెలుగు వెలుగులు ( 2013) :
                వివిధ సందర్భాల్లో ప్రముఖ కవులు, రచయితలు, సాహిత్య పరిణామాలపై చేసిన ప్రసంగాలు, పరిశోధన పత్రాల సంపుటి ఈ గ్రంథం. భాష, సాహిత్యంపై ఈ వ్యాసాలు దృష్టి కేంద్రీకరించినప్పటికీ, మునివాహనుడు నాటకంలోని కథ వెనుక కథ అందరూ చదివి తీరాల్సిన వ్యాసం. అలాగే మాలవాండ్రపాట, వలస రచయితల గురించి రాసిన వ్యాసాల్లో నూతన ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి.
తెలుగు నవల ( 2013) :    
                తెలుగు నవలల గురించి ఇంతవరకు వచ్చిన విమర్శ గ్రంథాలకంటే ఇది భిన్నంగా ఉంది. తొలి తెలుగు నవలగా నరహరిగోపాలకృష్ణమచెట్టి రాసిన శ్రీరంగరాజచరిత్రము (1872)ను గుర్తించారు. ఉన్నవ వారి మాలపల్లిని, విశ్వనాథ సాహిత్య దృక్పథాన్ని ఇనాక్‌గారు విశ్లేషించిన తీరు కొత్త విమర్శ ద్వారాల్ని తెరుస్తుంది. ఇంతవరకు వచ్చిన మూసధోరణిలో కాకుండా మాలపల్లి నవలను విశ్లేషించారు. జస్టీస్‌ పార్టీ, దాన్ని ప్రచారం చేసేవాళ్ళ నుండి మాల,మాదిగలను దూరం చేయడానికి జరిగిన  కుట్రగా, బ్రాహ్మణాధిపత్యాన్ని కొనసాగించడానికి, కాంగ్రెస్‌ పార్టీని కాపాడ్డానికి  ఉన్నవవారు వ్యక్తిగా ఉంటూనే ఒకవ్యవస్థ చేసిన పనిగా విశ్లేషించారు. మాలపల్లి అని పేరు పెట్టినంత మాత్రాన దానిలో మాలమాదిగలను ఉన్నతీకరించిన స్థితిలేదనీ దాన్ని గమనించాలనీ సూచించారు.
విశ్వనాథ సత్యనారాయణను గొప్ప సాహిత్యశిల్పమర్మజ్ఞుడుగా ప్రసంశిస్తూనే, వస్తుపరంగా సంప్రదాయాన్ని పునరుద్దరించాలనే తపనను కనబరిచారనీ వ్యాఖ్యానించారు. కొడవటిగంటి కుటుంబరావునీ, గోపీచంద్‌ సాహిత్యతత్త్వాన్ని కూడా చాలా లోతుగా వివరించారు. స్త్రీ ఆర్థిక స్వయంప్రతిపత్తి అవసరాన్ని కుటుంబరావు ప్రోత్సాహించారన్నారు. అబ్రాహ్మణ స్త్రీ పాత్రల్ని, ఆర్థికదృష్టి గోపీచంద్‌ రచనల్లో కనిపిస్తుందనీ వివరించారు. చలంతో పాటు మిగతా వాళ్ళని అంచెనావేయడంలో నవలాసాహిత్య క్రమ పరిణామాన్ని అవగాహన చేసుకునే తీరుని సూచించారు. కందుకూరి వీరేశలింగం తన పేరు చివరనున్న పంతులుఅనే కులసూచికను విసర్జించిన తర్వాత చాలా మంది ఆయన్ని కందుకూరి వీరేశలింగంఅనే రాస్తుంటారు. కానీ, ఇనాక్‌గారు మాత్రం కందుకూరి వీరేశలింగంపంతులుఅనే రాస్తున్నారు. కందుకూరి రాసిన శ్రీరాజశేఖరచరిత్రము (1878), వికార్‌ ఆఫ్‌ ది వేక్‌ ఫీల్డ్‌ నవలకు అనుసరణ అనీ, దానిలో తెలుగుతనాన్ని నింపారనీ చెప్పారు. కానీ, లంబాడీ జీవితేతివృత్తాన్ని శ్రీరంగరాజచరిత్రములో వర్ణించడం వల్లనే అది తొలితెలుగు నవలగా గుర్తిస్తున్నట్లు ఇనాక్‌గారి విమర్శదృక్పథాన్ని బట్టి అంచెనాకు రావచ్చు.
ఇనాక్‌గారిది  ప్రధానంగా దళిత, బహుజనసాహిత్యవిమర్శదృక్పథంగా చెప్పవచ్చు. ఇనాక్‌గారి విమర్శలో దళితులు, స్త్రీలు, బలహీనవర్గాలు, మైనారిటీలు, వెనుకబడిన ప్రాంతాలవారి పక్షాన నిలబడి వాదించే దృక్పథం    ఉంటుందనుకుంటున్నాను. సాహిత్యంలో వస్తువుకే ప్రాధాన్యాన్నివ్వాలనే వాదనతో పాటు, రూపవాదం పట్ల వ్యతిరేకతకూడా ప్రదర్శితమవుతుంది. అలాగని పూర్తిగా పాశ్చాత్య సాహిత్య విమర్శదృక్పథాన్నే కొనసాగిస్తున్నారనీ అనుకోవడానికి వీల్లేదు. పరోక్షంగా నవ్యమార్క్సిజాన్ని సమర్థిస్తున్నట్లు అనిపిస్తుంది. దాన్నీ లోతుగా చూస్తే వర్గదృక్పథాన్నీ వ్యతిరేకిస్తూనే చారిత్రక, గతి తార్కిక భౌతికవాద పునాదులపై నిలబడి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. దళిత,బహుజన సాహిత్యదృక్పథానికి కూడా పునాది భౌతివాదం ఉన్నా, దీనికి కులం తోడవుతుంది. ఉపరితలంలో కనిపించే సమస్యలకు పునాదిలో ఉండే వర్గం ఒక ప్రధానకారణంగా భౌతికవాదం భావిస్తే, దళిత, బహుజన సాహిత్య వాదం కులాన్ని, భౌతిక వాస్తవికతను పునాదిగానే భావిస్తుంది(ఆచార్య కొలకలూరి ఇనాక్‌ సాహిత్యంపై విమర్శనం, పుట: 167) .ఈ దృష్టే ఇనాక్‌గారి విమర్శదృక్పథంలోఅత్యంతప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తెలుగు కథానిక (2013) :
                ఇవి ప్రధానంగా ప్రసంగ వ్యాసాలు. అనుబంధంలో తెలుగు కథానిక పుట్టుపూర్వోత్తరాలను ప్రస్తావిస్తూనే, కథానికా శిల్పాన్ని వివరించారు. తొలితెలుగు కథానికగా బండారు అచ్చమాంబ రాసిన ధనత్రయోదశి’ (1903)ని గుర్తిస్తున్నట్లు మొదట్లో చెప్పినా, అనుబంధంలో మళ్ళీ గురజాడ దిద్దుబాటు’(1910)ని సమర్థిస్థున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఈ అనుబంధంలోని విషయాలను పుస్తకరూపంలో ప్రచురించేటప్పుడు ఈ గందరగోళాన్ని సరిదిద్దేప్రయత్నం చేస్తే బాగుండేది. పుస్తకంలో తొలి తెలుగుకథానిక గురించి చెప్పేటప్పుడు కాలం చాలా ప్రధానం. కాలాన్ని 1803 (ధనత్రయోదశి), 1810 (దిద్దుబాటు) అనే ముద్రణాదోషాన్ని (తెలుగుకథానిక, 2013, పుట: 10,11) ఫ్రూఫ్‌ రీడిరగ్‌ లో చూసుకోవాల్సింది. అయితే ధనత్రయోదశిలో కథానాయకుడు కృష్ణమూర్తి చొక్కాలో ఎవరో బంగారాన్ని పెడితే, దాన్ని పరుల సొమ్ము తీసుకుంటే పాపం వస్తుందనే దృష్టితో యజమానికి తిరిగి ఇచ్చేస్తాడు. దీనిలో పాపంవస్తుందేమో అనేది ఆధునిక దృష్టి అవుతుందా? ఆధునికతకు తాత్త్విక పునాది మానవుడా? మానవేతరశక్తుల ప్రభావమా? గురజాడ రాసిన దిద్దుబాటులో సంస్కరణదృష్టి ఉంది. పాపపుణ్యాల ప్రశక్తిలేదు. గురజాడ ఇతర రచనల్లోను ప్రధాన కేంద్రం మానవుడే. కానీ, అచ్చమాంబ ఇతర రచనల్లో కూడా దైవం, మూఢత్వానికి సంబంధించిన విషయాలు అనేకం కనిపిస్తాయి. కేవలం స్త్రీ రాయడం వల్లనో, దిద్దుబాటుకంటే ముందుగా రాయడం వల్లనో అది మొదటి కథానిక అయిపోతుందా? దీనికీ ఒక వాదాన్ని ఇనాక్‌ గారు ప్రతిపాదించారు.  ఆంగ్లంలో ఓహెన్రీ రాసిన katya of the Frogmore Flats or The Passing Repentance of John Perkins(the Pendulam)అని ( తెలుగు కథానిక, 2013, పుట: 11) ఆధారాన్ని చూపుతున్నారు. తొలి తెలుగు కథానిక గురించి ఆలోచించేవారికి ఇది ఒక కొత్త అంశమే. అయితే కథానికల గురించి వెలువడిన ఈ పుస్తకం ప్రసంగాల్ని కూర్చడం వల్ల వీరి విమర్శలో కనిపించే భిన్న కోణాల్ని గుర్తించడానికి కొంతవరకే సహకరిస్తుంది.

తెలుగు వ్యాస పరిణామం (1980) :
పరిశోధన ఉండాల్సిన సత్యాన్వేషణకీ, వ్యాసాన్ని ప్రక్రియగా గుర్తించడానికి కావలసినన్ని ఉపపత్తుల్ని సమకూర్చగలిగింది.నేడు సృజనాత్మకవిమర్శ అనే ఒక భావన కనిపిస్తుంది.దీనికి ప్రాతిపదికలు కూడా ఈ గ్రంథంలో కనిపిస్తున్నాయి.  సృజనతత్వం గల వ్యాస రచనకి  ప్రాముఖ్యతనిచ్చిన గ్రంథంగా విమర్శకులు కొండిపర్తి శేషగిరిరావు పేర్కొన్నారు.(ఆచార్య కొలకలూరి ఇనాక్‌ షష్టిపూర్తి సన్మాన సంచిక, పుట: 198) 
                సాహిత్య విమర్శకుడిగా ఇనాక్‌గారి గురించి ప్రస్తావించేవారెవరైనా ఈయన రాసిన ఆధునిక సాహిత్య విమర్శసూత్రం, శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం, జానపదుల సాహిత్య విమర్శ గ్రంథాలు గురించి ఇంతకుముందే ప్రస్తావించాను. వీటిలోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం.
ఆధునిక సాహిత్య విమర్శసూత్రం (1996):
                దీనికి సూత్రవృత్తిపేరుతో రాసుకున్న ముందుమాటలో గ్రంథలక్ష్యాన్ని వివరించారు. ఆధునిక సాహిత్యం ప్రాచీనం కంటే భిన్నం. ప్రాచ్యదృక్పథం ఈ సాహిత్యానికి సంపూర్ణంగా వర్తించదు. అలాగే, ఆధునిక సాహిత్య విమర్శకు పాశ్చాత్య పద్ధతి అన్వయమవుతున్నా, ప్రాచ్య ప్రభావాన్ని గుర్తించి, అనువర్తించడం కుదరదు. ఇది ఆంధ్రదేశ సాహిత్యం కనుక ఒక ప్రత్యేక  విమర్శసూత్రం అవసరం అన్నారు. విమర్శకులు రూపలక్షణాలను గుర్తించినంతగావస్వంశాలను  దర్శించడం లేదు. కనుకనే ఈ కోణంలో భిన్న కాలాల్లో భిన్న సామాజిక నేపథ్యాలను, భిన్నదృక్పథాలను సమన్వయించే దిశగా సిద్ధాంతీకరించబడిరదనీ ప్రకటించారు. ద్వితీయ ముద్రణ (2010)లో మరికొన్ని అంశాలను చేర్చినా,ఇంతకు ముందున్న విషయాలను తొలగించలేదు. ఈ విషయాలను ముందుమాటఆనందసూత్రంలో పేర్కొన్నారు.
                 తెలుగుసాహిత్యవిమర్శను వివిధ వాదాలుగా వర్గీకరించి విశ్లేషించారు. ఆధునికతను కాలవాచిగా చూసేటప్పుడు 1857 తర్వాత సాహిత్యంగా చెప్తూనే, ఆధునికత అవగాహనకు సంబంధించిందనీ,దీని మౌలిక భావన హేతుప్రధానమైన భౌతిక దృష్టిలో ఉంటుందని వివరించారు.ఆధునిక విమర్శసూత్రంలో కవిదృష్టిప్రధానంగా భావించారు.ఒక దృక్పథం లేకుండా ఉత్తమసాహిత్యం వెలువడదన్నారు.నిబద్ధత,నిమగ్నత, నిబిడిత అనే మూడు సూత్రాల్ని సమన్వయం చేసుకుంటూ ఆధునిక సాహిత్యం, విమర్శ ఉండాలనేది ఇనాక్‌గారి అభిప్రాయం.‘‘నిబద్ధత, నిమగ్నతల్లో విషయం, వస్తువు రచయిత చుట్టూ వుంటుంది. నిబిడితలో వస్తువు రచయిత ఒకటే. ఆరెండింటి కంటే నిబిడిత గాఢత కలిగి ఉంది. ఇది నేటి సాహిత్య సూత్రంగా ఉంది. అందువల్ల నిబిడిత దర్శించే ప్రయత్నం నుంచి సాహిత్య తత్త్వం విశదమవుతుంది. నేటి సాహిత్య విమర్శ సూత్రం నిబిడిత.’’ (ఆధునిక సాహిత్య విమర్శసూత్రం, 2010 పుట: 25) అనేది ఇనాక్‌గారు చేసిన దీన్ని గుణత్రైయిసిద్ధాంతం అనిపిలవవచ్చు. దీని వల్ల అంతవరకు నిబద్ధత, నిమగ్నతలు, సామాజిక స్ఫృహల గురించి చర్చించిన వాళ్ళు జీవితానుభవాల ప్రాధాన్యతను సిద్ధాంతీకరించేటప్పటికి తమ అస్తిత్వాలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ గ్రంథంలో మరోబలమైన ప్రతిపాదన కూడా ఉంది. సార్వికత్రయంగా పిలిచారాయన. సాహిత్యం సార్వకాలికం, సార్వదేశికం, సార్వజనీనంగా ఉండాలనే వాదాన్ని తిరస్కరించారు. (పుట:165) ప్రతిదేశానికీ, జాతికి, భాషకీ స్వీయ అస్తిత్వమనేది ఉంటుంది. అది లేకపోతే వైవిధ్యమే ఉండదనేది ఈ వాదనలోని సారాంశం. ఇలా ఈ సూత్రాలతో ఆధునిక విమర్శను సమన్వయించాలని ప్రతిపాదించడమే కాకుండా, తెలుగుసాహిత్యంలో కనిపిస్తున్న వాదాలు, ధోరణులను వీటికి అన్వయించి చూపారు. దళితసాహిత్యానికి దేశీయ సాహిత్య విమర్శ విధానం ఉందన్నారు.
జానపదుల సాహిత్య విమర్శసిద్ధాంత గ్రంథంగా పేర్కొన్నారు. తెలుగు సాహిత్యాన్ని అంతటినీ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కవులు కొన్ని కల్పనలు చేస్తుంటారు. అవి విశే షప్రాచుర్యాన్ని పొందుతుంటాయి. అది లిఖితం చేసిన కవికి సొంతంకాదు. అది జానపదుల ఆలోచన. ఆ ఆలోచనలో ఛమత్కారం, పాండిత్యం, సమయస్ఫూర్తి, విశ్వసనీయత వంటి లక్షణాలున్నట్లు అనిపిస్తాయి. అవన్నీ పాఠకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కవులను రక్షిస్తాయి. ఆ భావాలన్నీ జానపదుల సాహిత్యవిమర్శలో భాగంగా సిద్ధాంతీకరించేప్రయత్నం చేశారు.ఇప్పటికే ఈ వ్యాసం పెద్దది అయిపోయింది. అందువల్ల మరోసారి ఈ విషయాన్ని విపులంగా చర్చించుకుందాం.  
ముగింపు:
ఇనాక్‌గారి విమర్శపై విమర్శకుల వ్యాఖ్యలు:
                సమకాలీన సాహిత్య విమర్శకులు ఇనాక్‌గారి విమర్శ గురించి కింది విధంగా వ్యాఖ్యానించారు.
సాహిత్య విమర్శ ఏకకాలంలో సామాజికాంశాల మీదా, కళాంశాల మీద సాగే విమర్శ అయినప్పుడు నిండుతనాన్ని సంతరించుకుంటుంది.విమర్శకుడిగా ఇనాక్‌ ` విమర్శకు సంబంధించిన ఈ నిండుతనాన్ని గుర్తించాడు.దాని అవసరాన్ని గౌరవించాడు’’ అని జి.లక్ష్మీనరసయ్య వ్యాఖ్యానించారు. (ఆచార్య కొలకలూరి ఇనాక్‌ సాహిత్యంపై విమర్శనం, పుట: 61) 
                ‘‘ఆధునిక సాహిత్య విమర్శ సూత్రంహేతువాద దృక్పథంతో తర్కబద్దంగా సాగిన విశిష్ట విమర్శాగ్రంథం...ఇనాక్‌ గారి విమర్శాదృక్పథం ఈ వస్తు విశ్లేషణ చుట్టే తిరిగింది.’’ ` యస్వీరామారావు,ఆచార్య కొలకలూరి ఇనాక్‌ షష్టిపూర్తి సన్మాన సంచిక, పుట: 63, 64
                ‘‘ డాక్టర్‌ ఇనాక్‌ గారు కథలలో ఎంత నిమగ్నులై వస్తువు నిర్మిస్తారో, విమర్శలో కూడా అంతగా నిమగ్నులై సమన్వయాన్ని సాధిస్తారు’’` జి.వి.సుబ్రహ్మణ్యం, ఆచార్య కొలకలూరి ఇనాక్‌ షష్టిపూర్తి సన్మాన సంచిక, పుట:42
                ‘‘ వసుచరిత్ర మీద ఆచార్య ఇనాక్‌గారి విమర్శ సంప్రదాయబద్దంగా వచ్చిన ఆలంకారిక విమర్శకాదు. అగ్రవర్ణాల అధిక్షేపాలకు ఆగ్రహించి, వారి కవితా సృష్టికంటే అన్నివిధాలా అగ్రగణ్యంగా ఉండే ప్రబంధాన్ని సృష్టించాలని శూద్రకవి అయిన శుభమూర్తి ( భట్టుమూర్తి/ రామరాజభూషణుడు) రచించిన కావ్యంగా దానిని వర్గదృక్పథంతో సమన్వయించి చూపించారు.’’జి.వి.సుబ్రహ్మణ్యం,ఆచార్య కొలకలూరి ఇనాక్‌ షష్టిపూర్తి సన్మాన సంచిక, పుట: 43
                ‘‘ తెలుగులో కట్టమంచి, రాళ్ళపల్లి, విశ్వనాథ మొదలైనవారు తెలుగు విమర్శను తెలుగులోనే ఆలోచిస్తూ రచించే దేశివిధానం ప్రవేశపెట్టారు. దాని జిగిబిగిని రక్షించారు ఆచార్య ఇనాక్‌ గారు.’’  జి.వి.సుబ్రహ్మణ్యం,ఆచార్య కొలకలూరి ఇనాక్‌ షష్టిపూర్తి సన్మాన సంచిక, పుట: 43
                Prof.Enoch’s criticism is a signature of the Dalit rsentment on the sankritised ‘Poetics’, and ‘Rasa theory’ which cannot evaluate the ‘human’ nature of modern literature based not on ‘God’ but on ‘society’. - H.S.Brahmananda, ఆచార్య కొలకలూరి ఇనాక్‌ షష్టిపూర్తి సన్మాన సంచిక, పుట: 171
ఆచార్య కొలకలూరి ఇనాక్‌ విమర్శనీ, సమకాలీన విమర్శకుల వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత ఈయన ఒక కొత్త అంశాన్ని గానీ, కొత్త సమన్వయాన్ని గానీ, కొత్త సిద్థాంతాన్నిగానీ చెప్పకుండా సాహిత్యవిమర్శ కొనసాగించరని స్ఫష్టమవుతుంది. సాహిత్య ప్రపంచంలో అప్పటికే ఉన్న వాదాలను, సిద్థాంతాలను సమన్వయిస్తూనే వాటిని దళిత, బహుజనులు తీసుకోవాల్సినవాటినీ, తీసుకోకూడనివాటినీ కుండబద్ధలుకొట్టినట్లు చెప్పగల నిర్భయం ఈయన విమర్శశైలి.కొన్నిసార్లు సాహిత్యవిమర్శలో కూడా విమర్శపారిభాషను సామాన్యీకరించేస్తుంటారు. బ్రాహ్మణీయ సిద్థాంతాల్ని తగిన ఉపపత్తులు చూపుతూ, తన వాదనాపటిమతో దాన్ని తిరస్కరిస్తూనే దళిత,బహుజనసైద్థాంతిక విమర్శకుడిగా ముందుకొస్తారు. బహిరంగంగాను, అంతరంగికంగాను ఏకపక్షంగా సాగిన బ్రాహ్మణీయకుట్రల్ని విశదీకరించడం వల్ల ఈయన్ని నిలువెల్లా బ్రాహ్మణీయతను నింపుకున్న సాహితీవేత్తలు,విమర్శకులు అంగీకరించడానికి మనస్కరించలేరనుకుంటున్నాను. కానీ,  దళిత, బహుజన సృజనకారుల్ని, విమర్శకుల్ని, పరిశోధకుల్ని హెచ్చరిస్తూనే, వీరు కొత్తదారుల్లో వెళ్ళాల్సిన సిద్థాంతమార్గాల్ని చూపుతుంటారు.ఉత్తమ విమర్శకుడికి సత్యాన్వేషణతో పాటు నిర్భీతి అనేది అత్యంతముఖ్యం. అది ఈయనలో నూటికి నూరుపాళ్ళు కనిపిస్తుంది. సాహిత్యాన్ని ఒక బాధ్యతాయుతమైన, సామాజిక పరివర్తనలో భాగంగా గుర్తించాలని ఆకాంక్షించే స్వభావం ఈయన విమర్శలో కనిపిస్తుంది.ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య విమర్శల్ని సమన్వయిస్తూనే  తెలుగు సాహిత్యాన్ని విమర్శించే దేశీయవిమర్శసూత్రాన్ని, సిద్థాంతాన్నీ ప్రతిపాదించారు. అందుకే ఈయన్ని సైద్థాంతిక దళిత, బహుజన సాహిత్య విమర్శకుడుగా అభివర్ణించవచ్చునని అనుకుంటున్నాను.
ఆధారాలు:
1.ఇనాక్‌, కొలకలూరి. ఆధునిక సాహిత్య విమర్శసూత్రం,తిరుపతి: జ్యోతి గ్రంథమాల, 2010.
                (మొదటిప్రచురణ:1996)
2.ఇనాక్‌, కొలకలూరి.శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం (1996) , తిరుపతి: జ్యోతి గ్రంథమాల, 2010.(మొదటి    ప్రచురణ:1996)
3.ఇనాక్‌, కొలకలూరి. జానపదుల సాహిత్య విమర్శ, తిరుపతి: జ్యోతి గ్రంథమాల, 2010.
4.కృపాచారి, గుజ్జర్లమూడి.,వి.సింగారావు, నాగభైరవ ఆదినారాయణ,        కందిమళ్ళ సాంబశివరావు, గుమ్మా           సాంబశివరావు           (సంపాదకమండలి),ఆచార్య కొలకలూరి ఇనాక్‌ సాహితీ         సమాలోచనం (పరిశోధన            పత్రసమాహారం), తిరుపతి: జ్యోతి  గ్రంథమాల, 2011. 
5.చంద్రశేఖరరెడ్డి,రాచపాళెం., కొళ్ళాగుంట ఆనందన్‌, ( సంపాదకులు),       ఆచార్యకొలకలూరి ఇనాక్‌ సాహిత్యంపై                  పరిశోధనం, తిరుపతి:       జ్యోతి గ్రంథమాల, 2009.     
6.చెన్నకేశవరెడ్డి,జి. (ప్రధానసంపాదకుడు). ఆచార్య కొలకలూరి ఇనాక్‌  షష్టి పూర్తి సన్మానసంచిక,                                                     హైదరాబాదు: ఆచార్య కొలకలూరి ఇనాక్‌ షష్టి పూర్తి కమిటి, 1999.
7.మధుజ్యోతి, కొలకలూరి.(సంపాదకురాలు), ఆచార్య కొలకలూరి ఇనాక్‌సాహిత్యంపైవిమర్శనం, తిరుపతి:                                   జ్యోతిగ్రంథమాల,2009.
(దళితసార్వత్రిక విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌ వారు నిర్వహించిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి              ఇనాక్‌ గారి జీవితం`సాహిత్యంఅనే అంశంపై 12, 13 జూలై 2014 తేదీల్లో నిర్వహించిన                                      జాతీయసదస్సులో సమర్పించడానికి రాసిన పరిశోధన  పత్రం. అయితే, దీన్ని ది 19 జూలై 2014 న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి గ్రంథాల ఆవిష్కరణ సభ, రవీంద్రభారతి, హైదరాబాదులో సమర్పించాను)
 



No comments: