"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

31 January, 2009

అంతరార్థ రామాయణం - విశేషాలు

-డా దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్, తెలుగుశాఖ,
సెంట్రల్ యూనివర్సిటి, గచ్చిబౌలి, హైదరాబాదు.
09989628049


"శ్రీరామ' అనే నామం విన్నా, అన్నా, రాసినా పుణ్యమని భావించే భక్తులెంతో మంది ఉన్నారు. అలాగే రామాయణాన్ని రాసి, తమ జన్మలను చరితార్థం చేసుకోవాలని భావించిన వాళ్ళూ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారొకరు. ఆమె గేయ రూపంలో ''అంతరార్థ రామాయణం'' పేరుతో ఒక రామాయణాన్ని రాశారు. రామయణంలోని కథలను గేయ రూపంలో, చిన్న చిన్న కథలుగా చెప్తూనే, ఆ కథల్లోని అంతరార్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
రచయిత్రి పరిచయం:
శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ గారికి ''ముక్తికాంత'' అనే బిరుదు ఉంది. శ్రీవత్స గోత్రానికి చెందిన శ్రీమతి లక్కరాజు సుందరి, సీతారామయ్యల పుత్రిక. ఆమె పుట్టిన తేదీ విషయంలో స్పష్టత లేదు. కానీ, 'అంతరార్థ రామాయణం' లోని ఆంతంగిక ఆధారాలను అనుసరించి ఆమె 1950 (వికృతి నామ) సంవత్సరంలో స్వర్గస్థులయినట్లు మాత్రం తెలుస్తుంది. ఆమె జీవించి ఉండగా ఈ కావ్యం ముద్రితం కాలేదు. ఆమె మరణానంతరం మనవరాలు శ్రీమతి ఆత్రేయపురపు లక్ష్మీసుందరీ జ్ఞానప్రసూనాంబ గారు చొరవ తీసుకొని దాన్ని 1982లో ప్రచురించారు. జ్ఞానప్రసూనాంబ గారికి స్వయంగా సంస్కృతాంధ్ర సాహిత్యాలలో ప్రావీణ్యం ఉన్నా, గ్రంథ పరిష్కారానికి వివిధ పండితుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. ఈ కావ్య పరిష్కరణకు శ్రీమతి ముట్నూరి సీతామహాలక్ష్మమ్మ, డా చిలుకూరి వీరభద్ర శాస్త్రి గార్లు సహకరించినట్లు తన కృతజ్ఞతలలో పేర్కొన్నారు.
రచయిత్రి ఇతర రచనలు :
శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారు అంతరార్థ రామయణంతో పాటు వివిధ పురాణేతిహాసాలను, వాటిలోని అంతరార్థాలనూ వివరిస్తూ వివిధ కావ్యాలను గానం చేసేవారు. అంతరార్థ రామాయణంలో పేర్కొన్న వివరాల ప్రకారం ఆమె కింది రచనలను చేసినట్లు తెలుస్తుంది. 1. అంతరార్థ నరకాసురవధ, 2. అంతరార్థ రుక్మిణీ కల్యాణం, 3. అంతరార్థ గజేంద్ర మోక్షం, 4. అంతరార్థ సాగర మధనం, 5.వచన భగవద్గీత, 6. లాలి పాటలు.

అంతరార్థ రామాయణం కావ్య విశేషాలు:
1) ''అంతరార్థమున కాధారభూతమై! అవని అంతా నిండుగా
వెలుగులు విరజిమ్మ చిమ్మచీకటులు చెదిరిపోవ
ఓ గజాననా నీకు నమస్కారశతములు'' అంటూ విఘ్నేశ్వర స్తుతితో ఈ కావ్యాన్ని ప్రారంభించారు.
2) ఇతర రామాయణాల వలే కాకుండా, అంటే బాలకాండ, అయోధ్య కాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ద కాండ, ఉత్తరకాండ అనే భాగాలుగా కావ్యాన్ని విభజించలేదు. చిన్న చిన్న కథా భాగాలుగానే కావ్యాన్నంతా రూపొందించారు.
దశరథుని వృత్తాంతం, శ్రీరామ జననం, సీతాకన్యల జననం, విశ్వామిత్రుడనెడి విశ్వాస శర్మ రాక, జ్ఞానవివేకంబులు మునివెంట వెడలుట, తాటకయను భ్రాంతీ దేవియు, సుభాహువను దుర్గుణ పుంజంబుల వధ, అహల్యా దేవి శాపవిమోచనం, అహంకార ధనుర్భంగం, అయోధ్య ప్రవేశం......మొదలైన శీర్షికలుగా ఈ కావ్య విభజన జరిగింది.
3). ఈ కావ్యంలోనూ వాల్మీకి రామాయణ కథనే మూలంగా గ్రహించినా, ఇతర రామాయణాల్లోని కొన్ని కల్పితాంశాలను కూడా ఈ అంతరార్థ రామాయణంలో తీసుకున్నారు. ఉదాహరణకు అహల్యా శాపవిమోచనం ఘట్టాన్ని చూసినట్లైతే, వాల్మీకి రామాయణంలో లేకపోయినా, అది మొల్ల రామాయణంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
4). కావ్యమంతా గాన యోగ్యమైన శైలిలో కొనసాగింది. కావ్య రచన ద్విపద, మంజరి, కీర్తనలతో వర్ణించారు.
5). అంతరార్థాన్ని వివరిస్తున్నా, శ్రీరాముని కథను సంపూర్ణంగా వినిపించే ప్రయత్నమే కావ్యమంతా కనిపిస్తుంది.
6). వేదాలు, ఉపనిషత్తులు, యోగ శాస్త్రాది విషయాలను ఆధారంగా చేసుకొని రామాయణ అంతరార్థాన్ని వివరించారు. 7) రామాయణాన్ని ఎవరు రాసినా, ఏ విధంగా వర్ణించినా సాధారణంగా శ్రీరాముని మాహాత్మ్యమే అందులోనూ ప్రతిఫలించటం జరుగుతుంది. అంతరార్థ రామాయణం కూడా అలాగే కొనసాగింది. అయితే ఈ కావ్యంలో కథను వివరిస్తూనే, మానవుని జీవాత్మ- పరమాత్మల స్వరూపాన్ని వివరించే మార్గంలో ఈ రచన కొనసాగింది. మరో విశేషమేమిటంటే, శ్రీరాముని ప్రస్తావన వచ్చినప్పుడల్లా అనేక విశేషాలతో ప్రస్తుతించారు. ఈ రచనా విధానం వల్ల పాఠకుని లేదా శ్రోతను శ్రీరాముని పైనే కేంద్రీకరించేటట్లు చేయగలిగే అవకాశం ఉంది.
8) అంతరార్థాన్ని వివరించడంలో ఆయా పాత్రలను అన్వయించడంలో కొంత గందరగోళం కనిపిస్తుంది. అందువల్ల పాఠకులు లేదా శ్రోతలు గందరగోళానికి గురయ్యే అవకాశం లేకపోలేదు.
9) మొత్తం మీద మానవ జీవితంలోని పరమార్థాన్ని గ్రహించి, తదనుగుణమైన జీవనాన్ని కొనసాగించి, జీవాత్మ - పరమాత్మలో లీనమవ్వడంతో ''ముక్తి'' లభిస్తుందని చెప్పడానికి ''రామాయణం'' ఆవిర్భవించిందని వివరించటమే లక్ష్యంగా ఈ కావ్య రచన కొనసాగిందని భావించవచ్చు. వీటిలో ముఖ్యమైన వాటిని ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను.
ఉపనిషత్తుల్లో రామ ప్రస్తావన -అంతరార్థ వివరణ:
మానవుని మానసిక ప్రవృత్తులను వివరించడంలో వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో లోతైన ఆలోచనలను అందించాయి. అధర్వణ వేదాంతర్గతమగు రామరహస్యోపనిషత్తులో శ్రీరాముని తత్త్వము గురించి అడిగిన సనక సనందాది యోగేశ్వరులు, ఇతర ఋషీశ్వరులకు హనుమంతుడిలా వివరిస్తాడు.
''..... ఈసర్వ తత్త్వాలలో తారక బ్రహ్మ తత్త్వము ఉత్తమమైనది. రాముడే పర బ్రహ్మ, రాముడే పరమ తపము, రాముడే పరమతత్త్వము.. రాముడే తారక బ్రహ్మ '
''వాయు పుత్రుని, విఘ్నేశ్వరుని, సరస్వతిని, దుర్గా దే్విని, క్షేత్ర పాలకుని, సూర్యుని, చంద్రుని, నారాయణుని, నరసింహుని, వాయు దే్వుని, వరాహుని వీరందరునూ మరియు మాతా సహితులగు సీతమ్మను, లక్ష్మణుని, శత్రుఘ్నుని, భరతుని, విభీషణుని, సుగ్రీవుని, అంగదుని, జాంబవంతుని - ఈ తెలిపిన అందరును శ్రీరామునికి అంగములని తెలిసికొనవలెను. అంగములు లేకుంటే రాముడు విఘ్నకరుడు'' అనే వివరణ కనిపిస్తుంది. ఆత్మ వివిధ రూపాలలో కనిపించడమే దీనిలోని అంతరార్థం.
ఇంచుమించు ఇలాంటి భావాలనే శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారు తన ''అంతరార్థ రామాయణం''లో వర్ణించారు. 'దశరథుని వృత్తాంతం' తో అంతరార్థరామాయణం కథ ప్రారంభమవుతూ ఇలా వర్ణితమయ్యింది...
''ఇంద్రియంబులనెడి ఇంపైన గుర్రములు! కాయమనే రధము కడువేడ్కతోను !!
పంచ కోశాపురి పరగ వర్ణింప! వశముకాదు గద వసుధలోపల!!
సందు గొందులు సరస సావిళ్ళు! వింత వింత మేలు కట్ల మరియుండె
ఇళా పింగళ వీధులింపుతో గలవు! సుఘమ్న పురమున కే సూటిజాపునుగ!!
నయము మీరగ నవ ద్వారములు గలవు! నాథుడై దశరథుడు పాలించుచుండె
దశేంద్రియములు తా పాలనము సేయ! నా దశరథునకు నాత్మ రాజనెడి !!
నామంబు చేకూరె న్యాయాను సరణి! మగువలు ముగ్గురు కలరు రాజుకు!!
నివృత్తి, ప్రవృత్తి, భక్తియనెడి ! కౌసల్య, కైక, సుమిత్ర సుదతులు !!'' (అంతరార్థ రామాయణం,1982: 1) ఈ వర్ణనలో మానవుని దేహం , మనసులకు సంబందించిన విషయాలే రామ కథగా రూపోందిందనే ఆలోచన కలుగుతుంది.
''దాశరథి (రాముడు) ఎంత అంతర్ముఖుడో, ఇంద్రియ నిగ్రహం కలవాడో దశముఖుడంతగా బహిర్ముఖుడు, ఇంద్రియలోలుడు. ఒక్క మాటలో చెప్పాలంటే దశ దిశలకూ Ê బహిర్ముఖమైన ఇంద్రియ చాపల్యానికి లంకేశ్వరుడు సంకేతం.
''దశముఖడంటే కుడి వైపు ఐదు తలలు, ఎడమ వైపు ఐదు తలలుండి ఒకే మెడకాయ ఉన్న విచిత్ర పురుషుడు కాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిందేమిటి అంటే రావణుని ఇంద్రియ లోలుత దశ దిశా పరివ్యాప్తములైన వని అర్థం. '' అని డా ముదివేడు ప్రభాకార రావుగారు వ్యాఖ్యానించటం కూడా ఇలాంటి రామాయణంలో ఒక అంతరార్థాన్ని నిరూపించే ప్రయత్నమే ఆయనా చేశారనిపిస్తుంది ఆయనే అయోధ్య అంటే ఏమిటో వివరిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.
''మనలో ఏ సత్యం నిత్యమూ జాగృతమవుతూ ఉంటుందో, ఏ స్వచ్ఛ స్ఫాటికమైన అంత:కరణం ఆత్మానూభూతిగా జీవుని అనుభవంలో కసిస్తున వికసితున్నదో అదేరామతత్త్వం - ఆత్మా రాముడంటే అతడే. మనలోని ఈ ఆధ్యాత్మిక సారం బాహ్యంగా ఆకృతి ధరిస్తే ఎలా ఉంటుందంటే, దశరథుని కుమారుడైన దాశరధి వలే ఉంటుంది. ఈ దాశరథి దశేంద్రియాలను జయించిన వాడు -
( అవి ఐదు జ్ఞాఅనేంద్రియాలు ఘ్రాణ, రసన, చక్షు, త్వక్, శోత్రియములు జ్ఞానేంద్రియ పంచకం అంటారు. వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ కర్మేంద్రి య పంచకం అంటారు.)
దాశరథియైన దాశరథి మనలో అవతరించవలెనన్నా ఉన్నా లేక లోకంలో చక్షుర్గోచరం కావాలన్నా ఆ ప్రదే్శం 'అయోధ్య ' కావాలి.
యుద్దమంటే సంఘర్షణ. అయోధ్య అంటే సంఘర్షణ రహితమైనది.
ఎక్కడ సర్వేంద్రియ సంఘర్షణలు బాహ్యాభ్యంతరంగా శమించి ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుందో అదే 'అయోధ్య ' అన బడుతుంది. అటువంటి అయోధ్యను పరిపాలించడానికి ఆత్మనిగ్రహం గలవాడే అన్ని విధాలా అర్హుడు. రాముడు ఎటువంటి వాడంటే స్వాహంకారం, భౌతిక భోగాలు జీవితంలో శాంతినీ సమాధానాన్ని సమకూర్చవని చక్కగా తెలిసిన వాడు '' అని అన్నారు. (వాల్మీకి - విశ్వనాథ రామకథానుశీలనము, 1993: 2)
విశ్వాసమిత్రుడు యఙ్ఞం చేస్తుంటే కామశర్మ, దుర్గుణశర్మ,భ్రాంతిదేవి ఆటంకం పరుస్తున్నారని రచయిత్రి వివరించారు (అంతరార్ధ రామాయాణం, 1982;10)
దశరథుడు ఆందోళన పడతాడు.
కొడుకుని పంపించటానికి వెనుకాడినపుడు - వశిష్ట మహర్షి ఇలా చెప్పారట.
నరుడని నీ పుత్రుణ్ణి భ్రమిస్తున్నావు. అది పురుషుడు, అమర తేజశ్శీలి. మీరు అతిథి కశ్యవులు మీ తపస్సుకి మెచ్చి " భూ భారహరణార్థం రాముడు పుట్టెనయ్య భూవర ! భావ వినాశి రాముడనగ భవ్య చరిత " ( అంతరార్ధ రామాయణం ,1982: 17) అని చెపుతాడు. అంతేకాదు. --
" శంఖు చక్రంబులు రెండు భరత శతృఘ్నలు
శేషుడు సుమి లక్ష్మణుడు జగము మెచ్చన్" అని చెప్పి , " జనకపురంలో యోగమాయ జానికై జన్మించెను" అని చెపుతాడు.
రాముడు యాగ రక్షణకు వెళ్ళి, తాటకి అనే భ్రాంతి దేవిని, సుభామవను దుర్గుణాలను వధిస్తాడు. ఆ తరువాత మరీచుడనే కామాన్ని అణిచివేస్తాడు.
అహంకార ధనుర్భంగం చేసి జానకిని రాముడు వివాహమాడాతాడు. అహల్య అనేది క్షమాదేవి. ఆమెకి రాముని పాద ధూళితో శాప విముక్తి కలుగుతుంది. ( అంతరార్థ రామాయణం 1982:22.)ఇలా కొనసాగింది ఈ రామాయణం.
ఆత్మ పరమాత్మ తత్త్వము:
ఆత్మ పరమాత్మల తత్త్వాన్ని తేల్చడం అంత సులభం కాదు. ఈ విషయంలో యోగులు, మహర్షులు ఎంతో మంది వివరించే ప్రయత్నం చేశారు. ''ముక్తికి మెట్లు'' అనే గ్రంథంలో - డా వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారిలా వివరించారు. ''కర్మ బద్దమైన ఆత్మ 'జీవాత్మ' అన బడతాడు.
కర్మ విముక్తుడైన జీవుడు 'పరమాత్మ' అన బడతాడు. '
'సుగుణంగా ఉన్న జీవుణ్ణి ప్రకృతిగానూ, అందున్న నిర్గుణ పరమాత్మను పురుషుణ్ణి గాను '' గ్రంథాలు పేర్కొంటున్నాయి అని అన్నారు.''పురమంటే దేహం. పురుషుడంటే పురంలో ఉండేది 'ఆత్మ' అని అర్థం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ది అనే దేహంలోని. అందులో బుద్దిని నడిపించే శక్తి ఆత్మది.'' (ముక్తికి మెట్లు : 48)
అందుకనే కఠోపనిత్ లో దేహం గురించిన చర్చ కొంత కనిపిస్తుంది. దీని సారాంశాన్ని చూస్తే ఆత్మ, రథి శరీరం, రథం, బుద్ది, సారథి, మనస్సు, పగ్గం, ఇంద్రియాలు, గుర్రాలు, విషయాలు, మార్గం అని స్పష్టమవుంది. ఈ భావాలను వివరించటంలో రచయిత్రి చాలా వరకూ కృతకృత్యురాలైయ్యారు. అయినా మరింత స్పష్టంగా వివరిస్తే బాగుండేదనిపిస్తుంది.
అందువలనే వాల్మీకి మహర్షి మెదలు కొని నేటి వరకు వస్తున్న ఏ రామాయణాన్ని చదువుతున్నా, వింటున్నా ఏదో ఒక మాధుర్యం కలుగుతూనే, వాటిలో ఏదో అంతరార్ధం వినిపిస్తూనే ఉంటుంది. కానీ "అది" "ఇదే" అని చెప్పడం అంత సులువు కాదు. ప్రతి వాళ్ళూ రామయాణాన్ని చదవాలి. దానిలోని అంతరార్ధాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఉత్తమ జీవితాన్ని జీవించాలి. దానికి మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరూ తమ దేహన్ని, మనసుని, ఇంద్రియాల్ని తమ ఆధీనంలో ఉంచుకోవటానికి నిరంతరం సాధన చేయాలి. మనకు జీవిస్తూనే మన కర్మను మనం నిర్వర్తించాలని రామాయణం బోధిస్తుంది.
''శరీరంలో త్వక్(చర్మం) చక్షు, శ్రోత్ర, ఘ్రాణ, జిహ్వేంద్రియములనే పంచ జ్ఞానేంద్రియాలయాక్కయూ మనస్సు యోక్కయూ 'నేను నాది ' అనే భావం యొక్క క్రియా కలాపాల్ని జరిపించే దానికి మనోమయ కోశం అని పేరు. పదార్థాల యుక్క వైవిధ్యములైన స్వరూపము యొక్క పరిజ్ఞానం , దీని యొక్క ప్రత్యేక లక్షణంగా తెలిసికోవాలి. ఇది ప్రాణ కోశంతో ముడిపడి విజృంభిస్తూ ఉంటుంది. దీనిలో కలిగే 'నేను నాది' అనే భావాలు ప్రశాంతిని నాశనం చేస్తూ ఉంటాయి. అహం, లేక 'నేను ' అనేదానికి సంభంధించిన దేహం 'నాది' లేక 'మమ' అనే భావం. ఈ రెండు అహంకార మమకార కార్యాలే ' లోపల ఉండేది 'నాది' అనేది. బైట ఉండేది నేను (ముక్తికి మెట్లు : 129) '' అని వివరించడంలో కొంతలోతైన విశ్లేషణ కనిపిస్తుంది.
''ఈ జీవించే శరీరం నీకు సాధనం మాత్రమే అనుకోవాలి. కాని, అది నేనే అనుకోవడం కూడదు. నేను ఈ శరీరం కంటే విభిన్నుడనైయ్యే ఉన్నాను. అనే అనుభవాన్ని నీవు పొంది ఉండాలి. నీ వాహనాన్ని నీ పనులు జరుపుకోవడం కోసం చక్కగా నీవు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి మలినం లేకుండా ఉంచుకొన్నట్లుగానే ఈ శరీరాన్ని కూడా నీలోని జన్మ వాసలన్నింటినీ నాశనం చేసి మరణాంతంలో నీకు కైవల్యాన్ని (ముక్తిని) సమకూర్చేందుకు పరిశుద్ద ఆహార విహారాల నియమంతో శుభ్రపరచి ఉంచుకొనే ఉండాలి. నీ లక్ష్యం సిద్ధించే వరకు దానిని అలక్ష్యం చెయ్యకూడదని కూడా గ్రహించాలి'' (ముక్తికి మెట్లు: 127-128) అని వివరించారు. ఇలా వివరించిన డా వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారు కూడా అంతరార్థ రామాయణాన్ని రాసినట్లు వారి గ్రంథాలను బట్టి తెలుస్తుంది.
మొత్తం మీద శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ గారి రామాయణంలోని అంతరార్థాన్ని నాకు అర్థమైనంత వరకూ ఇలా అర్థం చేసుకోవచ్చునిపించింది. రాముడు - ఆత్మారాముడు, (జ్ఞాన పరిపూర్ణుడు), లక్ష్మణుడు - జితేంద్రి యుడు
(ఇంద్రియాలను జయించిన వాడు),భరతుడు-పరిపూర్ణ వైరాగ్యుడు (తనకు రాజ్యం వచ్చినా రాజ్యం పాలించలేదు.యోగిగా జీవించాడు),శత్నఘ్నుడు - అరిషడ్వర్గముల(కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యా దుల) ను శత్రువులను జయించిన వాడు.
సీత- శాంతి, తాటకిని భ్రాంతిగానూ, మంధరను దుర్భుద్దిగానూ,శూర్పణకను తృష్ణగానూ, జటాయువును ధర్మస్వరూపుడు గానూ, ఆంజనేయుడు- సత్సాంగత్యం, రావణాసురుడు - రవ్వంత సేపు ఈశ్వరాధ్యానం కలవాడే కానీ, అజ్ఞానంగలవాడు గానూ ఈ రామాయణంలో అంతరార్థాన్ని తత్త్వపరంగా వివరించే ప్రయత్నం చేశారనుకుంటున్నాను.
లంకను శంక రూపంగానూ, రావణుణ్ని అజ్ఞాన రూపుడుగాను ఆ పాత్రల్లోని అంతరార్థాన్ని రచయిత్రి వర్ణించారు.
''జన్మ రాహిత్యం కల్గడమే మోక్షం'' ఆ ఆ మోక్షాన్ని కలిగించడానికి అవతరించిన మహాత్ముడే శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడే ప్రతి మానవునిలోనూ దేహం, మనసు, దశేంద్రియాల, అరిషడ్వవర్గాల రూపంలో వివిధ మానసిక ప్రవృత్తుల్లో ఉంటారు. ఎప్పుడైతే జ్ఞానం ప్రకాశిస్తుందో అప్పుడు అతడు పరమాత్మలో ఐక్యమవుతాడు. అజ్ఞాని కూడా జ్ఞాని అవుతాడు. పరమాత్మను చేరతాడు. అలా చేరే మార్గాలను వివరించేదే్ రామాయణం. ఇదే ప్రధానంగా రామాయణం లోని అంతరార్థం!


పాదసూచికలు:
1.మం. శ్లో హనుమాన్ ఉవాచ:
భో యాగీం ద్రాశ్చ ఋష యో విష్ణుభక్తా స్తథై వ చ,
శృణుధ్వంమామకీం వాచం భవబంద నాశినీమ్,
ఏతేషు చైవ సర్వేషు తత్త్వంచ బ్రహ్మతారకమ్,
రామఏవ పరం బ్రహ్మ రామఏవ పరం తప:,
రామ ఏవ పరం తత్వగ్ం శ్రీరామో బ్రహ్మ తారకమ్
(రామరహస్యోపనిషత్ 1-1-3 , 970)
మం. శ్లో హనుమాన్ ఉవాచ:
వాయుపుత్రం విఘ్నేశం వాణీం దుర్గాం క్షేత్రపాలకమ్,
సూర్యం చంద్రం నారాయణం, నరసింహం వాయు దేవం వరాహం,
తత్సర్వాన సమాత్రాన్ సీతాం లక్ష్మణగ్ం శత్రుఘ్నం భరతం
భీషణం సుగ్రీవ మంగదం జాంబవంతమ్,
ప్రణవ మేతాం రామస్యాంగాని జానీథా:,
తాన్యంగాని నా రామో విఘ్నకరో భవతి
(రామరహస్యోపనిషత్ 1-5 ( పుట: 971)
2. పెయ్యేటి లక్ష్మీ కాంతమ్మ - అంతరార్ధ రామాయణం , పుట: 1
3. ముదివేడు ప్రభాకర రావు ,వాల్మీకి విశ్వనాథ రామ కథానుశీలన , 1993- 62,63.
4. ముదివేడు ప్రభాకర రావు ,వాల్మీకి విశ్వనాథ రామ కథానుశీలన ,1993.26.
5.వేదుల సత్యనారాయణ శాస్త్రీ , ముక్తికి మెట్లు - పుట 48.
6.వేదుల సత్యనారాయణ శాస్త్రీ , ముక్తికి మెట్లు - పుట129.
7.వేదుల సత్యనారాయణ శాస్త్రీ , ముక్తికి మెట్లు - పుట127,128.
ఆధార గ్రంధాలు:
1. ఉపనిషత్ కల్ప తరువు (మూడు భాగాలు) విద్వానం గర్రె సత్య నారాయణ గుప్త (సంగ్రహ కర్త ), ప్రార్థనా గాన ప్రచార సంఘం, విజయవాడ :1997.
2. ప్రభాకర రావు, ముదివేడు వాల్మీకి విశ్వనాథ రామ కథానుశీలము , ~ జ్నాన ప్రసూన మాలిక ప్రచురణలు, ఎస్ వి, యూనివర్శిటి క్యాంపస్ , తిరుపతి:1993.
3. పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ, అంతరార్ధ రామాయణం, అతేయపురపు లక్ష్మీసుందరి జ్నాన ప్రసూనాంబ , త్యాగరాజు భవనము, నర్సాపురము:1982.
4.సూర్య నారాయణ శాస్త్రీ, వేదుల ., ముక్తుకి మెట్లు గంగాధర పబ్లికే్షన్ , విజయవాడ :1987

1 comment:

చింతా రామ కృష్ణా రావు. said...

ఆటవెలది:-
దార్ల వారు తాను తన్మయత్వము చెంది
కాంతగారి రచన, ఘనత తెలిపె.
సరస హృదయు లలర సాహిత్యమందించె .
దార్ల రచన పంచదార కాదె?