"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

22 July, 2008

స్టాలిన్ గొప్పతనం.



(యుద్ధమూ శాంతీ!" పేరుతో ఈనాడు (22-7-2008) లో వచ్చిన డాక్టర్ సశ్రీ గారి చక్కని వ్యాఖ్యానం )

టాల్‌స్టాయ్ చచ్చి ఏ లోకాన (కచ్చితంగా పాఠకలోకమే) ఉన్నాడో కానీ తన నవల ''వార్ అండ్ పీస్''తో యుద్ధమూ-శాంతి అన్న మాటను శాశ్వతంగా ఈ లోకంలో వదిలిపోయాడు. వెయ్యికి పైగా పాత్రలుండే మహాభారతం తరవాత రమారమి ఎనిమిదొందల పాత్రలున్న కళాఖండం అది. మంచుకురిసే వేళలో బూట్ పాలిష్ చేస్తున్న బాల టాల్‌స్టాయ్‌ని చూసి కారులో దిగిన ఓ పెద్దాయన చలించిపోతాడు. వెంటనే తన లాంకోటు ఇచ్చాడాయన. ఒంటిమీద ఏదైనా కప్పుకోవచ్చుగా అని మందలించాడా ఆసామి. ఎంత కప్పుకొన్నా ముక్కు మూసుకోలేం కదా అని బదులిస్తాడు టాల్‌స్టాయ్. ఆ బాలుడిలో భావి తత్త్వవేత్తనీ, మహారచయితనీ దర్శించి ఆ పెద్దాయన అభినందిస్తాడు. పశ్చిమాసియాలో అశాంతికి విశ్వప్రయత్నాలు చేస్తున్న రాజ్యాధినేతలకు టాల్‌స్టాయ్‌ని చూపాలి. సమర సన్నాహాల్లో వున్న ఇజ్రాయెల్‌కీ, దానికి వత్తాసు పలుకుతున్న అమెరికాకీ శాంతి భ్రాంతి కాదని తెలియజెప్పాలి. ఇరాన్‌పై విరుచుకుపడాలనుకోవటం ఇసుమంతైనా సాహసయాత్ర కాదని స్పష్టం చేయాలి. అరవైమూడేళ్ల ఐక్యరాజ్యసమితి ఇప్పటికి నూట నలభై యుద్ధాల్ని చూసింది. ధృతరాష్ట్రుడిలాగా యుద్ధవార్తల్ని విని పొద్దుపుచ్చే దాని చేతకానితనానికి శాంతికాముకులు సిగ్గుపడాలి! భయం గుప్పిట్లో మన జీవితం తరచూ ముడుచుకుపోతుంటుంది. భయపడటం, భయపెట్టడం అనాదిగా మన పునాదులు. రెండో గుణం రెండింతలున్న హిట్లర్ చివరికి ఏమయ్యాడో చరిత్రకు తెలుసు. ఎవరైనా ఏదైనా చేస్తారేమోనన్న భయంతో పిరికిపందలే కయ్యానికి కాలుదువ్వుతారు. యుద్ధం జరగాలని సరదాపడతారు. అఫ్ఘాన్, ఇరాక్‌లలో ప్రభుత్వాల్ని 'యుద్ధం'చేసి మార్చినంత మాత్రాన అమెరికా అధినేత బుష్‌ని ధీరుడూ, శూరుడూ అనలేం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని కొన్నాళ్లలో శ్వేతసౌధం విడిచిపెట్టనున్న బుష్ నిరూపించదలిచాడు. తన హయాములో మరో యుద్ధం చేసి హీరోచితంగా చరిత్రను తిరగరాయాలని ఒంటికాలిపై లేస్తున్నాడు. ఇప్పటికి 83 యుద్ధాలు చేసి అమెరికా అప్రతిష్ఠ మూటకట్టుకుందన్న పచ్చినిజం 'బుష్‌కాకి' అవుతోంది. గతంలో శ్వేతసౌధంలో సాంకేతిక సమస్య తలెత్తి సైరన్ మోగేసరికి బంకర్‌లోకి పరుగులు తీసిన బుష్‌ది మేకపోతు గాంభీర్యమే! బుష్ మొదలు భారతీయ పాలకుల వరకు అందరికీ కొరవడిందల్లా కొండంత ధైర్యమే! మన పాలకులకే అదుంటే అణు ఒప్పందం ఖరారు చేసేది లేదని తెగేసి చెప్పేవాళ్లు. బుష్‌కన్నా మన శ్రీకృష్ణదేవరాయలు (1509-30) ఎంతో నయం. ఆ మాటకొస్తే ఆ కాలంలో టిప్పుసుల్తాన్‌తో సహా రాజులంతా స్వయంగా యుద్ధాల్లో పాల్గొన్నారు. కురుక్షేత్ర యుద్ధాన్ని దగ్గరుండి మరీ అంత వృద్ధాప్యంలోనూ నడిపించాడు శ్రీకృష్ణుడు. రాయల అల్లుడు అళియరామరాయలు తక్కువేమీ తినలేదు. తొమ్మిది పదులు దాటిన వయసులో 1565లో రాక్షసతంగడి యుద్ధానికి సారథ్యం వహించాడు. ఈ కాలం నేతలు అదృష్టవంతులు. యుద్ధాన్ని ప్రకటిస్తే చాలు. దేశాధినేతలు కండలు బిగించి తొడగొట్టి సవాల్ చేయాల్సిన పనిలేదు. అంతా త్రివిధ దళాలే చూసుకుంటాయి! నేడు దేశాధినేతలకు లెక్కలేనన్ని వెసులుబాట్లున్నాయి. ఏ దేశంలోనైనా, ఏ నేతయినా తన సంతానంలో కనీసం ఒక్కరినైనా సైన్యంలో చేర్పించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో లెనిన్‌ని మహా నాయకుడనవచ్చు. తన తనయుణ్ని ఏ డాక్టరునో, ఇంజినీరునో చేయకుండా సైనికుణ్ని చేశాడాయన. ఎంత కాదన్నా దేశాధ్యక్షుడి కొడుకు కదా అని అతి పిన్నవయసులోనే సీనియారిటీని తోసిరాజని ఉన్నత పదవులిచ్చారు. ఆ మిలిటరీ ఉన్నతాధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించి కొడుకు పదోన్నతిని, లెఫ్టినెంట్ జనరల్ గిరిని కత్తిరించాడు లెనిన్. రెండో ప్రపంచయుద్ధకాలంలో స్టాలిన్ కొడుకు జర్మనీ సేనలకు చిక్కాడు. తనకు బందీలుగా ఉన్న నాజీలను విడిచిపెట్టడం ద్వారా కొడుకును కాపాడుకునే ఒకేఒక్క అవకాశాన్ని కాలదన్నుకున్నాడు స్టాలిన్. రాత్రికి రాత్రే నాజీలకు మరణశిక్ష విధించి 'నా కొడుకును మీరు కూడా శిక్షించవచ్చు' అన్న వర్తమానాన్ని జర్మన్లకు పంపించాడు స్టాలిన్. రష్యాలో ప్రతి కుటుంబం సభ్యుణ్ని కోల్పోయిన యుద్ధకాలంలో తన కొడుకు కూడా చావటాన్ని చారిత్రక అవసరంగా భావించిన లెనిన్‌కి యుద్ధం ప్రకటించే హక్కుంది కానీ, బుష్‌కి ఏముంటుంది? పైపెచ్చు యుద్ధకాలంలో భార్యను పుట్టింటికి పంపి వ్యవసాయ పనులు చేయించాడు లెనిన్. 'ఆద్యంతాలు లేని నిద్రలో రెప్పపాటే జీవితం' అన్నాడో కవి. యుద్ధమూ-శాంతీ మధ్య నలుగుతున్న ఆధునిక జీవితం అంతకన్నా భిన్నమైనది కాదు. ఒకపరి శాంతికోసం ఎన్నో పర్యాయాలు యుద్ధం అనివార్యమని తప్పుడు సంకేతాలిచ్చే బుష్‌లాంటి 'గీతా'కారులున్నందుకు మనం సిగ్గుతో చచ్చిపోవాలి. ఫీనిక్స్ పక్షుల్లాగా పునర్జన్మ ఎత్తి శాంతిని ఎగరేయాలి. ఆకాశం నిండా శాంతివిత్తనాలు చల్లి నవసమాజాన్ని నేయాలి. తానొచ్చి యుద్ధాన్ని తెచ్చానని సూర్యుడు బిక్కమొహం వేయకుండా తూర్పురేఖపై శాంతిగోళాన్ని నిలబెట్టాలి. ఇరాన్‌పై యుద్ధాన్ని నివారించటం ద్వారా శాంతి వెన్ను తట్టాలి!
- డాక్టర్ సశ్రీ

1 comment:

కొత్త పాళీ said...

"మంచుకురిసే వేళలో బూట్ పాలిష్ చేస్తున్న బాల టాల్‌స్టాయ్‌ని చూసి కారులో దిగిన ఓ పెద్దాయన చలించిపోతాడు."
ఎక్కడిదీ అబద్ధం? టాల్స్టాయ్ ఒక ధనిక భూస్వామ్య ప్రభు కుటుంబంలో జన్మించాడు, ఉత్తరోత్తరా తాను కూడా వంశ పారంపర్యమైన "కౌంట్" బిరుదు స్వీకరించాడు. ఇహ లెనిన్ స్టాలిన్ల ఉదాత్తత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.